పాక్‌లో జీవనవిధ్వంసం
ABN , First Publish Date - 2023-03-16T01:19:54+05:30 IST
పాకిస్థాన్ ఆర్థికపతనం శ్రీలంకను మించి ఉండబోతున్నదనీ, ఆ సంక్షోభం దుష్ప్రభావాలు ఊహకు అందవని అంతర్జాతీయ ఆర్థికనిపుణులు అంటున్నారు. పొరుగుదేశం అతివేగంగా కుప్పకూలుతున్న...
పాకిస్థాన్ ఆర్థికపతనం శ్రీలంకను మించి ఉండబోతున్నదనీ, ఆ సంక్షోభం దుష్ప్రభావాలు ఊహకు అందవని అంతర్జాతీయ ఆర్థికనిపుణులు అంటున్నారు. పొరుగుదేశం అతివేగంగా కుప్పకూలుతున్న దృశ్యాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. అసలే ఆర్థికంగా దెబ్బతిన్న దేశాన్ని గత ఏడాది వరదలు ముంచెత్తడంతో ఆహార కొరత ఏర్పడింది. దీనికితోడు ఆయుధాలు అందుబాటులో ఉండటంతో దొంగతనాలు, దోపిడీలు, హింస హెచ్చుతున్నాయి. కరాచీ సహా అనేక ప్రధాననగరాల్లో అధికారిక లెక్కల ప్రకారమే దొంగతనాలు, హత్యలు అనేక రెట్లు పెరిగాయి. కత్తులు, తుపాకులు చూపించి డబ్బు, కార్లు తస్కరించడం, ఎదురుతిరిగిన వారిని గాయపరచడం లేదా చంపివేయడం వంటివి జరుగుతున్నాయి. సగటు పాకిస్థానీ కడుపునిండా తిండికి నోచుకోని పరిస్థితులు దాపురించినా ఇమ్రాన్‌ఖాన్ తన వీధిపోరాటాలు కొనసాగిస్తూనే ఉన్నారు, పాలకపక్షం ఆ రాజకీయవైరాన్ని పెంచిపోషిస్తూనే ఉంది.
పరిస్థితులన్నీ అదుపుతప్పిపోతూ పాలకపక్షం అచేతనంగా మారిపోతున్న స్థితి పాకిస్థాన్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ దేశాన్ని ఎప్పటికప్పుడు గట్టెక్కిస్తూ వస్తున్న విదేశీ ఆర్థికసాయం కూడా ఇప్పుడు సంక్షోభంలో పడింది. గతంలో ఉదారంగా పాకిస్థాన్‌కు సహాయం చేసే చైనా, సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా ఇప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నాయి. ఇటీవలే ఐఎంఎఫ్ సవాలక్ష ఆంక్షలతో, నిబంధనలతో కొంత సాయం చేయడానికి సిద్ధపడింది. అప్పు దక్కాలంటే అది చెప్పినట్టు వినాలి కనుక, సంక్షేమానికీ, ప్రోత్సాహకాలకు కత్తెర్లు వేస్తూ, ప్రజలపై మరింత ఆర్థికభారం మోపుతూ పాకిస్థాన్ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. పొదుపు చర్యల్లో భాగంగా, మంత్రులు, అధికారులు విలాసవంతమైన వాహనాలు వినియోగించవద్దని, విదేశీప్రయాణాలు తగ్గించుకోవాలని పాక్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా పెద్దగా ఫలితం లేకపోయింది. పొదుపుచర్యల పర్యవేక్షణ, అమలుకు పాక్ ప్రధాని ఒక ప్రత్యేక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ ఎంత వెంటపడుతున్నా సగం లగ్జరీ కార్లు కూడా వెనక్కురాలేదనీ, నిర్వహణ ఖర్చులు పెద్దగా తగ్గలేదని వార్తలు వస్తున్నాయి. ఈ చర్యల అమలుద్వారా అనేక వందలకోట్లు ఆదాచేయవచ్చునన్న అంచనాలు నీరుగారిపోతున్నాయి. ఇంధనం సహా అన్నింటిపైనా పన్నులు పెరిగి, వడ్డీరేట్లు హెచ్చి సామాన్యుడు మరిన్ని బాధలుపడుతుంటే, పాలకులు మాత్రం పట్టనట్టే ఉంటున్నారు.
అప్పు ఇస్తానన్న ఐఎంఎఫ్‌కు ఏ మాత్రం విశ్వాసం కలిగించగలిగే రీతిలో దేశంలో పరిస్థితులు లేవు. మూడేళ్ళక్రితం ఆరున్నర బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించిన ఐఎంఎఫ్, అందులో భాగంగా విడుదలచేయాల్సిన మరోవిడత మొత్తానికి కూడా ఇప్పుడు సందేహిస్తోంది. ఇతరదేశాల చేయూత, తిరిగి చెల్లించగలిగే సమర్థత ఇత్యాది విషయాల్లో దానికి చాలా అనుమానాలున్నాయి. రాజకీయ అస్థిరత దీనికి ఆజ్యంపోస్తోంది. రాబోయే నెలల్లో కొన్ని ప్రావిన్సులు ఎన్నికలకు పోబోతున్నాయి. ఆ తరువాత సార్వత్రక ఎన్నికలు జరపాలన్న ఇమ్రాన్ డిమాండ్‌కు మరింత బలం చేకూరి నిర్వహించవలసిరావచ్చు. ఒప్పందం కుదర్చుకున్న షరీఫ్ ప్రభుత్వం ఎంతోకాలం ఉండబోదన్న అనుమానం ఐఎంఎఫ్ సహా చాలాదేశాలను పీడిస్తోంది. అందువల్ల, ప్రస్తుత ప్రభుత్వం రేపు ఉండకపోయినా, తాము ఒప్పందాన్ని గౌరవిస్తామని ఇమ్రాన్ పార్టీ సహా విపక్షాలన్నీ హామీ ఇవ్వాలని ఐఎంఎఫ్ కోరుతోంది. మిగతాపార్టీల మాట అటుంచితే, అధికార కూటమి ప్రభుత్వం మీద పతాకస్థాయిలో యుద్ధం చేస్తూ, సత్వర ఎన్నికల ద్వారా తిరిగి అధికారంలోకి రావాలనుకుంటున్న ఇమ్రాన్ ఖాన్ అంతలోగా ఇంత ఔదార్యంగా వ్యవహరించే అవకాశం లేదు. తోషాఖానా కేసులో బెయిల్ ఇవ్వకుండా తక్షణ అరెస్టుకు న్యాయస్థానమే ఆదేశించినా ఇమ్రాన్ ఖాన్ దానినీ రాజకీయయుద్ధంగా మలిచారు. మంగళవారం పోలీసులకూ, పీటిఐ కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణ అక్కడి రాజకీయ అస్థిరతకు నిలువెత్తు నిదర్శనం. రాజకీయార్థిక స్థితిగతులపై తనకు నమ్మకం ఏర్పడినప్పుడే ఐఎంఎఫ్ ఆర్థికసాయం చేస్తుంది. దిగుమతులు నిలిచిపోయి, పరిశ్రమలు మూతబడుతూ కరెంటు, తిండి తదితర కొరతలతో, హెచ్చిన ధరలతో అప్పటివరకూ సామాన్యుడు మలమలా మాడిపోకతప్పదు.