ధీశాలి సానియా!
ABN , First Publish Date - 2023-03-07T01:08:28+05:30 IST
ఎంతటి గొప్ప క్రీడాకారులైనా ఏదో ఒకరోజు రిటైర్ కావాల్సిందే. అయితే, కొందరు మాత్రమే తాము ఎదుగుతూ ఆ ఆటనూ ఎదిగేలా చేస్తారు...
ఎంతటి గొప్ప క్రీడాకారులైనా ఏదో ఒకరోజు రిటైర్ కావాల్సిందే. అయితే, కొందరు మాత్రమే తాము ఎదుగుతూ ఆ ఆటనూ ఎదిగేలా చేస్తారు. దానికి మరింత పేరు ప్రఖ్యాతులను, గౌరవాన్ని చేకూర్చుతారు. అలాంటి అరుదైన క్రీడాకారిణి సానియా మీర్జా. దేశంలోని కోట్లాదిమంది క్రీడాకారిణులకు స్ఫూర్తిప్రదాత ఆమె. ఆటకు తాను ఎక్కడ పునాది వేసుకుందో.. అదే భాగ్యనగరంలోని చారిత్రక ఎల్బీ స్టేడియంలో ఆఖరి మ్యాచ్ ఆడి రాకెట్‌ను శాశ్వతంగా వదిలేసింది.
టెన్నిస్‌లోకి సానియా ఆగమనమే ఓ సంచలనం. మన దేశంలో అమ్మాయిలు టెన్నిస్‌లాంటి ఖరీదైన, వ్యక్తిగత క్రీడలోకి అడుగుపెట్టడం అరుదుగా ఉన్నకాలంలో ఆమె ప్రవేశించింది. తండ్రి ఇమ్రాన్ మీర్జా తొలి గురువు. తీవ్రమైన పోటీ ఉండే టెన్నిస్ ప్రపంచంలో తన కూతురు నిలవగలదా, ఆ ఆటలో ఆమెకు భవిష్యత్ ఉంటుందా? అని ఆమె తండ్రి ఓ దశలో సందిగ్ధంలోకి జారిపోయారు. పొట్టి దుస్తులు వేసుకొని ఆ ఆట ఆడడం అవసరమా అని సన్నిహితుల్లోనే కొందరు విసిరిన మాటలు ఆయన్ను బాధించాయి. అయినా, వాటిని మనసులోనే కప్పిపెట్టి తన కూతురు దేశం తరఫున ఆడుతుంటే చూసి గర్వపడాలన్న సంకల్పంతో ముందుకు సాగాడు. తన శిక్షణలో సానియాను రాటుదేల్చాడు. తొలినాళ్లలో దేశవ్యాప్తంగా టోర్నీలు ఆడేందుకు విమానాల్లో వెళ్లే స్తోమత లేక సానియా కుటుంబం తమ పాత కారునే వాడేది. ఆ కారులోనే వందలకొద్దీ కిలోమీటర్లు ప్రయాణం చేసింది. కెరీర్ ఆరంభంలో ఎన్నో కష్టనష్టాలను భరించిన సానియా, ఆటపై మాత్రం ఆ ప్రభావం పడనీయలేదు. జాతీయస్థాయిలో రాణిస్తూనే జూనియర్ వింబుల్డన్‌లో డబుల్స్ విజేతగా నిలిచి అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకుంది. ఎల్బీ స్టేడియంలో తొలిసారిగా సీనియర్ స్థాయి టోర్నీ హైదరాబాద్ ఓపెన్‌లో సింగిల్స్ విభాగం నుంచి పోటీపడిన సానియా తొలిరౌండ్లోనే పరాజయంపాలైనా నిరాశకు లోనుకాలేదు. అపజయాన్ని విజయానికి సోపానంగా భావించి మరింత పట్టుదలతో శ్రమించింది. రెండేళ్ల తర్వాత ఇదే వేదికపై జరిగిన అదే టోర్నమెంట్‌లో విజేతగా నిలిచింది. ఈ క్రమంలోనే గ్రాండ్‌స్లామ్స్‌లో పోటీపడుతూ సింగిల్స్‌లో అత్యుత్తమంగా 27వ ర్యాంక్‌కు చేరుకొని ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళగా ఖ్యాతికెక్కింది. అనంతరం వరుస పరాజయాలు, మణికట్టు గాయాల కారణంగా సింగిల్స్ నుంచి డబుల్స్ విభాగానికి మారింది. ఇక అక్కడినుంచి సానియా వెనుదిరిగి చూసుకోలేదు. ఎన్నో చిరస్మరణీయ విజయాలతో ఆటలో అత్యుత్తమస్థాయిని అందుకుంది. ప్రతి టెన్నిస్ ప్లేయర్ లక్ష్యంగా భావించే గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని ఆరుసార్లు (మూడు డబుల్స్, మూడు మిక్స్‌డ్ డబుల్స్ టైటిళ్లు) ముద్దాడి ఆటలో తన సత్తా ఏంటో నిరూపించుకుంది. మహిళల డబుల్స్‌లో ప్రపంచ నెంబర్‌వన్ ర్యాంక్ సాధించి తన కెరీర్‌ను పరిపూర్ణం చేసుకుంది.
ఆటలో అత్యుత్తమ దశను చూసిన సానియాను ఎన్నో వివాదాలూ, విమర్శలూ వెంటాడాయి. స్కర్ట్ వేసుకొని ఆడడంపై మత పెద్దల నుంచి ఫత్వా జారీ, మసీదులో వాణిజ్యపరమైన షూటింగ్‌లో పాల్గొనడం, ఓ టోర్నీ సందర్భంగా జాతీయ జెండాను అవమానించిందన్న వార్తలు, పాకిస్థానీ అయిన క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లాడడం.. వంటివి కమ్ముకొచ్చినా వాటినే తలుచుకుంటూ కుమిలిపోలేదు. ధైర్యంగా నిలబడి తన ఆటతోనే వాటన్నింటినీ వమ్ముచేసింది. అద్భుతమైన పట్టుదల, బలమైన వ్యక్తిత్వం, చెరగని ఆత్మవిశ్వాసం ఆమె సొంతం. 2012 లండన్ ఒలింపిక్స్ క్రీడల సందర్భంగా లియాండర్ పేస్‌తో కలిసి పురుషుల డబుల్స్ మ్యాచ్ ఆడేందుకు మహేశ్ భూపతి, రోహన్ బోపన్న అంగీకరించలేదు. దీంతో జాతీయ టెన్నిస్ సమాఖ్య పేస్‌కు జోడీగా తెలుగు ఆటగాడు విష్ణువర్ధన్‌ను ఎంపిక చేసింది. కానీ, మిక్స్‌డ్ డబుల్స్‌లో తనతో జోడీగా సానియాను ఆడిస్తేనే విష్ణుతో కలిసి డబుల్స్ బరిలో దిగుతానని పేస్ షరతు పెట్టాడు. ఈ విషయాన్ని తర్వాత తెలుసుకున్న సానియా ఈ ఘట్టాన్ని పురుషాధిక్యతకు నిదర్శనమని అభివర్ణించింది. ఒక ఆటగాడి కోసం తనను ఎరగా వేశారని సమాఖ్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఐదేళ్ళ వయసులో రాకెట్ పట్టుకొని, మరోపదేళ్ళలో ప్రొఫెషనల్ టెన్నిస్‌లో అడుగుపెట్టిన సానియామీర్జా మూడుదశాబ్దాలపాటు బరిలో నిలబడింది. భారత టెన్నిస్‌లో మరే క్రీడాకారిణీ అందుకోని విజయాలను సాధించింది. అద్భుత ప్రదర్శనతో ఆటపై అసమాన ముద్ర వేయడంతో పాటు శారీరకంగా, మానసికంగా, వ్యక్తిత్వపరంగా అనేక ఆటుపోట్లకు ఎదురొడ్డి నిలిచిన సానియా క్రీడాజీవితం స్ఫూర్తిదాయకం.