ఎట్టకేలకు శుభం కార్డు!
ABN , First Publish Date - 2023-05-19T00:37:25+05:30 IST
‘వాదోపవాదాలు ఎంత తీవ్రంగానైనా ఉండవచ్చు. ఒకసారి తీర్పు వెలువడిన తరువాత కట్టుబడాల్సిందే’ అన్నారు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్. ముఖ్యమంత్రి ఎంపిక...
‘వాదోపవాదాలు ఎంత తీవ్రంగానైనా ఉండవచ్చు. ఒకసారి తీర్పు వెలువడిన తరువాత కట్టుబడాల్సిందే’ అన్నారు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్. ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియలో జాప్యం జరిగినకొద్దీ, ఘనవిజయం అందించిన వెలుగుజిలుగులు క్షీణించిపోతాయన్న వాదన ఉన్నప్పటికీ, ఇద్దరు బలమైన స్థానిక నేతలు ఉన్నతపదవికి పోటీపడుతున్నప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం ఆచితూచి అడుగువేయాల్సిందే. అధిష్ఠానానిదే అంతిమనిర్ణయం అని మాటవరుసకు అన్నంతమాత్రాన ఇద్దరుయోధుల మధ్య సయోధ్య సాధించకుండా ఎవరో ఒకరిని రుద్దడం ఎంత ప్రమాదమో కాంగ్రెస్‌కు తెలుసు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కనబరిచిన విశ్వాసాన్ని నిలుపుకోవాలన్నా, కనీసం సార్వత్రక ఎన్నికల వరకూ సయోధ్య కనిపించాలన్నా అధికారాల పంపకం జాగ్రత్తగా జరగాల్సిందే. రాజుతో పాటు, రాజీపడినవారూ సంతృప్తి చెందాల్సిందే.
స్థానికనేతలను నమ్ముకొని కాంగ్రెస్ బాగుపడిందని, ఇందుకు భిన్నంగా వ్యవహరించి బీజేపీ దెబ్బతిన్నదన్న వ్యాఖ్యలను అంటుంచితే, రాష్ట్రానికే చెందిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో, సిద్దరామయ్య, శివకుమార్‌ల సారథ్యంలో పూర్తిగా స్థానిక అంశాలు, వ్యూహాలతో సాధించిన విజయం ఇది. ఏవో కొన్ని సభలకు వచ్చిపోవడం మినహా అభ్యర్థుల ఎంపికసహా సమస్తవ్యవహారాల్లోనూ గాంధీలు దూరంగానే ఉండిపోయరని అంటారు. ఇప్పుడు సోనియా ప్రమేయంతోనే డీకే దిగివచ్చివుండవచ్చుగానీ, ప్రస్తుతానికైతే సయోధ్య మిగిలినట్టే. కాంగ్రెస్ ఘనవిజయానికి డికె ప్రధానకారకుడన్నది కాదనలేని వాస్తవం. బీజేపీని ఫార్టీపర్సెంట్ సర్కార్‌గా అభివర్ణిస్తూ ఎన్నికల వ్యూహాలను నిర్మించడం, పార్టీ హామీలను ప్రచారంచేయడం, సమస్త వనరులను సమకూర్చడం ఆయనే చూసుకున్నారు. ఉపముఖ్యమంత్రి పదవితోపాటు, సార్వత్రక ఎన్నికల వరకూ ఆయనే కెపిసిసి అధ్యక్షుడిగా ఉంటారని అధిష్ఠానం నిర్ణయించడం అందుకే. గుజరాత్‌నుంచి అహ్మద్‌పటేల్‌ను రాజ్యసభకు పంపించడం వంటి విన్యాసాలతో సహా, పార్టీకి హార్దికంగా, ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తూవచ్చిన డీకేమీద బీజేపీ కక్షకట్టడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆయనమీద అనాదిగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఒకదశలో జైల్లోనూ ఉండాల్సివచ్చింది. కర్ణాటక ఎన్నికలముందు కేంద్రప్రభుత్వ సంస్థలు విరుచుకుపడి ఆయన ఆర్థికమూలాలు కత్తిరించే పని కూడా విశేషంగా జరిగింది. సార్వత్రక ఎన్నికలు ముందున్నందున ఆయనను వదిలిపెట్టే పరిస్థితులు కూడా లేవు. బీజేపీ పక్షాన పనిచేస్తున్నావంటూ ‘నలాయక్’ అని డీకే స్వయంగా దూషించిన వ్యక్తి కర్ణాటక డీజీపీ ప్రవీణ్‌సూద్ ఎన్నికల ఫలితాలు వెలువడిన మర్నాడే సీబీఐ అధినేత అయ్యారు. బీజేపీ ఇంతగా కక్షకట్టిన నేపథ్యంలో, ఏ క్షణమైనా తప్పుకోవాల్సిన పరిస్థితులున్నప్పుడు ముఖ్యమంత్రి పదవిలో కూచోవడం వల్ల ఆయనకు ప్రయోజనం లేకపోగా, పార్టీకి నష్టం చేస్తుందని అధిష్ఠానం ఒప్పించివుండవచ్చు. అలాగే, అనేకకులాలు పార్టీకి అండగా నిలిచినస్థితిలో ఒక బలమైన కులానికి చెందిన డీకేని సీఎం చేయడం వల్ల మిగతావారు దూరమవుతున్నారన్న భయం కూడా పనిచేసినట్టుంది.
అన్ని కులాలు, మతాలవారిలోనూ మంచిపేరు ఉండటం, ఎక్కువమంది ఎమ్మెల్యేలు మొగ్గుచూపడం, బీజేపీ మత ఎజెండాను ఓ బలమైన ఓబీసీ నేతగా వమ్ముచేయగల సమర్థత ఉండటం సిద్దరామయ్య ఎంపికకు దోహదం చేశాయి. దేవెగౌడకు దూరమై, సొంతకుంపటి పెట్టాలని అనుకొని, కాంగ్రెస్‌లో చేరిన ఈ ‘అహిండ’ సిద్ధాంత సృష్టికర్తను మరోమారు సీఎం చేయడం ద్వారా దిగువకులాల్లో ఉన్న ఆదరణను నిలుపుకోవాలన్నది కాంగ్రెస్ ప్రయత్నం.
ఐదేళ్ళక్రితం జనతాదళ్ సెక్యులర్‌తో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేసినా మరుసటి ఏడాది సార్వత్రక ఎన్నికల్లో బీజేపీ అత్యధికస్థానాలు గెలుచుకోవడానికి అహాలు, అంతర్గత కుమ్ములాటలే కారణం. ఇప్పుడు సర్వస్వతంత్రంగా అధికారంలోకి వచ్చి, సార్వత్రక ఎన్నికల ముందు తనబలాన్ని నిరూపించుకోగలిగింది కాంగ్రెస్. గతంలో తనను తీసిపారేసిన పార్టీలను దగ్గరచేర్చుకోగలిగే అవకాశాన్ని ఈ విజయం అందించింది. మోదీ మేజిక్‌ను, మతరాజకీయాలను వమ్ముచేయగల శక్తి సంక్షేమం, ఉపాధి, స్థానిక సమస్యలకు ఉన్నదని కర్ణాటక రుజువుచేసింది. బీజేపీ ఓటుబ్యాంకు అనుకున్న కులాలు, వర్గాలు, ప్రాంతాలు కూడా ఈ మారు కాంగ్రెస్‌వైపు మళ్ళిన స్థితిలో, కలసికట్టుగా పనిచేస్తూ ఐదు ప్రధాన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కొత్తప్రభుత్వం మీద ఉంది.