బంగారు బాక్సర్లు

ABN , First Publish Date - 2023-03-29T00:42:53+05:30 IST

వెక్కిరింపులు, అవమానాలు, ఛీత్కారాల నుంచి రాటుదేలిన నిఖత్‌ జరీన్‌ మరోసారి తన పంచ్‌ పవర్‌ చూపించింది. వరుసగా రెండో ఏడాది విశ్వవిజేతగా అవతరించి భారత బాక్సింగ్‌ చరిత్రలో...

బంగారు బాక్సర్లు

వెక్కిరింపులు, అవమానాలు, ఛీత్కారాల నుంచి రాటుదేలిన నిఖత్‌ జరీన్‌ మరోసారి తన పంచ్‌ పవర్‌ చూపించింది. వరుసగా రెండో ఏడాది విశ్వవిజేతగా అవతరించి భారత బాక్సింగ్‌ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ తర్వాత ఒకటికంటే ఎక్కువసార్లు ప్రపంచ టైటిల్‌ అందుకున్న అరుదైన ఘనత సాధించింది. తన శక్తివంతమైన పిడిగుద్దులతో సామాజిక ప్రతికూలతలను బద్దలుకొట్టి తెలుగుబిడ్డ సాధించిన ఈ విజయం అపూర్వం, చరిత్రాత్మకం. నిఖత్‌తో పాటు మరో ముగ్గురు అమ్మాయిలు లవ్లీనా బోర్గొహైన్‌, నీతూ ఘంగాస్‌, స్వీటీ బూర కూడా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అగ్రభాగాన నిలవడం యావద్భారతావనిని మురిపించే అరుదైన సందర్భం.

ఇన్నాళ్లూ భారత బాక్సింగ్‌ అనగానే వినిపించిన పేరు మేరీకోమ్‌. ఆమె రికార్డు స్థాయిలో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచి బాక్సింగ్‌ సామ్రాజ్యానికి రారాణి అనిపించుకుంది. మేరీ తర్వాత ఎవరన్న ప్రశ్నకు సమాధానంగా ఈసారి ఏకంగా నలుగురు అమ్మాయిలు ఒకే వేదికపై విజయకేతనం ఎగురవేయడం విశేషం. వీరికి ఈ విజయాలు అంత సులువుగా వచ్చినవి కావు. కష్టాలు, కన్నీళ్లను దాటి విశ్వవేదికపై తమ పంచ్‌ రుచిచూపిన ఈ నలుగురిదీ ఒక్కో స్ఫూర్తిగాథ. ప్రభుత్వ ఉద్యోగానికి మూడేళ్లు సెలవుపెట్టి బాక్సింగ్‌ శిక్షణ సమయంలో కుమార్తె వెన్నంటే ఉన్నారు నీతు తండ్రి. ఉద్యోగ సెలవు కారణంగా జీతం రాకపోవడంతో పూట గడవడం కోసం వ్యవసాయం చేస్తూ, కొందరి వద్ద అప్పులు చేసి కుమార్తె కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లాడు. హరియాణాలోని భివానీ జిల్లాకు చెందిన నీతు తన విజయంతో తండ్రి త్యాగానికి ప్రతిఫలం అందించింది. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అసోం యువతి లవ్లీనా ఇప్పటికీ తండ్రితో పాటు పొలం పనులు చేస్తూంటుంది. గ్యాస్‌ సిలిండర్లు మోస్తుంది. ఆమె 2018, 2019 ప్రపంచ టోర్నీల్లో కాంస్యాలు నెగ్గినా, నాలుగేళ్ల తర్వాత స్వర్ణం సాధించింది. రెండేళ్ల క్రితం సరిగ్గా టోక్యో ఒలింపిక్స్‌కు ముందు తల్లికి శస్త్రచికిత్స జరగగా, తానేమో కరోనా బారిన పడి బాక్సింగ్‌ శిక్షణకు దూరమైంది. అయినా, ఇంట్లోనే సాధన చేసి ఆ విశ్వక్రీడల్లో కాంస్యం సాధించడం లవ్లీనా పట్టుదలకు నిదర్శనం. ఏదైనా పనిని నువ్వు చేయలేవని ఎవరైనా అంటే చేసి చూపించేదాకా వదలిపెట్టని మొండితనం స్వీటీ బూరది. హరియాణాకు చెందిన ఈమె తండ్రి మాటను సీరియస్‌గా తీసుకొని బాక్సింగ్‌లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. పూర్తి నిబద్ధతతో కష్టపడే స్వీటీ కెరీర్‌లో ఒక్కోమెట్టు ఎక్కుతూ ఇవాళ ప్రపంచ చాంపియన్‌ స్థాయికి ఎదిగిన తీరు ప్రశంసనీయం. ఇక, బాక్సింగ్‌లో తలపడేందుకు అవసరమైన రింగ్‌ కూడా సరిగా లేని ఊరు నుంచి వచ్చిన నిఖత్‌ జరీన్‌ది విభిన్నమైన ప్రస్థానం. ముఖంపై దెబ్బలు తగిలే ఆట అమ్మాయిలకు అవసరమా అంటూ చాలామంది హేళన చేసినా, హెచ్చరించినా పట్టించుకోకుండా ముందుకు సాగిన నిజామాబాద్‌ బిడ్డ నిఖత్‌. అవరోధాలను దాటుకొని, అవమానాలన్నింటినీ భరించిన ఆమె గత ఏడాది ప్రపంచ టోర్నీ విజయంతోనే అన్ని ప్రశ్నలకూ బదులిచ్చింది. ఈమారు దేశ రాజధానిలో నిర్వహించిన మెగా టోర్నీలో మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. తన అద్భుత ప్రదర్శనతో వచ్చే ఏడు పారిస్‌ ఒలింపిక్స్‌లో తనకో పతకం ఖాయమన్న సందేశాన్ని కూడా ఇచ్చింది.

ఇప్పుడు దేశంలో అన్ని క్రీడలలో అమ్మాయిల ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల అండర్‌–19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో షెఫాలీ వర్మ నేతృత్వంలోని భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. అంతర్జాతీయ ఈవెంట్లలో మన అమ్మాయిలు అద్భుత ఫలితాలు రాబట్టడంతో పాటు బీసీసీఐ ఈ ఏడు కొత్తగా తీసుకొచ్చిన మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)తో మహిళల క్రికెట్‌పై క్రీడాభిమానుల్లో అమితమైన ఆసక్తి నెలకొంది. విదేశీ, స్వదేశీ క్రికెటర్లు పోటీపడ్డ ఈ ఆరంభ లీగ్‌లో హర్మన్‌ప్రీత్‌ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్‌ జట్టు విజేతగా నిలిచింది. ఐపీఎల్‌ స్థాయిలో కాకున్నా డబ్ల్యూపీఎల్‌నూ అభిమానులు ఆదరించారు. మహిళా క్రికెటర్లు సాగిస్తున్న ఈ ప్రయాణం స్ఫూర్తిదాయకం. బాక్సర్లు, క్రికెటర్లు, షట్లర్లు, రెజ్లర్లు.. ఇలా ప్రతి ఆటలోనూ భారత మహిళామణులు చెప్పుకోదగ్గ స్థాయిలో పతకాలు సాధిస్తుండడం భారత క్రీడారంగ పురోగతికి నిదర్శనం.

Updated Date - 2023-03-29T00:42:53+05:30 IST