అమానుషం
ABN , First Publish Date - 2023-07-07T00:37:40+05:30 IST
మధ్యప్రదేశ్‌లో ఒక గిరిజన కూలీపై ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్రవిసర్జన చేసిన అమానవీయమైన ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది...
మధ్యప్రదేశ్‌లో ఒక గిరిజన కూలీపై ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్రవిసర్జన చేసిన అమానవీయమైన ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులతో సన్నిహితంగా ఉంటూ, స్థానికంగా చిన్నపాటి కాంట్రాక్టు పనులు చేసుకొనే ఈ ఛోటానాయకుడి దుశ్చర్య రాజకీయంగానూ తీవ్రదుమారం రేపింది. కూలీ డబ్బులు అడగడానికి వచ్చిన ఒక నిరుపేద, నిస్సహాయ ఆదివాసీ మీద మూత్రవిసర్జన చేసిన ఈ ఉన్మాద ఘటన దేశంలో ఇంకా వేళ్ళూనుకొని ఉన్న అగ్రకుల దురహంకారానికి నిదర్శనమని పలువురు వాపోతున్నారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలకు పోబోతున్న తరుణంలో ఈ విడియో వెలుగులోకి రావడం ముఖ్యమంత్రి చౌహాన్‌కు రాజకీయంగా ఎదురుదెబ్బ.
మూడేళ్ళక్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన విడియోను ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో పెట్టడం వెనుక రాజకీయ కుట్ర ఉన్నదని బీజేపీ నాయకుల వాదన. ఘటన ఎప్పుడు జరిగిదన్నది అటుంచితే, దాని వెనుక నిందితుడి ఆర్థికసామాజిక స్థాయి, అధికారపార్టీతో ఉన్న సాన్నిహిత్యం బలంగా పనిచేశాయన్నది వాస్తవం. అతడి అమానుషత్వం, కండకావరం క్షమార్హమైనవి కావు. కూలి డబ్బులు కోసం వచ్చిన ఒక నిరుపేద ఆదివాసీపై ఈ విధమైన అఘాయిత్యానికి పాల్పడటానికి అతడికి మనసెలా ఒప్పిందో. కోల్ తెగకు చెందిన ఓ ఆదివాసీకి జరిగిన ఈ అవమానం తనకు రాజకీయంగా ఎంత నష్టం చేకూరుస్తుందో చౌహాన్‌కు తెలుసు. కనీసం నలభై అసెంబ్లీ స్థానాల్లో విజయావకాశాలను నిర్ణయించగల సంఖ్యాబలం ఉన్న ఆ ఆదివాసీ తెగ అనాదిగా బీజేపీ ఓటుబ్యాంకు. ప్రవేశ్‌మీద పలు కేసులు పెట్టి అరెస్టు చేశారు. పది అడుగుల లోతున పాతిపెడతానని ప్రకటించిన చౌహాన్ అతడి ఇంటిమీదకు బుల్డోజర్లను పంపారు. ఆ తరువాత సీఎం బాధితుడినే తన ఇంటికి రప్పించుకున్నారు, కాళ్ళుకడిగి తలమీద నీళ్ళు జల్లుకున్నారు. బొట్టుపెట్టి, దండవేసి, కొత్తబట్టలు ఇచ్చి క్షమాపణలు కోరారు. అతడిని సుధాముడితో సరిపోల్చారు. ఇదంతా నాటకమే తప్ప పశ్చాత్తాపం కాదని మాయావతి, కమల్‌నాథ్ వంటివారు అంటుంటే, దీనిని యావత్ నాగరిక సమాజం క్షమాపణ కోరుతున్నట్టుగా భావించాలని కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇలా పాదప్రక్షాళనను నాటకంగా అభివర్ణిస్తున్నవారే బుల్డోజర్ ప్రయోగాన్ని మాత్రం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సమర్థించడం విచిత్రం. ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ ద్వారా తక్షణశిక్షలతో యూపీ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధిపొందిన నేపథ్యంలో, మధ్యప్రదేశ్ చౌహాన్ అదేవిధానాన్ని ఆవాహన చేసుకున్నారు. గత ఏడాది శ్రీరామనవమి సందర్భంగా ఖర్గోన్‌లో అల్లర్లు జరిగినప్పుడు, అధికారులు బుల్డోజర్లతో పోయి ప్రధానంగా ముస్లింల ఇళ్ళు, దుకాణాలను కూల్చివేశారు. ఎవరి ఇళ్ళను కూల్చివేయాలన్నది ఎలా నిర్ణయించారన్న ప్రశ్నకు అల్లర్లకు సంబంధించిన విడియోల్లో మొఖాలు చూస్తే చాలదా అని హోంమంత్రి ప్రశ్నించారు. రాయి విసిరిన ప్రతీ ఇల్లూ కూలుతుందని బీజేపీ నాయకులు వ్యాఖ్యానించడం, అధికారులు వాటిని అక్రమకట్టడాల పేరిట కూల్చివేయడం చూశాం. దీనితో చౌహాన్ అభిమానులకు ‘బుల్డోజర్ మామ’ అయ్యారు. న్యాయ ప్రక్రియకు ఆవల జరిగే, అధికారపక్షం రాజకీయ లబ్ధికి ఉపకరించే ఈ బుల్డోజర్ ప్రయోగాన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు ఇప్పుడు ప్రవేశ్ మిశ్రా విషయంలోనూ దానిని అమలు చేస్తారా? అంటూ ఓ రాజకీయ సవాలు విసరడం విచిత్రం. తద్వారా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న చట్టవ్యతిరేక విధానానికి పరోక్షంగా మద్దతు ఇవ్వడమే కాక, భవిష్యత్తులో మళ్ళీ బుల్డోజర్లను నడిపితే ప్రశ్నించలేని దుస్థితికి జారుకున్నారు. ఇప్పుడు ఒక మిశ్రా ఇంటిమీదకు బుల్డోజర్ నడిపినంతమాత్రాన గతంలో అనేకమంది ముస్లింల ఇళ్ళను అక్రమంగా కూల్చివేసిన ఘట్టం సక్రమమైపోతుందా? తమ ఇళ్ళకూ, దుకాణాలకు అన్ని అనుమతులూ ఉన్నాయంటూ ఆయా ముస్లిం కుటుంబీకులు అప్పట్లో వేదనపడినట్టుగానే, ఎప్పుడో కట్టుకున్న తమ ఇల్లు ఇప్పటికిప్పుడు ఎలా అక్రమమైపోయిందని ప్రవేశ్ కుటుంబీకులు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. తప్పుచేసిన నా కుమారుడిని ఉరితీయండి, కానీ, నా సంపాదనతో నేను కట్టుకున్న ఇంటిని ఎలా కూలుస్తారని నిందితుడి తండ్రి ప్రశ్నిస్తున్నాడు. రేపు వీరంతా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే తమ చర్యను పాలకులు ఎలా సమర్థించుకుంటారో తెలియదు కానీ, తక్షణ రాజకీయ ప్రయోజనాల యావలో పడి చట్టపరంగా నడుచుకోవాల్సిన కర్తవ్యాన్ని ప్రభుత్వాలు గాలికి వదిలేయడం దురదృష్టకరం.