కాయకష్టం తప్పా?

ABN , First Publish Date - 2023-07-18T02:18:30+05:30 IST

పిండికొద్దీ రొట్టె అంటారు, సంస్కారం కొద్దీ భాష అని కూడా అనవచ్చు! సంస్కారం అంటే అదేదో సంస్కృతపదాలు దట్టించిన గ్రాంథికమయిన భాష...

కాయకష్టం తప్పా?

పిండికొద్దీ రొట్టె అంటారు, సంస్కారం కొద్దీ భాష అని కూడా అనవచ్చు! సంస్కారం అంటే అదేదో సంస్కృతపదాలు దట్టించిన గ్రాంథికమయిన భాష మాట్లాడడమో, అతి వినయం గుప్పించడమో కాదు. ఆధునిక నాగరిక సమాజంలో పరస్పరమయిన హద్దులను గుర్తిస్తూ, అందరినీ గౌరవించే విధంగా వ్యక్తీకరణ చేయడం, ఆవేశాన్నీ ఆక్రోశాన్నీ ప్రకటించవలసి వచ్చినా, హద్దులు మీరకుండా ఉండడం, తీవ్రతకు, అసభ్యతకు తేడా తెలియడం. భాష గురించి అంటున్నామంటే, ఇక్కడ భావం గురించి చెబుతున్నట్టే!

రాజకీయాల్లో అనేక క్షీణతలు కనిపిస్తున్నట్టే, వ్యక్తీకరణల్లో కూడా పతనావస్థ తెలుస్తోంది. ప్రత్యర్థులను విమర్శించేటప్పుడు ఏ నియమాలూ పాటించనక్కరలేదన్నట్టుగా వ్యవహరించడం ఈ మధ్య చూస్తున్నాము. రాజకీయ అంశాల మీద అసత్యాలూ అర్థ సత్యాలూ గుప్పించడం, బ్రహ్మాస్త్రాలు వేస్తున్నామనుకుని నోరుజారడాలు, ఆపైన నాలుక కరచుకోవడాలు, అసందర్భపు అనౌచిత్యపు వ్యాఖ్యలు చేయడాలూ... పద్ధతులు పాటించేవాళ్లకు ఇబ్బందిగానే ఉంటున్నది. వాళ్లలో వాళ్లు కొట్లాడుకుని అవమానించుకోవడం సరే, మధ్యలో ఇతరుల ప్రస్తావనతో దూషణలు సాగించడం బాధ కలిగిస్తోంది. మన నాయకుల స్థాయి ఇదేనా, వీరి అవగాహన, ప్రమాణాలు ఇవేనా అని ఆశ్చర్యం కలుగుతోంది.

కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి కెటిఆర్‌ను దృష్టిలో ఉంచుకుని కాబోలు, అమెరికాలో పారిశుద్ధ్య సేవలు అందించినట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. బిఆర్ఎస్ నాయకులు అందుకు ప్రతిగా రేవంత్ రెడ్డి గతంలో గోడలకు పెయింటింగ్ పనిచేశారన్నట్టు హేళన చేస్తున్నారు. తాజాగా, వ్యవసాయం అంటే అంట్లు తోముడు కాదు అని రేవంత్ మరో వ్యాఖ్య చేశారు. దానికి అటువైపు వారు ఏ శ్రమని అవమానించనున్నారో ఇంకా తెలియదు. రాజకీయాలలో పరస్పరం విమర్శించుకోదగిన అంశాలు లేవా? అవతలి వ్యక్తిని హీనపరచాలని అనుకుంటే కూడా, అందుకు వేరే పద్ధతులు లేవా?

వారు జానిటర్ పని చేశారో లేదో, వీరు వాల్ పెయింటింగ్ చేశారో లేదో నిర్ధారణ చేసుకోవలసిన అవసరం లేదు. అయితే ఏమిటి? అన్నదే ఇక్కడ వేయవలసిన ప్రశ్న. అమెరికా, కెనడా దేశాలలో, అనేక గల్ఫ్ దేశాలలో చదువుకోవడానికి వెళ్లిన భారతీయ విద్యార్థులు అక్కడి జీవన వ్యయాన్ని నిర్వహించుకోవడానికి రకరకాల పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తారు. అమెరికా, ఐరోపా దేశాలలో వేర్వేరు శ్రమల మధ్య మన దగ్గర ఉన్నట్టు గౌరవంలో హెచ్చుతగ్గులు ఉండవు. ఏ పనిచేయడాన్ని అయినా వారు తక్కువగా చూడరు. మన దేశంలో పారిశుద్ధ్య కార్మికులను తక్కువగా చూడడమే దుర్మార్గం. మన విలువల వ్యవస్థ ఎంత పాతాళంలో ఉన్నదో శ్రామికులను మనం చూసే తీరే చెబుతుంది. ఈ హీనవిలువలను అమెరికాకు కూడా ఎగుమతి చేయాలా? గోడలకు రంగులు వేస్తే తప్పేమిటి? దొంగతనాలు చేస్తే, అక్రమార్జనలకు పాల్పడితే వాటికి కించపడాలి. కష్టపడి జీవిక గడుపుకున్న దశ ఎవరి జీవితంలో అయినా మహోన్నతమైనదే కదా? నిజానికి ఏ రాజకీయ నాయకుడైనా అట్టడుగు వర్గాలు చేసే శ్రమ తమ జీవితంలో చేసి ఉంటే గనుక, వారు ఎంతో నేర్చుకుని ఉంటారు, తమను తాము కొద్దిగానైనా సంస్కరించుకుని ఉంటారు.

ఈ మధ్య పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ, వైసీపీ నాయకురాలు, ఏపీ మంత్రి రోజా ఒక వ్యాఖ్య చేశారు. పవన్ నీతులు చెప్పడం సన్నీ లియోన్ వేదాలు వల్లించినట్టు ఉన్నదట. పవన్ కళ్యాణ్ కూడా పరుషంగా, తీవ్రంగా, ఒక్కోసారి అసందర్భంగా మాట్లాడుతూ ఉండవచ్చు. దానికి సమాధానం చెప్పుకోవాలంటే రోజా అదే తీరులో తాను కూడా మాట్లాడితే వేరు. కానీ, మధ్యలో సన్నీ లియోన్ పేరు ఎందుకు? ఆ నటి జీవితం గురించి, వ్యక్తిత్వం గురించి తీర్పులు ఎందుకు? ఒకప్పుడు ఆర్థిక, రాజకీయ అవినీతులను, లైంగిక అవినీతితో పోల్చేవారు. ఇప్పుడు అది తగ్గింది. డబ్బు కోసం, జీవిక కోసం సెక్స్ వర్కర్‌గా ఉండేవారు గత్యంతరం లేక చేస్తున్నారని, అందులో అవినీతి లేదని, ఆ మాటకు వస్తే రాజకీయవాదులు, అక్రమార్కులే ఎక్కువ వ్యభిచారులని సమాధానం ఎదురయ్యేది. అద్దాల మేడలో ఉంటూ బయటివారి మీద రాళ్లు వేయడం రాజకీయవాదులకు తగదు. సన్నీలియోన్ దానికి స్పందించలేదు కానీ, ఆమె తరఫున అభిమాని ఎవరో రోజా మీద స్పందించారు. ‘‘నేను ఏదీ దాచలేదు. బాహాటంగానే అతిశృంగార చిత్రాలలో నటించాను. అందుకు నాకే బాధా లేదు. కాకపోతే, నేను అందులోనుంచి బయటపడ్డాను, మీరు ఇంకా అందులోనే ఉన్నారు’’ అన్నది ఆ ట్వీట్ సమాధానం సారాంశం. బహుశా, ఆ అభిమాని ఉద్దేశంలో, పోర్న్ సినిమాలు, రాజకీయ రంగం ఒకటే అయి ఉండవచ్చు. ఆ వ్యక్తీకరణతో ఏకీభవించినా లేకపోయినా, సన్నీ లియోన్ ప్రస్తావనకు ఎదురయిన సమాధానానికి సోషల్ మీడియాలో సానుకూల స్పందన లభించింది.

శ్రమశక్తిని అవమానించడం, స్త్రీల గురించి అవమానకరంగా మాట్లాడడం రాజకీయవాదులు పూర్తిగా మానుకోవాలి. గంభీరంగా, ఉదాత్తంగా మాట్లాడడం ఎట్లాగూ ఈ తరం నాయకులకు తెలియదు కానీ, కనీసంగా తమ పరువు తాము పోగొట్టుకోకుండా, జనం దృష్టిలో పలచన కాకుండా జాగ్రత్తపడాలి.

Updated Date - 2023-07-18T02:18:30+05:30 IST