కన్నడ మమకారం
ABN , First Publish Date - 2023-04-11T01:11:15+05:30 IST
పెరుగు పేరు విషయంలో కేంద్రాన్ని నిలదీసి, తెలుగువారి ఆత్మాభిమాన రాహిత్యాన్ని ఛెళ్లున కొట్టినట్టు స్ఫురింపజేసిన పొరుగు సోదరులు ఇప్పుడు మరోసారి మనలను బోనులో నిలబెట్టారు...
పెరుగు పేరు విషయంలో కేంద్రాన్ని నిలదీసి, తెలుగువారి ఆత్మాభిమాన రాహిత్యాన్ని ఛెళ్లున కొట్టినట్టు స్ఫురింపజేసిన పొరుగు సోదరులు ఇప్పుడు మరోసారి మనలను బోనులో నిలబెట్టారు. సంచలనం, ఆందోళన అంతా కర్ణాటక రాష్ట్రంలోనే కావచ్చు, ఎన్నికల అగ్గికి అది ఆజ్యం పోస్తున్నదే కావచ్చును, కానీ, మనమేమిటి అన్న ప్రశ్న తెలుగు అంతరాత్మలను కూడా కుదిపివేయక తప్పదు. అదే, నందిని, అమూల్ వివాదం.
కర్ణాటక మార్కెట్‌లో అమూల్ ఉత్పత్తులు అమ్మాలన్న ఉద్దేశాన్ని వారం రోజుల కిందట ఆ కంపెనీ సూచించిందో లేదో, కర్ణాటక కన్నెర్ర చేసింది. ఆ ప్రకటన వెనుక ఉన్న చరిత్ర ఒక కారణం, కన్నడ అస్తిత్వం మీద దాడి జరుగుతూనే ఉన్నదన్న స్పృహ మరో కారణం. పోయిన డిసెంబర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్ణాటకలోని మాండ్యా పరిసరాలలో పర్యటిస్తూ, కర్ణాటక పాల ఉత్పత్తుల బ్రాండ్ నందిని, అమూల్ చెట్టపట్టాలు వేసుకుని కలసి పనిచేయాలని ఉద్బోధ చేశారు. ఒక దేశం, ఒకే ప్రజ, ఒకే పార్టీ, ఒకే మతం ఇటువంటి ధోరణిలో జాతీయ అధికారపార్టీ ఉన్నది కాబట్టి, ఒకే దేశం, ఒకే అమూల్ అన్న ప్రమాద సూచికను కర్ణాటక పాడిరైతులు గుర్తించారు. అమూల్‌తో నందిని కలిసి పనిచేయడం అంటే అది పిల్లిలో ఎలుక ఐక్యం కావడం వంటిదేనని వారికి భయం వేసింది.
అమూల్ ఉత్పత్తులను బహిష్కరించాలని, కర్ణాటకలోని ఏడు దశాబ్దాల ఘనచరిత్ర కలిగిన కర్ణాటక పాల ఉత్పత్తిదారుల సమాఖ్య మీద ఝళిపించిన కత్తిని వెనక్కు తీసుకోవాలని కన్నడ సమాజం రోడ్లమీదకు వచ్చింది. కాంగ్రెస్ నాయకులు సిద్ధరామయ్య, శివకుమార్ తీవ్ర నిరసనలు చెప్పారు. బిజెపి రాష్ట్రమంత్రులు ఆత్మరక్షణలో పడిపోయి, అన్నీ అనుమానాలేనని, అపోహలేనని నచ్చచెప్పే ప్రయత్నంలో పడ్డారు.
అమూల్ చరిత్ర చిన్నదేమీ కాదు, 1946లో ప్రారంభమైన అమూల్ గుజరాత్ పాల ఉత్పత్తిదారుల మార్కెటింగ్ సమాఖ్య యాజమాన్యంలో ఉన్నది. ఆ సంస్థ విజయగాథ దేశంలోని శ్వేత విప్లవంలో ఒక ముఖ్యఘట్టం. సహకారరంగంలో దేశవ్యాప్తంగా కూడా అనేక సహకార సంఘాలు, సమాఖ్యలు ఏర్పడ్డాయి. అమూల్ అంత కాకున్నా, నందిని, విజయ వంటి బ్రాండ్లు వివిధ రాష్ట్రాల్లో విజయవంతం అయ్యాయి.
ఉదార ఆర్థిక సమాజం అంటే, న్యాయమైన పోటీకి అందరికీ సమాన అవకాశాలు ఉండడమే. కానీ, చెప్పినంత ఆదర్శవంతంగా ఉండదని, గత మూడు దశాబ్దాల ఆర్థిక సంస్కరణలు నిరూపించాయి. అనేక వ్యాపారాల్లో ప్రభుత్వ రంగం గుత్తాధిపత్యం ఉండడమేమిటని సంస్కరణ వాదులు ప్రశ్నించేవారు. ఆర్థిక సంస్కరణల అనంతరం చూసుకుంటే, ఇప్పుడు ప్రైవేటు రంగంలో అంతకు మించిన గుత్తసంస్థలు అవతరించాయి. టెలికాం రంగంలో, మౌలిక వసతుల రంగంలో అన్నిటా ఒకటి రెండు పేర్లే వినిపిస్తున్నాయి. అట్లాగే, అమూల్ కూడా దేశవ్యాప్త విస్తరణ చేస్తున్నది.
ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో అమూల్ బాహాటంగా, ఎటువంటి ప్రతిఘటనా లేకుండా ప్రవేశించింది. ప్రభుత్వ సహాయాలతోను, చిన్న చిన్న ప్రైవేటు డైరీలను కొనుగోలు చేసి అమూల్ ఒక ప్రధాన బ్రాండ్‌గా మారిపోతున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రప్రభువుల అభీష్టానికి అనుగుణంగా వ్యాపారావకాశాలను, వనరుల సమర్పణను చేస్తూ వచ్చిన జగన్ ప్రభుత్వం, అమూల్ విస్తరణకు అనువైన పరిస్థితుల కల్పన కోసం ఆరున్నర వేల కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయం చేసింది. ఆ డబ్బుతో రాష్ట్రంలోని 13 పాడి సహకార సమాఖ్యలను పునరుజ్జీవింపజేసి ఉండవచ్చు.
చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన సొంత కంపెనీ హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీని నష్టపరిచారని వైఎస్ రాజశేఖరరెడ్డి, ఇతర ప్రతిపక్ష నాయకులు ఆరోపించేవారు. వైఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చిత్తూరు డెయిరీకి పునరుత్తేజం ఇచ్చే ప్రయత్నం చేయలేదు, జగన్ కూడా అందుకు పూనుకోలేదు. తెలంగాణలో అమూల్ వారి భారీ ప్లాంట్ పెట్టడం ఏదో గొప్ప పెట్టుబడి రావడంగా ప్రభుత్వ పెద్దలు చెప్పుకున్నారు. ఇక్కడి పాడినే సేకరించి, ఇక్కడ విక్రయిస్తారు నిజమే కానీ, లాభాలు ఇక్కడి రైతులకు కాక, బయటకు వెళుతున్నాయి. అంతేకాక, స్థానిక సహకార సమాఖ్యలు స్థానికమయిన పేర్లతో, భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, రాష్ట్రాన్ని బాగుచేయడం పూర్తయింది, ఇక పొరుగువారిని ఉద్ధరించడమే మిగిలిందన్నట్టుగా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని చేపట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారట. ప్రైవేటీకరణ ఆగితే, కెసిఆర్ ప్రయత్నం ఫలిస్తే మంచిదే. కానీ, తెలంగాణలోని విజయా డెయిరీని కాస్త పట్టించుకుంటే, అది అమూల్‌కు దీటుగా కాకపోయినా, కాస్త ప్రతిష్ఠాత్మకమైన కంపెనీగా ఎదగడానికి తోడ్పడుతుంది కదా?
రకరకాల ఉత్తరాది ఆధిపత్యాలను ఎదుర్కొనడానికి కన్నడ, తమిళ, మలయాళ సోదరులు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ సొంత అస్తిత్వ భావనను ఆత్మాభిమానపూర్వకంగా ప్రకటిస్తున్నారు. దురదృష్టవశాత్తూ, తెలుగువారు మాత్రం స్పందనలేని వారిగా మిగిలిపోతున్నారు.