కర్ణాటక కదనం
ABN , First Publish Date - 2023-03-30T02:16:29+05:30 IST
ఈశాన్య రాష్ట్రాల విజయగర్వంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి మే 10న జరగబోతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పెద్ద పరీక్ష. దక్షిణ భారతంలో బీజేపీ అధికారంలో ఉన్న ఈ ఏకైక రాష్ట్రానికి...
ఈశాన్య రాష్ట్రాల విజయగర్వంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి మే 10న జరగబోతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పెద్ద పరీక్ష. దక్షిణ భారతంలో బీజేపీ అధికారంలో ఉన్న ఈ ఏకైక రాష్ట్రానికి అధికారంలో ఉన్న పార్టీని తిరిగి నెగ్గించే అలవాటు నాలుగు దశాబ్దాలుగా లేదు. 2008 ఎన్నికల్లోనూ, 2019లోనూ కూడా బీజేపీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రాలేదు కానీ, ఈ మారు నరేంద్రమోదీ హవాతో ‘అపరేషన్ కమల్’ అవసరం లేకుండా నేరుగా నెగ్గుకొస్తామనీ, మెజారిటీ మార్కు దాటేస్తామని బీజేపీ నాయకులు నమ్ముతున్నారు. సర్వేలు మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని అంటున్నాయి. కాంగ్రెస్ విజయం ఖాయమని కొన్ని తేల్చేస్తే, బీజేపీ కాంగ్రెస్ హోరాహోరీ వాస్తవమని మరికొన్ని స్పష్టంచేస్తున్నాయి. పోటీ తీవ్రత బీజేపీ పెద్దలకు తెలియకపోదు. ఎన్నికల ప్రకటనకు ఎంతోముందుగానే ఆరంభమైన కేంద్రపెద్దల పర్యటనలు, మోదీ ఏడుపర్యాయాల పర్యటనలు, శంకుస్థాపనలు, హడావుడి ఆరంభాలు అటుంచితే, మొన్న శుక్రవారమే బొమ్మయ్ ప్రభుత్వం అత్యంత దూకుడు నిర్ణయం ఒకటి చేసింది. నాలుగు దశాబ్దాలుగా ఉన్న నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దుచేసి, బలమైన లింగాయత్, వొక్కళిగ కులాలకు చెరో రెండుశాతం పంచింది. అధికార పక్షంమీద ప్రజావ్యతిరేకత అత్యధికంగా ఉన్నదని సర్వేలు చెబుతున్న స్థితిలో ఈ చర్యలు, హామీలు పార్టీని గట్టెక్కిస్తాయో లేదో చూడాలి.
వరుస పరాజయాలు చవిచూస్తున్న కాంగ్రెస్‌కు కర్ణాటక ఎన్నికలు జీవన్మరణ సమస్య. రాజకీయంగా నిలబడాలన్నా, విపక్ష పెద్దగా ఉండాలన్నా, సార్వత్రక ఎన్నికలకు కదనోత్సాహంతో కదలాలన్నా ఈ పరీక్షలో నెగ్గాల్సిందే. ఎన్నికలు ఏ స్థాయివైనా నిత్యసంసిద్ధతతో నిలబడే బీజేపీతో కలబడేందుకు సార్వత్రక ఎన్నికలవరకూ ఎందుకు, రాబోయే మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ ఎన్నికలకు కూడా కర్ణాటక కొత్తశక్తినిస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్ బలహీనంగా ఏమీ లేదు. వ్యవస్థాగత పునాది, బలమైన స్థానిక నాయకత్వం ఉంది. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న సిద్దరామయ్య, శివకుమార్ మధ్య ఆధిపత్య పోరాటం ఉన్నా ఇద్దరూ బలమైనవారే. మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కూచోవడం కర్ణాటకలోని దళితులను ప్రభావితం చేయడాకేనని అంటారు. ‘ఫార్టీ పర్సెంట్ సర్కార’ వంటి నినాదాలతో బీజేపీ పాలన అత్యంత అవినీతిమయమైనదిగా ప్రచారం చేస్తూ, ఉచిత విద్యుత్, ప్రతీ గృహిణికీ రెండువేల రూపాయల ఆర్థికసాయం, నిరుద్యోగ భృతి ఇత్యాది ఆకర్షణీయమైన హామీలు గుప్పిస్తూ కాంగ్రెస్ యుద్ధం చేస్తోంది. గత ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్ ఓటువాటా రెండుశాతం హెచ్చిందని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో, ప్రతికూలతలను అధిగమించి రాబోయే రోజుల్లో మరింత సానుకూలతను సాధించగలిగితే కాంగ్రెస్ గట్టెక్కగలదు. క్షేత్రస్థాయిలో జోడోయాత్ర ప్రభావం ఎంతో, ‘మోదానీ’ శక్తి ఎంతో, రాహుల్ ఎదుర్కొంటున్న వేధింపుల విషయంలో ప్రజల మనోభిప్రాయం ఏమిటో కర్ణాటక ఫలితాలు తెలియచెప్పవచ్చు.
ఒక దక్షిణాది రాష్ట్రంలో విజయం సార్వత్రక ఎన్నికల ఫలితాలను ప్రతిబింబించదు కానీ, బీజేపీకి ఈ రాష్ట్రంలో విజయం దాని అప్రతిహత గమనానికీ, రాజకీయాధిపత్యానికీ కీలకం. దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠంగా విస్తరించివున్న స్థితిలో, కొత్తవ్యాప్తి అవకాశాలు తక్కువగా ఉన్న దశలో, కర్ణాటకలో ఓటమి దానికి ప్రమాదం. పార్లమెంటు స్థానాలను మూటగట్టి మరీ ఇస్తున్న కర్ణాటక తన పక్షాన ఉంటే, సార్వత్రక ఎన్నికల్లో దేశంలోని ఇతరచోట్ల పొరపాటున నష్టాలు సంభవించినా పెద్ద సమస్య ఉండదు. ‘ఆపరేషన్ కమలం’తో అడ్డుతోవల్లో అధికారంలోకి రావడం తప్ప, నేరుగా ఎప్పుడైనా గెలిచిందా అన్న ప్రశ్నకు ఈ ఎన్నికల్లో బీజేపీ సమాధానం ఇవ్వగలిగితే, తెలుగురాష్ట్రాల్లోకి పొరుగు రాష్ట్రాల్లోకి ఉధృతంగా చొరబడగల ధైర్యం, స్థైర్యం మరింతగా సమకూరుతాయి. హిజాబ్ నుంచి నమాజ్ వరకూ మతపరంగానూ, రిజర్వేషన్ల తిరగమోతతో కులపరంగానూ కర్ణాటకలో తన తలరాతను రాసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని అనుకుంటున్న ఓ రెండు మూడు పార్టీలకే కాదు, మోదీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామని అంటున్న చాలా పార్టీలకు కూడా కర్ణాటక భవిష్యత్ సూచికే.