కొలీజియంతో కయ్యం
ABN , First Publish Date - 2023-10-13T01:15:51+05:30 IST
మణిపూర్ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎం.వి. మురళీధరన్‌ను కోల్‌కతాకు బదిలీచేయాలన్న తన నిర్ణయాన్ని మార్చుకోవడం లేదని సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం ప్రకటించింది...
మణిపూర్ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎం.వి. మురళీధరన్‌ను కోల్‌కతాకు బదిలీచేయాలన్న తన నిర్ణయాన్ని మార్చుకోవడం లేదని సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం ప్రకటించింది. అక్టోబర్ 9న మురళీధరన్ బదిలీని కొలీజియం ప్రకటించగానే, తనను తిరిగి మద్రాస్ హైకోర్టుకైనా వెనక్కుపంపాలని, లేదా మణిపూర్‌లోనైనా ఉండనివ్వాలని మురళీధరన్ విన్నవించుకున్నారు. మర్నాడు జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం తన పూర్వనిర్ణయాన్నే సమర్థించుకుంది. జస్టిస్ పి.వి. సంజయ్‌కుమార్ సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందిన తరువాత, ఆయన స్థానంలో మురళీధరన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా మణిపూర్ వెళ్ళిన విషయం తెలిసిందే. ఆ మరుసటినెల చివర్లో ఆయన తమను ఆదివాసులుగా గుర్తించాలన్న మైతీల విజ్ఞప్తిని పరిశీలించి, సాధ్యమైనంత వేగంగా నిర్ణయం తీసుకోవాలని మణిపూర్ ప్రభుత్వాన్ని ఆదేశించడంతో, అది ఆ రాష్ట్రం నెలల తరబడి రగిలిపోవడానికి పునాదులు వేసింది. రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత దశలో మురళీధరన్ ఆదేశాలను నిలుపుదలచేస్తే మరింత విధ్వంసకాండ జరుగుతుందని ప్రధాన న్యాయమూర్తిని మణిపూర్ తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ ఒక దశలో హెచ్చరించారు కూడా. అయినా, సుప్రీంకోర్టు మురళీధరన్ ఆదేశాలను తప్పుబట్టి, వాటిని నిలుపుదల చేసింది. ఆ తరువాత మురళీధరన్ స్థానంలో ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్న సిద్దార్థ మృదుల్‌ను మణిపూర్ హైకోర్టు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా కొలీజియం ప్రతిపాదిస్తే కేంద్ర ప్రభుత్వం అనేక నెలలుగా దానిని నానబెడుతూ వచ్చింది. మురళీధరన్ విషయంలో సుప్రీంకోర్టు వెనకడుగువేయనందుకు కాబోలు, మృదుల్ నియామకాన్ని త్వరలోనే కేంద్రం నోటీఫై చేయబోతున్నట్టు అటార్నీ జనరల్ మొన్ననే సుప్రీంకోర్టుకు తెలియచేశారు.
జడ్జీల నియామకానికి సంబంధించిన సంప్రదింపుల ప్రక్రియ ఆరువారాల్లోగా ముగియాలని, కొలీజయం తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరాలున్న పక్షంలో ప్రభుత్వం అంతలోపలే తెలియచేయాలనే సంప్రదాయాన్ని కేంద్రపాలకులు ఎన్నడూ పాటించలేదు. ఈనేపథ్యంలోనే, వివిధ హైకోర్టు కొలీజియంలు చేసిన డెబ్బయ్‌కుపైగా ప్రతిపాదనలను దాదాపు పదకొండునెలలుగా అట్టేపెట్టుకున్న కేంద్రం ఇప్పుడు ఒకేమారు వాటిని సుప్రీంకోర్టు కొలీజియంకు పంపడం ఆశ్చర్యం కలిగించదు. సుదీర్ఘవిరామం తరువాత, మొన్న సెప్టెంబరు 26న సుప్రీంకోర్టు ఈ డెబ్బయ్ నియామకాల విషయంలో జరుగుతున్న తాత్సారంపై కేంద్రప్రభుత్వాన్ని నిలదీసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు కొలీజియం పునరుద్ఘాటించినవి ఏడు, ప్రతిపాదించినవి 9, బదిలీలు 26 అంటూ ఆ సందర్భంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఓ పెద్ద జాబితా చదివారు. అందులో భాగంగా, పరోక్షంగా మణిపూర్‌నూ గుర్తుచేశారు. కనీసం ఈ ఏడాది ఏప్రిల్‌లోగా వచ్చిన ప్రతిపాదనలనైనా ముందు తేల్చండి అంటూ అటార్నీ జనరల్‌ను కోరారు. కొలీజియం ప్రతిపాదనలను నిర్దిష్టగడువులోగా ఆమోదించాలంటూ 2021లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలుచేయని కేంద్రంపై చర్యలు తీసుకోవాలంటూ బెంగుళూరు అడ్వకేట్స్ అసోసియేషన్, కామన్‌కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. కేంద్రం కొంతమంది విషయంలో సత్వరమే నిర్ణయం తీసుకొని, మిగతావారి ఊసు వదిలివేస్తున్న విషయన్ని కూడా పిటిషన్‌దారులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే, కేంద్రప్రభుత్వం ఇంతకాలమూ నానబెట్టిన వాటిని పరిష్కరించే పనిలో పడివుంటుంది. కౌల్ వ్యాఖ్యానించినట్టుగా న్యాయస్థానం ఎప్పటికప్పుడు జోక్యం చేసుకుంటే తప్ప ప్రభుత్వం తనకుతానుగా ముందుకు కదలదన్నది వాస్తవం. కొలీజయం సూచించిన పేర్లపై అభ్యంతరాలు ఉంటే తెలియచేసే హక్కు ప్రభుత్వానికి ఉంది. ఆ పనివెంటనే జరిగితే చాలా నియామకాలు సత్వరమే జరుగుతాయి. కానీ, ప్రభుత్వం ఆ పనిచేయదు. పైగా, గత ఏడాది నవంబరులో ధిక్కార పిటిషన్లకు సంబంధించి ప్రభుత్వ వైఖరి అడిగినందుకే, అప్పటి న్యాయమంత్రి కిరణ్‌రిజిజు ఏకంగా కొలీజయం వ్యవస్థనే దుమ్మెత్తిపోయడం ఆరంభించారు. ఆ తరువాత ఆయనకు ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ తోడయ్యారు. ఈ వ్యవస్థ నచ్చకపోతే కొత్త చట్టంతో దానిని మార్చుకోండి, లేదా అప్పటివరకూ దీని ప్రకారం నడుచుకోండి అంటూ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది కూడా. కేంద్రపాలకులు ఈ రెండూ చేయకుండా న్యాయవ్యవస్థపై ఒత్తిడి పెంచుతున్నారు.