మహా మాయ!

ABN , First Publish Date - 2023-07-04T01:56:33+05:30 IST

మహారాష్ట్రలో ‘సీరియల్‌ డిప్యూటీ చీఫ్‌ మినిస్టర్‌’ అజిత్‌ పవార్‌ మళ్ళీ తడాఖా చూపించారు. కొంతమంది ఎమ్మెల్యేలతో ఎన్సీపీని చీల్చి బీజేపీ–షిండే సేన ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి అయ్యారు...

మహా మాయ!

మహారాష్ట్రలో ‘సీరియల్‌ డిప్యూటీ చీఫ్‌ మినిస్టర్‌’ అజిత్‌ పవార్‌ మళ్ళీ తడాఖా చూపించారు. కొంతమంది ఎమ్మెల్యేలతో ఎన్సీపీని చీల్చి బీజేపీ–షిండే సేన ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి అయ్యారు. నాలుగేళ్ళకాలంలో ఆయనకు ఈ పదవి దక్కడం ఇది మూడోసారి. ముఖ్యమంత్రి కాగల తెలివితేటలు, సమర్థత తనకు చక్కగా ఉన్నాయని విశ్వసించే అజిత్‌పవార్‌ను ఈ తిరుగుబాటు ఆ దిశగా నడిపిస్తుందా? ఈయన అనూహ్య ప్రవేశంతో, ఏక్‌నాథ్‌ షిండే ‘డబుల్‌ ఇంజన్‌’ ప్రభుత్వం ‘ట్రిపుల్‌ ఇంజన్‌’ స్థాయిలో నిజంగానే బలపడిందా లేక షిండే పదవికే ఎసరు వస్తుందా? సీఎం నుంచి డిప్యూటీ స్థాయికి దిగిపోయిన దేవేంద్ర ఫడ్నవీస్‌ ఇకపైనా సర్దుకుపోతారా, రాష్ట్రాన్ని వదిలి పోతారా? ఇంతకూ ఇది పెద్ద పవార్‌ మీద చిన్నపవార్‌ నిజమైన తిరుగుబాటేనా, లేక పెద్దాయన వేసిన గూగ్లీకి బీజేపీ మారోమారు బోల్తాపడిందా?

నాలుగేళ్ళుగా, అంటే 2019 ఎన్నికలనుంచి మహారాష్ట్ర రాజకీయాలు ఊహకు అందనిరీతిలో ఉంటున్నాయి. ఆయా రాజకీయపార్టీల, నాయకుల ఎత్తులు లెక్కకు చిక్కడం లేదు. నాలుగేళ్ళక్రితం ఫలితాల్లో బీజేపీకి 105స్థానాలు, దానితో పొత్తులో ఉన్న శివసేనకు 56స్థానాలు వస్తే, ఎప్పుడూ అధికారం మీదేనా అని ఉద్ధవ్‌ బీజేపీమీద అలిగింది. దీనితో బీజేపీ చిన్న పవార్‌కు గేలం వేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, శరద్‌పవార్‌ వెంటనే చక్రం తిప్పి తనవారినందరినీ వెనక్కుతెచ్చుకోవడంతో ఫడ్నవీస్‌ ప్రభుత్వం కూలిపోయింది. పార్టీని చీల్చిన అజిత్‌పవార్‌ను శిక్షించకపోగా, బీజేపీ మిత్ర ఉద్ధవ్‌ ఠాక్రేతో తాను చేతులు కలిపి, కాంగ్రెస్‌ను కూడా ఆ ప్రత్యర్థితో చేర్చి, మహావికాస్‌ అగాఢీ ప్రభుత్వాన్ని సృష్టించారు శరద్‌పవార్‌. పైగా అదే అజిత్‌పవార్‌ను మళ్ళీ డీప్యూటీ సీఎం చేశారు. శరద్‌పవార్‌ పరిభాషలో ఈ గూగ్లీ దెబ్బకు దిమ్మతిరిగిన బీజేపీ రెండున్నరేళ్ళ తరువాత, ఏక్‌నాథ్‌ షిండే చీలికతో పవార్‌ సృష్టించిన ఆ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి తిరిగి అధికారంలో వచ్చింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని అంటారు కానీ, మహారాష్ట్రలో వారు వీరు అయ్యే కాలం మరీ స్వల్పం.

రేపటి పరిణామాలను ఇప్పుడే అంచనావేయలేం కానీ, అజిత్‌పవార్‌ చీలికతో శరద్‌పవార్‌ ప్రతిష్ఠకు పెద్దదెబ్బే తగిలింది. అజిత్‌పవార్‌కు బీజేపీ వలవేస్తున్న నేపథ్యంలో, ఆయన కూడా తిరుగుబాటుకు సర్వంసిద్ధం చేసుకుంటున్న స్థితిలో శరద్‌పవార్‌ ఈ మధ్యనే ఓ పెద్ద విన్యాసం చేశారు. ఎన్సీపీ అధ్యక్షపదవినుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించి, నాయకులంతా భోరుమనేట్టు చేసి, పార్టీ యావత్తూ తన గుప్పిట్లోనే ఉందని తేల్చారు. ఆ దెబ్బతో అజిత్‌ తిరుగుబాటు వెనక్కుపోయినట్టేనని అంతా అనుకున్నారు. కానీ, తరువాత పార్టీ కీలకబాధ్యతల అప్పగింతలో కుమార్తె సుప్రియాసూలేకు అధికప్రాధాన్యం ఇవ్వడం అజిత్‌ వర్గాన్ని నిరాశకు గురిచేసింది. ఈ కారణంగానే ఆయన తిరుగుబాటు చేశారా అన్నది అటుంచితే, అప్పట్లో షిండేను చీల్చి శివసేనను, ఇప్పుడు అజిత్‌ను చేర్చుకొని ఎన్సీపీని బీజేపీ అసెంబ్లీ ఎన్నికల ముందు బాగా బలహీనపరచగలిగింది. అలాగే, సార్వత్రక ఎన్నికలముందు జరిగిన ఈ పరిణామం విపక్ష ఐక్యత దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ. పట్నాలో విపక్ష సమావేశం తరువాత అజిత్‌పవార్‌ వర్గంపై బీజేపీ ఒత్తిడిపెరిగిందని అంటూ అజిత్‌ సహా ఇప్పుడు మంత్రులుగా చేరిన ఎమ్మెల్యేలపై ఏయే కేసులున్నాయో, ఎన్ని లక్షలకోట్ల అవినీతి ఆరోపణలున్నాయో మీడియా విశ్లేషిస్తున్నది. ఈ చేరికతో వారి పాపప్రక్షాళన జరిగిపోవచ్చు. త్వరలోనే షిండేతో సహా ఆయనవర్గానికి చెందిన పదహారుమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడుతుంది కనుక, ఆయన స్థానంలో అజిత్‌పవార్‌కు పట్టాభిషేకం జరుగుతుందని, ఫడ్నవీస్‌ను ఢిల్లీలో కూచోబెడతారని అంటున్నారు. అదానీ కేంద్రంగా విపక్షాలన్నీ బీజేపీమీద యుద్ధం చేస్తున్నప్పుడు, ఆయనను ఏకంగా తన ఇంటికే ఆహ్వానించి రెండుగంటలపాటు చర్చలు జరిపిన శరద్‌పవార్‌ ఆశీస్సులు లేనిదే ఈ పరిణామాలు జరగవనీ, ఇప్పుడు చీలికవర్గంమీద న్యాయస్థానంలో కాక, ప్రజాక్షేత్రంలో పోరాడతామని ప్రకటించడం వెనుక రహస్యం ఇదేనని కొందరి వాదన. ఎంతైనా శరద్‌పవార్‌ పెనంమీద చపాతీని సరైనసమయంలో తిరగవేయగల సమర్థుడు.

Updated Date - 2023-07-04T01:56:33+05:30 IST