మనిషే అతని కేతనం!
ABN , First Publish Date - 2023-08-08T03:11:42+05:30 IST
చరిత్రకు గతంలోనే కాదు, భవిష్యత్తులో కూడా ఉనికి ఉంటుంది. ఒక జ్ఞాపకంగా, స్ఫురణగా, ప్రేరణగా, అనుభవపాఠంగా చరిత్ర జీవిస్తూనే ఉంటుంది. ఆ అర్థంలో గద్దర్ ఇక చరిత్ర. ఒక చరిత్ర...
చరిత్రకు గతంలోనే కాదు, భవిష్యత్తులో కూడా ఉనికి ఉంటుంది. ఒక జ్ఞాపకంగా, స్ఫురణగా, ప్రేరణగా, అనుభవపాఠంగా చరిత్ర జీవిస్తూనే ఉంటుంది. ఆ అర్థంలో గద్దర్ ఇక చరిత్ర. ఒక చరిత్ర.
కేవలం రాసి, పాడే వాగ్గేయకారుడా, ఆడి ఆవేశపరిచే ప్రదర్శనకారుడా, నిలదీసే ఉద్యమకారుడా, ఏ ఒక్క నిర్వచనంలోనూ ఇమడ్చలేకపోవడంలోనే అతని ప్రత్యేకత ఉన్నది. యాభై అరవయ్యేళ్ల నుంచి తెలుగు సమాజం చేసిన పోరాటాల, పడిన కల్లోలాల కన్న బిడ్డ అతడు. కాలం కడుపుతో ఉండి అతనికి జన్మనిచ్చింది. అతడు కేవలం నామవాచకం కాదు. ఏకవచనం కాదు. అతను ఒక ఉమ్మడి. గద్దర్ గొప్పకవి. కానీ, అతను పాడే పాట అనివార్యంగా అతని అల్లికే కానక్కరలేదు, అదొక కోవ. ప్రజాగీతమే అతని పేరుతో ప్రాచుర్యం పొందింది. అతని వ్యక్తిగత ప్రతిభ, సామూహిక సృజనశీలత, ఇంధనం అందించిన సిద్ధాంతం కలసి అతన్ని జనరంజక, జనప్రియ కళాకారుడిని చేశాయి. పాప్యులర్ సంస్కృతి, వ్యాపార కళావిలువలు, ప్రజలను ఉర్రూతలూగించే తారారాధన వ్యాపిస్తూ ఉన్న కాలంలో, అతను ప్రత్యామ్నాయ ఆరాధనీయ కళాకారుడయ్యాడు. ఉద్యమం అతనికి చుట్టూ కాంతి వలయం కల్పిస్తే, అతను తిరిగి తన తేజస్సుతో ఉద్యమాల వేడి పెంచాడు.
అతని సంగీతం, గానం, నాట్యం, వాటిలోని వాచకం అన్నీ, వాటిలో ఆవేశం ఉండనీ, విషాదం ఉండనీ, జన హృదయవేదిక మీద వేడుకగా వెలిగాయి. అందుకే, అతనొక ఉత్సవుడు. జనం గుండెల చప్పుడును ప్రతిధ్వనించే సాంస్కృతిక శక్తి. గద్దర్ అభిప్రాయాలతో ఏకీభావం లేని వారు కూడా ఆయన పాటలకు అభిమానులే. మట్టివాసన గుప్పుమనే గ్రామీణ కంఠస్వరంతో, పేదల వేదన, హీనుల అభాగ్యత, దుర్మార్గుల దౌర్జన్యం, ప్రతిఘటన అవసరం, ఆయన పలికేవారు. నవరసాలు పలికినా, ఆ గొంతులో వీరరసమే పరవశించేది.
అతన్ని సమాజంలోని ప్రధానస్రవంతి అంత తొందరగా ఆమోదించలేదు. అతనొక నిషిద్ధ మానవుడిగా, నిషేధాల వల్ల మాత్రమే ఆకర్షణ కలిగే తిరుగుబాటుదారుడిగా గుర్తించినా, అతడొక శక్తిగా గుర్తించకతప్పని స్థితి 1990లకు కానీ రాలేదు. అతనికి హానిచేయక తప్పని పరిస్థితి ఆ దశాబ్ది చివరి సంవత్సరాలకు కాని రాలేదు. వివిధ రంగాలలో ప్రముఖులుగా ఎవరన్నా ఎదగనీ, ఎవరన్నా ప్రతిష్ఠ కోల్పోనీ, తెలుగు సమాజంలో గద్దర్ వ్యక్తీకరణకు ఉన్న తిరుగులేని ప్రభావశీలత మాత్రం స్థిరపడిపోయింది. విప్లవపోరాటమా, సామాజిక న్యాయమా, ప్రాంతీయ ఉద్యమమా, హక్కుల నినాదమా, మనిషే అతని కేతనం!
అతను ఈ వ్యవస్థను సమూలంగా మార్చివేయడానికి కంకణం కట్టుకుని విప్లవాన్ని సృజనరంగంలో ప్రకటించడంతో పాటు, స్వయంగా అజ్ఞాత వాసంలో కార్యాచరణ చేపట్టాడు. ఈ రోజు, అస్తమయంలో అతనిని కీర్తించడానికి, అతని మార్గాన్ని సొంతం చేసుకోవడానికి అనేక సాధారణ రాజకీయపార్టీలు పోటీ పడడం, ప్రభుత్వమే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించడం విశేషంగా, విచిత్రంగా అనిపించక మానదు. సంతాప ప్రకటనలు చేస్తున్న నేతలు, గద్దర్ అంకిత భావాన్ని ప్రస్తావిస్తున్న పార్టీలు అనుసరించిన విధానాలే ఆయన పాటల్లోని వీరుల అమరత్వానికి కారణం. ఎన్‌కౌంటర్లలో మరణించిన విప్లవకారుల మృతదేహాలను బంధువులకు అప్పగించమని అధికారులను కోరుతూ ఆయన చేసిన పోరాటాలు, అత్యంత విషాదకరమైనవి, సాహసోపేతమైనవి. అధికార కేంద్రాల మహాద్వారాల ముందు నిలబడి సవాల్ చేసిన కవి అతను. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆరంభించడంలోను, గత ద్రోహాలతో దెబ్బతిన్న ఆకాంక్షకు విశ్వసనీయత ఇవ్వడంలోను గద్దర్ పాత్ర గొప్పది. గద్దర్‌ను అధికారికంగా గౌరవించమని రాష్ట్ర ప్రభుత్వం మీద తెలంగాణ సమాజంలోని కొన్ని శ్రేణుల ఒత్తిడి రావడానికి అదొక కారణం. గద్దర్ రాజకీయ విశ్వాసాలలో మార్పు వచ్చిన మాట నిజమే కానీ, ఇప్పుడీ గౌరవప్రకటన కేవలం అందువల్ల కాదు, సుదీర్ఘ ప్రజాజీవితంలో అత్యధికభాగం అనుసరించిన మార్గానికి ఉన్న ప్రతిష్ఠ వల్ల, ఆ క్రమంలో గద్దర్ సమకూర్చుకున్న సొంత ప్రతిష్ఠ వల్ల కూడా.
శ్రీశ్రీ కవిత్వాన్ని పాల్ రోబ్సన్ పాటలతో పోల్చాడు చెలం. శ్రీశ్రీ కంటె ప్రదర్శనాకళాకారుడైన గద్దర్‌కే ఆ పోలిక చెల్లుతుంది. బాబ్ డిలాన్, బీటిల్స్ కవులు, ట్రేసీ చాప్‌మాన్ వంటి వాగ్గేయకారుల కోవలోనివాడు గద్దర్. గ్రామీణ, శ్రామికకులాల కళాకారుడి వేషధారణతో ఆయన ఆహార్యాన్ని కూడా ఒక ముద్రగా మలిచాడు. కళాకారుడిగా వేదికమీదనే కాదు, అధికారసానువులలో, మర్యాద కేంద్రాలలో కూడా ఆ వేషధారణతో గద్దర్ తన ప్రత్యేకతను, సందేశాన్ని, ధిక్కారాన్ని ప్రకటించేవాడు.
గద్దర్ పాట, ఆయన కోవలోని పాట కొనసాగుతాయి. గద్దర్ జీవితాన్ని, ఆయన ప్రకటించిన భావాలను, ఆయన భావుకతను, ప్రతిభను, అంకితభావాన్ని, స్థిరత్వాన్ని, చాంచల్యాన్ని విశ్లేషించే పని కూడా కొనసాగుతుంది. యావజ్జీవితాన్ని ప్రజాజీవితంగా మలచుకుని, అందులో అధికభాగం ప్రమాదసీమలలో సంచరించి, కత్తుల వంతెన మీద కవాతు చేసి నిష్ర్కమించిన గద్దర్‌ను ప్రజానీకం ఎప్పుడూ సగౌరవంగానే స్మరించుకుంటుంది.