దైవభక్తిలో దుశ్చేష్టలు!
ABN , First Publish Date - 2023-04-04T02:52:25+05:30 IST
శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా దేశంలోని చాలా రాష్ట్రాలు ఘర్షణలను, హింసను చవిచూశాయి. ప్రధానంగా పశ్చిమబెంగాల్, బిహార్‌లలో తీవ్రస్థాయి ఘటనలు జరిగాయి...
శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా దేశంలోని చాలా రాష్ట్రాలు ఘర్షణలను, హింసను చవిచూశాయి. ప్రధానంగా పశ్చిమబెంగాల్, బిహార్‌లలో తీవ్రస్థాయి ఘటనలు జరిగాయి. బెంగాల్ ఘర్షణల్లో అనేకమంది గాయపడ్డారు, వాహనాలు తగలబడ్డాయి, నివాసాలమీదా, దుకాణాలమీదా దాడులు జరిగాయి. రామనవమి యాత్రల్లో రేగిన అగ్గి బెంగాల్‌లో ఇంకా ఆరలేదు కూడా. బిహార్‌లో ఒక మసీదు సమీపంలో బాంబుపేలి ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు, నలందా ఘటనల్లో ఒక యువకుడి మరణంతోపాటు, కొందరు పోలీసులు కూడా గాయపడ్డారు. ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాల్సి వచ్చింది. ఈ రెండు రాష్ట్రాలూ బీజేపీ వ్యతిరేకపక్షాల ఏలుబడిలో ఉన్నవి కనుక, రాజకీయ విమర్శలు కూడా తీవ్రస్థాయిలోనే సాగుతున్నాయి.
బెంగాల్ హింస బీజేపీ సృష్టించినదేనని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆరోపణ. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలున్న నేపథ్యంలో, తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ రామనవమి యాత్రలను పోటాపోటీగా నిర్వహిస్తూ భక్తియాత్రలను రాజకీయ ఆధిపత్య ప్రదర్శనకు వేదికలుగా మార్చేశాయి. ఆయుధాలు చేబూని మరీ యాత్రల్లో పాల్గొని వాటిని హింసాత్మకంగా మార్చేసింది మీరంటే మీరేనని ఇరుపార్టీలు విమర్శలు చేసుకుంటున్నాయి. ప్రతీ పండుగనీ హింసాత్మకంగా మార్చేయడం బీజేపీకి అలవాటైపోయిందని తృణమూల్ విమర్శిస్తుంటే, న్యాయవిచారణ జరిపితే రాష్ట్ర పాలకపక్షమే ఈ హింస సృష్టికర్తన్న విషయం తేలుతుందని బీజేపీ అంటున్నది. రాష్ట్ర గవర్నర్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం, కేంద్ర హోంమంత్రితో సంభాషించడం, బీజేపీ నాయకులు న్యాయస్థానాలను ఆశ్రయించడం ఇత్యాదివన్నీ విషయాన్ని రాజకీయం చేయడమేతప్ప ప్రజాక్షేమం విషయంలో పట్టింపు కాదు. నిజానిజాలతో నిమిత్తం లేకుండా రెండుమతాలవారి మధ్య ఉద్రిక్తతలు కొనసాగించగలిగే స్థాయిలో వార్తలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రవహిస్తూనే ఉన్నాయి. శ్రీరామనవమి సందర్భంగా బీజేపీ పాలిత మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ హింసాత్మక ఘటనలు జరిగాయి. తెలంగాణలో ఘాటైన ప్రసంగాలతో పాటు గాడ్సే చిత్రంతో ఘనమైన ఊరేగింపు కూడా జరిగింది. విపక్షపాలిత రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలకు అక్కడ అధికారంలో ఉన్నవారే కారకులని ఆరోపిస్తున్న బీజేపీ, తమ ఏలుబడిలోని రాష్ట్రాల్లో జరిగిన హింసకు తామే బాధ్యులమని అంగీకరించవలసి ఉంటుంది.
శ్రీరామనవమి ఉత్సవాలు మతఘర్షణలకు దారితీయడం గతంలో లేదు. ఇప్పుడది క్రమంగా సర్వసాధారణమైపోతోంది. ప్రశాంతంగా ఉండే రాష్ట్రాలకు సైతం ఈ జాడ్యం వేగంగా విస్తరిస్తున్నది. పొరుగుదేశం నేపాల్‌కూ సోకుతోంది. గత ఏడాది మధ్యప్రదేశ్‌లో శోభాయాత్ర సందర్భంగా హింస జరిగితే, శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం యూపీ ముఖ్యమంత్రి యోగి తరహాలో ఒకవర్గం వారి ఇళ్ళను, దుకాణాలను బుల్డోజర్లతో కూల్చివేసిన విషయం తెలిసిందే. అవి అక్రమనిర్మాణాలని అధికారికంగా చెబుతూ, మరోపక్క హిందువులపై రాళ్ళు విసిరినవారిని క్షమించేది లేదని కేంద్ర రాష్ట్ర నాయకులు ఈ తక్షణశిక్షను సమర్థించుకొచ్చారు. రెండు వర్గాలవారి ప్రమేయమూ లేకుండా మతఘర్షణలు జరిగే అవకాశం లేదు కనుక, నిందితులను సక్రమపద్ధతుల్లో గుర్తించి, కేసులు నమోదుచేసి, న్యాయస్థానాల్లో శిక్షలు వేయించినప్పుడు ప్రభుత్వాలపట్ల నమ్మకం ఏర్పడుతుంది. కానీ, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమైనప్పుడు అల్లర్లూ, శిక్షలూ కూడా ఏకపక్షంగానే ఉంటాయి. ప్రతీ పండుగ, వేడుక, యాత్ర, చివరకు ప్రార్థన కూడా హింసకు దారితీసే సందర్భంగా మారిపోతాయి. యాత్రల సందర్భంగా మరోవర్గంవారి నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించడం, నినాదాలతో రెచ్చగొట్టడం, వారే దాడి చేశారంటూ హింసకు దిగడం ఇవన్నీ రాజకీయ ప్రేరేపణ, ప్రమేయం లేకుండా జరగవు. అల్లర్లు జరిగినప్పుడు పోలీసు వ్యవస్థను సజావుగా పనిచేయనిస్తే నియంత్రణ పెద్ద కష్టం కాదు.
రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నందునా, సార్వత్రక ఎన్నికలు సమీపిస్తున్నందునా రాబోయే రోజుల్లో ప్రతీ చిన్నవేడుకా మతపరమైన ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కారణమయ్యే ప్రమాదం ఉంది. మతం నుంచి ఓట్లు దండుకొనే ధోరణికి రాజకీయపక్షాలు దూరంగా ఉన్నప్పుడే అవి ఆగుతాయి. రాముడు తమకు ఆదర్శమనీ, రామరాజ్యం తమ లక్ష్యమనీ చెప్పుకుంటున్నవారు ఈ విషయంలో మరింత బాధ్యతగా వ్యవహరించాలి.