నగుబాటు నిష్క్రమణ

ABN , First Publish Date - 2023-06-15T01:53:53+05:30 IST

బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రెండున్నర దశాబ్దాల రాజకీయజీవితం ఇలా ముగుస్తుందని ఎవరూ ఊహించివుండరు. నాలుగేళ్ళక్రితం ఆయన ఆధ్వర్యంలో...

నగుబాటు నిష్క్రమణ

బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రెండున్నర దశాబ్దాల రాజకీయజీవితం ఇలా ముగుస్తుందని ఎవరూ ఊహించివుండరు. నాలుగేళ్ళక్రితం ఆయన ఆధ్వర్యంలో కన్సర్వేటివ్‌ పార్టీ 80సీట్ల మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 1987తరువాత టోరీలకు ఈ స్థాయి ఘన విజయాన్ని సాధించిపెట్టి ప్రధాని పదవిని చేపట్టిన ఆయన చేజేతులా చేసుకున్న పాపాల కారణంగా పార్టీ అంతర్గత తిరుగుబాటు తట్టుకోలేక గత ఏడాది జూలైలో ప్రధాని పదవినుంచి దిగిపోవాల్సి వచ్చింది. ‘పార్టీగేట్‌’ వ్యవహారంలో ప్రివిలేజెస్‌ కమిటీ నుంచి అభిశంసన ఎదుర్కోబోతున్న తరుణంలో, ఇప్పుడాయన ఉన్న ఎంపీ పదవిని కూడా వదులుకోవాల్సి వచ్చింది. కొవిడ్‌ కాలంలో సామాన్య ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలతోనూ, పలురకాల ఆంక్షలతోనూ ఇబ్బందులు పడుతున్న తరుణంలో, ప్రధానిగా ౧0 డౌనింగ్‌ స్ట్రీట్‌లో ఆయన ఎన్ని మద్యం విందులు చేసుకున్నారో, ఎంతమందితో కలిసి చిందులువేశారో, అసత్యవాదనలతో, తప్పుడు నివేదికలతో తనపై వచ్చిన ఆరోపణలను కొట్టివేస్తూ పార్లమెంటును ఎలా తప్పుదోవపట్టించారో ఏడాదిపాటు నిగ్గుతేల్చిన ప్రివిలేజెస్‌ కమిటీ నేడు దానిని బహిరంగపరచబోతున్నది.

పార్లమెంటులో అనూహ్యంగా రాజీనామా ప్రకటన చేసిన ఆయన ఎంతటి అవమానకరమైన స్థితిలో నిష్క్రమిస్తున్నారో ఆయన ఆగ్రహావేశపూరిత వ్యాఖ్యలే చెబుతున్నాయి. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని మాటమాత్రంగా అన్నప్పటికీ, అరవైయేళ్ళవయసులోనే ఆయన పాతికేళ్ళ రాజకీయజీవితం ముగిసిపోయినట్టే. తగిన ఆధారాలు లేకుండానే విచారణముగించారని, చేయని తప్పులు మెడకు చుట్టారని, నిందలు వేశారని అంటూ తనను తాను సమర్థించుకోవడం కంటే, ప్రివిలేజెస్‌ కమిటీలో మెజారిటీ సభ్యులుగా ఉన్న తన పార్టీవారినే ఆయన పరోక్షంగా ఆడిపోసుకున్నారు. ప్రజాస్వామ్యవిరుద్ధంగా తనను బయటకు గెంటేశారని వాపోయిన ఆయన, ప్రధానిగా తాను కాస్తంత నిలకడగా, బాధ్యతగా, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించివుంటే ఈ గతిపట్టేది కాదని మాత్రం అనుకోలేదు. ఆంక్షలు, ఆచారాలు సామాన్యులకే తప్ప ప్రధానిగా తనకు వర్తించవని ఆయన నమ్మాడు. జనానికి ఇచ్చిన ఆదేశాలను తాను ఎందుకు పాటించాలని అనుకున్నాడు. తన చర్యలను, చేష్టలను సమర్థించుకోవడం ద్వారా, అబద్ధాలు అసత్యాలతో కప్పిపుచ్చడం ద్వారానే అధికారాన్ని నిలబెట్టుకోగలనని అనుకున్నాడు.

నైతిక విలువలకు కట్టుబడని నాయకుడిని మూడేళ్ళపాటు నెత్తినపెట్టుకొని కన్సర్వేటివ్‌పార్టీ చాలా అప్రదిష్టపాలైంది. ప్రధాని పదవినుంచి తప్పుకోవాల్సివచ్చినప్పుడు ఆయన ఆ పని హుందాగా చేయలేకపోయాడు. తన మంత్రిగా ఉన్న రిషీ సునాక్‌ తొలిగా తిరుగుబాటు చేసి పార్టీ యావత్తూ తనకు ఎదురుతిరిగేట్టుచేశాడన్న ఆగ్రహాన్ని బోరిస్‌ ఎన్నడూ దాచుకోలేదు. సునాక్‌ను మాత్రం నాయకుడిగా ఎన్నుకోవద్దని బహిరంగంగా పిలుపునిచ్చి, ఆయన అవకాశాలు దెబ్బతీసి, యాభైరోజుల లిజ్‌ ట్రస్‌ పాలనకు కారకుడైనాడు. తన ఆర్థిక కార్యాచరణమీద తనకే నమ్మకం లేని స్థితిలో ఆమె రాజీనామా చేయాల్సిరావడంతో పార్టీ పరువు మరింత దిగజారింది. చివరకు పార్టీ యావత్తూ సునాక్‌ చుట్టూ మోహరించి, ఆయనను ప్రధానిగా ప్రతిష్ఠిస్తే తప్ప ఆర్థికంగానూ, రాజకీయంగానూ బ్రిటన్‌ సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న అస్తవ్యస్థ పరిస్థితులు చక్కబడలేదు. నైట్‌హుడ్‌ సహా ఇతర గౌరవపురస్కారాల విషయంలో సునాక్‌తో సాగిన వాగ్వాదం, సునాక్‌ ఏలుబడిలో పార్టీ దిగజారిందన్న వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అక్కసు తెలియచేస్తాయి తప్ప, ప్రభుత్వ పనితీరుమీద వాస్తవిక అంచనాకాదు. పార్టీ ఎన్నడూ లేనంత దుస్థితిలోకి జారుకున్నదనీ, కొందరి గుప్పిట్లోకి పోయిందని విమర్శిస్తూ పార్టీలో చిచ్చురేపగలిగానని ఆయన అనుకొని ఉండవచ్చు కానీ, ఆయన నిష్క్రమణ చాలామంది నెత్తిన పాలుపోసింది. ప్రివిలేజెస్‌ కమిటీ నివేదికపై ఓటింగ్‌లోనూ ఆయన పార్టీవారు అండగా నిలిచే సూచనలు లేవు. తనకు తానుగా రాజీనామా చేసి, సస్పెన్షన్‌ శిక్షను తప్పించుకున్నప్పటికీ, మాజీ ఎంపీగా దక్కబోయే చాలా అవకాశాలు, అధికారాలకు ఆయన దూరం కావచ్చు. ప్రధానిగానే కాదు, ఒక ఎంపీగా కూడా ఆయన నిష్క్రమణ హుందాగా లేకపోవడం, అవమానకరమైన రీతిలో చరిత్రనుంచి చెరిగిపోవడం విచారకరం.

Updated Date - 2023-06-15T01:54:08+05:30 IST