హరగోపాల్‌పై ‘ఊపా’నా?

ABN , First Publish Date - 2023-06-16T00:58:53+05:30 IST

అంటే,ఇతరుల మీద పెట్టడం సరైనదని కాదు, మునుపు పెట్టిన ఊపా కేసులు న్యాయమైనవనీ కాదు. ఆయన చట్టానికి అతీతుడనీ కాదు. ఆయన ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టలేదనీ కాదు...

హరగోపాల్‌పై ‘ఊపా’నా?

అంటే,ఇతరుల మీద పెట్టడం సరైనదని కాదు, మునుపు పెట్టిన ఊపా కేసులు న్యాయమైనవనీ కాదు. ఆయన చట్టానికి అతీతుడనీ కాదు. ఆయన ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టలేదనీ కాదు. అసాధారణమనీ, జీర్ణించుకోలేనంత దిగ్భ్రాంతికరమనీ ఆవేదన చెందడం మాత్రమే. సమాజానికి మంచీచెడ్డా చెప్పగలిగే, ‘పెద్దమనుషుల’ సమాజం కూడా పెద్దమనిషిగా గౌరవించే మేధావికే నల్లచట్టం బిగుసుకుంటే, ఇక ఇతరుల పరిస్థితి ఏమిటని మథన పడడం. ఇంత జరిగితే, తెలుగు సమాజాలు, ముఖ్యంగా తెలంగాణ సమాజం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడమేమిటని మరింత దుఃఖపడడం.

గత ఏడాది ఏదో ఒక కేసులో గుట్టు చప్పుడు కాకుండా రూపొందించిన ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)లో ప్రొఫెసర్ హరగోపాల్ పేరు నిందితుడిగా ఉన్నదని, ప్రస్తుతం దేశంలో అత్యంత వివాదాస్పదమైన నల్లచట్టంగా ఉన్న చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం ‘ఊపా’, సుప్రీంకోర్టు చేతనే విమర్శలు పొందిన రాజద్రోహచట్టంతో సహా అనేక చట్టాలు, సెక్షన్లను అందులో ఆరోపించారని తెలిసినప్పుడు, భయానకమైన ఆశ్చర్యం కలగడం సహజం.

హరగోపాల్ ఐదు దశాబ్దాలకు పైగా వివిధ విశ్వవిద్యాలయాలలో అధ్యాపకులుగా ఉన్నారు. నలభయ్యేళ్లుగా ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాలనా శాస్త్రం నేపథ్యం నుంచి ప్రారంభమై, రాజకీయశాస్త్రం, మానవహక్కుల దాకా ఆయన విద్యా ప్రయాణం సాగింది. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ సోషల్ సైన్సెస్ నుంచి బెంగుళూరు నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా దాకా ఆయన సందర్శక ఆచార్యులుగా వ్యవహరించారు. భారతీయ సివిల్ సర్వీసు, పోలీసు సర్వీసు అధికారులకు శిక్షణ ఇచ్చే సంస్థలలో ఆయన క్రమం తప్పకుండా అతిథి ప్రసంగాలు చేస్తారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో సైతం ఆయన ప్రఖ్యాతి అసామాన్యమైనది. ఇదంతా ఆయన వృత్తి సంబంధితమైతే, ప్రవృత్తి రీత్యా ఆయన సామాజిక కార్యకర్త. హక్కుల ఉద్యమంలో ప్రముఖులు. తెలంగాణ ఉద్యమంలోను, మహబూబ్‌నగర్ జిల్లా జలసాధన ఉద్యమంలోను క్రియాశీలురు. అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు, ఉద్యమ, వృత్తి సంఘాలు, యావత్ పౌరసమాజం గౌరవించే స్థాయి వ్యక్తి ఆయన. అనేక జటిల సందర్భాలలో ప్రభుత్వాలు కూడా ఆయన సూచనలను, సహాయాన్ని తీసుకుంటాయి.

ప్రభుత్వాలు సులువుగా చెలగాటమాడలేని స్థాయి వ్యక్తిగా హరగోపాల్‌ను ఒక ఉదాహరణగా తీసుకోవడమే తప్ప, ఇదే కేసులో చేర్చిన పాత్రికేయ శాస్త్ర ఆచార్యులు పద్మజాషా కానీ, హైకోర్టు న్యాయవాదులు రఘునాథ్ కానీ, చిక్కుడు ప్రభాకర్ కానీ ఆయా రంగాలలో అదే స్థాయిలో సుప్రసిద్ధులు, గౌరవనీయులు, ప్రజారంగంలో చురుకుగా ఉన్నవారు. మొత్తం 152 మందిని ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. పోయిన సంవత్సరం ఆగస్టు 19వ తేదీన తెల్లవారు జామున ములుగు జిల్లాకు చెందిన తాడ్వాయి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన కూంబింగ్ ఆపరేషన్‌లో నక్సలైట్లు పారిపోవడంతో కొంత సామగ్రి దొరికిందట. అక్కడ లభించిన పుస్తకాలలో ఈ మేధావుల పేర్లు ఉన్నాయి కాబట్టి కేసు నమోదు చేశారట. ఈ అభియోగాల గురించి ప్రత్యేకంగా వ్యాఖ్యానించవలసిన అవసరం లేదు. నిందితులుగా ఉన్నవారి దగ్గర ఉన్న పుస్తకాలలో ఎవరి పేర్లు రాసి ఉంటే వారిమీద కేసులు పెట్టడంలో పోలీసులకు అనౌచిత్యం కనిపించకపోవడం విచిత్రం.

ఊపాను దేశవ్యాప్తంగా యథేచ్ఛగా ఉపయోగిస్తున్నారనడానికి సాక్ష్యం, భీమా కోరేగావ్ దగ్గర నుంచి పౌరసత్వ చట్టం వ్యతిరేక ఆందోళనల దాకా దీర్ఘకాలంగా నిర్బంధంలో ఉంటున్న మేధావులు, రచయితలు, హక్కుల కార్యకర్తలు, విద్యార్థి ఉద్యమ నేతలు. మరి, కేంద్రప్రభుత్వం నిర్బంధ విధానాలను వ్యతిరేకిస్తున్నామని, పోరాడుతున్నామని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నదేమిటి? ఐదేళ్ల కిందటే విద్యాపరిరక్షణ యాత్ర నిర్వహిస్తున్న సందర్భంలో హరగోపాల్‌ను అరెస్టు చేయడమే కాదు, చేయి చేసుకున్నారు కూడా. ఉద్యమకారులతో, మేధావులతో అమర్యాదగా వ్యవహరించడంలో తెలంగాణ ప్రభుత్వం రానురాను శ్రుతిమించిపోతున్నది.

తన పేరు, తెలంగాణ రాష్ట్రం పేరు అపఖ్యాతి పాలుకాక ముందే, ప్రభుత్వం ఆ ఎఫ్ఐఆర్‌ను వెంటనే రద్దు చేయాలి. తెలంగాణ పౌరసమాజంలో ఎంతో ముఖ్యమైన, విలువైన వ్యక్తులను వేధించకుండా తక్షణం చర్యలు తీసుకోవాలి. రేపు ఇవే అధికారపార్టీలు, ఇవే ప్రాంతీయ ప్రభుత్వాలు తమ కంటె బలవంతుల నుంచి, ప్రత్యర్థుల నుంచి అణచివేతను, వేధింపులను ఎదుర్కొన్నప్పుడు గొంతువిప్పడం కోసమైనా నాలుగు గొంతులను మిగలనివ్వాలి. ఈ రహస్య ఎఫ్ఐఆర్‌ల ఆనవాయితీ, అందులో తమను ప్రశ్నించే పెద్దమనుషులను కూడా నిందితులుగా చిత్రించే ప్రభుత్వ ధోరణి ఎంత ప్రమాదకరమైనవో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రజారంగ ప్రముఖులు గమనించి పాలకులకు హితవు చెప్పాలి.

Updated Date - 2023-06-16T00:58:53+05:30 IST