‘చిలుక’ పలుకులు!

ABN , First Publish Date - 2023-04-05T03:15:10+05:30 IST

ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో సీబీఐ వజ్రోత్సవకార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రసంగం ఆసక్తిదాయకంగా ఉంది. అధికారులకు ఎలా అర్థమైందో తెలియదు కానీ, సామాన్యులకు మాత్రం...

‘చిలుక’ పలుకులు!

ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో సీబీఐ వజ్రోత్సవకార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రసంగం ఆసక్తిదాయకంగా ఉంది. అధికారులకు ఎలా అర్థమైందో తెలియదు కానీ, సామాన్యులకు మాత్రం సీబీఐకి ఇంతటి స్వతంత్రత ఉన్నదా అని కచ్చితంగా విస్మయం కలిగిస్తుంది. అవినీతిపరులు ఎంతటిశక్తిమంతులైనా వదలవద్దనీ, ఒక్క అవినీతిపరుడు కూడా తప్పించుకోవడానికి వీల్లేదని మోదీ అధికారులకు ఉద్బోధించారు. పనిలోపనిగా, పదేళ్ళకిందట యాభయ్యవ వార్షికోత్సవం సమయంలో దేశం ఎలా ఉన్నదో గుర్తుచేసుకోమంటూ పరోక్షంగా రాజకీయవిమర్శలూ చేశారు. అప్పట్లో ప్రతీపని, ప్రతీ ప్రాజెక్టు అవినీతిమయమై దేశం భ్రష్టుపట్టిపోయిందనీ, తాము అధికారంలోకి రావడంతోనే నల్లధనం, బినామీ ఆస్తులకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టామని చెప్పుకొచ్చారు. ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రలకు ఏ మాత్రం వెరవకుండా ముందుకు సాగిపొమ్మంటూ సీబీఐకి దిశానిర్దేశం చేశారు.

సర్వసాధారణంగా ఇటువంటి సందర్భాల్లో అధికారులకు అత్యున్నతస్థాయి నాయకులు ఇచ్చే సందేశాలు చప్పగా సాగిపోతుంటాయి కానీ, సందర్భం ఏదైనా, విషయం ఏమైనా మాట మహత్తరంగా ఉండటం మోదీలో మెచ్చుకోవాల్సిన లక్షణం. దేశంలో నెలకొని ఉన్న వాతావరణానికి అనుగుణంగానే ఆయన ప్రసంగం ఉంది. ఈ అత్యున్నత దర్యాప్తు సంస్థ కేంద్రంలోని అధికారపక్షం చేతుల్లో బ్రహ్మాస్త్రంగా, రాజకీయప్రత్యర్థులను నేలమట్టంచేసే బుల్‌డోజర్‌గా పరిణమించిందన్న విమర్శలున్న నేపథ్యంలో, అయిననూ వెనక్కుతగ్గేదేలేదని మోదీ తేల్చేశారు. అవినీతి, దాని దుష్ప్రభావాల విషయంలో ఆయన వ్యాఖ్యలు సముచితమైనవి. అవినీతినిరోధానికి సీబీఐవంటి అగ్రసంస్థ చేయాల్సిన కృషి చాలా ఉంది. కానీ, ఆ కృషి ప్రత్యర్థులకు మాత్రమే పరిమితమై, అస్మదీయులకు వర్తించకపోవడంతోనే సమస్య వస్తున్నది. దేశవ్యాప్తంగా రాజకీయంగా విస్తరించాలన్న బీజేపీ లక్ష్యాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ, ఆ లక్ష్యసాధనకు ప్రభుత్వ ఏజెన్సీలు ఉపకరించడమే విమర్శలకు తావిస్తున్నది. ఢిల్లీ ప్రత్యేక పోలీసుచట్టంద్వారా ఏర్పడిన సీబీఐ, తన విధ్యుక్తధర్మాన్ని సక్రమంగా నిర్వహించాలంటే కేంద్ర రాష్ట్రాల మధ్య కనీసస్థాయి సయోధ్య, సమన్వయం ఉండాలి. ఫెడరల్‌ స్ఫూర్తి కనుమరుగైపోతున్నప్పుడు సీబీఐ తన ఆవిర్భావ లక్ష్యాన్ని నెరవేర్చలేదు. కేంద్రప్రభుత్వం తన అధీనంలోని సీబీఐ, ఈడీలను రాజకీయంగా దుర్వినియోగం చేస్తున్నదంటూ పద్నాలుగు విపక్షపార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టబోతోంది. 2014 వరకూ ఈ ఏజెన్సీలు విపక్ష నాయకులపై ఎన్నికేసులు పెట్టాయో, ఇప్పుడు అవి ఎన్నిరెట్లు పెరిగాయో ఈ పార్టీలు నివేదించాయి. దేశంలోని మూడోవంతు రాష్ట్రాలు సీబీఐ ప్రవేశానికి మోకాలడ్డటం నేడు నెలకొని ఉన్న ఘర్షణ వాతావరణానికి నిదర్శనం. ఇందుకు భిన్నంగా, మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ఉద్ధవ్‌ ప్రభుత్వం నిర్ణయాన్ని తిరగదోడుతూ సీబీఐ ప్రవేశానికి అనుమతినివ్వడం, యోగి ప్రభుత్వం పలుకేసులను సీబీఐకి అప్పగించడం వెనుకా ఏ మర్మం ఉన్నదో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.

సీబీఐ చేపట్టిన కేసుల్లో అవినీతి ఎంతో, రాజకీయం ఎంతో న్యాయస్థానాల్లో తేలవచ్చు. కానీ, అవినీతిపై పోరాటంలో తరతమభేదాలు లేవని ప్రజలకు కూడా నమ్మకం కలగాలి. సీబీఐ నమోదుచేసిన కేసులు న్యాయస్థానాల్లో వీగిపోతూ, నేరనిర్ధారణ రేటు గతంతో పోల్చితే ఇటీవలి కాలంలో బాగా పడిపోవడం కూడా ఈ నమ్మకాన్ని తగ్గిస్తోంది. అలాగే, గతంలో ఈడీ డైరక్టర్‌ రెండేళ్ళ పదవీకాలం పరిమితిని కచ్చితంగా పాటించవలసిందేనని సుప్రీంకోర్టు ఆదేశిస్తే, తీర్పు స్ఫూర్తిని దెబ్బతీస్తూ, తాను మెచ్చినపక్షంలో సీబీఐ, ఈడీ డైరక్టర్ల పదవీకాలాన్ని ఐదేళ్ళవరకూ పొడిగించుకొనే విధంగా ప్రభుత్వం ఆర్డినెన్సు చేసింది. రాఫెల్‌ కుంభకోణాన్ని దర్యాప్తుచేసేందుకు సిద్ధపడినందుకే, అప్పటి సీబీఐ డైరక్టర్‌ అలోక్‌వర్మను మోదీ ప్రభుత్వం రాత్రికిరాత్రి తప్పించి ప్రభుత్వం సీబీఐ కార్యాలయానికి తాళం వేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తడమూ తెలిసిందే. వరుస పరిణామాలు సీబీఐ పట్ల ప్రజల్లోనూ నమ్మకాన్ని తగ్గిస్తున్న తరుణంలో దాని విశ్వసనీయతను పెంచడానికి నిర్దిష్టమైన చర్యలు అవసరం. సీబీఐ సర్వస్వతంత్రంగా, నిష్పాక్షికంగా వ్యవహరించగలిగినప్పుడే, అధికారులకు మోదీ చేసిన మార్గనిర్దేశనానికి, వల్లించిన ఆదర్శాలకు విలువ, సార్థకత చేకూరుతాయి.

Updated Date - 2023-04-05T03:15:10+05:30 IST