హింసానందం

ABN , First Publish Date - 2023-09-12T02:31:34+05:30 IST

నాలుగు దశాబ్దాలకు పైబడి తెలుగు రాజకీయాలలో ముఖ్యపాత్ర, కొంతకాలం జాతీయ రాజకీయాలలోనూ కీలక పాత్ర పోషించిన నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడంలో..

హింసానందం

నాలుగు దశాబ్దాలకు పైబడి తెలుగు రాజకీయాలలో ముఖ్యపాత్ర, కొంతకాలం జాతీయ రాజకీయాలలోనూ కీలక పాత్ర పోషించిన నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడంలో సాక్ష్యాధారాల వంటి వాటి ప్రమేయం ఏమీ లేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కక్షపూరిత మనస్తత్వమే ఈ పరిణామాలను నడిపిస్తున్నదని సామాన్యులకు కూడా అర్థమవుతున్నది. అరెస్టు జరిగిన సమయం, సందర్భం అన్నీ కూడా అదే విషయాన్ని ధ్రువపరుస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ దేశంలో లేరు. బహుశా, దూరం నుంచే అన్నీ నడిపిస్తూ ఉంటారు. తొందరగా బెయిల్ రాకుండా, దీర్ఘకాలం నిర్బంధంలో ఉండేలాగా ప్రాసిక్యూషన్ ఎట్లా వ్యవహరించాలో, ఈ కేసు సరిపోకపోతే ఇంకా ఇతర కేసులతో ఎట్లా ఇబ్బంది పెట్టాలో జగన్ బృందం వ్యూహరచనలో మునిగి ఉన్నదని కూడా తెలిసిపోతున్నది.

అవినీతి అక్రమాలు జరిగినప్పుడు చర్యలు తీసుకోగూడదని ఎవరు అంటారు? బాధ్యత కలిగిన పదవులలో ఉన్నవారు ప్రజాధనానికి నష్టం కలిగే నిర్ణయాలు తీసుకున్నప్పుడు, లేదా స్వలాభంతో వ్యవహరించినప్పుడు తప్పనిసరిగా విచారణలను, న్యాయప్రక్రియలను ఎదుర్కొనాలి. కానీ, కేవలం తమ మనసులో ఉన్న కార్పణ్యమే న్యాయబద్ధమైన అభియోగం కాజాలదు కదా? విశ్వసనీయత కలిగిన ఆధారాలు కావాలి, వాటి ఆధారంగా నిందితుడి నిర్బంధాన్ని కోరాలి. అట్లా కాక, దేశంలో ఇప్పుడు ఉన్న ‘కఠినమైన’ న్యాయవాతావరణాన్ని ఆసరా చేసుకుని, తీవ్రమైన సెక్షన్లతో పెద్ద పెద్ద ఆరోపణలు చేయడం ద్వారా తమ దుర్బుద్ధిని నెరవేర్చుకోవాలని చూడడం హేయం.

డెబ్భైమూడేళ్ల వయస్సున్న చంద్రబాబును నిద్రలేకుండా, గంటలతరబడి ఇబ్బంది పెట్టడం, ప్రజాజీవితంలో ఆయన స్థానాన్ని దృష్టిలో పెట్టుకున్నా, వయస్సును పరిగణించినా చేయదగిన పని కాదు. కుటుంబసభ్యులు, అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయనకు కలిగిన కష్టానికి కలతచెందుతుంటే, రాష్ట్ర మంత్రులతో సహా అధికారపార్టీ పెద్దలు సంబరాలు జరుపుకోవడం, దూషణలతో మీడియా ముందు మాట్లాడడం, ఏమి సంస్కారం అనిపించుకుంటుంది? ఈ నీచమైన ప్రవర్తనల వల్లనే చంద్రబాబు అరెస్టు వెనుక ఏ స్కామూ లేదని, కేవలం జగన్ స్కీము మాత్రమే ఉన్నదని జనం అనుకుంటున్నారు.


జగన్ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేండ్లు అయింది. తనకు ముందున్న ప్రభుత్వం మంచిచెడ్డలను సమీక్షించడానికి కానీ, తప్పులేవైనా జరిగితే విచారణలు జరిపించడానికి కానీ, చాలా సమయం ఆయన చేతిలో ఉండింది. ఎందుకు ఇప్పుడు చివరినిమిషంలో అవినీతినిరోధక శాఖను, పోలీసు యంత్రాంగాన్ని ఉసిగొల్పినట్టు? నిన్నటిదాకా ప్రాథమిక నివేదికలో లేని పేరు ఇప్పుడు ఎట్లా ప్రత్యక్షమైనట్టు? జాబితాలో చివర ఎక్కడో ఉన్న ముద్దాయి ఉన్నట్టుండి నెంబర్ వన్ ఎట్లా అయినట్టు? సమష్టి విధాన నిర్ణయాలు వ్యక్తిగత నేరాలుగా ఎట్లా మారినట్టు? ఇవన్నీ ప్రాసిక్యూషన్‌ను బోనులో నిలబట్టే ప్రశ్నలే. కఠినమైన సెక్షన్లు తప్ప గట్టి సాక్ష్యాలు లేని కేసు కాబట్టి, ఇందులో అంతిమ తీర్పు ఎట్లా వస్తుందో ఊహించవచ్చు. ప్రజలలో ఉధృతంగా తిరుగుతున్న చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేశ్‌ను తమ పార్టీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లకుండా చేయడమే ఇక్కడ ప్రధాన ఉద్దేశ్యం. ఇటువంటి చర్యల వల్ల ప్రజలలో సానుభూతి పెరిగి, చంద్రబాబుకే మేలు జరిగే అవకాశం ఉండవచ్చు. జగన్‌కు, ఆయన సలహాదారులకు ఆ విషయం తెలియదని అనుకోలేము. కానీ, తెలుగుదేశం పార్టీ యంత్రాంగానికి కాళ్లూ చేతులూ ఆడకుండా స్తంభింపజేస్తే తమకు ఎదురుండదని అధికారపార్టీ ఆశిస్తూ ఉండవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు అరెస్టుకు వ్యక్తమవుతున్న నిరసనలను చూస్తే, ప్రభుత్వానికి ప్రజాదరణ ఈ రెండు రోజులలో బాగా పడిపోయి ఉండాలి. కొందరు తెలుగుదేశం నాయకులు చెబుతున్నట్టు, పట్టుదలగా పనిచేయడానికి ఈ విపత్తును కార్యకర్తలు ఒక అవకాశంగా తీసుకోగలరేమో చూడాలి.

వివేకానందరెడ్డి హత్యకేసులో ఆధారాలు, అనుమానాలన్నీ ఒకవైపు వేలు చూపుతుండగా, ఒక్కరోజు కూడా జైలుకు వెళ్లకుండా ఆ నిందితుడిని కాపాడుతూ వస్తున్న ముఖ్యమంత్రి, ప్రమేయం ఉన్నట్టు ఆధారం లేని ఒక కేసులో మాజీ ముఖ్యమంత్రిని దీర్ఘకాలం బంధించాలని ఆలోచించడంలో హింసానందం తప్ప మరొకటి లేదు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో తెలుగుదేశం ప్రభుత్వ పెద్దల ప్రమేయాన్ని నిరూపించదలచుకుంటే, అందుకు తగిన ఆధారాలను సమకూర్చుకోవడం ప్రాసిక్యూషన్ బాధ్యత. ఆ స్కామ్ నుంచి రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటే, ప్రతిపక్ష పార్టీ అవినీతి గురించి ప్రజలలో ప్రచారం చేసుకోవాలి. అట్లా కాక, వ్యక్తిగత ప్రతీకారం కోసం, రాజకీయ లాభం కోసం విచారణ సంస్థలను, న్యాయప్రక్రియను వినియోగించడం ఏ మాత్రం అంగీకారయోగ్యం కాదు.

Updated Date - 2023-09-12T02:31:34+05:30 IST