చదరంగంలో ‘ప్రజ్ఞ’
ABN , First Publish Date - 2023-08-25T03:02:30+05:30 IST
చదరంగం ఓ ఆట మాత్రమే కాదు, మేధస్సుకు పనిచెప్పే మంత్రం. ప్రత్యర్థి బలాలు, బలహీనతల్ని అనుక్షణం అంచనావేస్తూ, ఎత్తుకు పై ఎత్తులతో శత్రువును చిత్తు చేసే తంత్రం...
చదరంగం ఓ ఆట మాత్రమే కాదు, మేధస్సుకు పనిచెప్పే మంత్రం. ప్రత్యర్థి బలాలు, బలహీనతల్ని అనుక్షణం అంచనావేస్తూ, ఎత్తుకు పై ఎత్తులతో శత్రువును చిత్తు చేసే తంత్రం. ఆ రణరంగంలో చిరుప్రాయంలోనే దూసుకుపోతున్న రమేష్‌బాబు ప్రజ్ఞానంద భారత చదరంగానికి లభించిన ఆణిముత్యం. అజర్‌బైజాన్ రాజధాని బాకు వేదికగా జరిగిన ప్రపంచ కప్‌లో ఈ చెన్నై కుర్రాడు రజత పతకం చేజిక్కించుకొని మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. పద్దెనిమిదేళ్ల వయసులోనే ఈ ఘనత సాధించి భారత చదరంగంలో సరికొత్త చరిత్రకు నాంది పలికాడు. ఫైనల్లో ప్రపంచ నెంబర్‌వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్ ముందు ఓడి స్వర్ణం చేజార్చుకున్నా, టోర్నమెంట్ ఆద్యంతం అమోఘమైన పోరాటాన్ని కనబరచి క్రీడాలోకం నుంచి జేజేలు అందుకున్నాడు.
ప్రపంచకప్‌లో మేటి ఆటగాళ్లంతా తలపడతారు. ఈ మెగా టోర్నీలో అనుభవజ్ఞులైన సీనియర్లంతా ఒక్కో రౌండ్ నుంచే నిష్క్రమిస్తుంటే, ప్రజ్ఞానంద మాత్రం గేమ్ గేమ్‌కూ తన ప్రదర్శనను మెరుగుపరచుకుంటూ ముందుకెళ్లాడు. ప్రీక్వార్టర్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ హికారు నకమురపై, క్వార్టర్స్‌లో అర్జున్‌పై, సెమీస్‌లో మూడో ర్యాంకర్ ఫాబియానో కరువానాపై సంచలన విజయాలతో ఫైనల్ చేరాడు. ప్రపంచ చెస్ చరిత్రలోనే అత్యంత ప్రతిభావంతమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్న కార్ల్‌సన్‌తో తుది సమరంలోనూ అంత సులువుగా తలొగ్గలేదు. ఫైనల్ ఫలితాన్ని టైబ్రేక్ దాకా తీసుకెళ్లి ముచ్చెమటలు పట్టించాడు. ఇలా ఓడిగెలిచిన ప్రజ్ఞానంద, నిజానికి కార్ల్‌సన్‌పై తన ఆధిపత్యాన్ని ఇప్పటికే చాటుకున్నాడు. అనేకమంది అగ్రశ్రేణి ఆటగాళ్లు కార్ల్‌సన్‌పై గెలిచేందుకు విఫలయత్నాలు చేస్తుంటే, గతేడాది ఆరునెలల వ్యవధిలోనే అతడిని మూడుసార్లు ఓడించిన ఘనత ప్రజ్ఞానందది. 12 ఏళ్ల వయసులోనే గ్రాండ్‌మాస్టర్ హోదా, అండర్–18 ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్ టైటిల్, 17 ఏళ్లకే అర్జున అవార్డు.. ప్రజ్ఞానంద ఓ వండర్ బాయ్.
ప్రజ్ఞానంద ఈ స్థాయికి చేరడం వెనక తల్లి నాగలక్ష్మిది అమోఘమైన పాత్ర. తండ్రి రమేశ్‌బాబు బ్యాంకు ఉద్యోగి. ప్రజ్ఞానంద సోదరి వైశాలి కూడా అంతర్జాతీయ చెస్ క్రీడాకారిణి. దీంతో టోర్నీల కోసం విదేశాలకు వెళ్లినప్పుడు కొడుకు, కూతురు వెంట నాగలక్ష్మి ఉండాల్సిందే. విదేశాల్లో పిల్లలు ఇంటి భోజనానికి దూరం కారాదన్న భావనతో ఇండక్షన్ స్టవ్, రైస్ కుక్కర్ తనతో తీసుకుపోయి వారికి వండిపెట్టేవారు. నిత్యం వెన్నంటే ఉంటూ వాళ్లలో నైతిక స్థయిర్యాన్ని నింపేవారు. తాజా ప్రపంచకప్ పోటీల్లోనూ ప్రజ్ఞానంద చెస్ బోర్డుపై ప్రత్యర్థులతో తలపడుతుంటే, ఆమె ఓ మూలన కూర్చొని కుమారుడి ఆటను చూస్తూ మురిసిపోయారు. ఈ టోర్నీ క్వార్టర్స్‌లో అర్జున్ ఇరిగేసిని ఓడించి, విశ్వనాథన్ ఆనంద్ తర్వాత సెమీస్ చేరిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించినప్పుడు ప్రపంచ మీడియా ప్రజ్ఞానందను చుట్టుముట్టింది. తన కుమారుడు మీడియాతో మాట్లాడుతుంటే, తల్లి అతడినే చూస్తూండిపోయిన ఆ దృశ్యం ఎన్నటికీ చెరగనిది. ప్రజ్ఞానందలో కనబడని ఆనందం, భావోద్వేగం ఆమె కళ్ళలో ప్రతిఫలించడం, ఆనందబాష్పాలు రాల్చడం అందరినీ కదిలించింది.
మనదేశంలో చెస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు విశ్వనాథన్ ఆనంద్. ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌మాస్టర్ హోదాను పొందిన తొలి భారతీయుడిగా ఖ్యాతి అందుకున్న ఆనంద్ ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ దక్కించుకున్నాడు. తన అద్భుత విజయాలతో భారత చెస్‌లో సరికొత్త విప్లవాన్ని తెచ్చాడు. ఆనంద్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటూ ప్రజ్ఞానందలాంటి నవతరం స్టార్లు ఇప్పుడు చెస్‌లో మన దేశాన్ని మెరిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, లలిత్ బాబు, అర్జున్ ఇరిగేసి, ప్రియాంక, హర్ష భరత్‌కోటి, రాజా రిత్విక్, రాహుల్ శ్రీవాత్సవ, ప్రణీత్‌తో పాటు ఇతర రాష్ట్రాల ఆటగాళ్లు సూర్యశేఖర గంగూలీ, శశికిరణ్, సేతురామన్, విదిత్ గుజరాతి, గుకేశ్ ఇలా ఎందరో ప్రపంచ చెస్ యవనికపై సత్తా చాటుతున్నారు. ఈ ప్రపంచకప్‌లో భారత్ నుంచి ఏకంగా నలుగురు ఆటగాళ్లు క్వార్టర్‌ఫైనల్ చేరడమే అందుకు నిదర్శనం. విశ్వనాథన్ ఆనంద్ దీనిని ఓ చారిత్రక ఘట్టంగా అభివర్ణించాడు. అంతర్జాతీయ పోటీల్లో అగ్రశ్రేణి ఆటగాళ్లపై అద్భుత విజయాలతో మన క్రీడాకారులు చెస్ ప్రపంచాన్ని శాసించే దిశగా సాగుతుండడం శుభపరిణామం.