రాష్ట్రపతి పాలనే శరణ్యం

ABN , First Publish Date - 2023-06-20T00:39:10+05:30 IST

‘మణిపూర్‌లో పరిస్థితులు లెబనాన్‌, నైజీరియా, సిరియాలో మాదిరిగా ఉన్నాయి. ఎవరు ఎవరినైనా చంపివేయవచ్చు, ఎవరి ఆస్తినైనా యథేచ్ఛగా ధ్వంసం చేయవచ్చు’ అంటూ ఆ రాష్ట్రంలో నివసిస్తున్న...

రాష్ట్రపతి పాలనే శరణ్యం

‘మణిపూర్‌లో పరిస్థితులు లెబనాన్‌, నైజీరియా, సిరియాలో మాదిరిగా ఉన్నాయి. ఎవరు ఎవరినైనా చంపివేయవచ్చు, ఎవరి ఆస్తినైనా యథేచ్ఛగా ధ్వంసం చేయవచ్చు’ అంటూ ఆ రాష్ట్రంలో నివసిస్తున్న రిటైర్డ్‌ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ ఒకరు చేసిన ట్వీట్‌ను మాజీ ఆర్మీచీఫ్‌ వేద్‌మాలిక్‌ తిరిగిపోస్టు చేస్తూ, రాష్ట్రంమీద కేంద్ర ప్రభుత్వ పెద్దలు మరింత శ్రద్ధపెట్టాల్సిన అవసరం ఉన్నదని వ్యాఖ్యానించారు. దాదాపు ఆరు వారాల నుంచి మణిపూర్‌లో పరిస్థితులను రవ్వంతైనా దారికి తేలేకపోయిన కేంద్రప్రభుత్వం ఇక చేయగలిగిందేమీ లేదని చేతులెత్తేసిందా అనిపిస్తున్నది.

మీరు పోలీసులనుంచి దోచుకున్న ఆయుధాలు దయుంచి తిరిగి ఇచ్చేయండి అని ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ మరోమారు విజ్ఞప్తిచేశారు. కనిపించకుండా పోయిన వేలాది తుపాకులు ప్రధానంగా మీతీల చేతుల్లో పడి మరింత హింసకు ఉపకరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొన్ననే ఆ రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి ఇంటిని కొందరు తగులబెట్టినప్పుడు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిందని తన పార్టీకి చెందిన ప్రభుత్వాన్నే ఆయన విమర్శించారు. భద్రతాదళాలను అడ్డుకోవడం, అసోం రైఫిల్స్‌కు చెందినవారిని రోజులపాటు కదలనీయకుండా చేసి ఆకలితో మాడ్చటం వంటివార్తలు కూడా వింటున్నాం. ఆహారం లేక, వైద్యం అందక రాష్ట్రం తీవ్ర మానవీయ సంక్షోభాన్ని చవిచూస్తున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితులను దారికి తేలేకపోతున్నాయి. దాడులు, మరణాల కంటే, వైద్యం అందక చనిపోతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉన్నదని, వైద్యవ్యవస్థ పూర్తిగా కుప్పకూలిన స్థితిలో తాత్కాలిక వైద్యశిబిరాలు తప్ప ప్రజలకు దిక్కులేకపోతున్నదని వార్తలు వస్తున్నాయి. యాభైవేలమంది నిరాశ్రయులైనారని, వేలాదిమంది సహాయక శిబిరాల్లో ఉంటున్నారని అంటున్నప్పటికీ, పొరుగురాష్ట్రాలకు తరలిపోయినవారి సంఖ్య ఇంతకు రెట్టింపు ఉంటుంది. శిబిరాల్లో ఉంటున్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీస్త్రీల ఆరోగ్యపరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయి. దశాబ్దాలపాటు తీవ్రవాద హింస చవిచూసినప్పటికీ, ప్రార్థనాస్థలాలు వైద్యాలయాలు దాడులకు గురికాలేదు. ఇప్పుడు వందలాది చర్చిలు దహనం కావడంతో పాటు, వైద్య సిబ్బందిమీద దాడులు జరగడం నిత్యకృత్యమైపోయింది. ఒక తెగకు చెందినవారికి చికిత్సచేస్తున్నారనో, తరలిస్తున్నారనో అనుమానం కలిగితే చాలు అంబులెన్సులు నిలువునా తగులబడిపోతున్నాయి. పరస్పర విద్వేషం, జాతివైరం దిగువస్థాయి వరకూ పాకడంతో తోటిమనుషులకు నీటివనరులు దక్కకుండా చేయడం, పంటలను తగులబెట్టడం, పెంపుడు జంతువులను చంపివేయడం వంటివి జరుగుతున్నాయి. ఇళ్ళనూ పొలాలను వదిలిపెట్టిపోయినవారు తిరిగిరాలేని, వచ్చినా బతికిబట్టకట్టలేని వాతావరణం ఉన్నందున స్థానిక వ్యవసాయం పూర్తిగా దెబ్బతిన్నది. బయటనుంచి ఆహారధాన్యాలు వచ్చే పరిస్థితులు మూసుకుపోయాయి.

ఇప్పటికీ వేటనిమిత్తం లైసెన్సులున్న అయుధాలకు తోడు పోలీసులనుంచి దోచుకున్న వేలాది తుపాకులు, మందుగుండు కలగలసి హింస మరింత విస్తరిస్తున్నది. మిగతా అన్ని రంగాల్లో మాదిరిగానే, మీతీ ఆధిపత్యం ఉన్న పోలీసుశాఖలో ఆయుధాలు మాయం కావడం, చాలా పోలీసుస్టేషన్లు ఖాళీగా దర్శనమిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తున్నది. చేతగాకనో, చేయదల్చుకోలేదో తెలియదుకానీ, ఆయుధాల స్వాధీనం విషయంలో మీతీ ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ అనాదిగా అవే దీనమైన ప్రకటనలు చేస్తున్నారు. మే 3న హింస రేగిన వెంటనే కేంద్రప్రభుత్వం తన బలగాలను దించివుంటే పరిస్థితులు ఇంతగా దిగజారిపోయివుండేవి కాదు. మీతీలకు, ఇతర ఆదివాసీ తెగలకు మధ్య చిచ్చురేపిన బీరేన్‌ సింగ్‌ ప్రభుత్వం పరిస్థితిని అదుపుచేయడానికి బదులు పరోక్షంగా దాడులకు సహకరిస్తుంటే, మణిపూర్‌ సందర్శనకు కేంద్రహోంమంత్రికి మే 29వరకూ సమయమే చిక్కలేదు. నలభైవేలమంది సైనికుల తరలింపు, శాంతికమిటీల ఏర్పాటు, సలహాదారుల నియామకం వంటివి మణిపూర్‌ మంటలు ఆర్పలేవని తేలిపోయిన నేపథ్యంలో, బీరేన్‌ సింగ్‌ ప్రభుత్వాన్ని తప్పించడం వినా మరోమార్గం లేదు. ప్రత్యర్థిపార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇంతటి ఘోరమైన హింస జరిగివుంటే కేంద్రపాలకులు ఇంతకాలం ఊరుకొనేవారే కాదు. బీరేన్‌ సింగ్‌ను తప్పిస్తే తమ ప్రధాన ఓటుబ్యాంకు అయిన మీతీలకు మరింత ఆగ్రహం కలుగుతుందన్న రాజకీయకోణాన్ని పక్కనబెట్టి, ఈ ఈశాన్య రాష్ట్రంలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించడం అవసరం.

Updated Date - 2023-06-20T00:39:10+05:30 IST