శిక్షా? కక్షా?
ABN , First Publish Date - 2023-03-25T00:33:47+05:30 IST
రాహుల్ గాంధీని ఇంకా ‘పప్పు’ అని అధికార భారతీయ జనతాపార్టీ హేళన చేస్తున్న కాలంలోనే, ఆయన తరచు చేసే రెండు రకాల వ్యాఖ్యలు పరిశీలకులను ఆశ్చర్యపరిచాయి...
రాహుల్ గాంధీని ఇంకా ‘పప్పు’ అని అధికార భారతీయ జనతాపార్టీ హేళన చేస్తున్న కాలంలోనే, ఆయన తరచు చేసే రెండు రకాల వ్యాఖ్యలు పరిశీలకులను ఆశ్చర్యపరిచాయి. ఒకటి రాష్ట్రీయ స్వయం సేవక్ మీద తీవ్రమైన, నికరమైన వ్యతిరేకతను ప్రకటించేవి, రెండు, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి, కార్పొరేట్ దిగ్గజాలకు, ముఖ్యంగా అదానీకి ఉన్న అనుబంధాన్ని విమర్శించేవి. పాలక రాజకీయాలలో ఉంటూ, ఇంత నిక్కచ్చిగా ఒక వివాదాస్పద సంస్థను విమర్శించడం, ఇంతింతై ప్రపంచపు వింతై ఎదిగే అతిసంపన్నుడిని శత్రువు చేసుకోవడం సాహసంగానే ధ్వనించాయి. ఇటీవలి ‘భారత్ జోడో’ యాత్రలో కూడా రాహుల్ ఈ రెండు అంశాలను పదే పదే ఉద్ఘాటిస్తూ వచ్చారు. బహుశా, గురు, శుక్రవారాల్లో రాహుల్ గాంధీ విషయంలో సంభవించిన పరిణామాలను పై వైఖరుల నేపథ్యంలో చూడాలేమో? జోడో యాత్ర తరువాత రాహుల్ ప్రతిష్ఠలో వచ్చిన మార్పు భారతీయ జనతాపార్టీ అగ్రనాయకత్వానికి ఆందోళన కలిగిస్తోందా? నిజంగానే, రాహుల్‌ను చూసి వారు భయపడుతున్నారా?
పోయిన సాధారణ ఎన్నికల ప్రచారంలో చేసిన ఒక వ్యాఖ్యలో కొందరు మోదీల మీద విమర్శ ఉన్నదా, అందరు మోదీల మీద నింద ఉన్నదా, నిజానికి మోదీలకు అంటూ ఒక గుంపు, కులం, కోవ ఉన్నాయా? ఈ ప్రశ్నల మీద న్యాయనిపుణులు ఇంకా చర్చిస్తూనే ఉన్నారు. కానీ, కింది కోర్టు తీర్పు ఇచ్చింది. రెండేళ్ల కంటె తక్కువ శిక్షవేస్తే న్యాయం జరిగినట్టే కాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నేరనిర్ధారణను కాక, శిక్ష అమలును మాత్రం నెలరోజులు వాయిదా వేసి అప్పీలుకు వీలు కల్పించారు. ఆ వెనువెంటనే ఆగమేఘాల మీద పరిణామాలు సంభవించి, మరునాడే రాహుల్‌ను పార్లమెంటు సభ్యత్వం నుంచి అనర్హుడిగా లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. మొత్తం విషయంలో న్యాయపరమైన వివాదాంశాలు అనేకం ఉన్నాయి కానీ, అంతా సజావుగానే జరిగిందనుకున్నప్పటికీ, రాహుల్‌ను ఎంపిగా తప్పించడానికి వ్యవస్థలో ఎంతో ఆత్రుత, శ్రద్ధ, పట్టింపు, వేగం కనిపించాయి. రాజకీయ దృష్టితోనే ఇంత హడావిడి అనర్హత జరిగిందన్న అభిప్రాయం కలుగుతోందంటే, అందులో అసహజం ఏమీ లేదు.
ఇక లోక్‌సభలో గౌతమ్ అదానీ గురించి గట్టిగా నిలదీసే ఒక పెద్ద నాయకుడు ఉండడు. మాట్లాడకుండా చేయడానికి అధికారపక్ష సభ్యులు భూనభోంతరాలు దద్దరిల్లజేయవలసిన అవసరం ఉండదు. పై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా, స్పీకర్ ఎప్పుడు తిరిగి నిర్ణయం వెనక్కు తీసుకుంటారో తెలియదు. తీసుకున్నా, తీసుకోకున్నా, కేసే తేలేదాకా మళ్లీ పోటీ చేసే అవకాశం ఉండదు. ఇటువంటి వాడితో మనకేమిటని, మిత్రపక్షాలు, ఇంకా సమీకృతమవుతున్న నూతనపక్షాలు అన్నీ చెదిరిపోతాయి. 2024 ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఇటువంటి ఊహలతో కేంద్రప్రభుత్వం పెద్దలు ఈ వ్యవహారాన్ని నడిపించారో లేదో తెలియదు కానీ, రాజకీయంగా ఇది ప్రస్తుత అధికారపార్టీకి నష్టమే చేస్తుందని తెలుసుకోవాలి. జాతీయ మీడియా వేదికల మీద ఈ పరిణామం, కాంగ్రెస్‌కు మంచిదా, చెడ్డదా అని చర్చిస్తున్నారు. ఇంతకాలం, కాంగ్రెస్‌కు కాస్త ఎడంగా ఉండిపోయిన పక్షాలు కూడా, ఈ విషయంలో సంఘీభావం ప్రకటించాయి. భారత రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖరరావు స్వయంగా, రాహుల్ అనర్హతను తీవ్రంగా ఖండించారు. తీర్పు వెంటనే ఆమ్ ఆద్మీపార్టీ, అనర్హత తరువాత తృణమూల్ కాంగ్రెస్ కూడా ఖండనలతో గొంతు కలిపాయి. శుక్రవారం నాడు, అనేక పక్షాలు రాష్ట్రపతి నివాసానికి వెళ్లడం, ఇంతకు ముందే, ఈడీ దుర్వినియోగం మీద ఉమ్మడిగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ఒక ఉద్యమ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.
పదేళ్ల కిందట రాహుల్ గాంధీ దూకుడుగా వ్యవహరించిన ఒక సందర్భం ఇప్పటి పరిణామంలో ప్రస్తావనకు వస్తున్నది. ఒకసారి శిక్షకు గురైన ప్రజాప్రతినిధి తక్షణమే అనర్హుడు కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దరిమిలా, వెంటనే అనర్హత పాలు కాకుండా పై కోర్టుకు అప్పీలు కోసం మూడునెలల వ్యవధి ఇస్తూ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ వ్యతిరేకించారు. పత్రికా సమావేశంలో ఆర్డినెన్స్ ప్రతులను చింపేశారు. తన పార్టీకి చెందిన ప్రధానమంత్రి నొచ్చుకునే విధంగా చేసిన ఆ చర్యను అనేకమంది విమర్శించారు. తరువాతి కాలంలో, రాహుల్ గాంధీ పశ్చాత్తాపం వంటి భావాన్ని ప్రకటించారు కూడా. ఆ ఆర్డినెన్స్ కొనసాగి, చట్టరూపం కూడా తీసుకుని ఉంటే, రాహుల్ గాంధీకి ఇప్పటి పరిస్థితి ఉండేది కాదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే చేస్తున్నాం, అటువంటి గడువులను మీరే వ్యతిరేకించారు అంటూ ఇప్పుడు బిజెపి చేస్తున్న వాదనలకు ఆస్కారం ఉండేది కాదు. అప్పటి రాహుల్ చర్యలో చాపల్యం ఉన్నప్పటికీ, అవినీతి కేసులలో ఉన్న నాయకుల విషయంలో వెసులుబాటు ఉండకూడదన్న ఒక ఆదర్శం ఉన్నది. కానీ, ప్రభుత్వం కక్షపూరితంగా శిక్షలకు, అనర్హతలకు పాల్పడవచ్చునన్న ఊహ ఆయనకు అప్పటికి ఉండి ఉండదు. తక్షణమే అనర్హత వేటు వేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును కూడా అన్ని సందర్భాలలో, రెండేళ్లకు పైబడి శిక్షలకు గురి అయిన అందరు ప్రజాప్రతినిధుల విషయంలో అమలుజరిపారని చెప్పలేము.
ప్రధాన ప్రతిపక్షానికి చెందిన ఒక కీలకనాయకుడి విషయంలో కేంద్రప్రభుత్వం ఇంత తొందరపాటుగా వ్యవహరించకుండా ఉండవలసింది. తమకు తిరుగులేదన్న వాతావరణం నెలకొని ఉన్నదని, అది ఎప్పుడూ అట్లాగే ఉంటుందని పాలకులు ఏదో ఒక దశలో భ్రమలో పడతారు. అప్పుడు, తమ చర్యలకు ప్రజల నుంచి స్పందనలు ఎట్లా ఉంటాయన్న విచక్షణ కోల్పోతారు. శుక్రవారం నాటి లోక్‌సభ నిర్ణయంతో, దేశ రాజకీయ వాతావరణంలో పెద్ద కుదుపు ఏర్పడింది. బహుశా, వచ్చే ఏడాది ఎన్నికల వేడి ఈ వేసవి నుంచే కొనసాగేట్టు ఉన్నది. ఈ ఒకటి రెండు సంఘటనలు మౌలిక మార్పులకు కారణమవుతాయని చెప్పలేము కానీ, చిలికి చిలికి గాలివానలు తుఫానులుగా మారడం రాజకీయాలలోనూ అరుదు కాదు.