రాజస్థాన్ చొరవ
ABN , First Publish Date - 2023-05-04T02:00:35+05:30 IST
రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరిలో ‘గిగ్ వర్కర్ల’ సంక్షేమం కోసం బిల్లు రూపొందిస్తున్నట్టు ప్రకటించినప్పుడు, రాష్ట్రం ఎన్నికలకు పోబోతున్నందున దానిని ఎన్నికల ఎత్తుగడగా...
రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరిలో ‘గిగ్ వర్కర్ల’ సంక్షేమం కోసం బిల్లు రూపొందిస్తున్నట్టు ప్రకటించినప్పుడు, రాష్ట్రం ఎన్నికలకు పోబోతున్నందున దానిని ఎన్నికల ఎత్తుగడగా చాలామంది తీసిపారేశారు. తమ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడం కోసం, కొన్ని రోజులపాటు లేదా రోజులో కొన్ని గంటలు వివిధ ఫుడ్ డెలివరీ, ఈ కామర్స్ తదితర సంస్థలకోసం పనిచేసే గిగ్‌వర్కర్ల సంఖ్య మనదేశంలోనూ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, వారి సంక్షేమానికి పాటుపడాల్సిన అవసరం ఉందని ఆర్థికనిపుణులు ఎంతోకాలంగా హితవుచెబుతున్నారు. రాజకీయ ప్రయోజనమా కాదా అన్న విషయాన్ని అటుంచితే, దేశంలోనే తొలిసారిగా గిగ్ వర్కర్ల ప్రయోజనాల పరిరక్షణ నిమిత్తం ‘రాజస్థాన్ ప్లా్ట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్) –2023’ పేరిట ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చొరవ ఇప్పుడు మరిన్ని రాష్ట్రాలను ఆ దిశగా ఆలోచింపచేస్తున్నందుకు సంతోషించాలి.
గిగ్‌వర్కర్ల సంక్షేమానికి ఈ కామర్స్ సంస్థలు కృషిచేయాలని, ఒక త్రైపాక్షిక ఒప్పందం ద్వారా వీరిని ఆదుకొనే విధానాన్ని రూపొందించే ఆలోచనలో తమ ప్రభుత్వం ఉన్నదని తెలంగాణ పరిశ్రమల మంత్రి తారకరామారావు బుధవారం ఒక ఈ కామర్స్ సంస్థకు సంబంధించిన కార్యక్రమంలో ప్రకటించారు. రాజస్థాన్‌లో ఎన్నికలు వచ్చేలోగానే బిల్లును చట్టం చేయాలని భావిస్తున్న కాంగ్రెస్, ఎన్నికలు జరగబోతున్న కర్ణాటకలోనూ గిగ్‌వర్కర్ల సంక్షేమం కోసం ఒక బోర్డు నెలకొల్పుతానని హామీ ఇచ్చింది. వారి సంక్షేమనిధికోసం మూడువేలకోట్ల రూపాయలు కేటాయిస్తానని, లాజిస్టిక్స్, ఫుడ్ డెలివరీ, ఈ ఫార్మసీ, ట్రాన్స్‌పోర్ట్ తదితర రంగాల్లో పనిచేస్తున్న గిగ్‌వర్కర్లకు, అసంఘటిత రంగ కార్మికులకు పనిచేసే ప్రతీ గంటకూ సముచిత వేతనం లభించేట్టు చూస్తానని ఆ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. అభివృద్ధి చెందిన దేశాల్లో గిగ్‌వర్క్ ఒక అదనపు ఆదాయ మార్గం మాత్రమే. ఒక ఉద్యోగం చేసుకుంటూ, వేణ్ణీళ్ళకు చన్నీళ్ళసాయం లాగా ఈ గిగ్‌వర్క్‌నుంచి మరికొంత సంపాదించుకోవడం జరుగుతూంటుంది. కానీ, భారతదేశంలో అత్యధికశాతం యువతీయువకులు, వారి కుటుంబాలు ఈ పనిమీదే ఆధారపడి జీవిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ దేశంలో గిగ్‌వర్కర్ల సంఖ్య ప్రస్తుతానికి కోటిలోపే కానీ, ప్రతీ ఏటా వారిసంఖ్య అమితవేగంగా పెరుగుతోంది. కంపెనీలు వీరిని ‘పార్ట్‌నర్’ అంటూ, వర్కర్ లేదా ఉద్యోగి నిర్వచనంలోకి రాకుండా, కార్మికచట్టాల కన్నుపడనంత దూరంలో ఉంచుతున్నాయి.
రాజస్థాన్ ప్రవేశపెడుతున్న బిల్లు 200కోట్ల రూపాయల సంక్షేమనిధిని ఏర్పాటు చేయడంతోపాటు, గిగ్‌వర్కర్లు వృత్తిపరంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కూడా కృషిచేసేందుకు ఉద్దేశించింది. చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించడం, బకాయీలను ఇప్పించడంతో పాటు, బీమా, వైద్యం, ఈఎస్‌ఐ, పెన్షన్ తదితర సౌకర్యాలకు కూడా హామీపడుతోంది. సంక్షేమ బోర్డు నిబంధనలకు అనుగుణంగా వ్యహరించకపోయినా, దాని ఆదేశాలను గౌరవించకపోయినా సంస్థలకు జరిమానాలు విధించే అధికారం దానికి ఉంటుంది. సంక్షేమనిధికోసం ప్రభుత్వాలు కొంతమొత్తాన్ని కేటాయించినప్పటికీ, కంపెనీలు జరిపే ప్రతీ అమ్మకం నుంచీ కొంతశాతం వసూలు చేసి గిగ్–ప్లాట్‌ఫామ్ వర్కర్ల సంక్షేమనిధిలో జమచేస్తున్నప్పుడు మాత్రమే వర్కర్లకు నిరంతరాయంగా మేలు జరుగుతుందని ఆ రంగంలో పనిచేసేవారి సూచన.
దేశ శ్రమశక్తిలో గిగ్‌వర్కర్లు రెండుశాతం వరకూ ఉంటారని, మరో ఐదేళ్ళలో అది నాలుగుశాతం దాటిపోతుందని అంచనా. దేశంలో గిగ్ ఆర్థికవ్యవస్థ పెరుగుతోందని, ఇది పనిచేస్తున్నవారికీ, సంస్థలకు, వినియోగదారులకు కూడా ఉపయోగకరంగా ఉందని నీతి ఆయోగ్ మెచ్చుకుంటోంది. కానీ, ఎండకీ వానకూ తడుస్తూ, ప్రమాదాలబారిన పడుతూ, తక్కువ ఆదాయంతో, ఎవరికీ చెందని మనుషులుగా వారు మిగిలిపోవడమే బాధ కలిగించే అంశం. రాజకీయ అవసరమే కావచ్చు కానీ, వారి సంక్షేమం గురించి ఇప్పుడు పార్టీలు ఆలోచించడం స్వాగతించాల్సిన విషయం.