వివక్షపై తిరుగుబాటు
ABN , First Publish Date - 2023-07-05T02:25:15+05:30 IST
ఫ్రాన్స్‌లో అల్లర్లు నానాటికీ తీవ్రరూపం దాల్చుతున్నాయి. పారిస్ నగర శివార్లలో నహేల్ అనే పదిహేడేళ్ళయువకుడిని ఒక పోలీసు అధికారి కాల్చిచంపడంతో మొదలైన విధ్వంసకాండ...
ఫ్రాన్స్‌లో అల్లర్లు నానాటికీ తీవ్రరూపం దాల్చుతున్నాయి. పారిస్ నగర శివార్లలో నహేల్ అనే పదిహేడేళ్ళయువకుడిని ఒక పోలీసు అధికారి కాల్చిచంపడంతో మొదలైన విధ్వంసకాండ చాలా నగరాలకు పాకి, అవధులులేకుండా సాగుతోంది. యాభైవేలమంది పోలీసులు రంగంలోకి దిగి, వేలాదిమందిని అరెస్టులు చేస్తున్నా, లాఠీచార్జీలు, టియర్ గ్యాస్ ప్రయోగాలు జరుగుతున్నా ఫలితం కనిపించడం లేదు. ఒక యువకుడి మరణం ఇంతటి విధ్వంసానికి దారితీయడమేమిటని ఆశ్చర్యం కలగవచ్చును కానీ, అరబ్ ఆఫ్రికన్ మూలాలున్నవారి పట్ల అనాదిగా అక్కడ అమలవుతున్న వివక్ష మీద తిరుగుబాటు ఇది. నివురుగప్పిన నిప్పులాగా ఉన్న ఆ ఆగ్రహం ఇప్పుడు మరోమారు భగ్గుమన్నది.
నహేల్ తప్పిదమల్లా ట్రాఫిక్ పోలీసులు అతడి వాహనాన్ని ఆపమన్నప్పుడు ఆపకపోవడం. అలా ఆపనందుకు, అల్జీరియా మూలాలున్న ఈ పదిహేడేళ్ళ ముస్లిం యువకుడిని ఆ శ్వేతజాతి పోలీసు అధికారి కాల్చిపారేశాడు. నేరుగా ఛాతీలో బుల్లెట్లు దింపుతున్న విడియో ఒకటి విస్తృతంగా ప్రచారంకావడంతో ప్రజాగ్రహం కట్టలుతెంచుకుంది. నహేల్ తీవ్రవాదో, ఉగ్రవాదో కాదు. ఏ నేరచరిత్రా లేని ఈ కుర్రాడు డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ తన ఒంటరితల్లికి ఆసరాగా ఉన్నాడు. కారు ఆపకపోవడానికి కారణం అతడికి డ్రైవింగ్ లైసెన్సు లేకపోవడమే. పోలీసులకు చిక్కితే చిక్కుల్లో పడతానని భయపడ్డాడు కానీ, ఏకంగా ప్రాణాలే పోతాయని తెలుసుకోలేకపోయాడు. చివరకు వాహనాన్ని నిలిపిన తరువాత కూడా, అతడిని ఆపిన ఇద్దరు పోలీసుల్లో ఒకరు తలకు తుపాకీ గురిపెట్టడం, తరువాత గుండెల్లో బుల్లెట్లు దించడం జాతిదురహంకారపూరిత హత్యే తప్ప మరొకటి కాదు. నహేల్‌ను చూడగానే ఆ శ్వేతజాతి పోలీసుకు అతడి జాతి, మతం తెలిసిపోయి ఉంటాయి. ఇంతే వయసున్న ఓ శ్వేతజాతి కుర్రవాడు ఇలాగే కారు ఆపకుండా తప్పించుకుంటే సదరు పోలీసు అధికారి ఏం చేసివుండేవాడు? కేసులే పెట్టేవాడో, చలాన్లే రాసేవాడో కానీ, ఇలా నడిరోడ్డుమీద కాల్చిపారేసేవాడు కాదు.
నహేల్ నివసిస్తున్న ప్రాంతమే కాదు, అరబ్, ఆఫ్రికా మూలాలున్నవారితో కిటకిటలాడిపోయే ఇటువంటి శివారువాడల్లోని కుర్రవాళ్ళు లైసెన్సులు లేని వాహనాలు నడపడం, పోలీసులనుంచి తప్పించుకోవాలనుకోవడం సర్వసాధారణం. కానీ, ఈ కుర్రవాడిని ఏకంగా పారిపోతున్న ఓ ఉగ్రవాదిలాగా సదరు శ్వేతజాతి పోలీసు భావించాడంటే తెల్లజాతి అహంకారం పూర్తిగా తలకెక్కినందువల్లే. నహేల్ వంటి అరబ్, ఆఫ్రికన్ మూలాలున్నవారు ఎక్కడినుంచో ఫ్రాన్స్‌కు వచ్చినవారు కాదు. వందలేళ్లపాటు దాని దోపిడీకి గురైన వలసపాలిత దేశాలవారు. ఆ దేశం ఇలా వెలిగిపోవడంకోసం ఊడిగం చేసినవారు. ఇప్పుడు ఘటన జరిగిన పారిస్ శివారు ప్రాంతమైన నాంటేరే మాత్రమే కాదు, అలా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న అనేక ఫ్రాన్స్ నగరాల శివారు ప్రాంతాలే వారి ఆవాసం. మిగతా ప్రపంచానికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందించిన ఈ దేశం తన వలసపాలిత ప్రాంతాలవారి విషయంలో మాత్రం వివక్షాపూరితంగానే వ్యవహరిస్తూ వచ్చింది. దశాబ్దాలుగా కనీస ప్రాథమిక సౌకర్యాలకు దూరమై ఈ శివారు వాడల్లో భౌగోళికంగానూ, భౌతికంగానూ వారు ఎదుర్కొంటున్న వివక్ష అత్యధికం. కేవలం వారి పేరు, నివసిస్తున్న ప్రాంతం చాలు ఉపాధికి దూరమైపోవడానికి. జాతివివక్ష వారిని పనిలోపెట్టుకోవడానికి అడ్డుపడుతున్నది. మరోపక్క మితవాద పార్టీలు, నాయకులు వీరిని శత్రువులుగా చూపి రాజకీయంగా ఎదుగుతున్నారు. వారి పక్షాన మాట్లాడేందుకు, నిలిచేందుకు ఎవరూ ధైర్యం చేయలేని వాతావరణం క్రమంగా నెలకొంటున్నది.
దాదాపు రెండుదశాబ్దాలక్రితం ఇటువంటిదే ఒక చిన్న నిప్పురవ్వ దావానలంగా మారి మూడువారాల పాటు ఫ్రాన్స్ ఇలాగే తగులబడిన ఘటనను గుర్తుచేసుకుంటే, అప్పటికీ ఇప్పటికీ అక్కడి సామాజిక పరిస్థితుల్లో కానీ, జాత్యంహకారధోరణిలో కానీ ఏ మార్పూ రాలేదని అర్థమవుతుంది. ఒక నాయకుడంటూ, ఆదేశాలంటూ లేకుండా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ఇంతటి ఆగ్రహం రేగిందంటే అది క్షణికావేశం కాదు. దశాబ్దాలుగా గూడుకట్టున్న ఆగ్రహం, అవమానం ఇందుకు కారణం. వివక్షలేని సమాజాన్ని నిర్మించగలిగినప్పుడు మాత్రమే వ్యవస్థలమీద నమ్మకం ఏర్పడుతుంది.