వింత వాదనలు, విపరీత చేష్టలు
ABN , First Publish Date - 2023-04-06T01:14:43+05:30 IST
చైనామరోమారు నామకరణోత్సవానికి దిగింది. మాండరిన్ భాషలో జంగ్‌నన్‌గా పిలిచే దక్షిణటిబెట్‌లో అరుణాచల్‌ప్రదేశ్ అంతర్భాగమని చైనా ఎప్పటినుంచో అంటున్నది...
చైనామరోమారు నామకరణోత్సవానికి దిగింది. మాండరిన్ భాషలో జంగ్‌నన్‌గా పిలిచే దక్షిణటిబెట్‌లో అరుణాచల్‌ప్రదేశ్ అంతర్భాగమని చైనా ఎప్పటినుంచో అంటున్నది. ఇప్పుడు అరుణాచల్ రాజధానికి ఇటానగర్‌కు అత్యంత సమీపంలో ఉన్నవాటితో సహా పదకొండు ప్రాంతాలకు కొత్తపేర్లు ప్రకటించి ఆనందించింది. భారత్ అధీనంలోని ఈ ప్రాంతాల అక్షాంశాలు, రేఖాంశాలతో సహా సాగిన ఈ నామకరణాన్ని మన ప్రభుత్వం తీవ్రంగా నిరసిస్తూ, పేర్లు మార్చినంతమాత్రాన క్షేత్రస్థాయి వాస్తవాలు మారిపోతాయా? అని నిలదీసింది. కొత్తగా కనిపెట్టిన ఈ పేర్లతో అరుణాచల్‌ప్రదేశ్ భారత్ అంతర్భాగమన్న చారిత్రక వాస్తవాన్ని ఏమార్చలేరని విదేశాంగశాఖ వ్యాఖ్యానించింది. భారత భౌగోళిక సార్వభౌమత్వాన్ని సవాలు చేసే చైనా దుశ్చర్యను అమెరికా సైతం తీవ్రంగా నిరసించింది.
చైనా పాలకులకు ఆగ్రహం కలిగినప్పుడో, స్వదేశంలో సమస్యలు తలెత్తినప్పుడో ఇటువంటి చేష్టలకు పాల్పడుతూ ఉంటారు. 2017లో ఆరుప్రాంతాల్లోనూ, ఆ తరువాత 2021లో ఏకంగా పదిహేనుప్రాంతాల్లోనూ ఈ పేరుమార్పిడి పథకానికి చైనా ఒడిగట్టింది. దలైలామా తవాంగ్‌లో కాలూనినందుకు ఆగ్రహించి ఒకమారు, తన కొత్త సరిహద్దు చట్టానికి అనుగుణంగా మారోమారు చైనా ఈ పనిచేసింది. వీటికి కొనసాగింపుగా ఇప్పుడు మరో పదకొండు ప్రాంతాలకు కొత్తపేర్లతో జాబితా విడుదలచేయడం ద్వారా మొత్తం ఆరుణాచల్‌ప్రదేశ్‌ను తన కొత్త చట్టం పరిధిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నది. తనదని ప్రకటించిన భూభాగాలను పునఃస్వాధీనం చేసుకోవడానికి చైనా ప్రభుత్వానికి ఆ చట్టం సర్వాధికారాలనూ దఖలుపరుస్తున్నది. తోచినప్పుడు చొరబాట్లకు పాల్పడటం, నచ్చినప్పుడు నామకరణాలు చేసుకోవడం చైనాకు అలవాటే కానీ, ఇటీవలి కొన్ని పరిణామాలు కూడా ఇందుకు దోహదం చేసివుండవచ్చు. కొద్దినెలల క్రితం తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్త్సే పోస్టును దురాక్రమించుకొని సరిహద్దులను మార్చేందుకు చైనా ప్రయత్నించినప్పుడు భారత సైన్యం దానిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇటానగర్‌లో ఇన్నోవేషన్ టెక్నాలజీమీద జీ20 అనుబంధ సదస్సు నిర్వహించడం కూడా దాని కోపానికి కారణం కావచ్చు.
ఒక దేశంలోని ప్రాంతానికి మరోదేశం తన భాషలో పేరుపెట్టినంతమాత్రాన భౌగోళిక ఆధిపత్యాలు, అధికారాలకు వచ్చిననష్టమేమీ లేదు. కానీ, వరుసపెట్టి జరుపుతున్న ఈ నామకరణాల ద్వారా చైనా ఒక విధంగా న్యాయ, నైతికపరమైన ఆధిపత్యంకోసం ప్రయత్నిస్తున్నది. లద్దాఖ్‌లోని దెమ్‌చోక్ తనదేనని చెప్పుకోవడానికి కూడా చైనా దానిని పరిగాస్ అని సంబోధించింది. తన భూభాగాలను ఇతరదేశాలు దురాక్రమించుకున్నాయంటూ న్యాయపోరాటాలకు, దాడులకు దిగడానికి ఈ చర్యలు పునాది. మూడేళ్ళుగా ఉభయదేశాల సైన్యాలు తూర్పు లద్దాఖ్‌లో అధీనరేఖ విషయంలో గొడవలు పడుతుంటే, అక్కడి వివాదం పూర్తిగా పరిష్కారం కాకుండానే అరుణాచల్‌లో చైనా అగ్గిరగిల్చింది. హిమాచల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ రెండువేల చ.కిమీ.భూభాగం తనదేనని చైనా వాదన. ఆక్సాయ్‌చిన్‌ను చైనా దురాక్రమించుకున్నదని భారత్ ఇందుకు ప్రతిగా గుర్తుచేస్తూంటుంది. తాను ఆక్రమించుకున్న ప్రాంతాల్లో త్వరితంగా శాశ్వత నిర్మాణాలు చేపట్టడం, ఒకపట్టాన చర్చలకు ఒప్పుకోకపోవడం, చివరకు రాజీమార్గంగా తాను దురాక్రమించిన ప్రాంతాల్లోకి భారతీయసైనికుల ప్రవేశాన్ని కూడా అంగీకరించకపోవడం ద్వారా చాలా ప్రాంతాలను చైనా ఒక్కో అంగుళం కబళిస్తూ వస్తున్నది. గతంలో భారత సైనికుల గస్తీలో ఉన్న తూర్పు లద్దాఖ్ ప్రాంతాల్లో ఇప్పుడు గస్తీలేకుండా పోయిందన్న వార్తలు వెలువడుతున్నాయి. చైనా సైనికులకు అనవసర అగ్రహం కలుగుతుందన్న భావనతో స్థానికులను కూడా అధికారులు అటుగా పోనివ్వడంలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి.
గాల్వాన్ ఘాతుకం తరువాత ఉభయదేశాలు అప్పుడప్పుడు సైనికస్థాయి చర్చలతో ఉద్రిక్తతలను కొంతమేరకు తగ్గించుకున్నప్పటికీ, దౌత్య సంబంధాలు పెద్దగా వికసించలేదు. ఉభయదేశాల విదేశాంగ, రక్షణమంత్రుల భేటీలు, ఇండోనేషియాలో గత ఏడాది జి20 సదస్సు సందర్భంగా జిన్‌పింగ్‌తో మోదీ ముచ్చటించడం వినా అడుగుముందుకు పడిందేమీ లేదు. సమీపంలోనే మనదేశం అధ్యక్షతన షాంఘై సహకార సంస్థ మంత్రులస్థాయి సదస్సు ఉన్నది. జూలైలో జరగబోయే శిఖరాగ్రసదస్సుకు జిన్‌పింగ్ రావచ్చు. ఈ రెండు సందర్భాలను సయోధ్యకు వాడుకుంటే మంచిది.