సుహృద్భావ సూచిక
ABN , First Publish Date - 2023-03-22T02:07:40+05:30 IST
‘కావాలనుకుంటే మీరు మా చిట్టగ్యాంగ్, సిల్హెట్ ఓడరేవులను చక్కగా వాడుకోవచ్చు’ అని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారతదేశానికి హామీ ఇచ్చారట. వాణిజ్యం పెంచుకోవడానికీ...
‘కావాలనుకుంటే మీరు మా చిట్టగ్యాంగ్, సిల్హెట్ ఓడరేవులను చక్కగా వాడుకోవచ్చు’ అని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారతదేశానికి హామీ ఇచ్చారట. వాణిజ్యం పెంచుకోవడానికీ, ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించుకోవడానికీ ఈ రెండు ఓడరేవులూ ఉపకరిస్తాయనీ, ఉభయదేశాల మధ్యా, ప్రజల మధ్యా సాన్నిహిత్యాన్ని మరింత పెంచే చర్యలు చేపట్టాలని ఆమె ఆకాంక్షించారు కూడా. భారత్–బంగ్లాదేశ్ మైత్రి పైప్‌లైన్ ప్రారంభమైన ఉత్సాహంలో బంగ్లాదేశ్ ప్రధాని ఉన్నారు. ఈ పైప్‌లైన్ బంగ్లాదేశ్‌కు ఇంధన భద్రతను కల్పించడమే కాక, ఆర్థికవృద్ధికి ఎంతో దోహదం చేస్తుంది.
ఉభయదేశాల ప్రధానులు, మంత్రులతోపాటు అసోంముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కూడా పాల్గొన్న వర్చువల్ సమావేశంలో, బంగ్లాదేశ్‌కు హైస్పీడ్ డీజిల్ సరఫరా చేసే పైప్‌లైన్ ఆరంభం కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో హిమంత బిశ్వశర్మకు హసీనా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేశారు. అసోంలోని సుమలిగఢ్ రిఫైనరీనుంచి బంగ్లాదేశ్‌లోని పర్బతిపూర్ డిపోవరకూ హైస్పీడ్ డీజిల్ తరలింపు జరుగుతూండటం ఇందుకు ఒక కారణం అయినప్పటికీ, నిత్యమూ బంగ్లాదేశ్ అక్రమచొరబాటుదారుల పేరుతో ఈశాన్య రాజకీయాలు జరిపే శర్మను ఈ ప్రత్యేక ప్రశంసతో హసీనా శాంతింపచేశారని కొందరి భావన. భారతదేశ గ్రాంట్‌తో ఆరంభమైన ఈ పైప్‌లైన్ ద్వారా ఏటా ఒక మిలియన్ మెట్రిక్ టన్నుల డీజిల్ బంగ్లాదేశ్‌లోని ఏడుజిల్లాలకు చేరుతుంది కనుక, తక్కువ ఖర్చుతో ఎటువంటి అంతరాయాలూ లేని సరఫరాలు పొరుగుదేశం అందుకోగలుగుతుంది. నాలుగేళ్ళక్రితం తలపెట్టి, కరోనా కాలంలో కూడా పనులు కొనసాగిన ఈ ప్రాజెక్టు భారత్–బంగ్లాదేశ్ మధ్య ‘మైత్రి’ పేరిట అమలు జరుగుతున్న పలు ప్రాజెక్టుల్లో ఒకటి. ఈ పైప్‌లైన్ ప్రాజెక్టుతో బంగ్లాదేశ్‌కు భారత్ అందించే అభివృద్ధి సహకారం పది బిలియన్ డాలర్లకు చేరి, చైనాను మించిపోయింది. అభివృద్ధి చెందుతున్న దేశానికి ఇంధన అవసరాలు హెచ్చుగా ఉంటాయి కనుక, బంగ్లాదేశ్ విద్యుదవసరాలను తీర్చడంలో కూడా భారత్ ముందుంది. ఏటా పన్నెండువందల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేస్తున్న బంగ్లాదేశ్ అవసరాలను మరింత గుర్తెరిగి ప్రత్యేక ప్లాంట్లు, ప్రత్యేక లైన్ల ఏర్పాట్లు వంటివి జరిగాయి. ఆ దేశ అవసరాలు తీర్చడంలో అదానీ కూడా ముందున్నారు.
ఆర్థికసహకారం పేరిట పొరుగుదేశాలను అప్పుల ఊబిలో ముంచి, సైనికపరంగా తన ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్న చైనా విషయంలో బంగ్లాదేశ్ జాగ్రత్తగానే ఉంటోంది. చైనా ఆరంభించిన ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’ (బిఆర్‌ఐ)లో చేరినప్పటికీ, అది ప్రతిపాదించిన ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ, శ్రీలంకమాదిరిగా అప్పుల ఊబిలోకి జారిపోకుండా బంగ్లాదేశ్ తన ప్రయోజనాలను కాపాడుకుంటోంది. అలాగే, దేశంలో మితిమీరిపోతున్న మతఛాందసాన్ని, మతోన్మాదశక్తులనూ నియంత్రిస్తూ, ఒక లౌకికదేశంగా నిలబడేందుకు కూడా ప్రయత్నిస్తున్నది.
భారత్ బంగ్లా సరిహద్దు సమస్యలకు, ఉద్రిక్తతలకు పుట్టినిల్లంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మంగళవారం ఓ వ్యాఖ్య చేశారు. సరిహద్దులోని కొన్ని ప్రాంతాలగుండా మాదకద్రవ్యాల, పశువుల అక్రమరవాణా సాగుతున్నదనీ, దానిని నియంత్రించేక్రమంలో బిఎస్‌ఎఫ్ సమస్యలు ఎదుర్కొంటున్నదని ఆయన వాదన. ఇటీవల పశువుల స్మగ్లర్లపై బిఎస్‌ఎఫ్ కాల్పులు జరిపిన ఘటన ఇరుదేశాల మధ్యా దూరాన్ని పెంచింది. పశువుల అక్రమరవాణాదారులకు, భద్రతాదళాలకు మధ్య ఘర్షణలు జరగడం కూడా అనాదిగా ఉన్నదే. అక్రమంగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని సాధ్యమైనంత మేరకు సక్రమం చేయడం, అధికారికంగా సరిహద్దు విక్రయాలను అనుమతించడం వంటివి జరగాలి. అలాగే, బంగ్లాదేశీ చొరబాటుదారులంటూ అసోం ముఖ్యమంత్రి వంటివారు విమర్శలు చేయడం, వారు ఆర్థికశరణార్థులే తప్ప తీవ్రవాదులు కాదని బంగ్లాదేశ్ ప్రతివిమర్శలు చేయడం అనాదిగా ఉన్నదే. ఇటువంటి వివాదాల పరిష్కారం మీద కూడా ఉభయదేశాల పాలకులు శ్రద్ధపెడితే చీటికీ మాటికీ రాజకీయంగా అగ్గిరాజేసే అవకాశాలు తగ్గుతాయి. ముజబూర్ రహ్మాన్ కుమార్తెగా భారత్‌పట్ల సానుకూలవైఖరి కనబరిచే ప్రధాని హసీనా నాయకత్వానికి సహకరించడం భారత్‌కు మేలు చేస్తుంది. ఉభయదేశాల మధ్యా ఆర్థికబంధంతో పాటు పరస్పర విశ్వాసం కూడా పెరగడం ముఖ్యం.