సుప్రీం తీర్పు ఓ హెచ్చరిక
ABN , First Publish Date - 2023-07-13T03:05:45+05:30 IST
‘ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టర్ ఎవరన్నది ముఖ్యం కాదు, అక్కడ ఎవరున్నా వంశపారంపర్యంగా కులాసాగా, ధిలాసాగా రాజ్యాలు ఏలుతున్నవారి అవినీతికోటలను బద్దలుకొట్టితీరుతారు’ అంటూ...
‘ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టర్ ఎవరన్నది ముఖ్యం కాదు, అక్కడ ఎవరున్నా వంశపారంపర్యంగా కులాసాగా, ధిలాసాగా రాజ్యాలు ఏలుతున్నవారి అవినీతికోటలను బద్దలుకొట్టితీరుతారు’ అంటూ కేంద్రహోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టర్ సంజయ్‌మిశ్రా పదవీకాలం పొడిగింపులను సుప్రీంకోర్టు తప్పుబట్టి, అది అక్రమం అని నిర్ధారించిన నేపథ్యంలో, విపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయని హోంమంత్రి ప్రజలకు గుర్తుచేశారు. ఇప్పుడు మిశ్రా పోయినా, ఆ స్థానంలో వచ్చిన వారు మిమ్మల్ని వదిలిపెట్టరన్న హెచ్చరిక కూడా హోంమంత్రి మాటల్లో విపక్షాలకు వినిపించే ఉంటుంది. మిశ్రా కాకపోతే మరొకరు అని ఇంత సులువుగా తేల్చేసిన అమిత్ షా అదే మిశ్రాకు సుప్రీంకోర్టు కూడదన్నా సరే పొడిగింపులు ఇవ్వడం ఎందుకు, ఆయన కోసమే ఓ ఆర్డినెన్సు తేవడం ఎందుకు అన్నది ప్రశ్న. హోంమంత్రి ప్రవచించినట్టుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ వ్యక్తికి అతీతమైన ఉన్నత వ్యవస్థే కావచ్చును కానీ, తమ ఆదేశాలను శిరసావహించే అస్మదీయులకు దానిని అప్పచెప్పినప్పుడే దాని ఔన్నత్యం దిగజారిపోయింది.
ప్రభుత్వం అభ్యర్థనమేరకు, అధికారాల బదలాయింపు సవ్యంగా జరిగేందుకు సంజయ్ మిశ్రాను ఈ నెల చివరివరకూ ఉండనిచ్చింది సుప్రీంకోర్టు. నవంబరువరకూ కొనసాగనివ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనకు సరేనంటే తన తీర్పుకే అర్థంలేకుండా పోతుంది. వ్యక్తి కాదు వ్యవస్థ ముఖ్యం అని ఇప్పుడు హోంమంత్రి గొప్పగా మాట్లాడుతున్నారు కానీ, కేవలం ఈ వ్యక్తికోసమే ఆయన ప్రభుత్వం అన్ని సంప్రదాయాలను, నిబంధనలను తుంగలోతొక్కింది. న్యాయవ్యవస్థను, పార్లమెంటును అవమానపరిచింది. అస్మదీయుడి పదవీకాలాన్ని నచ్చినంతకాలం పొడిగించుకున్నది కాక, ఇంకా ఉండాలంటూ న్యాయపోరాటాలు చేస్తోంది. అవినీతిని చీల్చిచెండాడుతున్న మిశ్రాను తప్పించడానికి అవినీతిపరులంతా ఏకమైనారని రాజకీయవ్యాఖ్యలు చేస్తూ, ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లన్నీ రాజకీయప్రేరేపితమైనవేనని న్యాయస్థానాల్లో వాదిస్తోంది. డైరక్టర్‌గా రెండేళ్ళపదవీకాలం పూర్తయిన తరువాత ఆయనను వదిలిపెట్టి ఉంటే, వ్యక్తి కాదు వ్యవస్థ ముఖ్యం అన్నమాటలకు అర్థం ఉండేది. కానీ, మరో ఏడాది పొడిగింపు కోసం 2018నాటి నియామక ఉత్తర్వులను మూడేళ్ళకు వర్తించేలా వెనక్కుపోయి మరీ సవరించింది. సుప్రీంకోర్టు ఈ చర్యను కాదనకుండానే 2021 నవంబరు 17 తరువాత ఆయన ఆ పదవిలో కొనసాగకూడదని ఆదేశించింది. దీనికి విరుగుడుగా, పార్లమెంటు శీతాకాల సమావేశాలు పట్టుమని పదిహేను రోజుల్లో ఉండగా, రెండు ఆర్డినెన్సులతో ఈడీ, సీబీఐ సంచాలకుల పదవీకాలాన్ని ఐదేళ్ళకు పెంచింది. దానితో పాటు ఏడాదికొకసారి చొప్పున మూడుసార్లు గడువు పొడిగించుకొనే వెసులుబాటు కూడా పాలకులకు కల్పించుకున్నారు. ప్రతిపక్ష నాయకులను ఎంతగా వేధిస్తే అన్ని పొడిగింపులు అందుకోవచ్చన్న సందేశం ఇందులో ఉన్నదని విపక్షాలు అప్పట్లోనే విమర్శించాయి. ఉద్యోగకాలాన్ని పెంచడం దేశశ్రేయస్సుకు ఉపకరించేదే అయితే ఆ సవరణలేవో పార్లమెంటులో చర్చించి చేయవచ్చు. అసాధారణ పరిస్థితుల్లోనే ఆర్డినెన్సులు చేయాల్సిన పాలకులు మిశ్రాను నిలబెట్టుకోవడానికే దానిని వాడారన్నది వాస్తవం.
ఆయన అధీనంలో రెండువేలకు పైగా దాడులతో, 65వేలకోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసి ‘కొత్త సీబీఐ’గా అవతరించిన మాట నిజమే కానీ, అందులో విపక్షనేతలు, ఆయా పార్టీలతో అనుబంధం ఉన్న సంస్థలు ఎన్నో, బీజేపీ శ్రేయోభిలాషులు, అనుకూల కార్పొరేట్ సంస్థలు ఎన్నో లెక్క విప్పితే బాగుంటుంది. ‘మనీలాండరింగ్’ ఆయుధంతో ఈడీ అడుగుపెట్టని విపక్షరాష్ట్రమంటూ దేశంలో ఏదీ మిగల్లేదు. 2021తరువాత మిశ్రా కొనసాగింపు అక్రమం, చట్టవ్యతిరేకమని సర్వోన్నత న్యాయస్థానం నిర్ధారించిన నేపథ్యంలో, అప్పటినుంచి ఇప్పటిదాకా ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా అక్రమమే అవుతాయని విపక్షాలు అంటున్నాయి. మిశ్రా తీసుకున్న నిర్ణయాలపై స్వతంత్ర న్యాయవిచారణ జరపాలన్న వాటి డిమాండ్ రాజకీయపరమైనదే కావచ్చు కానీ, అర్థంలేనిదైతే కాదు.
సీవీసీ చట్టంలో సవరణలను సుప్రీంకోర్టు సమర్థించిందని పాలకులు గుర్తుచేస్తున్నారు కానీ, ఆ సవరణల వెనుక ఒక వ్యక్తి కొనసాగింపు లక్ష్యం ఉన్న విషయం న్యాయస్థానానికి కూడా తెలుసు, శాసనం చేసుకొనే హక్కును అది కాదనలేకపోవచ్చు కానీ, ఆ వ్యక్తి కొనసాగింపును న్యాయస్థానం తప్పుబట్టడం అవమానకరమైనదే. న్యాయస్థానం తీర్పు మిశ్రాకు పరిమితమైన అంశమే కావచ్చు. కానీ, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఆయా సంస్థలను ‘యస్ బాస్’లతో నింపుతూ వాటిని ఆయుధాలుగా వాడుతున్నారనడానికి మిశ్రా ఉదంతం ఒక నిదర్శనం.