స్వర్ణ ‘నీరాజ’నం
ABN , First Publish Date - 2023-08-30T04:25:27+05:30 IST
గతఏడాది అమెరికాలోని యుజీన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఫైనల్లో నీరజ్ చోప్రాకు రెండు సవాళ్ళు ఎదురైనాయి. ఒకటి, ముందువైపు నుంచి గాలి బలంగా వీచి, వాతావరణం సవాలు...
గతఏడాది అమెరికాలోని యుజీన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఫైనల్లో నీరజ్ చోప్రాకు రెండు సవాళ్ళు ఎదురైనాయి. ఒకటి, ముందువైపు నుంచి గాలి బలంగా వీచి, వాతావరణం సవాలు విసిరింది. రెండోది, ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన పోటీతో లోలోపల ఒత్తిడి పెరిగింది. ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ అతడు రెండోస్థానంతో రజత పతకం సాధించాడు. కానీ, ఈసారి హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో నీరజ్ ఎలాంటి ఒత్తిడికీ లోనవలేదు. పసిడి తనదేనన్న ధీమాతో బరిలో నిలిచాడు, రెట్టించిన బలంతో ఈటెను 88.17 మీటర్ల దూరం విసిరాడు, స్వర్ణచరిత్ర లిఖించాడు. వరుసగా రెండు ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పతకాలు సాధించిన ఏకైక భారత క్రీడాకారుడిగా తన కీర్తిని మరింత సమున్నత స్థాయికి తీసుకెళ్లాడు.
బ్యాడ్మింటన్‌లో సింధు, బాక్సింగ్‌లో మేరీకోమ్, రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్.. ఇలా ఒక్కో క్రీడలో ఒక్కొక్కరు దేశం తరఫున అంతర్జాతీయ ఆటల పటంపై విజయబావుటా ఎగురవేశారు. వీరంతా అటు ఒలింపిక్స్‌తో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ పతకాలు కొల్లగొట్టి సత్తాను చాటుకున్నారు. ఇప్పుడు వీళ్లను అధిగమిస్తూ విశ్వక్రీడలు, ప్రపంచ టోర్నీల్లోనూ స్వర్ణాలు సాధించిన స్టార్‌గా పాతికేళ్ల నీరజ్ నీరాజనాలు అందుకుంటున్నాడు. అథ్లెటిక్స్‌లో అసాధ్యమనుకున్న లక్ష్యాలను అలవోకగా దాటుతున్నాడు. భారత అథ్లెటిక్స్‌కు నూతన మార్గాన్ని చూపెడుతున్నాడు. దివంగత మిల్కాసింగ్, పీటీ ఉష, అంజూ బాబీజార్జ్‌లాంటి మహామహులను మించిన ప్రదర్శనలతో అబ్బురపరుస్తున్నాడు. దేశంలో జావెలిన్ త్రో క్రీడకు ఆదరణ పెంచుతున్నాడు. ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నీరజ్‌తో పాటు మరో ఇద్దరు భారత అథ్లెట్లు డీపీ మను, కిషోర్ జనా జావెలిన్ త్రోలో ఫైనల్స్‌కు చేరడం గర్వించదగ్గ పరిణామం.
హరియాణా రాష్ట్రం పానిపట్‌లోని ఖంద్రా అనే ఓ చిన్న గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన నీరజ్ చిన్నప్పుడు పాల పదార్థాలను ఎక్కువగా తినేవాడట. 13 ఏళ్ల వయసుకొచ్చేసరికి ఏకంగా 80 కిలోల బరువు పెరగడంతో చుట్టుపక్కల వాళ్ల వెటకారాలు, అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. బరువు తగ్గడం కోసం అక్కడి స్పోర్ట్స్ సెంటర్‌లోని జిమ్‌లో చేరి, జావెలిన్ త్రో క్రీడకు ఆకర్షితుడై, ఫిట్‌నెస్ మెరుగుపరచుకొని మరీ దాని సాధన మొదలుపెట్టాడు. కఠోర శ్రమ, అంకితభావంతో ఆ క్రీడలో రాటుదేలి అంతర్జాతీయ పోటీల స్థాయికి ఎదిగాడు.
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడంతో నీరజ్‌కు పేరుతో పాటు ఊహించనంత డబ్బు కూడా వచ్చి పడింది. సాధారణ జీవితం గడిపిన క్రీడాకారులు ఇలా ఒక్కసారిగా కీర్తి, కనకం సమకూరడంతో ఆటపై ఏకాగ్రత చెదిరి, విఫలం కావడం విశ్వవ్యాప్తంగా చాలామందిలో చూశాం. నీరజ్ ఇందుకు భిన్నం. విజయాలతో పాటు అతనిలో పట్టుదల, క్రమశిక్షణ కూడా అదేస్థాయిలో పెరిగాయి. విదేశాల్లో అత్యుత్తమ శిక్షణతో రాటుదేలుతున్నాడు. దృష్టి చెదరకుండా, గమ్యం మారకుండా రోజురోజుకూ మరింత మెరుగవుతూ లక్ష్యాలను చేరుకుంటున్నాడు. అందుకు నిదర్శనమే.. వచ్చే ఏడు పతకం రంగు మారుస్తానని గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచిన వెంటనే చెప్పిన మాటను నీరజ్ ఇప్పుడు నిలబెట్టుకోవడం.
2016లో ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో టైటిల్ నెగ్గి వెలుగులోకి వచ్చిన నీరజ్.. కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో ఇప్పటికే చాంపియన్. 2017 ఆసియా చాంపియన్‌షిప్‌లో పసిడి పట్టేశాడు. ప్రతి క్రీడాకారుడు కలగనే ఒలింపిక్స్ స్వర్ణం, ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్.. ఇలా అన్నీ ఖాతాలో వేసుకున్నాడు. ఇక, అతను సాధించడానికి ఏం మిగిలింది? 90 మీటర్ల దూరంలో ఈటె విసరాలన్న లక్ష్యసాధన దిశగా నీరజ్ ప్రస్తుతం ముందుకు సాగుతున్నాడు. గతేడాది డైమండ్ లీగ్‌లో 89.94 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసిన నీరజ్, తన నిర్దేశిత లక్ష్యాన్ని వచ్చేనెలలో జరిగే ఆసియా క్రీడల్లో అందుకుంటాడా, వచ్చే ఏడు పారిస్ ఒలింపిక్స్‌లో నెరవేర్చుకుంటాడా అన్నది చూడాలి. అసాధారణ ప్రతిభతో ఆటలో అద్భుతాలు సృష్టించడమే కాదు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం అతనిది. నాడు ప్రపంచకప్‌లో కపిల్ సేన విజయం దేశంలో క్రికెట్ విప్లవానికి పునాదులు వేసినట్టుగా, నేడు నీరజ్ చోప్రా విజయాల పరంపర దేశ అథ్లెటిక్స్‌లో సరికొత్త మార్పునకు నాంది పలకడం హర్షించాల్సిన పరిణామం.