తడిలేని మాటలు

ABN , First Publish Date - 2023-07-21T00:44:06+05:30 IST

అంతటి అమానుష ఘటన మీద ప్రధానమంత్రి స్పందన ఎలా ఉండాలి? డెబ్బైఏడు రోజులుగా మణిపూర్‌ ఘోరకలిమీద ప్రధాని నోరువిప్పలేదు. రక్షించడం లేదు, రాష్ట్రంలో పర్యటించడమూ లేదు...

తడిలేని మాటలు

అంతటి అమానుష ఘటన మీద ప్రధానమంత్రి స్పందన ఎలా ఉండాలి? డెబ్బైఏడు రోజులుగా మణిపూర్‌ ఘోరకలిమీద ప్రధాని నోరువిప్పలేదు. రక్షించడం లేదు, రాష్ట్రంలో పర్యటించడమూ లేదు, కనీసం మాట్లాడండి అని ఆ రాష్ట్రప్రజలే కాదు, మిగతా దేశమూ ఆయనను ప్రార్థిస్తోంది. ఎట్టకేలకు ఆయన మాట్లాడారు. అదీ, సామాజిక మాధ్యమాల్లో ఒక దారుణఘటనకు సంబంధించిన విడియో వెలుగుచూసి, దేశం యావత్తూ దిగ్భ్రాంతి చెందిన తరువాత. మణిపూర్‌ మీద ప్రధాని సమక్షంలో చర్చ జరగాలని, ఆయన రావాల్సిందేనని లోపల విపక్షాలు పట్టుబడుతూంటే, ఎన్నడూ మీడియాతో మాట్లాడని నరేంద్రమోదీ, పార్లమెంటు వెలుపల నాలుగుముక్కలు మాట్లాడారు. ఆ మాటలు విన్నవారికి అవి తడిసిన మనసులోనుంచి వచ్చినవని అనిపిస్తాయా? హింస నివారణలో ఆయన జోక్యాన్ని కోరుతున్నవారు, పాశవికదాడులు ఎదుర్కొన్న బాధితులు, ఈ దృశ్యాన్ని చూసి చలించిపోయిన దేశప్రజలకు ఈ మాటలు ఉపశమనాన్ని, నమ్మకాన్ని ఇస్తాయా?

మణిపూర్‌లో పరిస్థితులు ఎంతటి భయానకంగా ఉన్నాయో ఈ విడియో తెలియచెబుతోంది. కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించడం, అత్యాచారం చేయడం, అడ్డుకోబోయిన కుటుంబీకులను హింసించి చంపేయడం మీతీల ఉన్మాదం ఏ స్థాయిలో సాగుతోందో అర్థమవుతుంది. ఈ ఆదివాసీయువతులు ప్రాణరక్షణకోసం పారిపోతూ, రక్షకభటుల చేతికి చిక్కితే, వారే తిరిగి వీరిని మీతీ సేనలకు అప్పగించారంటే పాలకులు, అధికార యంత్రాంగం కలగలసి చేపట్టిన జాతినిర్మూలన అని అర్థం. అందుకే, మిగతాదేశం ఈ విడియో చూసి, దిగ్భ్రాంతికి, విషాదానికి లోనైంది కానీ, మీతీ ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ చలించిపోలేదు, కదిలిపోలేదు. ఇటువంటివి వందలకొద్దీ ఉన్నాయన్న ఒక్కమాట చాలు అక్కడ జరుగుతున్నదేమిటో మనకు అర్థంకావడానికి. తక్షణశిక్షలు అమలుచేసే డబుల్‌ ఇంజన్‌ పాలకులు విడియోలో మొఖాలు చూసి బుల్‌డోజర్లతో ఇళ్ళూవాకిళ్ళూ కూల్చివేయగల సమర్థులు. కానీ, మణిపూర్‌లో ఈ ఘాతుకానికి పాల్పడిన దుర్మార్గులు వారికి ఆ మహిళలను స్వయంగా అప్పగించిన పోలీసులకు కానీ, అనంతరం ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసిన అధికారులకు కానీ, గుర్తుతెలియనివ్యక్తులుగానే ఉండటం విచిత్రం. రెండు దశాబ్దాల క్రితం గుజరాత్‌లో జరిగింది, ఇప్పుడు మణిపూర్‌లో జరుగుతున్నదీ ఒక్కటే. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందన్నది ఒట్టిమాట, ఓ మర్యాదమాట. అక్కడ జరుగుతున్నది మతపరమైన ఊచకోత. అక్రమ వలసదారుల పేరిట, గంజాయి సాగుదారులపేరిట మణిపూర్‌ కొండలనుంచి చిట్టచివరి ఆదివాసీని తరిమికొట్టేవరకూ సాగే జాతిహననం. గుజరాత్‌లో మాదిరిగా పాలకుల ఆశీస్సులతో సమస్త వ్యవస్థలూ కట్టగట్టుకొని సాగిస్తున్న మారణకాండ. ఆదివాసీ భూములను హస్తగతం చేసుకోవడానికి చట్టాలు అడ్డుపడుతున్నప్పుడు, అంతర్యుద్ధం ఒక్కటే మార్గం. యాభైవేలమంది కేంద్రబలగాలున్నా, కేంద్రమే నేరుగా శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నా పరిస్థితుల్లో మార్పురాలేదంటే, ఇది ఆవేశకావేశాలతో ఆకస్మికంగా రేగిన అగ్గికాదని, ప్రణాళికాబద్ధంగా సాగుతున్న కార్చిచ్చని అర్థమవుతుంది. ఇంతకాలమూ లోపల జరుగుతున్నదేమిటో బయటికి తెలియకుండా పాలకులు ఎంతో జాగ్రత్తపడ్డారు. నాయకులనే కాదు, పరిశీలకులను కూడా రానివ్వకుండా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. సుప్రీంకోర్టు వరకూ పోయి డెబ్బయ్‌ఏడురోజులుగా ఇంటర్నెట్‌ ఇవ్వకుండా జాగ్రత్తపడ్డారు. అయినా, దాచాలనుకున్నందంతా ఈ విడియోతో బయటకు పొక్కింది. ఇంతవరకూ ప్రత్యక్షంగా జోక్యం చేసుకోని సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు చేసింది. పాలకులు మాత్రం విడియోను తొలగించాల్సిందిగా సామాజిక మాధ్యమ సంస్థలను ఆదేశించారు.

మణిపూర్‌లో బీరేన్‌ సింగ్‌ ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్రపతి పాలన విధించాలని విపక్షాలు మళ్ళీ డిమాండ్‌ చేశాయి కానీ, మోదీ మాటలు విన్న తరువాత కూడా అటువంటిదేదో జరుగుతుందని ఎవరికీ నమ్మకం అక్కరలేదు. ఇంతకాలం తరువాత తప్పనిసరిగా స్పందించాల్సి వచ్చినందున కాబోలు అద్భుతమైన ఆ మాటకారి నోటినుంచి వచ్చిన ఆ నాలుగు మాటల్లో తడిలేదు. పైగా యావత్‌ సమాజమూ తలదించుకోవాలంటున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తూ అమ్మలనూ, అక్కలనూ కాపాడాలంటున్నారు. స్వపక్షపాలిత రాష్ట్రంలో ఈ ఘోరం జరిగితే, కాంగ్రెస్‌ పాలిత రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌లను కూడా ఉద్దేశపూర్వకంగా ప్రస్తావించారు. అందుకే, ఎంతోకాలం తరువాత స్పందించినా, అది ఈ దేశ ప్రధానిగా కాక, ఒక బీజేపీ నాయకుడు మాట్లాడినట్టే అనిపించింది.

Updated Date - 2023-07-21T00:44:06+05:30 IST