డ్రాగన్ ఓ శాంతికపోతం!
ABN , First Publish Date - 2023-03-15T00:53:46+05:30 IST
ప్రబల శత్రువులైన సౌదీ ఆరేబియా–ఇరాన్ మధ్య ఇటీవల మైత్రి కుదరడమే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిస్తే, దానికి చైనా మధ్యవర్తిత్వం వహించడం అమెరికాకే కాదు, మనకూ తీవ్ర కలవరం కలిగించే...
ప్రబల శత్రువులైన సౌదీ ఆరేబియా–ఇరాన్ మధ్య ఇటీవల మైత్రి కుదరడమే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిస్తే, దానికి చైనా మధ్యవర్తిత్వం వహించడం అమెరికాకే కాదు, మనకూ తీవ్ర కలవరం కలిగించే అంశం. దశాబ్దాలుగా ఉప్పూనిప్పూగా ఉన్న సౌదీ–ఇరాన్‌లు కరచాలనాలు చేసుకుంటూ, గతకాలపు మైత్రీ ఒప్పందాలను సైతం ఆచరణలోకి తీసుకువస్తామని ప్రకటించిన ఘట్టం ఇది. మధ్యలో చైనా ప్రతినిధి నవ్వులు చిందిస్తూ నిలబడివున్న ఈ దృశ్యం పశ్చిమాసియా రాజకీయాలను సమూలంగా మార్చివేయబోతున్నదని విశ్లేషకుల అభిప్రాయం. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ విజయోత్సాహంతో ఊగిపోతున్నారు. సోమవారం ఆయన పార్లమెంటులో ఒక ప్రకటన చేస్తూ, చైనా ఇకపై ప్రపంచవ్యవహారాల్లో కీలకభూమిక నిర్వహించబోతున్నదన్నారు. సౌదీ–ఇరాన్ ఒప్పదం ఊసెత్తకుండా, గ్లోబల్ రాజకీయాల్లో చక్రం తిప్పడం ద్వారా చైనా ప్రపంచశాంతికోసం పాటుపడబోతున్నదని ప్రకటించారు.
ఇక ఆయన జీవితకాలపు అధినాయకుడు కనుక, ఈ తరహా మరిన్ని ఊహించని పరిణామాలను ప్రపంచం చూడాల్సిరావచ్చు. ఆఖరునిముషం వరకూ ఎంతో రహస్యంగా ఉంటూ, ఫోటోలు బయటకువస్తే కానీ, ప్రపంచానికి బీజింగ్‌లో సౌదీ–ఇరాన్ ఒప్పందం కుదిరిందని తెలియలేదు. రాజకీయవిశ్లేషకులు దీనిని చైనా దౌత్యకుట్రగా అభివర్ణిస్తున్నారు. ఇరాక్‌లోకి అమెరికా చొరబడి సరిగ్గా 20 ఏళ్ళు అవుతున్న సందర్భంలో, తనకు రాజకీయ, భౌగోళిక ప్రయోజనాలుండే ఇండోపసిఫిక్‌ను దాటి, పశ్చిమాసియాలో చైనా కాలూనడం విశేషం. రెండేళ్ళక్రితం ఇరాన్‌తో పాతికేళ్ళ దీర్ఘకాలిక సహకార ఒప్పందాన్ని కుదర్చుకున్న చైనా, తనకు సైనికపరంగా పెద్ద ఉనికిలేని ప్రాంతంలోకి కూడా వ్యూహాత్మకంగా అడుగుపెట్టింది. సౌదీ–ఇరాన్ మధ్య ఉన్న షియా–సున్నీ వైరాన్ని సైతం ఎగదోసి దశాబ్దాలుగా తన ప్రయోజనాలను కాపాడుకుంటూ వస్తున్న అమెరికాకు ఇది పెద్ద షాక్.
ఇటీవలికాలంలో సౌదీ–ఇరాన్ మధ్య ఘర్షణరేపిన ఘటనలు అనేకం జరిగాయి. 2019లో సౌదీ చమురుక్షేత్రాలమీద ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్లతో దాడులు చేశారు. రెండుదేశాల మధ్యా యుద్ధం జరిగే పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇరాన్‌తో ప్రత్యక్ష యుద్ధానికి దిగే ఆలోచన లేదని అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సౌదీ పాలకులకు స్పష్టంచేశారట. ఇది సౌదీని నిరాశకు గురిచేసింది.
యువరాజు మహమ్మద్ బీన్ సల్మాన్ పాలకుడు అయిన తరువాత అమెరికా–సౌదీ మధ్య దూరం మరింత పెరిగింది. మరోపక్క ట్రంప్ దూకుడుగా అణు ఒప్పందాన్ని రద్దుచేసుకోవడం, ఆంక్షలు విధించడం, ఇరాన్ రివల్యూషనరీ గార్డు అధినేత సులేమానీహత్య వంటి ఘటనలు ఇరాన్‌ను ఆగ్రహానికి గురిచేశాయి. సౌదీ, ఇరాన్‌లు అమెరికా పట్ల ఆగ్రహంతో ఉన్న తరుణంలో చైనా రంగప్రవేశం చేసింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కూడా మారిన ఈ వాతావరణానికి మరో నిదర్శనం. అమెరికా మిత్రదేశంగా ఉండాల్సిన సౌదీ అరేబియా చైనా మిత్రదేశమైన రష్యా తరఫున ఉండిపోయింది. ఇరాన్ ఏకంగా రష్యాకు యుద్ధానికి అవసరమైన సైనికసాయమే చేస్తోంది.
చైనా సహభాగస్వామిగా ఉన్న ఈ కొత్త ఒప్పందం ప్రకారం సౌదీ–ఇరాన్‌లు గత వైషమ్యాలన్నీ పక్కనబెట్టి, దశాబ్దాలనాటి ఒప్పందాలకు తిరిగి కట్టుబడబోతున్నాయి. 1998 ఒప్పందంలో భాగంగా ఆర్థికం, వాణిజ్యం సహా అనేకరంగాల్లో సహకారాన్ని పెంచుకుంటాయి. 2001నాటి భద్రతా ఒప్పందాన్ని అమలు చేస్తాయి. అంతేకాదు, ఈ రెండు దేశాల సయోధ్య వల్ల అంతర్యుద్ధాలతో సతమతమవుతున్న చాలా దేశాల్లో శాంతి వెల్లివిరియవచ్చు. ముఖ్యంగా యెమెన్ దారినపడవచ్చు. సిరియా, లెబనాన్ వంటిదేశాల్లో పరస్పరం తిరుగుబాటుదారులను ఎగవేసే కార్యక్రమం ఆగిపోవచ్చు.
అమెరికా భౌగోళికార్థిక రాజకీయప్రయోజనాలతో ముడిపడివున్న పశ్చిమాసియాలోకి చైనా ఇప్పుడు ప్రవేశించింది. చమురుకోసమో, వనరులకోసమో, ఆధిపత్యంకోసమో అమెరికా అనుసరిస్తున్న మిత్రభేదానికి విరుగుడువేసే కార్యక్రమాన్ని అది మరింత విస్తృతపరచవచ్చు. తన సైనికశక్తితో పొరుగుదేశాల్లోకి చొరబడే దురాక్రమణదారుగా, ఆర్థికశక్తితో చిన్న దేశాలను రుణాల్లో ముంచే స్వార్థపరుడిగా ముద్రపడిన చైనా ఒక శాంతికాముక దేశంగా, విశ్వసనీయశక్తిగా, శత్రువులను సైతం స్నేహితులను మార్చగల సంధానకర్తగా అవతరించడం అమెరికాకు ప్రమాదం. పెర్షియన్ గల్ఫ్‌తో చారిత్రకంగా సన్నిహిత సంబంధాలున్న భారతదేశానికి కూడా ఈ పరిణామం జీర్ణించుకోలేనిదే. తన సన్నిహితమిత్రుడు చక్రం తిప్పాల్సిన నేలమీద ప్రత్యర్థి కాలూనడం కలవరం కలిగించే పరిణామమే.