కథన కుతూహలుడు
ABN , First Publish Date - 2023-05-23T01:39:21+05:30 IST
ఆయన గురించి చెప్పగలిగే మాటలు తక్కువ. అక్షర సంపన్నుడు, అతి నిరాడంబరుడు. ఎత్తైన మనిషి, లోతైన వ్యక్తి. సోమవారం తెల్లవారుజామున కన్నుమూసిన...
ఆయన గురించి చెప్పగలిగే మాటలు తక్కువ. అక్షర సంపన్నుడు, అతి నిరాడంబరుడు. ఎత్తైన మనిషి, లోతైన వ్యక్తి. సోమవారం తెల్లవారుజామున కన్నుమూసిన రాయలసీమ కథకుడు, నవలాకారుడు, సాహిత్య, విద్యా ప్రచురణల సంపాదకుడు, అభ్యుదయ సాహిత్యోద్యమ నేత, విద్వాంసుడు, ప్రజాస్వామిక స్నేహశీలి కేతు విశ్వనాథరెడ్డి తెలుగు సమాజం గర్వించదగిన ప్రభావశాలి. ఆయన జ్ఞాపకాలు, ఆనవాళ్లుగా వదలిన రచనలు అభిమానులు, అనుయాయులు, విద్యార్థులు, పాఠకులు చిరకాలం మననం చేసుకోదగ్గవి.
రాయలసీమ అంటే సినిమాలూ మీడియా ప్రతికూల ఆపాదనలను పదే పదే రుద్దుతున్నాయి కానీ, ఆ నాలుగు జిల్లాలకు, అందులో మరీ కడప జిల్లాకు ఉన్న ఒక గొప్ప విశేషం, భాషాసారస్వతాభిమానం. అచట పుట్టిన చివురు కొమ్మైన చేవ అన్నట్టుగా, ఎటువంటి వృత్తి వ్యాపకాలలో ఉన్నవారు కూడా సాహిత్య పరిచయం కలిగి ఉంటారు, వ్యక్తీకరణలో సారస్వత స్పర్శ ఉన్న భాష తొణికిసలాడుతుంది. కేతు విశ్వనాథరెడ్డికి తొలిచదువులలోనే పెద్ద పండితుల శిష్యరికం లభించింది. ఎదుగుతున్న కొద్దీ సామాజిక దృష్టి, రాజకీయ అవగాహన అలవడుతూ వచ్చాయి. అధ్యయనం, అభ్యాసం, అనుభవం ఆయనను గొప్ప రచయితను చేశాయి. ఏ రచయిత అయినా, తను పుట్టిపెరిగిన, తన చుట్టూ ఉన్న సమాజం నుంచి సంభాషిస్తాడు కాబట్టి, కేతు విశ్వనాథరెడ్డి అనేకం ‘సీమ’ కథలు రాశారు. తాను సంపన్న రైతు కుటుంబంలో పుట్టినా, భిన్నమైన పెంపకంలో పెరిగినా ఆయన చూపు మాత్రం అట్టడుగు జీవితాలలోకి ప్రసరించింది. తన సంపన్న, సమష్టి కుటుంబంలోని ‘ఉత్థాన పతనాలు సమాజంలోకి చూపును ప్రసాదించాయనుకుంటాను’ అని ఒక ఇంటర్వ్యూలో విశ్వనాథరెడ్డి అన్నారు. రాయలసీమ వ్యవసాయ సంక్షోభాన్ని, మనుగడల విధ్వంసాన్ని వాటి మూలకారణాలతో సహా కథనం చేశారు. తన జీవితానుభవం విస్తరించిన మేరకు ఆయన కథనం కూడా పరివ్యాప్తం అయింది. ఆర్థిక సమస్యలను, దోపిడీ దుర్భిక్షాలను మాత్రమే చిత్రించి ఊరుకోలేదు. మానవసంబంధాల, పరిస్థితుల మధ్య విలవిలలాడే నైతికతలను కూడా ఆయన పట్టుకున్నారు. మధ్యతరగతి నగరజీవనం నేపథ్యంలో కూడా ఆయన కథలు రాశారు.
విశ్వనాథరెడ్డి తొలికథలలో ఒకటి ‘అనాది వాళ్లు’ అరవయ్యేళ్ల కిందట రాసినది. అది ప్రతీకాత్మక పాత్రలతో, హేతుబద్ధ సంవాదంతో సాగే కథ. రాయలసీమ దుర్భిక్ష సంక్షోభం మీద తరువాత వచ్చిన అసంఖ్యాకమైన కథలకు విశ్వనాథరెడ్డి రాసిన ‘వానకురిస్తే’ కథ ఒరవడి పెట్టిందంటారు. గడ్డి, దప్పిక వంటి తొలిదశ కథల నుంచి మార్పు, పీర్లసావిడి, అమ్మవారి నవ్వు వంటి అనంతర దశ గొప్ప కథల నుంచి, భద్రలోకం వంటి ఇటీవలి కథ దాకా విశ్వనాథరెడ్డి కథాప్రయాణం సుదీర్ఘమైనది, విశిష్టమైనది. రాయలసీమ భూస్వామ్యంలోని కులపీడనను ఆయన తన కథలలో బాధిత పక్షపాతంతో చిత్రించారు. ఆయన కథలలోని మహిళాపాత్రలు ప్రత్యేకంగా పరిశీలన చేయదగ్గవి.
భావావేశం, ఉద్వేగ తీవ్రత ఉన్న తాను కవిత్వంలోకి కాకుండా, వచనరచనలోకి ఎందుకు వచ్చినట్టు అని విశ్వనాథరెడ్డి ప్రశ్నించుకుని, ఇట్లా సమాధానం చెప్పారు. ‘...నా ఉద్వేగ ప్రవృత్తిని మించిన మనుషుల పరిశీలన, ఆలోచనాప్రవృత్తి, ఇవి కవిత్వరూపంలో వొదగని వస్తువులనుకుంటాను. అంతర్ముఖత్వం వ్యక్తిగతమై, బహిర్‌ముఖత్వం జీవితమైతే వచనరచయితే మిగులుతాడనుకుంటాను’.
రాచమల్లు రామచంద్రారెడ్డి, గజ్జెల మల్లారెడ్డి, పుట్టపర్తి నారాయణచార్యులు, మధురాంతకం రాజారాం, కె. సభా, ఆచంట జానకిరామ్, జానమద్ది హనుమచ్ఛాస్త్రి మొదలైనవారి మధ్య మెలగి, ఎదిగిన వ్యక్తి విశ్వనాథరెడ్డి. అభ్యుదయ సాహిత్యోద్యమంలో క్రియాశీలంగా ఉంటూ నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు. కొడవటిగంటి కుటుంబరావు రచనల సంపుటాల సంపాదకత్వం ఆయన నిర్వహించిన పెద్ద బాధ్యత. అంబేడ్కర్ సార్వత్రక విశ్వవిద్యాలయంలో తెలుగులో పాఠ్యాలను రూపొందించడంలో ఆయన పాత్ర విలువైనది. ఈనాడు ఆ విశ్వవిద్యాలయం వివిధ పాఠ్యాంశాలు అంతటి విస్పష్టమైన, ఆధునిక తెలుగులో ఉన్నాయంటే అందుకు పునాది విశ్వనాథరెడ్డి సారథ్యంలోనే పడింది. అనేక పురస్కారాలు, సత్కారాలు పొందిన కేతు వచనం అత్యంత సరళంగా, నిరాడంబరంగా ఉంటుంది. చేరా మెచ్చిన వచనం విశ్వనాథరెడ్డిది. విద్యార్థులు, సహ అధ్యాపకులు, పెద్దా చిన్నా ఎవరితో అయినా స్నేహంగా మాత్రమే ఉండగలిగే వ్యక్తిత్వం ఆయనది.
పెద్దలందరూ వెళ్లిపోతున్నారు. వారి నుంచి అనంతరతరాలు చేదుకోవలసినంత చేదుకుంటున్నాయో లేదో అనుమానమే. తెలుగు అక్షరాల పరిచయమే అరుదయిపోతున్న కాలంలో, జీవితాన్ని రంగరించిన కథలను, కావ్యాలను చెప్పిన మునుపటి మనుషుల స్ఫూర్తిని కాపాడుకోవాలి. వారి జీవన విలువలను కూడా వారసత్వంగా స్వీకరించాలి.