‘సనాతన’ వివాదం
ABN , First Publish Date - 2023-09-05T02:51:43+05:30 IST
ఉదయనిధి స్టాలిన్ మాటలతో పెద్ద దుమారమే రేగింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించవలసిందేనని ఆయన ఒక సభలో చేసిన వ్యాఖ్యలకు రాజకీయరంగంలోను, సామాజికమాధ్యమాలలోను...
ఉదయనిధి స్టాలిన్ మాటలతో పెద్ద దుమారమే రేగింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించవలసిందేనని ఆయన ఒక సభలో చేసిన వ్యాఖ్యలకు రాజకీయరంగంలోను, సామాజికమాధ్యమాలలోను తీవ్రస్థాయిలో అనుకూల ప్రతికూల స్పందనలు వస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు కావడంతో పాటు రాష్ట్ర మంత్రి కూడా అయినందువల్ల, ఉదయనిధి మాటలను డిఎంకెకు, అది భాగస్వామిగా ఉన్న ‘ఇండియా కూటమి’కి కూడా ఆపాదిస్తూ బిజెపి శిబిరం తీవ్రంగా విమర్శిస్తోంది. హిందువుల జాతి నిర్మూలన (జెనోసైడ్)కు ఇచ్చిన పిలుపుగా ఉదయనిధి మాటలను బిజెపి నాయకులు అన్వయించారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చేజేతులా ప్రతిపక్ష కూటమి అవకాశాలను దెబ్బతీసుకోవడమే అని ‘ఇండియా కూటమి’ శ్రేయోభిలాషులు బాధపడుతున్నారు. కూటమిలోని మిత్రపక్షాలు ఇంకా అధికారికంగా ఏమీ మాట్లాడలేదు కానీ, లోలోపల మాత్రం కొన్నిపార్టీలు ఇబ్బందిపడడం తెలుస్తూనే ఉన్నది. ఉదయనిధి వ్యక్తిగత వ్యాఖ్యలుగా పరిగణించి, కూటమి చేతులు దులుపుకోవచ్చు.
కొందరు అనుకుంటున్నట్టు, సంచలనం కోసం, పనిగట్టుకుని, ఆకస్మాత్తుగా చేసిన వ్యాఖ్యలు కావవి. శనివారం నాడు చెన్నైలో తమిళ అభ్యుదయ రచయితల సంఘం, ద్రవిడ కజగం వారి ఆధ్వర్యంలో ఒక సదస్సు జరిగింది. ఆ సదస్సుపేరు సనాతన ధర్మ నిర్మూలనా మహానాడు. అందులో స్వాతంత్ర్యోద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర అన్న 8 పేజీల పుస్తకాన్ని ఆవిష్కరించారు. సావర్కర్ లొంగుబాటు, గాంధీ హత్య, ఈ రెండు అంశాలను సూచించే బొమ్మలు మినహా తక్కిన పేజీలన్నీ ఖాళీపేజీలు. ఒకపేజీలో ఉదయనిధి మూడు గుండుసున్నాలు కూడా గీశారు. ఆ సభలో మాట్లాడుతూ సమానత్వభావనకు, సమన్యాయానికి వ్యతిరేకమైనందున సనాతన ధర్మాన్ని నిర్మూలించవలసిందేనని జూనియర్ స్టాలిన్ అన్నారు. ప్రతికూల స్పందనలు వచ్చిన తరువాత ఆయన ఒక వివరణ కూడా ఇచ్చారు. తన మాటలకు కట్టుబడి ఉంటానని, న్యాయప్రక్రియను కూడా ఎదుర్కొంటానని అన్నారు. కులమతాల ప్రాతిపదికన ప్రజలను విభజించేదే సనాతన వాదమని, ఇందుకు మద్దతుగా పెరియార్, అంబేడ్కర్ రచనల నుంచి అనేక ఉటంకింపులను చూపించగలనని ఆయన సమాధానం చెప్పారు.
ఉదయనిధి వ్యాఖ్యలు ‘సనాతన’ వాదులకు బాధ, ఆగ్రహం కలిగించడం సహజం. నిజానికి ఈ సనాతనమనేది ఒక అనిర్దిష్ట భావన. పరంపరాగతమైనది, స్థిరమైనది, శాశ్వతమైనది అన్న అర్థాలు ఈ భావనకు ఉన్నాయి. సనాతనులంటే, బ్రహ్మవిష్ణు మహేశ్వరులనే నిఘంటు అర్థమూ ఉన్నది. హిందూమతంగా ప్రస్తుతం సంబోధిస్తున్న విశ్వాసవ్యవహారాలను సనాతనమతంగా పిలవడం ఇటీవలి కాలంలో పెరిగింది. విశ్వాసాలకు, ఆచారాల సంపుటికి ప్రాచీనత ధ్వనింపజేసే పదం ‘సనాతనం’. అత్యంత ప్రాచీనకాలం నుంచి కొనసాగుతూ వస్తున్న పరంపర అని చెప్పడంలో మతభావనలో ఉద్వేగ అంశ అధికమవుతుంది. ఈ నేపథ్యంలో సనాతనాన్ని మలేరియా, డెంగీ వంటి వ్యాధులతో పోలుస్తూ నిర్మూలన గురించి మాట్లాడడం తీవ్రమైన విషయమే. సున్నితమైన పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇటువంటి వ్యాఖ్యలకు పాల్పడడం సమాజానికైనా, తమకైనా ఎంతవరకు ప్రయోజనకరమో రాజకీయవాదులు ఆలోచించుకోవాలి. మతభావనలను అనుకూలంగా అయినా, ప్రతికూలంగా అయినా రాజేయడం వాంఛనీయమేనా అని ప్రశ్నించుకోవాలి. ఈ చర్చలు విద్యావిషయిక వేదికలపైనా, పండితుల మధ్యా జరగవలసినవి తప్ప, ఆవేశకావేశాల రాజకీయ వేదికల మీద కాదు. ఓట్ల కోసం ప్రజలను సమీకరించే అంశాలుగా వీటిని మలచుకోవడం అన్యాయం.
ఎడతెగకుండా ప్రవహిస్తున్న నదులు కూడా కాలక్రమంలో గతులు దిశలు మార్చుకుంటాయి. చరిత్రలో మార్పు లేకుండా ఏదీ యథాతథంగా కొనసాగదు. భారతదేశంలో సనాతన ధర్మం అని పిలుచుకుంటున్నది కూడా మార్పులు లేకుండా ఉన్నది కాదు. ఇవాళ ఎవరైనా తీవ్ర విమర్శలు చేస్తుంటే, అపచారంగా భావిస్తున్నాము కానీ, ఆస్తికనాస్తిక, వైదికఅవైదిక వాదోపవాదాలు కూడా సనాతన సంప్రదాయంలో భాగమే. హిందూమతంగా పిలుచుకుంటున్న దానిమీద బౌద్ధజైన ప్రభావాలు, బౌద్ధం మీద వైదికప్రభావాలు కనిపిస్తాయి. కాలానుగుణంగా, చరిత్ర కల్పించిన అవసరానుగుణంగా కొత్తదనం ముందుకు వస్తుంది, కాలంచెల్లినది వెనుకకుపోతుంది. ఈ రోజు సతీసహగమనం పాటించడం లేదు. వేల ఏండ్లుగా అమలులో ఉన్నది కదా అని అస్పృశ్యతను అనుమతించడం లేదు, పైగా నేరంగా పరిగణించి శిక్షిస్తున్నాము. భారతీయ సమాజంలో నిచ్చెనమెట్ల కులవ్యవస్థ ఉన్న మాట నిజం. తన, పర భేదాల పాటింపు అధికం. ఇవి చిన్న విషయాలు కావు. సమాజప్రగతిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నవి. ఇవి పోదగిన విలువలని అందరమూ అంగీకరిస్తున్నాము. ఈ విలువలే కొందరు సనాతనాన్ని విమర్శించడానికి ఆస్కారం ఇస్తున్నాయి. మన సమాజం కూడా మారుతున్న, ప్రగతిశీల సమాజం అని చెప్పుకోగలిగితే, ఒక కొత్త పరంపరను దర్శించగలుగుతాము. స్థిరత్వాన్ని ప్రశ్నిస్తూ పురోగతికి దారులు వేసిన పురాతనులు మన చరిత్రలోనూ ఉన్నారు.