పదోసారీ అదే తీరు!

ABN , First Publish Date - 2023-08-16T02:47:23+05:30 IST

అధికారంలోకి వచ్చిన వెంటనే ఎర్రకోటమీద నుంచి మరుగుదొడ్ల గురించి మాట్లాడిన సాహసి నరేంద్రమోదీ. ఆయన ఎర్రకోట ప్రసంగాల్లో చర్వితచర్వణం, స్వభుజతాడనం ఎక్కువైనాయన్న...

పదోసారీ అదే తీరు!

అధికారంలోకి వచ్చిన వెంటనే ఎర్రకోటమీద నుంచి మరుగుదొడ్ల గురించి మాట్లాడిన సాహసి నరేంద్రమోదీ. ఆయన ఎర్రకోట ప్రసంగాల్లో చర్వితచర్వణం, స్వభుజతాడనం ఎక్కువైనాయన్న విమర్శలున్నప్పటికీ, దేశానికి దిశానిర్దేశం చేసే స్థానంలో ఉన్నందున ఆ ప్రసంగాన్ని వినడం, విశ్లేషించుకోవడం అవసరం. మంగళవారంనాటి స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగం ఆయన ప్రస్తుత పదవీకాలంలో చివరిది. వచ్చే ఏడాది ఎర్రకోటనుంచి కూడా తానే ప్రసంగిస్తానని మోదీ ప్రకటించారు. దేశ స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగంలో ఈ మాట అనడానికి మన మాజీ ప్రధానులకు ధైర్యం లేకపోయింది. ఈ తరహా సంశయాలు, సందేహాలు, మొహమాటాలకు అతీతుడు నరేంద్రమోదీ. దేశానికి అవసరమైనప్పుడు నోరువిప్పకపోవడంలోనూ,తనకు అవసరమైనప్పుడు సుదీర్ఘ ప్రసంగాలు చేయడంలోనూ ఆరితేరిన ఆయన ఈ పదవ ఎర్రకోట ప్రసంగంలో చివరకు తన రికార్డులను సైతం తానే చెరిపేశారు. ఆయన సుదీర్ఘ ప్రసంగంలో దాదాపు పదకొండువేల పదాలున్నాయని, వర్డ్‌కౌంట్‌ లెక్కన ఐదు డిజిట్లు దాటిన తొలి ఎర్రకోట ప్రసంగం ఇదేనని మీడియా విశ్లేషిస్తున్నది.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రసంగాలను తూచడం, గతంలో చెప్పినవీ, తరువాత వదిలేసినవీ, కొత్తగా చెబుతున్నవీ విడదీయడం ఇప్పుడు మరింత సులువు. తొమ్మిదేళ్ళపాటు దేశవాసులారా అని సంబోధించిన ప్రధాని ఇప్పుడు వారిని తన కుటుంబీకులుగా మార్చేశారు. తన హయాంలో దేశం ఏకంగా విశ్వగురువు అయింది అంటారు కనుక, యావత్‌ ప్రపంచం అన్న మాట ఈ ప్రసంగంలో ఆయన నోట వందదాటింది. గతంలో అప్పుడప్పుడైనా ఎర్రకోట మీదనుంచి విద్య గురించి మాట్లాడిన ఆయన ఈ మారు ఆ ఊసు ఎత్తలేదని, పేదరికం ప్రస్తావన కూడా తొలివిడత పాలన ఎర్రకోట ప్రసంగాల్లో వందలసార్లు చోటుచేసుకుంటే, మలివిడతలో తగ్గుముఖం పట్టి, ప్రస్తుత ప్రసంగంలో తొమ్మిదిసార్లు మాత్రమే ఉన్నదని ఓ విశ్లేషణ. ఆయన నోటినుంచి రైతు మాట కూడా అలాగే ఆదిలో అరవై నుంచి మలివిడతలో ముప్పైకి తగ్గి, ఈ ప్రసంగంలో ఐదుపర్యాయాలకే పరిమితమైంది.


ప్రభుత్వ సంస్థల నివేదికలు, అంతర్జాతీయ అంచనాలు ఎలా ఉన్నా, తన తొమ్మిదేళ్ళ పాలనలో దేశం పేదరికం నుంచి బయపడిందని, మధ్యతరగతి పెరిగిందని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అద్భుతంగా ఉన్నాయని ఆయన చెప్పుకుంటున్నారు కనుక, చదువు, రోగం, దారిద్ర్యం ఇత్యాది మాటల స్థానంలో ఆయన నోట ఇప్పుడు టెక్నాలజీ, ప్రపంచం, యువతరం ‌ వంటివే వినిపించడం సహజం. సార్వత్రక ఎన్నికల ముందు జరిగే ఎర్రకోట ప్రసంగాల్లో వారసత్వ పాలనను దునుమాడటం ఓ ఆచారం కనుక, ఈ మారు కూడా అవినీతికి సంబంధించిన ఆ నాలుగుమాటలూ కూడా కుటుంబపాలనతో ముడిపడే వినిపించాయి. స్వాతంత్ర్యానంతర భారతదేశం ఇంత అద్భుతంగా ఎదగడానికి గతకాలపు ప్రధానులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కారణమని వారికి సెల్యూట్‌ చేసి, తాను ఏకపక్షంగా కాక ఏకాభిప్రాయంతో దేశాన్ని నడుపుతానని తన తొలి ఎర్రకోట ప్రసంగంలో హామీ ఇచ్చిన నరేంద్రమోదీ, దేశం ఎదుర్కొంటున్న సకల సమస్యలకు గత పాలకులే కారణమని పదో ప్రసంగంలోనూ ఆడిపోసుకోవడం ఆశ్చర్యం. పదేళ్ళ తరువాత జవాబుదారీగా ఉంటూ, మాట విసరడానికి భయపడాల్సిందిపోయి, ఇంకా తాను అవినీతిపై పోరాడుతున్నానంటూ, దురాచారాలన్నింటినీ విపక్షాలకు అంటగడుతూ ఎర్రకోటనుంచి ఎదురుదాడికి దిగాలంటే ఎంత ధైర్యం కావాలి? మాజీ ప్రధానుల ఎర్రకోట ప్రసంగాల్లో ఎంతోకొంత రాజకీయం ఉన్నా, విపక్షాలపై సుతిమెత్తని విమర్శలున్నా ఇంతటి ఆత్మస్తుతి, పరనింద లేదు. మతతత్వం మీద పదేళ్ళ మారటోరియం విధించుకొని ముందుకు సాగుదామని తన తొలి ఎర్రకోట ప్రసంగంలో ప్రకటించిన నరేంద్రమోదీ, ఇంతవరకూ పార్టీ ప్రసంగాలకు, నాయకుల మాటలకు పరిమితమైన ‘బుజ్జగింపు’ను పదేళ్ళ తరువాత ఎర్రకోటమీదకు అధికారికంగా తెచ్చారు. దానికి మైనారిటీ అన్న పదాన్ని తగిలించలేదంతే, ప్రధానులు ఎర్రకోటనుంచి తాము సాధించిందీ, సాధించబోయేదీ చక్కగా చెప్పుకోవచ్చు. కానీ, క్షేత్రస్థాయి పరిస్థితులతో, అధికారిక డేటాతో పొంతనలేకుండా మాట్లాడటానికీ, తన తొమ్మిదేళ్ళ పాలనలోనే భారతమాత మేల్కొన్నదని ప్రకటించడానికి తెగువతో పాటు చాలా లక్షణాలు ఉండాలి.

Updated Date - 2023-08-16T02:47:23+05:30 IST