టమాటా పోయి, ఉల్లి వచ్చె...

ABN , First Publish Date - 2023-08-23T03:25:12+05:30 IST

టమాటా ధర ఆకాశాన్ని అంటి, సామాన్యుడికి చుక్కలు చూపించిన తరువాత, ఇప్పుడు ఉల్లి కన్నీళ్ళు పెట్టిస్తున్నది. సెప్టెంబరుకల్లా కిలో ఉల్లి డెబ్బయ్‌ రూపాయలవరకూ చేరవచ్చునని...

టమాటా పోయి, ఉల్లి వచ్చె...

టమాటా ధర ఆకాశాన్ని అంటి, సామాన్యుడికి చుక్కలు చూపించిన తరువాత, ఇప్పుడు ఉల్లి కన్నీళ్ళు పెట్టిస్తున్నది. సెప్టెంబరుకల్లా కిలో ఉల్లి డెబ్బయ్‌ రూపాయలవరకూ చేరవచ్చునని ఈ నెలారంభంలోనే అంచనాలున్న నేపథ్యంలో, ఆగస్టు రెండోవారంనుంచి అది ఘాటెక్కడం ఆరంభించింది. హోల్‌సేల్‌ మార్కెట్లలోకి వస్తున్న ఉల్లి పరిమాణం తగ్గుతూండటం, ధర హెచ్చుతూండటంతో శనివారం కేంద్రప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నలభైశాతం పన్ను విధించింది. ఎగుమతి పన్నువేసినందుకు మహారాష్ట్రలోని ఉల్లి హోల్‌సేల్‌ మార్కెట్లు సమ్మె చేయడం, ఈ చర్యవెనుక విపక్షాల కుట్ర ఉన్నదని బీజేపీ నాయకులు వ్యాఖ్యానించడం చూస్తూనే ఉన్నాం. రెండు లక్షల టన్నుల ఉల్లిని అత్యధిక ధరకు కొనడానికి కూడా కేంద్రం సిద్ధపడుతున్నది. నిల్వలు పెంచడం, సరఫరాకు అంతరాయం లేకుండా చూడటం, తక్కువ ధరకు విక్రయించడం వంటి చర్యలతో ఉల్లిఘాటు సామాన్యుడికి తాకకుండా కేంద్రం జాగ్రత్తలు పడుతోంది. ప్రభుత్వాలను కూల్చివేసే శక్తి ఉన్న ఉల్లితో ఎన్నికల ముందు జాగ్రత్తగా వ్యవహరించడం తప్పదు.

ఎగుమతులమీద భారీ పన్ను విధించిన కారణంగా ధరలు పడిపోతాయన్న అర్థంలేని భయంతో తక్కువధరకు అమ్ముకొని నష్టపోకండి, ఎన్‌సిసీఎఫ్‌, నాఫెడ్‌ ఎంత ఉల్లినైనా కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి, కేంద్రం మీకు అండగా ఉంది అంటూ మంగళవారం పీయూష్‌గోయల్‌ ఉల్లి రైతులకు ధైర్యవచనాలు చెప్పారు. గత ఏడాది క్వింటాలుకు పన్నెండువందల రూపాయల చొప్పున కొనుగోలు చేసిన ఈ సంస్థలు ఇప్పుడు రెట్టింపు రేటుకు ఉల్లిని కొంటున్నాయంటేనే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఎగుమతులపై నలభైశాతం పన్ను విధించడం వల్ల దేశీయ మార్కెట్‌లో ఉల్లి లభ్యత కొంతమేరకు పెరిగినా, భవిష్యత్తులో ఉల్లి ఎగుమతులు దెబ్బతింటాయని కొందరి వాదన. ఉల్లి ఉత్పత్తి, ఎగుమతుల్లో తొలిస్థానాల్లో ఉన్న భారతదేశం ఇలా నియంత్రణలు పాటిస్తే, దశాబ్దాలుగా నెలకొల్పుకున్న అంతర్జాతీయ మార్కెట్‌ను కోల్పోవడంతోపాటు, మనతో పోటీపడుతున్న నెదర్లాండ్స్‌, మెక్సికో, చైనా వంటి దేశాలకు మార్గాన్ని సుగమం చేసినట్టవుతుందని వారి బాధ. అలాగే, మన ఉల్లిమీద అధికంగా ఆధారపడిన నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక వంటి పొరుగుదేశాల్లో సంక్షోభం సృష్టించడంతో పాటు, ఆ దేశాలు కొత్త మార్కెట్‌కు తరలిపోయే ప్రమాదం ఉన్నదని, ఇది ఉల్లి రైతులకు, వ్యాపారులకు దీర్ఘకాలికంగా నష్టం చేస్తుందని వారి వాదన.


భారతీయుల ఆహారంలో ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, టమాటా అతి ముఖ్యమైనవి కనుక వాటి ధరలు కొండెక్కకుండా చూడటానికి పాలకులు ఎన్ని కష్టాలైనా పడతారు. ప్రస్తుతం టమాటా ధర కాస్తంత దిగినా, గత ఏడాది ఇదేకాలంతో పోల్చినా ఇప్పటికీ అందనంత ఎత్తునే ఉంది. గతనెలలో ప్రధాన నగరాల్లో కిలో టమాటా రెండువందల రూపాయలవరకూ చేరి చెమటలు పట్టించింది. ఇప్పుడు దాని స్థానంలోకి ఉల్లి వచ్చి చేరింది. ఎన్నికల ముంగిట్లో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వానికి టమాటా కంటే ఉల్లితోనే ఎక్కువ ప్రమాదం ఉన్నదని, ఈ సమస్యను దారికి తేవడం అంత సులభం కాదని విదేశీ మీడియా కూడా విశ్లేషణలు చేస్తోంది. ఎగుమతులను నియంత్రించడం ద్వారా దేశీయంగా వివిధ ఆహారోత్పత్తుల ధరలు పెరగకుండా చూడటానికి ఇటీవలికాలంలో ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. గోధుమలు, బియ్యం, పంచదార ఎగుమతులపై నిషేధం విధించడం, కొన్ని పప్పుదినుసుల నిల్వల పరిణామాన్ని నియంత్రించడం, భారత ఆహారసంస్థ గిడ్డంగులనుంచి లక్షలాది టన్నుల బియ్యం, గోధుమలను బహిరంగ మార్కెట్‌లోకి విడుదల చేయడం వంటివి అనేకం జరిగాయి. ఇంతటి కృషి జరుగుతున్నా ఆహార ద్రవ్బోల్బణం అత్యధికంగానే ఉంది, అందులో కూరగాయలవాటా 30శాతం మించిపోయింది. అనేక ఆహార ఉత్పత్తుల ధరలు పదినుంచి ఇరవైశాతం వరకూ పెరిగి వినియోగధరల సూచిక (సీపీఐ) రిజర్వుబ్యాంకు అంచనాలను మించిపోయింది. కూరగాయల ధరలు త్వరలోనే సర్దుకుంటాయన్న ఆర్థికమంత్రిత్వశాఖ వాదన వాస్తవరూపం దాల్చినా, ఇతరత్రా ఉత్పత్తుల ధరలు ఇప్పట్లో అదుపులోకి రాగలిగే సూచనలు కనిపించడం లేదు. చాలా నిత్యావసరాల ధరలు దీర్ఘకాలంగా అధికంగానే ఉంటున్న నేపథ్యంలో, దశాబ్దకాలంలో మూడవ అతిపెద్ద ఆహారద్రవ్యోల్బణాన్ని దేశం ప్రస్తుతం చవిచూస్తున్న తరుణంలో ఈ అధికధరలకు అలవాటుపడిపోవడం, సర్దుకుపోవడం ప్రజలకు తప్పకపోవచ్చు.

Updated Date - 2023-08-23T03:25:12+05:30 IST