పర్యటనలు–ప్రయోజనాలు
ABN , First Publish Date - 2023-03-23T01:26:23+05:30 IST
చైనాఅధ్యక్షుడు రష్యాలో ఉన్న సమయంలోనే జపాన్ ప్రధాని ఉక్రెయిన్‌లో కాలుమోపారు. రష్యాకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడుతున్న ఉక్రెయిన్‌లో పర్యటించి మీకు తోడుగా ఉన్నామని...
చైనాఅధ్యక్షుడు రష్యాలో ఉన్న సమయంలోనే జపాన్ ప్రధాని ఉక్రెయిన్‌లో కాలుమోపారు. రష్యాకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడుతున్న ఉక్రెయిన్‌లో పర్యటించి మీకు తోడుగా ఉన్నామని చెప్పిరండి అంటూ జపాన్ ప్రధాని కిషిదామీద స్వదేశంలో తనపార్టీ నుంచి తీవ్ర ఒత్తిడి ఉందనీ, ఆయన ఎంతోకాలం నాన్చి ఇప్పుడు రహస్యంగా కీవ్‌లో అడుగుపెట్టారని అంటారు. జపాన్ మీ పక్షానే ఉన్నదని నాలుగు మంచిమాటలు చెప్పడానికి తప్ప ఆయన పర్యటనకు పెద్ద ప్రాధాన్యం లేదు. కానీ, యుద్ధంలో నష్టపోతున్న రష్యాకు చైనా త్వరలోనే భయానకమైన ఆయుధాలు అందించబోతున్నదని అమెరికా ఆరోపిస్తున్న సమయంలోనే చైనా అధ్యక్షుడి రష్యా పర్యటన జరిగింది. చైనా అధ్యక్షుడిగా మూడోసారి బాధ్యతలు తీసుకున్న తరువాత జిన్‌పింగ్ జరిపిన తొలివిదేశీ పర్యటన ఇదే.
ఈ పర్యటనలో రష్యా పక్షాన తాను మరింత బలంగా నిలవబోతున్న సంకేతాలు చైనా స్పష్టంగా ఇచ్చింది. రష్యాను కానీ, యుద్ధాన్ని కానీ పల్లెత్తుమాట అనకుండా అంతర్జాతీయ నియమాలకు కట్టుబడాలని, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ శాంతిచర్చలు సాగించాలని ప్రకటించడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు. యుద్ధం ఈ స్థాయికి చేరడానికి అమెరికాయే ప్రధానకారణమని విమర్శించడం చైనా వైఖరికి అనుగుణంగానే ఉంది. రష్యా చైనా మైత్రికి ఇక అవధులు ఉండబోవనీ, సహకారం కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం కాబోదని ప్రకటించడంలోనే అమెరికా ఆరోపిస్తున్న ఆయుధ సహకారం కూడా అంతర్లీనంగా కనిపిస్తున్నది. చైనా ప్రతిపాదించిన పన్నెండు అంశాల శాంతిమార్గాన్ని అమెరికా తప్పుబడుతున్న విషయం తెలిసిందే. రష్యా చొరబాటుకు అమోదం, చొరబడిన ప్రాంతాలను అధికారికం చేసే కుట్ర ఈ ప్రతిపాదనలో ఉన్నదని, యుద్ధాన్ని ఆపాలని కానీ, ఆక్రమిత ప్రాంతాలనుంచి వైదొలగాలని కానీ అనకుండా రష్యా పక్షాన చైనా ఉపరితల విన్యాసాలు చేస్తున్నదని వాటి విమర్శ. తన ప్రతిపాదన అంతర్జాతీయ నియమాలకు, అన్ని దేశాల భద్రతాభయాలను దృష్టిలో పెట్టుకొని రూపొందిందని చైనా అంటూంటే, రష్యా అధ్యక్షుడు దీనిని ప్రశంసిస్తూ, తటస్థమైనదీ, ఆచరణయోగ్యమైనదిగా అభివర్ణిస్తున్నారు.
అధికారిక ప్రకటనలు, బహిరంగ వ్యాఖ్యలు అసలు నిజం చెప్పవు కానీ, చైనా అధ్యక్షుడి పర్యటన లక్ష్యం శాంతిసాధనేనని అనేకుల నమ్మకం. సౌదీ–ఇరాన్ సయోధ్యతో ఓ శాంతిదూతగా గుర్తింపు పొందిన చైనా ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం నిలువరించే విషయంలోనూ తనవంతు ప్రయత్నం చేయాలనే ఆలోచనలో ఉంది. రష్యా పక్షాన నిలబడుతూనే, దానికి ఆయుధాలు అందించడం కంటే, శాంతిని సాధించడం తనకు మరింత ముఖ్యమని చైనా చెప్పదలుచుకుంది. ఒకరి భద్రత మరొకరికి ప్రమాదాన్ని సృష్టిస్తున్న కాలంలో, తక్షణ ఉపసంహరణ, తక్షణ శాంతి వంటి మాటలకు అర్థం లేదని చైనా వాదన. ఉద్రిక్తతలు క్రమంగా చల్లారి, కాల్పుల విరమణ పరిస్థితులు ఏర్పడి, పరస్పర విశ్వాసంతో చర్చలు సాగినప్పుడు మాత్రమే ఫలితం దక్కుతుందని దాని భావన. ఈ పర్యటనకు ముందే ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడాలని అనుకున్న జిన్‌పింగ్ ఇప్పుడు రష్యానుంచి తిరిగివచ్చాక ఆ పనిచేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. రష్యా అధ్యక్షుడి మనసులోమాట తెలుసుకున్న తరువాత, ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడటం మరింత సులభమవుతుంది. శాంతిముసుగులో ఆయుధాలు అమ్ముకోవడానికీ, ఆయిల్, గ్యాస్ తెచ్చుకోవడానికే చైనా అధ్యక్షుడు రష్యా వెళ్ళారన్న ఆరోపణలు కూడా ఉన్నప్పటికీ, ఆయుధాలు అమ్ముకోవడానికే ప్రాధాన్యం ఇస్తే, ప్రపంచస్థాయిలో వివాదాల పరిష్కర్తగా, సంధానకర్తగా, శాంతిదూతగా కనబడాలన్న లక్ష్యం నెరవేరదు. ఇది ఉద్రిక్తతలను మరింత పెంచి, పాశ్చాత్యదేశాల ఆరోపణలకు నైతికత చేకూరుస్తుంది.
తన ఆర్థిక భౌగోళిక ప్రయోజనాలకోసం సౌదీ–ఇరాన్ మధ్య వైషమ్యాలు పెంచిన అమెరికా, అనేక పరిణామాల నేపథ్యంలో ఆ రెండు దేశాలకూ దూరమైన స్థితిలో చైనా రంగప్రవేశం చేసి సయోధ్య కుదర్చగలిగింది. కానీ, అమెరికా నాటో నేరుగా మోహరించి ఉన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించడం అంత సులభం కాదు. రెండుదేశాలూ హోరాహోరీ పోరాడుతూ, తమదే పైచేయి అని భావిస్తున్న తరుణంలో, ఉద్రిక్తతలను చల్లార్చడం, దారికి తేవడం, చర్చలకు దింపడం ఇప్పటి లెక్కల ప్రకారం అసాధ్యం. చైనా అధ్యక్షుడు దానిని సుసాధ్యం చేయగలుగుతారో లేదో చూడాలి.