ఉద్ధవ్‌ నైతిక విజయం

ABN , First Publish Date - 2023-05-12T02:02:18+05:30 IST

‘యుద్ధక్షేత్రంలో పోరాడకుండానే, అస్త్రసన్యాసం చేసి ఉద్ధవ్‌ఠాక్రే తప్పుపనిచేశారు’ అని శరద్‌పవార్‌ గతంలో పలుమార్లు అన్నారు. అవమానంతోనో, ఆగ్రహంతోనో...

ఉద్ధవ్‌ నైతిక విజయం

‘యుద్ధక్షేత్రంలో పోరాడకుండానే, అస్త్రసన్యాసం చేసి ఉద్ధవ్‌ఠాక్రే తప్పుపనిచేశారు’ అని శరద్‌పవార్‌ గతంలో పలుమార్లు అన్నారు. అవమానంతోనో, ఆగ్రహంతోనో పోరాటాన్ని తుదివరకూ కొనసాగించకపోవడం రాజకీయాల్లో సరికాదని తన ఆత్మకథలో కూడా ఆయన లోతుగా ప్రస్తావించారట. గత ఏడాది ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటుతో షాక్‌లో ఉన్న ఉద్ధవ్‌ ఠాక్రే, తనకు అధికారయావ లేదనీ, రాజీనామా చేయబోతున్నానని కార్యకర్తలకు తెలియచేసి, తన అధికార నివాసం ఖాళీచేసి సొంతింటికి తరలిపోయారు. మరోవారం తరువాత, మహారాష్ట్ర శాసనసభలో బలపరీక్ష ఎదుర్కొనే ముందురోజు, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, తలలు మాత్రమే లెక్కించి ఎవరికి బలం ఉన్నదో తేల్చే ఈ ప్రక్రియ సరికాదంటూ బలపరీక్షను ఎదుర్కోకుండానే రాజీనామా చేశారు. పదకొండు నెలల తరువాత, శివసేనకు సంబంధించిన కేసులో గురువారం సుప్రీంకోర్టు ఉద్ధవ్‌ నిర్ణయం ఎంత తొందరపాటు చర్యో తన వ్యాఖ్యల ద్వారా తెలియచెప్పింది.

ఉద్ధవ్‌ బలపరీక్ష ఎదుర్కొని ఓడివుంటే, తిరిగి ప్రతిష్ఠించగలిగే వీలు తమకు ఉండేదనీ, ఆయన రాజీనామాను కొట్టివేయలేని స్థితిలో తాము ఉన్నామని సుప్రీంకోర్టు అంటోంది. ఉద్ధవ్‌ తనకు తానుగా ముందే తప్పుకోవడంతో, అప్పటికే అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ మద్దతుతో షిండే నాయకత్వంలో చీలికవర్గం గవర్నర్‌ ప్రమాణస్వీకారం చేయించడం ఓ సముచిత చర్యగా మారిపోయింది. తిరిగి అధికారంలోకి రాగలిగే అవకాశాన్ని ఒక తప్పటడుగుతో ఉద్ధవ్‌ కోల్పోయినప్పటికీ, సుప్రీంకోర్టు తీర్పు నైతికంగా ఆయన పక్షానే నిలిచింది. ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామిక, అనైతిక, చట్టవిరుద్ధ ప్రక్రియలద్వారా అధికారంలోకి వచ్చిందన్నది తీర్పు సారాంశం. ఈ వ్యవహారంలో గవర్నర్‌ పాత్రపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు అత్యంత తీవ్రమైనవి. పార్టీలో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నట్టుగా తెలియచెప్పే విస్పష్టమైన ఆధారాలు లేకుండానే గవర్నర్‌ ఉద్ధవ్‌కు తగినంతబలం లేదన్న నిర్ణయానికి వచ్చారని, పార్టీ అంతర్గత సమస్యను బలపరీక్షతో ముడిపెట్టడంలోనూ, తనకు లేని అధికారాలు ప్రయోగించి షిండే–ఫడ్నవీస్‌ కూటమికి అనుకూలంగా పరిస్థితులను సృష్టించడంలో భగత్‌సింగ్‌ కోషియారీ చట్టవిరుద్ధంగా వ్యవహరించారని సుప్రీంకోర్టు విస్పష్టంగా తేల్చింది. ఆయన ఓ రాజకీయనాయకుడి అవతారం ఎత్తారని సగౌరవంగా గుర్తుచేసింది. మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చడానికి కోషియారీ కుట్రపన్నారంటూ విపక్షాలు ఇంతకాలమూ చేస్తున్నది రాజకీయ విమర్శలు కాదని, నూరుశాతం నిజమని సుప్రీంకోర్టు నిర్ధారించినట్టు అయింది.

గవర్నర్‌తో పాటు, షిండేవర్గం అధికారంలోకి రావడానికి ప్రధానకారణమైన స్పీకర్‌ను కూడా కోర్టు గట్టిగా దులిపేసింది. హడావుడిగా షిండే వర్గం మనిషిని విప్‌గా గుర్తించడం ద్వారా స్పీకర్‌ మొత్తం కథను తిరుగుబాటుదారులకు అనుకూలంగా మార్చేశారన్నది సారాంశం. కొత్త విప్‌ నియామకం సరైనదికాదని అనడంద్వారా ఆయన చర్యలన్నీ అక్రమం అని కోర్టు తేల్చింది. అలాగే, శివసేన పేరునూ, గుర్తునీ షిండేవర్గానికి కట్టబెట్టే విషయంలో ఎన్నికల సంఘం తీసుకున్న ప్రాతిపదికలను, అనుసరించిన ప్రక్రియలను గట్టిగానే ప్రశ్నించింది. షిండే ప్రభుత్వం ఏర్పాటు రాజ్యాంగవ్యతిరేకమన్న ఒక్కమాట తప్ప ఈ తీర్పులో తాను అనదల్చుకున్నదంతా న్యాయస్థానం అన్నది.

అందరూ కలిసి ఉద్ధవ్‌కు తీవ్ర అన్యాయం చేశారని, వెన్నుపోటుదారులకు వెన్నుదన్నుగా నిలిచారని అంటున్న ఈ తీర్పు ప్రభావం, షిండే ప్రభుత్వం మనుగడమీద ఏమాత్రం ఉండకపోవచ్చు. ఉద్ధవ్‌కు తిరిగి అధికారం కట్టబెట్టలేదు కనుక, తనను దిగిపొమ్మని నేరుగా చెప్పలేదు కనుక షిండేకు వచ్చిననష్టమేమీ లేదు. జరిగిందంతా అన్యాయం, అక్రమం అని కోర్టు ఎన్ని అక్షింతలు వేసినా ఈ నాటకంలోని పాత్రధారులు సూత్రధారులు సులువుగా దులిపేసుకుంటారు. కానీ, మరో ఏడాదిలో ఎన్నికలున్న తరుణంలో ఉద్ధవ్‌ ఠాక్రేకు ఇది కచ్చితంగా నైతికవిజయమే. తనను తిరిగి అధికారంలో కూచోబెట్టాలన్న అభ్యర్థనను న్యాయస్థానం సాంకేతిక కారణాలతో తిరస్కరించినా, ప్రజలు ఆ పనిచేయాలంటే ప్రజాక్షేత్రంలో ఆయన మరింత బలంగా పోరాడాల్సి ఉంటుంది.

Updated Date - 2023-05-12T02:02:18+05:30 IST