విమర్శ–విచక్షణ

ABN , First Publish Date - 2023-07-19T02:33:34+05:30 IST

మణిపూర్‌ నా పుట్టినిల్లు, దయుంచి సత్వరమే నా ప్రజలను కాపాడండి అంటూ ఒలింపిక్స్‌లో దేశానికి పతకం సాధించిపెట్టిన వెయిట్‌ లిఫ్టర్ మీరాబాయి చాను ప్రధానికి విజ్ఞప్తిచేశారు...

విమర్శ–విచక్షణ

మణిపూర్‌ నా పుట్టినిల్లు, దయుంచి సత్వరమే నా ప్రజలను కాపాడండి అంటూ ఒలింపిక్స్‌లో దేశానికి పతకం సాధించిపెట్టిన వెయిట్‌ లిఫ్టర్ మీరాబాయి చాను ప్రధానికి విజ్ఞప్తిచేశారు. మరో పదిరోజుల్లో మణిపూర్‌ సమస్య పరిష్కారానికి ప్రధాని చొరవచూపకపోతే దేశరాజధానిలో ఉద్యమిస్తామని ఫోరం ఫర్‌ రిస్టోరేషన్‌ ఆఫ్‌ పీస్‌ అనే సంఘం అధినేత హెచ్చరిస్తున్నారు. ఓ సారి రాష్ట్రంలో పర్యటించి, పరస్పర విద్వేషంతో రగిలిపోతున్న తెగలమధ్య సయోధ్య కుదర్చండి అంటూ సమస్య పరిష్కారానికి కొన్ని సలహాలతో లేఖరాసినా ప్రధానమంత్రి ప్రతిస్పందించలేదన్నది ఈ సంఘం ఆగ్రహం. ఒక మహిళ హత్యతో రాష్ట్రం తిరిగి రగిలి, బంద్‌ జరిగిదంటే పరిస్థితుల్లో ఏ మార్పులేదని అర్థం. 75రోజులుగా లేని ఇంటర్నెట్‌ సేవలను పాక్షికంగానైనా పునరుద్ధరించమంటూ హైకోర్టు ఆదేశించినందుకు ఆగ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయింది. శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమైన ముఖ్యమంత్రి మరింత భద్రంగా ఆ పదవిలోనే కొనసాగుతారు. ప్రధాని మాట్లాడరు, చర్యలుండవు, విపక్షాల విమర్శలకు విలువే లేదు. ఈ పరిస్థితుల గురించి ఈయూ పార్లమెంటు మాట్లాడినందుకు మాత్రం ఎంతో ఆగ్రహం కలుగుతుంది.

మణిపూర్‌ అంతర్గత వ్యవహారమే. సమస్య మనదే, పరిష్కరించాల్సిందీ మనమే. అగ్గిరాజేసినవారే ఆర్పాలి. యూరోపియన్‌ పార్లమెంటుకు ఈ అంశాన్ని చర్చించే, వ్యాఖ్యానించే అవకాశం ఇచ్చిందీ మనమే. రెండునెలలకు పైగా, ఒక ఈశాన్యరాష్ట్రం తెగలమధ్య యుద్ధాలతో తగలబడిపోతున్నప్పుడు, ఎన్నికల లెక్కలతో అక్కడివారిని మనుషులుగా కాక ఓటర్లుగా చూస్తూ వదిలేసినందుకే ఇలా పాఠాలు చెప్పించుకోవాల్సి వస్తున్నది. అధికారిక లెక్కల ప్రకారమే 150మంది ఘర్షణల్లో మరణించి, నలభైవేలమంది నిరాశ్రయులై, ఇళ్ళు, వ్యాపారసముదాయాలు, ఆరాధనాస్థలాలు అగ్నికి ఆహుతై, ఇప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగుతూండటం అత్యంత దయనీయమైన విషయం కనుకనే, చివరకు మన ఆప్తమిత్ర అమెరికా కూడా అది భారతదేశ అంతర్గత విషయమని అంటూనే, అడిగితే ఏ సాయమైనా చేస్తామని అనాల్సివచ్చింది. మనం చలనరహితంగా కనిపిస్తే ఎదుటివాడికి నీతులు చెప్పాలని అనిపిస్తుంది.

ఈయూ పార్లమెంటు తన తీర్మానంలో మణిపూర్‌ హింస, ప్రాణ ఆస్తి నష్టాలను ఖండించడంతో పాటు ఈ విషయంలో బీజేపీ నాయకులు ప్రదర్శిస్తున్న వైఖరిని తప్పుబట్టడం మన తీవ్ర ప్రతివిమర్శకు కారణం. ఘర్షణలు మతప్రాతిపదికన సాగుతున్నాయని ఈయూ ఏ కారణంగా వ్యాఖ్యానించినప్పటికీ, అన్ని మతాలవారూ ఇందులో బాధితులే అయినప్పటికీ, హిందువులు అత్యధికంగా ఉన్న మీతీలకు ఎస్టీ హోదా కల్పించే ప్రతిపాదనే ఈ అగ్గికి కారణమన్నది కాదనలేని నిజం. తనకు లేని అధికారంతో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇలా ఆదేశించడం వెనుక మిగతా తెగలవారికి రాజకీయమే కనిపించింది. అప్పటికే వివిధరంగాల్లో మీతీలకు ఉన్న అధిపత్యం, మైదానప్రాంతాల్లోని వీరికీ, కొండప్రాంతాల్లోని ఇతర తెగలవారికీ మధ్య ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉండటం వంటివి ఇందుకు పునాది. మీతీ బీరేన్‌సింగ్‌ పట్ల ఇతరుల్లో పెరిగిపోయిన అవిశ్వాసం పరిస్థితులను ఏమాత్రం నియంత్రించలేని దశకు తెచ్చాయి. మీతీ ఓటుబ్యాంకు కోల్పోతామన్న భయంతో బీజేపీ పెద్దలు ఆయన జోలికే పోవడానికి జడుస్తుంటే, ఓ రాజీనామా నాటకంతో ఆయన తన అధికారాన్ని మరింత సుస్థిరం చేసుకున్నారు. ఆర్థికంగానూ, వాణిజ్యపరంగానూ ప్రపంచం దగ్గరవుతూ, పరస్పరాధారితంగా మారుతున్నప్పుడు తీవ్ర ప్రతివిమర్శలతో సాధించేదేమీ ఉండదు. ముఖ్యంగా, మనతో సత్సంబంధాలు కోరుకుంటున్న, మనం దగ్గరకావాలని ఆశిస్తున్న దేశాలతో వ్యవహారం బాధ్యతాయుతంగా ఉండటం దేశానికి ప్రయోజనకరం. ప్రజాస్వామ్యం, చట్టబద్ధపాలన, బహుళత్వం ఇత్యాది విషయాల్లో ఉన్నతమైన ప్రమాణాలు పాటిస్తూ, విశ్వగురువు అయ్యామని అంటున్నప్పుడు జవాబు సున్నితంగా ఉండేట్టు జాగ్రత్తపడక తప్పదు. పొరుగుదేశాలనుంచి సాగే వలసలనుంచి, విదేశాల్లో హిందూదేవాలయాలపై దాడులవరకూ ప్రతిదానిపైనా మనమూ వ్యాఖ్యానిస్తుంటాం. కశ్మీర్‌లో అంతా సవ్యంగా ఉన్నదని చూపడానికి అంతర్జాతీయ బృందాలను పలుమార్లు ప్రత్యేకంగా ఆహ్వానించి మరీ సర్టిఫికేట్లు అందుకుంటాం. చమురు ఎగుమతులు, ఆయుధకొనుగోళ్ళు జరిపినప్పుడు అస్మదీయులనీ, మనలను ప్రశ్నించినప్పుడు మాత్రం తస్మదీయులనీ అంటే ఎలా?

Updated Date - 2023-07-19T02:33:34+05:30 IST