మాటల యుద్ధం!
ABN , First Publish Date - 2023-04-13T01:42:57+05:30 IST
ఒక్కఅంగుళం కూడా తీసుకుపోలేరు అంటూ కేంద్రహోంమంత్రి అమిత్ షా మరోమారు చైనాను ఉద్దేశించి గర్జించారు. సోమవారం నాటి ఆయన అరుణాచల్ ప్రదేశ్ పర్యటన సహా...
ఒక్కఅంగుళం కూడా తీసుకుపోలేరు అంటూ కేంద్రహోంమంత్రి అమిత్ షా మరోమారు చైనాను ఉద్దేశించి గర్జించారు. సోమవారం నాటి ఆయన అరుణాచల్ ప్రదేశ్ పర్యటన సహా ఆ రాష్ట్రంలో భారత అధికారుల కార్యకలాపాలు తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తున్నాయని చైనా మారోమారు ఆగ్రహించింది. ఇటీవల చైనా మూడోమారు అరుణాచల్‌లోని కొన్ని ప్రాంతాలకు తన మాండరిన్ భాషలో నామకరణం చేసిన నేపథ్యంలో, హోంమంత్రి అక్కడ పర్యటించడమే కాక, చైనా వాదనలను సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. కొత్త పేర్లు పెట్టుకున్నంత మాత్రాన భారత్ అంతర్భాగమైన అరుణాచల్‌ను ఎవరూ వేరుచేయలేరని ప్రకటించారు. భద్రతాబలగాలు సరిహద్దులను కంటికిరెప్పలా కాపలాకాస్తున్నందున, దేశం కంటినిండా నిద్రపోగలుగుతున్నదని ప్రశంసించారు. గతంలో ఈశాన్యం అభివృద్ధికి నోచుకోకుండా, అల్లకల్లోలంగా, కారడవిలాగా ఉండిపోయిందనీ, తమ పాలనలో అత్యద్భుతంగా ఎదిగిందనీ, దేశ అభివృద్ధిలో అంతర్భాగమైందని చెప్పుకున్నారు. చైనా మాండరిన్ పేర్లకు సమాధానంగా కాబోలు, పురాణాల్లో సైతం అరుణాచల్ ప్రదేశ్ ప్రస్తావన ఉన్నదని అంటూ, పరశురాముడు ఆ ప్రాంతానికి ఆ పేరు ఎందుకు పెట్టాడో కూడా అమిత్ షా చక్కగా చెప్పుకొచ్చారు.
భారతదేశ సరిహద్దులను ఎవరూ వక్రదృష్టితో చూడలేరని, సూదిమొనంత భూభాగాన్ని కూడా ఆక్రమించుకోలేరని హోంమంత్రి స్పష్టంగా హామీ ఇవ్వడం సంతోషించవలసిన విషయమే. అరుణాచల్‌మీద చైనా కన్నుపడినందున అక్కడ ఏవేవో పేర్లతో వరుసగా కార్యక్రమాలు జరుపుతూ, ఉన్నతస్థాయి నాయకులు, అధికారులు తరచుగా ఇటువంటి పర్యటనలు సాగిస్తూండటమూ మంచిదే. సరిహద్దు సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొని, వివాదాలకు ముగింపు పలకాలన్న అభిలాష చైనాకు లేదన్నది వాస్తవం. అటువంటి పరిష్కారానికే ఆ దేశం సిద్ధంగా ఉండివుంటే నామకరణోత్సవాలతో భారతదేశాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నాలు సాగించేది కాదు. వరుసగా మూడుమార్లు అరుణాచల్‌ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలకు తమ భాషలో పేర్లు ప్రకటించి, మా ‘జంగనన్’లో మీరు ఎలా తిరుగుతారంటూ మనలను ప్రశ్నిస్తూండేది కాదు. సైనికుల చొరబాట్లతోనూ, పేరుమార్పిడి పథకాలతోనూ, కొత్తమ్యాపుల సృష్టితోనూ సరిహద్దు వివాదాలు తీరవని దానికి తెలియపోదు. కానీ, గతంలో దశాబ్దాలపాటు సరిహద్దుల్లో ఒక్క బుల్లెట్ కూడా పేలని వాతావరణం ఇప్పుడు లేదు. అమెరికాతో మన సైనిక సాన్నిహిత్యం హెచ్చుతున్నకొద్దీ చైనాతో మనకు ఊప్పూనిప్పూ తప్పదు. గతకాలపు చైనా అధినేతల వైఖరికి భిన్నంగా జిన్‌పింగ్ వ్యవహరిస్తూండటం చాలా దేశాలతో చైనాకు ఘర్షణ తెస్తున్నది.
మా భూభాగం అని చైనా అంటున్నప్పుడల్లా మనం దీటుగా జవాబు ఇస్తున్నమాట నిజం. కానీ, ఇటీవల భూటాన్ ప్రధాని విదేశీమీడియాతో చేసిన వ్యాఖ్యలు మారుతున్న పరిస్థితులకు అద్దంపడుతున్నాయి. అనేక సంవత్సరాలుగా భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలకు, గత ఏడాది తీవ్ర ప్రతిష్టంభనకు కారణమైన డోక్లామ్ విషయంలో భూటాన్ వైఖరిని ఆయన ప్రకటించారు. డోక్లామ్‌లో జరిగింది చొరబాటు కానేకాదనీ, సమస్య పరిష్కారంలో చైనా కూడా భాగస్వామేనన్నది ఆయన వ్యాఖ్యల సారాంశం. భూటాన్‌లోని కొన్ని భూభాగాలు చైనా వశం అయిపోతూ, జరుగుతున్నవి చొరబాట్లు కావనో, మా భూభాగాలు కావనో భూటాన్ సమర్థించుకుంటూ వస్తున్న తరుణంలో మనం అన్ని దిక్కులా మరింత అప్రమత్తం కావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
నామకరణాలతోనూ, చొరబాట్లతోనూ ఇతరదేశాలను ఊపిరితీసుకోనివ్వని పరిస్థితుల్లోకి చైనా నెడుతోంది. లద్దాఖ్‌లో అగ్గి ఆరకముందే అరుణాచల్‌లో సమస్యలు సృష్టిస్తున్నది. సరిహద్దులను అతిక్రమించి ఒక్కో అంగుళం కబళించడం, లోయలను స్వాధీనం చేసుకోవడానికి భౌతికదాడులకు పాల్పడటం, పర్వతశిఖరాలమీద అధునాతన వ్యవస్థలు ఏర్పాటు చేసుకొని భారతదళాల కదలికలను నియంత్రించడం ద్వారా చైనా తాను అనుకున్నది ఎంతోకొంతమేర చేయగలుగుతోంది. ఒకసారి దానిచేతిలోకి పోయిన భూభాగాన్ని పూర్తిగా పునఃస్వాధీనం చేసుకోవడం అసాధ్యమైపోతోంది. తూర్పు లద్దాఖ్ లో గతంలో భారతసైనికుల గస్తీలో ఉన్న చాలా ప్రాంతాల్లో ఇప్పుడు చైనాకు ఆగ్రహం కలుగుతుందన్న అనుమానంతో మనం గస్తీ తగ్గించేశామన్న విమర్శలున్నాయి. జులైలో జరగబోయే జి20 శిఖరాగ్రసదస్సును ఉద్రిక్తతలు తగ్గించుకోవడానికి ఉభయదేశాలు వాడుకుంటే తప్ప పరిస్థితుల్లో మార్పురాదు.