ఇవేమి హత్యలు?

ABN , First Publish Date - 2023-06-09T02:32:32+05:30 IST

ఫిలిప్పీన్స్‌కు ఏడాది కిందటి దాకా అధ్యక్షుడిగా ఉన్న రొద్రిగో దుతెర్తె మాదకద్రవ్యాల అదుపు పేరుతో ఎన్ని వేల మందిని హత్య చేయించాడో లెక్కలేదు. రుజువులు అక్కరలేదు,...

ఇవేమి హత్యలు?

ఫిలిప్పీన్స్‌కు ఏడాది కిందటి దాకా అధ్యక్షుడిగా ఉన్న రొద్రిగో దుతెర్తె మాదకద్రవ్యాల అదుపు పేరుతో ఎన్ని వేల మందిని హత్య చేయించాడో లెక్కలేదు. రుజువులు అక్కరలేదు, అనుమానితుడి ఆనవాళ్ల నిర్ధారణా అక్కరలేదు, చంపాలని అనిపిస్తే చాలు చంపేయడమే. అర్ధరాత్రుళ్లు మనీలా నగరంలో స్వయంగా గస్తీ తిరుగుతూ ఆయన కూడా డ్రగ్స్ దందాలలో తిరిగే కుర్రవాళ్లను చంపిపారేసేవాడు. అతను ఫిలిప్పీన్స్‌ను పాలించిన కాలం 2016 నుంచి 2022 దాకా. ప్రపంచమంతా ఇటువంటి జనరంజక నియంతలు, చట్టాలను ఖాతరు చేయని చండశాసనులు చెలరేగిపోతున్న కాలం. ఎంతటి అణచివేత చేసినా, ప్రజలు పాలకులకు జేజేలు కొట్టిన కాలం.

ఆదిత్యనాథ్ యోగికి కూడా దుతెర్తె లాగా ప్రసిద్ధి పొందాలని ఉందేమో అనిపిస్తుంది. శ్రీరాముడిని తుపాకిరాముడిగా ఊహించుకోవడం తెలుగు సినిమాలకు సాధ్యపడుతుందేమో కానీ, రాజకీయ సామాజిక రంగాలలో అటువంటి కల్పన కూడా ప్రమాదకరమే! కానీ, సర్వసంగ పరిత్యాగి వలె కాషాయాంబరధారి అయిన యోగి పిస్టల్ పట్టుకుని కులాసాగా పోజిచ్చే వ్యంగ్య చిత్రాలు అనేకం వచ్చినా ఆయన ఆగ్రహించకపోగా, దానినొక ప్రశంస వలె ఆనందించారు. అభిరాముడిని, ఆనందరాముడిని ఆరు పలకల కండలతో భీకరబలశాలిగా చిత్రించే రోజులు వచ్చినప్పుడు, సాధువుల పాలనలో నిర్దాక్షిణ్యత పెరిగిపోవడాన్ని అర్థం చేసుకోవచ్చు.

ఉత్తరప్రదేశ్‌లో మాఫియా, గూండా సంస్కృతి మీద యోగి యుద్ధం చేస్తున్నానంటున్నారు. ఈ ఆరేళ్ల పాలనలో వేలాది ఎన్‌కౌంటర్లు జరిగాయి. నూటాయాభై మందికి పైగా గ్యాంగ్‌స్టర్స్ ఈ ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. యోగి మొదటి హయాంలో, అంటే 2017 నుంచి 2022 మధ్యలో 41 మంది పోలీసు కస్టడీలోనే మరణించారు. చట్టాలను, నియమాలను ఖాతరు చేయకుండా తాననుకున్నదే న్యాయం అన్న రీతిలో యోగి వ్యవహరిస్తున్న తీరుకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ఎన్‌కౌంటర్ హత్యలు జరిగినప్పుడల్లా జయజయ ధ్వానాలు చేసేవారున్నారు. ఆయన కాఠిన్యమే దేశాన్ని భద్రంగా ఉంచుతుందని గట్టిగా నమ్మేవారున్నారు.

గుజరాత్‌లో కూడా 2002 అనంతర పరిణామాలలో వరుసగా ఎన్‌కౌంటర్లు జరిగేవి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా నిందితులను తరలించుకువచ్చి గుజరాత్‌లోనే విచారణలు జరిపేవారు. పెద్ద పెద్ద కుట్రకేసులు రూపొందేవి. బహుశా, మోదీ అడుగుజాడల్లో, ఆయనను మించిన ఆచంట మల్లన్నవలె యోగి వ్యవహరిస్తున్నాడా? నియంతృత్వ జనరంజకత్వానికి గిరాకీ పెరుగుతున్నందున, లక్నో నుంచి ఢిల్లీ మరింత చేరువ అయినందున, యోగి ఆ మార్గంలో పయనిస్తున్నారా?

బుధవారం నాడు లక్నోలో ఒక కేసు విచారణ కోసం జైలు నుంచి పోలీసు భద్రతతో వచ్చిన సంజీవ్ మహేశ్వరి అలియాస్ జీవా అనే ఒక నిందితుడిని, కోర్టు ఆవరణలోనే నల్లకోటు ధరించిన దుండగుడొకడు కాల్చి చంపాడు. ముక్తార్ అన్సారీ అనే రాజకీయ, మాఫియా నాయకుడి అనుచరుడు ఈ జీవా. అనేక హత్య కేసులలో ముద్దాయి. రెండు నెలల కిందట అతిఖ్ అహ్మద్‌ను, అతని సోదరుడిని పోలీసుల సంరక్షణలోనే పాత్రికేయులుగా అభినయించిన దుండగులు ఒక ఆస్పత్రిలో కాల్చేశారు.

చనిపోయినవారి గురించి, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే బాధపడి ఉంటారు. కానీ, ఈ ప్రక్రియల్లో దెబ్బతిన్న చట్టబద్ధ పాలన గురించి అందరం కలవరపడవలసి ఉన్నది. చనిపోయిందెవరన్నది కాదు ప్రశ్న, అంతటి భద్రతలో ఉన్న వ్యక్తి హత్యకు గురికావడం సమస్య- అని యుపి ప్రతిపక్ష నాయకుడు అఖిలేశ్ యాదవ్ అన్నది నిజం. నేరాలను అదుపుచేయడానికి నేరపూరిత విధానాలే అవసరమా? అన్నది ఆలోచించాలి. అహ్మద్ సోదరుల విషయంలో కానీ, సంజీవ్ జీవా విషయంలో కానీ ప్రభుత్వమే చాకచక్యంగా వారిని నిర్మూలించిందని, న్యాయప్రక్రియలోని లొసుగుల ఆధారంగా తప్పించుకుని తిరిగేవారికి ఇటువంటి మరణాలే జవాబు అని జనం నమ్ముతున్నారు. అది వ్యవస్థల మీద అపనమ్మకాన్ని, అధర్మ పద్ధతుల మీద ఆకర్షణను పెంచే పరిణామం. ఇది మన ప్రజాస్వామ్యానికి, చట్టబద్ధ పాలనా సూత్రానికి వ్యతిరేకం.

దుష్ట శిక్షణ కోసం ఇటువంటి మార్గంలో వెళ్లవలసి వస్తున్నదని సమర్థించుకునే వారు, నిజంగా పక్షపాత రహితంగా నేరస్థులను ఎంపిక చేస్తున్నారా? కొన్ని రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్నవారిని, కొన్ని సామాజిక వర్గాల వారిని లక్ష్యంగా పెట్టుకుంటున్నారన్న ఆరోపణలు వింటూనే ఉన్నాము. సమాజ్‌వాదీ పార్టీలో ఉన్న మాఫియా కూటములను కూడా నిర్మూలిస్తున్నారన్న విమర్శా ఉన్నది. మరి అధికార భారతీయ జనతాపార్టీకి అనుబంధంగా నేరచరితులే లేరా? యుపికే చెందిన నేరచరితుడైన ఎంపి బ్రిజ్ భూషణ్ విషయంలో కేంద్రప్రభుత్వం ఎందుకు రక్షణ కవచంగా నిలబడింది?

Updated Date - 2023-06-09T02:32:39+05:30 IST