ఆ పిల్లలను ఎవరు చంపారు?
ABN , First Publish Date - 2023-10-19T01:03:58+05:30 IST
యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన పదిహేడేళ్ళనాటి నిఠారీ వరుస హత్యల విషయంలో అలహాబాద్ హైకోర్టు సోమవారం వెలువరించిన తీర్పు తీవ్ర విస్మయాన్ని కలిగిస్తున్నది...
యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన పదిహేడేళ్ళనాటి నిఠారీ వరుస హత్యల విషయంలో అలహాబాద్ హైకోర్టు సోమవారం వెలువరించిన తీర్పు తీవ్ర విస్మయాన్ని కలిగిస్తున్నది. గతంలో ట్రయల్ కోర్టు దోషులుగా నిర్ధారించి, ఏకంగా మరణశిక్ష విధించిన ప్రధాన నిందితులు ఇద్దరూ నిర్దోషులని హైకోర్టు ప్రకటించింది. ఈ తీర్పుతో సురేందర్ కోలీ, మనీందర్ సింగ్ పంథేర్ అనే ఆ ఇద్దరు నిందితుల మరణశిక్ష రద్దయి, నిర్దోషులుగా మారిపోయారు.
ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలోని నిఠారీ గ్రామంలో 2005–06లో చోటుచేసుకున్న దారుణం ఇది. అప్పటికే ఆ ప్రాంతంలో చాలామంది పిల్లలు, మహిళలు అదృశ్యమైపోయిన నేపథ్యంలో, 2006 డిసెంబరులో స్థానిక వ్యాపారి పంథేర్ ఇంటి సమీపంలోని ఒక మురికికాల్వలో మానవ అవశేషాలు కొన్నింటిని స్థానికులు గుర్తించి పోలీసులకు తెలియచేశారు. ఆ నిరుపేదల ఫిర్యాదులను అప్పటివరకూ పట్టించుకోకుండా, మిస్సింగ్ కేసులు రిజిస్టర్ చేయకుండా ఊరుకున్న యూపీ పోలీసులు దీనితో విధిలేక రంగంలోకి దిగాల్సివచ్చింది. పంథేర్ ఇంటివెనుక భాగంలో తవ్వకాలు జరిపినప్పుడు అనేకమంది పిల్లల, యువతుల అస్తిపంజరాలు బయటపడ్డాయి. ఇవన్నీ ఆ ప్రాంతంలో ఏడాదిన్నర కాలంగా కనిపించకుండా పోయినవారివేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం సీబీఐ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగినప్పుడు నిందితుల దారుణాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. పంథేర్ ఇంట్లో పనిచేసే సురేందర్ కోలీ ఆ నిరుపేద పిల్లలకు స్వీట్లు, చాక్లెట్లు ఆశచూపి, ఇంట్లోకి రప్పించేవాడని, అనంతరం వీరిరువురూ వారిని హత్యచేసి, మృతదేహాలపై లైంగికదాడి చేసేవారని సీబీఐ నిర్ధారించింది. మొత్తంగా వీరిద్దరిపైనా 19 కేసులు నమోదైతే, సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో మూడింటిని మొదట్లోనే మూసివేశారు. మిగతావాటిలో పన్నెండు కేసుల్లో ట్రయల్ కోర్టు సురేందర్ కోలీని దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. మనీందర్ సింగ్ పంథేర్ మీద మిగతా కేసులన్నీ వీగిపోయి, రెండింటిలో ఉరిశిక్షపడింది. ఈ పద్నాలుగు కేసుల్లో తమకు విధించిన మరణశిక్షను సవాలు చేస్తూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించిన వీరిద్దరూ, ఇప్పుడు నిర్దోషులుగా బయటపడ్డారు.
మరి, మా పిల్లలను ఎవరు చంపారు? అన్న స్థానికుల ప్రశ్నకు ఈ తీర్పు అనంతరం జవాబు చెప్పడం కష్టం. ఈ దారుణకాండకు సంబంధించిన దర్యాప్తు కలగాపులగంగా, కట్టుకథనాలతో, సరైన సాక్ష్యాధారాలు లేకుండా జరిగిందంటూ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సీబీఐని తీవ్రంగా విమర్శించింది. అరెస్టులు, సాక్ష్యాల సేకరణ, నేరాంగీకారం ఇత్యాది ప్రక్రియల్లో ఏ మాత్రం మనసుపెట్టకుండా దర్యాప్తు సంస్థ వ్యవహరించిందని కోర్టు వ్యాఖ్యానించింది. సీబీఐ ఎప్పటికప్పుడు వాదనలు మారుస్తూండటం, ప్రధానంగా కోలీ నేరాంగీకారంమీదే కేసులన్నీ ఆధారపడివుండటం, అది కూడా ఇదమిత్థంగా కాక, నిరంతరం మారుతూండటం న్యాయస్థానానికి సమంజసంగా కనిపించలేదు. కోలీ కథనం, నేరాంగీకారం అధారంగానే ఘజియాబాద్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం హత్య, అత్యాచారం, అపహరణ ఇత్యాది అంశాల్లో అతడిని దోషిగా నిర్ధారించి ఉరిశిక్ష విధిస్తే, ఇప్పుడు ఆ దర్యాప్తు ప్రక్రియనే హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టడం విచిత్రం. దేశం గర్వించదగ్గ దర్యాప్తు సంస్థ నిఠారీ దారుణంలో ఉపరితలంలో వ్యవహరించిందనీ, వీరిరువురిపై కేసు బిగించే విషయంలో అంతగా శ్రద్ధచూపలేదని విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది.
ఇంతటి ఘోరం వెలుగుచూసిన తరువాత కూడా అప్పటి ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సోదరుడు, క్యాబినెట్ మంత్రి అయిన శివ్‌పాల్ యాదవ్ దీనిని ‘ఛోటీ మోటీ ఘటనా’ అని తీసిపారేశారు. స్థానికుల ఫిర్యాదులు నమోదు చేసుకొనే విషయంలో యూపీ పోలీసులు ప్రదర్శించిన నిర్లక్ష్యం మరెంతో మంది పేదల ప్రాణాలు పోవడానికి కారణమైంది. మనీందర్ సింగ్ పంథేర్‌కు ఉన్న ఆర్థిక, రాజకీయ ప్రాబల్యం ఆదినుంచీ ఈ కేసులపైన పనిచేశాయి. ఒక భయానక దారుణంపై సాగిన దర్యాప్తు లోపభూయిష్టంగా ఉండటంతో బాధితులకు అంతిమంగా న్యాయం దక్కకుండా పోయింది. నిఠారీ మాత్రమే కాదు, దేశాన్ని కుదిపేసిన ఇటువంటి చాలా కేసులు ఇలా ముగిసిపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఏళ్ళ తరబడి దర్యాప్తు జరిగి, న్యాయస్థానాల్లో వాదోపవాదాల ప్రక్రియ మరికొంత కాలం సాగి, చివరకు దర్యాప్తు సంస్థల పనితీరు, ప్రక్రియలో లోటుపాట్ల కారణంగా తీవ్రమైన కేసులు సైతం న్యాయస్థానాల్లో నిలవలేకపోవడం విచారకరం.