బీభత్స విషాద హాస్య నాటకం!
ABN , First Publish Date - 2023-04-27T01:43:45+05:30 IST
పెద్దలను కొట్టి పేదలకు పంచడం ఒక రాబిన్ హుడ్ ఆదర్శం, కాకులను కొట్టి గద్దలకు పెట్టడం దుర్మార్గుల ఆదర్శం.
పెద్దలను కొట్టి పేదలకు పంచడం ఒక రాబిన్ హుడ్ ఆదర్శం, కాకులను కొట్టి గద్దలకు పెట్టడం దుర్మార్గుల ఆదర్శం. కాకులను కొట్టి కాకులకే పెట్టడం తాజా రాజకీయ ఆదర్శం. వాళ్ల రిజర్వేషన్లు తీసేసి, వీళ్లకిస్తాను, ఇదే నా ఎన్నికల వాగ్దానం, అని ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఒక పదేళ్ల కిందట అనగలిగేవాడా? రాహుల్ గాంధీ లాగానో, దేశంలోని అనేకమంది ముఖ్యమంత్రులలాగానో రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని అడగకుండా, ఒకరిని తీసివేసి, ఇంకొకరి ఖాతాలో వేస్తామనడం ఎందుకు? ఒకరికొకరిని శత్రువులను చేయడానికే కదా? ఒకరి దృష్టిలో ఒకరు తమ అవకాశాలను అపహరిస్తున్నవారిగా మారడానికే కదా? కానీ, సాక్షాత్తూ ఈ దేశ హోంమంత్రి వేలాది జనం ముందు, కోట్లాది పరోక్ష ప్రేక్షకుల ముందు, శ్రోతల ముందు ఆ మాట అనగలడు. ఆయన పార్టీ కర్ణాటకలో ఆ వాగ్దానంపై విధాన నిర్ణయమే తీసుకున్నప్పుడు, రాష్ట్రస్థాయి నాయకుడే ప్రకటించారు. ఆ నిర్ణయం సుప్రీంకోర్టులో విచారణకు నిలిచిన సమయంలో, జాతీయస్థాయి నాయకుడే దాన్నొక అస్త్రం లాగా, ఒక వరంలాగా ఝళిపించారు. ప్రజల మధ్య ద్వేషాన్ని రగిలించే మాటలను ఒక బాధ్యతాయుత వ్యక్తి మాట్లాడవచ్చునా?
లక్ష్మణరేఖలను ఉల్లంఘించడంలో హోంమంత్రిది రెండో స్థానమే. ప్రథమస్థానంలో ప్రధానమంత్రే ఉన్నారు. సివిల్ సర్వీసుల దినోత్సవం రోజున సందేశమిస్తూ ఆయన ఏమన్నారు? ప్రభుత్వాలు ఎట్లా ఖర్చు చేస్తున్నాయో, ఎవరికి ప్రయోజనం చేకూరుస్తున్నాయో సివిల్ సర్వీసు అధికారులు ఒక కన్నువేసి ఉంచాలట. రాష్ట్రాలలో ఒక ప్రభుత్వం పోయి మరో ప్రభుత్వం వచ్చినప్పుడు జరిగే మార్పులను గమనించాలట. ఎందుకంటే, కొత్తగా ఎన్నికయ్యే ప్రభుత్వానికి ఉండే వ్యాపార మిత్రుల ప్రయోజనాలు ఆ మార్పులలో ఉండవచ్చునట. ప్రభుత్వాల మీద ప్రతిపక్షాల నిఘా, పౌరసమాజం నిఘా ప్రజాస్వామ్యంలో సహజమైనవి, అవసరమైనవి. బ్యూరోక్రాట్ల నిఘా ఏమిటి? అంటే ఇప్పుడు కొనసాగుతున్న దర్యాప్తు ఏజెన్సీల విజృంభణకు ప్రధాని ఒక సైద్ధాంతిక నిర్వచనం సమకూరుస్తున్నారా? 2047 దాకా, కొనసాగవలసిన అమృతకాల ప్రయాణంలో సివిల్ అధికారుల దోహదం అవసరమని కూడా మోదీ వారికి ఉద్వేగపూరిత ప్రోత్సాహ వాక్యాలు పలికారు. దేనికంటే కూడా దేశ ఐక్యత, సమగ్రతలను కాపాడడమే ముఖ్యమని కూడా మోదీ వక్కాణించారు. అమిత్ షా చేవెళ్లలో మాట్లాడిన మాటలు ఐక్యతను కాపాడే కోవలోకే వస్తాయా?
అమిత్ షా మరో మాటన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వానికి స్టీరింగ్ ముందు ఒవైసీ ఉన్నారని. సరే, బిజెపి ఎంతటి స్థాయికి వెళ్లినా, సమస్థాయి పక్షంగా ఎంఐఎంనే భావిస్తుంది కాబట్టి, ఆ వ్యాఖ్యను అర్థం చేసుకోవచ్చు. బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముందు నుంచో వెనుకనుంచో నడపడానికి ఎంఐఎంకు అంతో ఇంతో బలమూ, రెండో మూడో శాతం ఓట్లూ, ఓ ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు. ఒక్కశాతం ఓటు కూడా లేకుండా, బిజెపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది కదా అని అమిత్ షాకు ఎదురు సవాల్ విసిరేవాళ్లు కనిపించడం లేదు.
ప్రధాన పక్షాలు రెండు, మరో వర్ధమాన ప్రధానపక్షం భారతీయ జనతా పార్టీ కరుణాకటాక్ష వీక్షణాల మీద తమ భవితవ్యం ఆధారపడి ఉన్నదని నమ్ముతున్నాయి. ఎవరు అధికారంలోకి వచ్చినా మనకేమి చింత అన్నట్టు కేంద్ర బిజెపి ఉంటున్నది, అధిష్ఠానం ఏమి చెప్పినా, రాష్ట్ర బిజెపి తనకు తోచిందే చేస్తుంది.
ప్రజల్లోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోయిందనుకున్నప్పుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు బిజెపితో ఏమి అవసరం? కేంద్రపెద్దలు జగన్‌ను అదుపు చేయకపోతే, ఎన్నికలు సజావుగా జరగకపోతే, ప్రజాభిప్రాయం ఫలితాలలో వ్యక్తంకాకపోతే? ఇన్ని సందేహాలున్నాయి, కేంద్రంలోని మహానీతిమంతమైన సత్యకాలపు ప్రభుత్వం మీద! బిజెపితో నిమిత్తం లేకుండా టిడిపి, జనసేన కలిసి ప్రభుత్వ వ్యతిరేక ప్రభంజనం సృష్టించాలని కోరుకుంటున్నవారు తక్కువేమీ లేరు. కానీ, పరిస్థితులు అనుకూలంగా కనిపించడం లేదు! నోటా కంటె తక్కువ ఓట్లు వచ్చే పార్టీని మంచి చేసుకోవడానికి ప్రయత్నించవలసి రావడమే, దుస్థితికి అద్దం పడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిజెపి చేసిన, చేస్తున్న అన్యాయానికి ఎన్నికల ఎజెండాలో ఇప్పుడిక స్థానం ఉండదు. ఆత్మరక్షణ కోసం చంద్రబాబు చేస్తున్న విన్యాసంలో ఆయనకూ, రాష్ట్రానికీ, మొత్తంగా దేశానికీ కూడా ప్రమాదకర అంశాలు ఉన్నాయి.
అయితే, చంద్రబాబు మాట్లాడేటప్పుడు తన జాగ్రత్తలో తానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడుతున్న సానుకూలతను దెబ్బతీయకుండా, భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి ఒక సందేశం ఇవ్వడానికి ఆయన ప్రయత్నించారు. గతంలో ఏ కారణంతో బిజెపికి దూరమైందీ చెప్పారు కానీ, ఆ విషయంలో వైఖరి మారినట్టు చెప్పలేదు. అతి జాగ్రత్తగా మోదీ జాతీయ అభివృద్ధి విధానాలు మాత్రమే నచ్చాయి అన్నారు. పంక్తుల మధ్య ప్రతిపదార్థం అర్థమయ్యేవారు, ఎటువైపు వారు అటు వ్యాఖ్యానించుకోవచ్చు.
సానుకూల వచనాలు చెప్పడానికి చంద్రబాబు ఎంచుకున్న ఒకానొక అంశం, మోదీ 2047 అమృతకాల్ అజెండా. అంతే కాదు, ప్రపంచం దృష్టిలో భారత్ ప్రతిష్ఠను పెంచినందుకు కూడా మోదీని బాబు ప్రశంసించారు. ఈ ప్రతిష్ఠకు మరో కోణం కూడా ఉంది. బ్రిటన్ నుంచి ప్రచురితమయ్యే ‘అబ్జర్వర్’ పత్రిక ఈ మధ్య ఒక సంపాదకీయంలో ప్రపంచానికీ, భారత్ ప్రజాస్వామ్యానికి ఉండే సంబంధాన్ని పరామర్శించింది.
బిబిసి గొడవ తరువాత, మరో బ్రిటిష్ సమాచార సాధనం నుంచి ఈ విమర్శ రావడం విశేషం. అయితే, అది యుకెలోను, ఇంటర్నెట్‌లోనూ అందుబాటులో ఉండే ఇంగ్లీషు పత్రిక కావడం వల్ల పెద్ద వివాదం కాలేదు. ఇన్‌కమ్‌టాక్స్ దాడులు చేయడానికి భారత్‌లో ఆ పత్రిక బ్రాంచి ఏదీ ఉన్నట్టు లేదు.
మోదీ పరిపాలనలో ఎటువంటి నియంతృత్వ, పెత్తందారీ పోకడలు పెరిగిపోయాయో, సామాజిక వాతావరణం ఎంతగా కలుషితమైందో ‘అబ్జర్వర్’ తన సంపాదకీయంలో చర్చించింది. అమెరికా, ఇంగ్లండ్ ప్రభుత్వాలు భౌగోళిక రాజకీయాల లెక్కలు వేసుకుని మోదీ ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి వెనుకాడుతున్నాయని విమర్శించింది. ఆ పత్రిక ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేసింది. ‘భారత్ ప్రజాస్వామ్యం ప్రపంచపు ఆస్తి. దానికి నష్టం జరిగితే ప్రపంచమే నష్టపోయినట్టు’.
మోదీ ప్రభుత్వం మీద వస్తున్న విమర్శల గురించి అవగాహన ఉన్నప్పటికీ, రష్యా, చైనాలతో వ్యవహారంలో కలసివస్తారనే ఆశతో అమెరికా బ్రిటన్‌లు చూసీ చూడనట్టుగా ఉంటున్నాయని ‘అబ్జర్వర్’ వ్యాఖ్యానించింది.
బిజెపి తరహా రాజకీయాలను ఇష్టపడకపోయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లోని అధికారప్రతిపక్షాలు ఆ పార్టీ సాన్నిహిత్యం కోసం ప్రయత్నించడం కూడా భయంతోనో, ఆశతోనో మాత్రమే! చెడిపోతే, నిద్రావస్థలో ఉన్న కేసులకు ప్రాణం వస్తుందేమోనని ఒకరికి భయం, దగ్గరగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం హద్దుమీరకుండా రక్షణ దొరుకుతుందని మరొకరికి ఆశ.
పోలీసులు ఆమెపై దురుసుగా ఉన్నారో, ఆమె పోలీసుల మీద నోరూ చేయీ పారేసుకున్నారో కానీ, షర్మిల ఒక ప్రభావవంతమైన సన్నివేశాన్ని సృష్టించారు. ఆమె వైఖరిని తెగువ సాహసం అంటున్నవాళ్లున్నారు, రాజకీయ కుటుంబ నేపథ్యం వల్ల ఏర్పడిన సులువు అనుకుంటున్నవారున్నారు, సాధికారతను సాధించుకునే మహిళ ఆత్మాభిమాన వ్యక్తీకరణ అని మెచ్చేవారున్నారు. భూస్వామ్య అహంకారపు ఛాయలు ఉన్నాయని అనేవారూ ఉన్నారు. ఏదో ఒకటో అన్నీనో కావచ్చు కూడా.
ఆమెని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. తండ్రి కానీ, అన్న కానీ తెలంగాణ రాష్ట్రవాదానికి తీవ్ర వ్యతిరేకులు. 2009 ఎన్నికలలో రాజశేఖరరెడ్డి మళ్లీ గెలవడంలో తోడ్పడిన ముఖ్యాంశాలలో తెలంగాణ రాష్ట్రవాదం గురించి ఆంధ్రలో చేసిన ‘వీసా వ్యాఖ్యలు’ ఒకటి. ఆమె ఆరంభ రాజకీయ సాధన అంతా అన్నకు బదులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేసిన పాదయాత్రలు, అనంతరపు ప్రచారయాత్రలు. ఇంతటి ప్రతికూల నేపథ్యం నుంచి వచ్చి, తెలంగాణలో రాజకీయ ఆచరణ ఆరంభించడం విశేషం. ఎవరో వదిలిన బాణమని, ఎవరికో బీ టీమ్ అని ఆరోపణలు ఉన్నా నిలకడగా తాను అనుకున్నది చేసుకుంటూ పోతున్నది షర్మిల. ఆమె అరెస్టు సన్నివేశం తరువాత చాలా మందికి అనిపించి ఉండాలి, షర్మిల లాగా పట్టుదల, తెగింపు, శ్రమకు ఓర్చగలిగే లక్షణం ఉండి ఉంటే, తెలంగాణలో ప్రతిపక్షం పరిస్థితి ఇట్లా ఉండేది కాదు కదా?
షర్మిల వంటి శక్తుల ఎదుగుదలకు తెలంగాణలో అవకాశం లేని పరిస్థితి మునుపు ఉండేది. చేజేతులా టిఆర్‌ఎస్ అందుకు ఆస్కారం కల్పించింది. బిఆర్ఎస్‌గా మారిపోయింది. రెండు ఎన్నికలలో తనను గెలిపించిన తెలంగాణవాదాన్ని వదులుకుని, ఉద్యమ నేపథ్యానికి తనకు ఇక రుణం తీరిపోయిందన్నట్టు వ్యవహరిస్తున్న బిఆర్ఎస్ అధినాయకుడు, తన సంక్షేమ, అభివృద్ధి విధానాల ప్రాచుర్యాన్ని పరీక్షించుకోవడానికి పక్కరాష్ట్రాలలో ప్రయత్నిస్తున్నారు.
ఆకాశమంత ఎత్తున్న అంబేడ్కర్ విగ్రహాన్ని స్థాపించిన అతిశయంతో ఔరంగాబాద్‌లో కెసిఆర్ పెద్ద బహిరంగ సభ పెట్టారు. ఒక కొత్త గ్రూపు అవతరిస్తే, అధికార సమీకరణలే తలకిందులయ్యే స్థితిలో ఉన్న మహారాష్ట్ర రాజకీయరంగంలో బిఆర్ఎస్ భవితవ్యం ఏమిటో తెలియదు. లీకేజి సమస్యలను కాలానికి వదిలిపెట్టి, రాజకీయ వీధులను జాతీయ బిజెపి నేతలకు, పాదయాత్రికులకు వదిలి కెసిఆర్ మాత్రం రాజసూయం కొనసాగిస్తున్నారు.
బహుశా, కర్ణాటక ఎన్నికల దాకా సన్నివేశం మారదు, ఆ తరువాత మారకుండా ఉండదు!
కె. శ్రీనివాస్