ఆత్మవంచన మాని, ఆత్మవిమర్శ చేసుకోండి!
ABN , First Publish Date - 2023-12-07T03:10:52+05:30 IST
ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఈ పార్టీ గెలిచింది. ఒక ప్రభుత్వం పోయింది, మరొక ప్రభుత్వం వచ్చింది. ఇంత మాత్రమే చెబితే సగం సగం చెప్పినట్టే...
ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఈ పార్టీ గెలిచింది. ఒక ప్రభుత్వం పోయింది, మరొక ప్రభుత్వం వచ్చింది. ఇంత మాత్రమే చెబితే సగం సగం చెప్పినట్టే. మునుపటి అధికారపార్టీని ప్రజలు ఓడించారు. అందువల్ల ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇట్లా చెబితే సత్యానికి దగ్గరగా ఉంటుంది.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నారు. పదవి అంటే అధికారమే. అందనంత అందలమే. కానీ, రేవంత్ కిరీటంలో రత్నాలూ వజ్రాల కంటె ముళ్లే ఎక్కువ. బొటాబొటి మెజారిటీ, పోటీదారులతో పోరు. పదేళ్ల ఆశాభంగాల తరువాత ఇక నిరీక్షించలేని ప్రజలు, అనేక ఓటముల మధ్య ఆలంబన కోరుకునే అధినాయకత్వం, కాచుకుకూర్చున్న ప్రధాన ప్రతిపక్షం, చిన్నసంఖ్యే అయినా చిరాకుపెట్టగల మూడో పార్టీ, ఆదాయాలకూ అవసరాలకూ నడుమ చేయవలసిన కత్తిమీద సాము.. దృశ్యం సామాన్యంగా లేదు. రానున్న రోజులు రసవత్తరంగా ఉండబోతున్నాయి!
అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీతో సౌకర్యం ఏమిటంటే, సందడి ఎప్పుడూ తగ్గదు. ప్రతిపక్షం హడావిడి లేకుంటే సొంత కుంపట్లతోనే వేడి రాజుకుంటుంది. నాయకుడి ఎంపిక తరువాత, మంత్రివర్గం కూర్పు, అసమ్మతులు, అలకలు, బుజ్జగింపులు, తొలి సంతకాలు, ఇతర రాజకీయ నియామకాలు వగైరావగైరాతో రానున్న కొన్ని మాసాలు కొత్తకాపురపు కలకలం గ్యారంటీ. మీడియాకు కావలసినంత మేత. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్‌కు ఇదంతా అనువైన సన్నివేశం. ఈ కోలాహలం నడుమ పాత ప్రభుత్వపు నేరాలు దోషాలు పరాజయకారణాలు అన్నీ నెమ్మదిగా విస్మృతిలోకి పడిపోతాయి. ఏమీ నేర్చుకోనవసరం లేకుండానే ప్రతిపక్ష పాత్రలోకి సగౌరవంగా ఒదిగిపోతారు.
ఒకపార్టీని ఓడించి, మరొకదానిని గెలిపించారంటేనే, ఈ మార్పు ప్రధానంగా ప్రతికూల ఓటు ద్వారా జరిగిందని అర్థం. అలాగని, కాంగ్రెస్ పార్టీ, దాని నాయకులు, యంత్రాంగం చేసిందేమీ లేదని కాదు. ప్రతికూలతను ఓటు ద్వారా తమవైపు మళ్లించగలిగిన ఘనత వారిదే. కానీ, ముడిసరుకు మాత్రం ప్రజలలో ఏర్పడిన విముఖతే. దానిని పాత అధికారపార్టీ నిరాకరించినా, కొత్త అధికార పార్టీ కాదన్నా ప్రజాతీర్పు స్ఫూర్తిని పోగొట్టుకున్నట్టే. ఏయే కారణాలు కేసీఆర్ ప్రభుత్వం మీద అయిష్టాన్ని కలిగించాయో, ఆ కారణాలకు నివృత్తి జరగాలి. కొత్త ప్రభుత్వం అవే తప్పులు చేయకుండా కూడా ఉండాలి. కాబట్టి, భారత రాష్ట్ర సమితి పరాజయానికి కారణాల మీద విస్తృతంగా చర్చ జరగాలి. ఆ పార్టీలో జరిగినా జరగకున్నా సమాజంలో తప్పనిసరిగా జరగాలి.
స్వయంకృతాపరాధాలే ఓటమికి కారణాలని అంగీకరించగలగడం చిన్న విషయం కాదు. వ్యక్తులకే కాదు, సంస్థలకు కూడా తప్పులను ఒప్పుకోవడానికి అహం, పంతం అడ్డువస్తాయి. ఏవో కారణాలు చెప్పి ఆత్మవంచన చేసుకోవడానికి, పరులను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తారు. బీఆర్ఎస్, దాని యంత్రాంగం ఇప్పుడు, పరాజయ కారణాలను తమలో కాక ‘మరొకచోట’ కనుగొనే ప్రయత్నం చేస్తున్నాయి. ఓట్ల తేడా పెద్దగా లేదని, తీర్పు తెలంగాణ అంతటా ఒకేరకంగా లేదని సన్నాయి నొక్కులు వినిపిస్తున్నాయి. ఇటువంటి బలహీన సమర్థనలు ప్రతి పరాజిత పార్టీ చేస్తూనే ఉంటుంది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్ కూడా అదే పనిచేస్తోంది. ప్రజల ముందు బహిరంగ ఆత్మవిమర్శ చేసుకోవడానికి కమ్యూనిస్టు పార్టీల దగ్గర నుంచి ఏ పార్టీకీ మన దేశంలో మొహం చెల్లదు.
స్థానిక అభ్యర్థుల మీద ఉన్న వ్యతిరేకతే ఓటమికి కారణం తప్ప, పార్టీ అధినాయకత్వం మీద ప్రజలలో ఎటువంటి అయిష్టమూ లేదని ఒక వాదన. ఇండియా టుడే మై యాక్సిస్ సర్వేలో ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు ఎక్కువ ఓట్లు రావడాన్ని అందుకు సమర్థనగా చెబుతున్నారు. బీఆర్ఎస్ ఓటమికి ప్రధానకారణాలలో అనేకమంది సిట్టింగ్ శాసనసభ్యుల మీద ఉన్న వ్యతిరేకత ఒకటి అన్నదానిలో అభ్యంతరం ఎవరికీ లేదు. కానీ, సిట్టింగ్ సభ్యులకు తిరిగి టికెట్లు ఇచ్చింది ఎవరు? ప్రజలు హాహాకారాలు చేస్తున్నా, ఆ అభ్యర్థులనే బలవంతంగా రుద్దింది ఎవరు? తన జనాకర్షణ, పోలింగ్ వ్యూహం ప్రజల అభిమతాన్ని అధిగమించగలవన్న అతి ఆత్మవిశ్వాసం ప్రదర్శించింది ఎవరు? నేరం నాది కాదు, అభ్యర్థులది అనడంలో, నెపం మోపడం తప్ప నిజాయితీ ఎక్కడుంది?
ఏ నాయకత్వమైనా కేవలం అధికారం మాత్రమే కాదు, బాధ్యత కూడా. పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నందుకే పదవుల్లోకి వస్తారు. నాయకత్వంలో విఫలమైనప్పుడు అందుకు బాధ్యత వహించడం కూడా నాయకత్వ ధర్మాలలో ఒకటి. తన వైఫల్యాలను, నిర్లక్ష్యాలను, అవాంఛనీయ వ్యవహార సరళిని బోనులో నిలబెట్టకుండా తప్పించడానికి ఇతరులను, ఇతర కారణాలను నిందించడం అన్యాయం.
నేరాన్ని నాయకుడు ఇతరుల మీదికి నెట్టడం ఎంతటి తప్పో, నాయకుడే ఏకైక పాపాల భైరవుడు అనడం కూడా అంతే తప్పు. పార్టీ అంటే పదిలక్షల వేళ్ల చేయి కదా, అంటాడు ఒక కవి. అంతగొప్ప సమష్టి తత్వం ఉన్న పార్టీ కాకపోవచ్చును కానీ, అరకోటి సభ్యత్వం అయితే ఉన్నది కదా? ఎవరి వంతు బాధ్యతను వారు తీసుకుని తీరాలి కదా, గెలుపైనా ఓటమి అయినా? తానిక ఉద్యమపార్టీని కాదని, నూరుపాళ్లు సాధారణ రాజకీయపార్టీని అని ఆ నాటి తెలంగాణ రాష్ట్రసమితి పదేళ్ల కిందట చెప్పింది. ఫక్తు రాజకీయపార్టీగా, ప్రాంతీయపార్టీగా, ఏకవ్యక్తి కేంద్రిత పార్టీగా, కుటుంబ పార్టీగా కూడా పరిణమించింది. ఇటువంటి పార్టీల్లో సంప్రదింపులకు, సమష్టి నిర్ణయాలకు అవకాశం తక్కువే.
ఓట్లు సమకూర్చగలిగేది అధినాయకుడే అయినప్పుడు, అవకాశాలు ఆశించే అందరూ జీ హుజూర్ అనేవాళ్లే అవుతారు. కానీ, తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ప్రయాణించిన అనేక శ్రేణులు మంచీచెడ్డా తెలిసినవారే కదా, ప్రజాస్వామ్యం ప్రయోజనాలు తెలిసినవారే కదా? ఎందుకు అతి విధేయంగా ఉండిపోయారు? చివరకు పాదాభివందనాలకు కూడా ఎందుకు తెగబడ్డారు? చాప కింద నీరు లాగా ప్రజలలో వ్యతిరేకత వ్యాపిస్తుంటే, నిజం తెలిసి కూడా ఎందుకు చెప్పలేకపోయారు? దేవతావస్త్రాలను ఎందుకు కీర్తిస్తూపోయారు? ఒక నాయకుడు తనను తాను సూపర్ లీడర్‌నని భావిస్తుంటే, పవర్ ఈజ్ నాలెడ్జ్ అనుకుంటూ అందరూ ఎందుకు వంతపాడారు? ఇప్పుడు పార్టీకి తీరని నష్టం జరిగితే, నేరాన్నంతా నాయకుడి వ్యవహారసరళి మీదకు నెట్టివేయడం ఏమి న్యాయం? అనుచరులపాత్ర లేకుండా నాయకుడు ఆధిపత్యాన్ని కానీ, అహంకారాన్ని కానీ చూపగలడా? రెండు చేతులు కలిస్తే కదా చప్పట్లు? నాయకుడి శ్రేయోభిలాషులైనవారు, కష్టాలకు సిద్ధపడి అయినా సత్యాన్ని చెప్పగలగాలి కదా? వినకపోతే బిగ్గరగా అరచి అయినా చెప్పాలి కదా? కేసీఆర్ మంచిచెడ్డలను ధైర్యం చేసి చెప్పినవారు లేకపోలేదు, చెప్పబోయినందుకు ఎడమైనవారు, శిక్షపొందినవారు లేరని కాదు. తక్కినవారెందుకు, చివరి నిమిషం దాకా ప్రియమైన అసత్యాలు చెప్పి నాయకుడిని ఎందుకు మభ్యపెట్టారు? ఇప్పుడు కూడా ప్రజలే తప్పు చేశారని వాదిస్తూ, ఆత్మవిమర్శకు కూడా ఆస్కారం లేకుండా ఎందుకు అడ్డుపడుతున్నారు?
ఎన్నికలంటే రెండు మూడు పార్టీల వ్యవహారం కాదు. ప్రత్యేకించి, నూతన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, ఇవి మామూలు ఎన్నికలు కావు. గత తొమ్మిదిన్నరేండ్ల అధికారపార్టీని ఓడించడానికి ముందు తెలంగాణ సమాజం ఎంతో మథనపడి ఉంటుంది. కేసీఆర్ కానీ, ఆయన పార్టీ కానీ కేవలం పాలకులు మాత్రమే కాదు. అంతకు ముందు దశాబ్దంన్నరపాటు రాష్ట్రసాధన ఉద్యమంలో ముఖ్యపాత్ర వహించిన శక్తులు, ప్రజలు ఉద్వేగపూరిత అనుబంధాన్ని నిర్మించుకున్న రాజకీయ సంస్థ టీఆర్ఎస్. తానే అన్నీ అని కేసీఆర్ చెప్పుకోవచ్చు కానీ, ఉవ్వెత్తున లేచిన ఉద్యమసమాజానికి రాజకీయ నాయకత్వాన్ని అందించి చేసిన దోహదాన్ని చరిత్ర గుర్తుంచుకుంటుంది. తనతో నడిచిన శక్తులన్నిటిని క్రమంగా విదిలించుకుని, అనైతిక రాజకీయ శక్తులతో పార్టీని నింపివేసి, ప్రజాభాగస్వామ్యాన్ని నిరాకరించి, అవకాశవాదానికి ద్వారాలు తెరిచి, తెలంగాణ రాష్ట్ర తొలి అధికారపార్టీ ప్రజలకు, వారి ఆకాంక్షలకు క్రమంగా దూరం అవుతూ వచ్చింది. ఆశాభంగాలు, స్వప్నభంగాలతో జనం నిస్పృహలోకి జారిపోయారు. హెచ్చరికలు, హితవులు ఏవీ అల వైకుంఠపురానికి తాకలేదు. చివరికి ఉద్యమంతో, రాష్ట్ర అవతరణతో పేగుసంబంధం కలిగిన పార్టీని ఓడించాలనే కఠినమైన, బాధాకరమైన నిర్ణయం ప్రజలు తీసుకోవలసి వచ్చింది. తప్పెక్కడ జరిగిందో నిష్కర్షగా సమీక్షించుకుని, ప్రజాభిమానాన్ని దుర్వినియోగం చేసినందుకు ప్రాయశ్చిత్తం చేసుకుని తిరిగి ప్రజలలోకి వస్తే బీఆర్ఎస్‌కు మంచి ఆహ్వానమే దొరుకుతుంది. ఆ పార్టీ నుంచి ఆశించదగిన మేళ్లు ఇంకా ఉన్నాయి.
అధికారపీఠాలలో కొత్త వ్యక్తులను పార్టీలను కూర్చోబెట్టగానే ప్రజల పాత్ర ముగిసిపోదు. నిరంతరం అధికారయంత్రాంగంతో, రాజకీయ వ్యవస్థతో విమర్శనాత్మక సంబంధంలో మెలగాలి. మళ్లీ ఒక కొత్త అధికారపీఠాన్ని బలపరచి, దుర్భేద్య దుర్గాలలో పాలకులు సేదదీరుతుంటే వారిని చేరలేక నిస్పృహ చెందే బదులు, ప్రజలు తమను తాము సాధికారం చేసుకుని, నిరంతర అప్రమత్తతతో మెలగాలి. అనుక్షణ ప్రతిపక్షం కానక్కరలేదు కానీ, ఎవరికీ అధికారాన్ని జాగీరులాగా రాసివ్వనక్కరలేదు.
కె. శ్రీనివాస్