గ్లోబల్ కీర్తి వెలుగుల్లో కొన్ని చీకట్లు!
ABN , First Publish Date - 2023-09-02T01:23:59+05:30 IST
ఈ ఏడాది జీ–20 శిఖరాగ్ర సదస్సుకు మన దేశం ఆతిథ్యమివ్వడం ఎంతో సంతోషాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తోంది.....
ఈ ఏడాది జీ–20 శిఖరాగ్ర సదస్సుకు మన దేశం ఆతిథ్యమివ్వడం ఎంతో సంతోషాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తోంది. ఈ ఇరవై దేశాలలో అత్యల్ప తలసరి ఆదాయం, అత్యధిక పేదలు, ప్రపంచ ఆకలి సూచీలో చాలా క్రింది స్థానంలో ఉన్నది భారతదేశమే! ఈ వాస్తవాలను చెప్పడం 1991 నుంచి భారత్ సాధించిన అభివృద్ధిని చులకన చేయడానికి కానే కాదు. మన ఆర్థికాభివృద్ధిలోని వైరుధ్యాలపై ఆత్మ శోధన చేసుకోవాలి. ప్రతీ పౌరుని జీవన స్థితిగతులను మెరుగుపరచని అభివృద్ధి ఎలా సార్థకమవుతుంది?
న్యూఢిల్లీ ఇప్పుడు మహోత్సాహ అలలపై తేలియాడుతున్నది! సెప్టెంబర్ 9, 10 తేదీలలో ‘గ్రూప్ ఆఫ్ ట్వంటీ’ (జీ–20) దేశాల శిఖరాగ్ర సమావేశం గురించి నేను ప్రస్తావిస్తున్నాను. ఆ శిఖరాగ్రం విషయమై ప్రభుత్వం ఢిల్లీ నుంచి పల్లె దాకా ఉధృత ప్రచారం చేస్తోంది. అవును, ఆ ప్రచార ఆర్భాటం ఒక పతాక స్థాయికి చేరనున్న క్షణాన మీరు ఈ కాలమ్‌ను చదవనున్నారు. అదలా ఉంచితే ఈ ఏడాది జీ–20 శిఖరాగ్ర సదస్సుకు మన దేశం ఆతిథ్యమివ్వడం నాకు ఎంతో సంతసాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తోంది. అయితే ఆ ముఖ్య ఘటన, దాని ఫలితాల గురించి మనం వినమ్రంగా ఉండాలి. వాస్తవిక దృక్పథమే ఎల్లవేళలా వివేకాన్నిస్తుంది.
నేను ఇది ఎందుకు చెప్పుతున్నాను? జీ–20 సమావేశాలు చాలా మామూలు వ్యవహారాలు అయిపోయాయి కనుక. 1999 నుంచి ఏటా ఈ కూటమి శిఖరాగ్ర సదస్సులు జరుగుతూ వస్తున్నాయి. సభ్య దేశాల ప్రభుత్వాధినేతల మొదటి శిఖరాగ్రం 2008లో (అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో) వాషింగ్టన్‌లో జరిగింది. రెండు శిఖరాగ్రాల మధ్య కాలంలో వివిధ అంతర్జాతీయ వేదికలపై కలుసుకునేందుకు ప్రభుత్వాధినేతలకు అనేక అవకాశాలు ఉన్నాయి–ఐక్యరాజ్యసమితి, జీ–7, ప్రపంచ ఆర్థిక వేదిక, ఐపీసీసీ, ఎస్‌సీఓ, బ్రిక్స్, క్వాద్, ఆకస్, ఏసియాన్, అంక్టాడ్ మొదలైనవెన్నో. ఈ సదస్సుల గురించి ప్రాచుర్యంలో ఉన్న ఒక జోక్‌ను చెప్పనివ్వండి: ఆంగ్ల భాష వర్ణమాలలోని ఏ నాలుగు లేదా ఐదు అక్షరాలను అయినా తీసుకోండి, అవి ఒక కొత్త బహుళపాక్షిక సంస్థను సూచించే అవకాశం తప్పక ఉంటుంది!
జీ–20 అధ్యక్షత సభ్య దేశాలకు వరుసగా వంతు ప్రకారం లభిస్తుంది. భారత్‌కు మొదటిసారి ఈ ప్రతిష్ఠాత్మక అధ్యక్ష పదవి 2003లో లభించింది. మళ్లీ ఇప్పుడు 2023లో. తదుపరి అవకాశం 2043లో వస్తుంది. సరే, ఈ శిఖరాగ్రం గురించి మనం వినమ్రశీలంగా ఉండాలని అన్నాను కదూ, ఎందుకో చెప్పుతాను. జీ–20 సభ్య దేశాలలో అత్యల్ప తలసరి ఆదాయం (2085 డాలర్లు) ఉన్న దేశం మనదే; అత్యధిక పేదలు (230 మిలియన్) ఉన్న దేశమూ మనదే; ప్రపంచ ఆకలి సూచీలో (123 దేశాలలో) మన దేశం 107వ స్థానంలో ఉన్నది! నేనీ వాస్తవాలను చెప్పడం 1991 నుంచి భారత్ సాధించిన అభివృద్ధిని చులకన చేయడానికి కానే కాదు. ఇంచుమించు ప్రతీ పది సంవత్సరాలకు స్థిర ధరల్లో తమ స్థూల దేశీయ అభివృద్ధి (జీడీపీ)ని రెట్టింపు చేసుకోవడం చాలా కొద్ది దేశాలకు మాత్రమే సాధ్యమయింది. వీటిలో మన భారత్ కూడా ఒకటి. 1991–92లో మన జీడీపీ రూ. 25 లక్షల కోట్లుగా ఉండగా అది 2003–04లో రూ.50 లక్షల కోట్లకు, 2013–14లో రూ.100 లక్షల కోట్లకు పెరిగింది.
2014–15లో (యూపీఏ సర్కార్ దిగిపోయి, నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తొలి సంవత్సరం) మన ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉన్నది. అయినా 2023–24 నాటికి మన జీడీపీ రెట్టింపు కాలేదు. ఒక సదవకాశం పూర్తిగా వ్యర్థమై పోయింది. కారణమేమిటి? ఎన్డీఏ ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలనలో వార్షిక సగటు వృద్ధిరేటు 5.7 శాతం మాత్రమే. అంతకు ముందు యూపీఏ ప్రభుత్వ పదేళ్ల పాలనలో వార్షిక సగటు వృద్ధిరేటు 7.5 శాతంగా ఉన్నది. 2004 నుంచి 415 మిలియన్ ప్రజలను పేదరికం నుంచి బయటపడవేశాం. ఇంకా కోట్లాది ప్రజలు పేదలుగానే ఉండిపోయారు. చందమామపై నడయాడేందుకు అవసరమైన వైజ్ఞానిక–సాంకేతిక నైపుణ్యాలను మనం సమకూర్చుకున్నాం. అయితే ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలల్లో 30 శాతం మంది రెండవ తరగతి పాఠ్య పుస్తకాన్ని చదవలేనివారుగా ఉన్నారు; 55 శాతం మంది సామాన్యమైన గుణకారాలు, భాగహారాలు చేయలేకపోతున్నారు. మన అభివృద్ధిలో ఇదొక తీవ్ర వైరుద్ధ్యం.
ప్రపంచంలో మన దేశ కీర్తిప్రతిష్ఠలు నిజంగా పెంపొందాలంటే మనం ఏం చేయాలి? విపులంగా పేర్కొంటాను. మన ప్రజాస్వామిక పాలనా పద్ధతులను గణనీయంగా మెరుగుపరచుకోవాలి. ఉదారవాదం, బహుతా వాదంను చిత్తశుద్ధితో అనుసరించాలి. అన్ని మతాలను సమానంగా గౌరవించాలి, ఆదరించాలి; పార్లమెంటు, శాసనసభల్లో బిల్లులతో సహా అన్ని అంశాలపై చర్చలు మరింతగా జరపాలి. భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణను అనుమతించాలి. బిల్లులను నిశితంగా పరీక్షించి, సమగ్రంగా చర్చించిన తరువాతనే ఆమోదించాలి; అన్ని రాష్ట్రాలలోను, అన్ని స్థాయిలలోను చట్టబద్ధ పాలనను అమలుపరచాలి. ‘బుల్‌డోజర్’ న్యాయాన్ని నిషేధించాలి. మూక దాడులు, హింసాకాండకు తావులేకుండా జాగ్రత్త వహించాలి. చట్ట విరుద్ధ విచారణలతో మరణశిక్షను విధించి అమలుపరచడాన్ని నిరోధించాలి. విద్వేష నేరాలను అరికట్టాలి; వ్యాపార దిగ్గజాలకు కాకుండా మార్కెట్‌కు మాత్రమే అనుకూలంగా ఉండాలి. ఇందుకు దోహదం చేసే విధానాలనే రూపొందించి అమలుపరచాలి. మన ఆర్థిక వ్యవస్థను మరింతగా తెరవాలి. పెట్టుబడులకు సమృద్ధ అవకాశాలను కల్పించాలి. అధునాతన సాంకేతికతలను సమకూర్చుకోవాలి. వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలలో పోటీ తత్వాన్ని పెంపొందించాలి; న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం, కాగ్, మానవ హక్కుల కమిషన్, సమాచార కమిషన్ మొదలైన రాజ్యాంగ సంస్థలు, వ్యవస్థలకు నిజమైన స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలి. అవి పక్షపాత రహితంగా పనిచేసేలా చూడాలి. వాటి విధి నిర్వహణలో ఏ విధంగానూ జోక్యం చేసుకోనప్పుడు మాత్రమే మన పాలనా వ్యవస్థ మెరుగవుతుందనే వాస్తవాన్ని గుర్తించాలి; దర్యాప్తు సంస్థలు చట్టాల ప్రకారం కాకుండా విశృంఖలంగా వ్యవహరించడాన్ని అరికట్టాలి. వ్యక్తులను బెదిరించేందుకు, సంస్థలను భయపెట్టేందుకు, రాజకీయ పార్టీలను హడలగొట్టేందుకు అవి ఏ విధంగాను ప్రయత్నించకుండా చూడాలి.
దేశంలో నివశిస్తున్న భారతీయులు మాత్రమే మన వ్యవస్థలలోని లోపాలు, లొసుగులను గమనిస్తున్నారని మనం భావిస్తే ముంచుకొస్తోన్న ప్రమాదాన్ని గుర్తించలేని స్థితిలో ఉన్నామని చెప్పక తప్పదు. ప్రపంచవ్యాప్తంగా నియంతృత్వ వ్యవస్థలు, బూటకపు ఎన్నికలు, జాతి వివక్ష వైపరీత్యాలు, మహిళల అణచివేత, రాజకీయ, మానవ హక్కుల నిరాకరణ, గిరిజన తెగల ఘర్షణలు, కార్పొరేట్ గుత్తాధిపత్యాలను మనం గమనిస్తున్నట్టుగానే మన వైఫల్యాలను ప్రపంచమూ గమనిస్తుంది.
ప్రస్తుత సందర్భంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి జీ–20 చాలా కలవరం చెందుతోంది. ఆర్థిక వ్యవస్థ పెరుగుదల అందరి స్థితిగతులను మెరుగుపరుస్తుందని ఆర్థిక వేత్తలు అంగీకరిస్తారు. వ్యక్తుల నడవడి, ప్రజల ప్రవర్తన, మాటా మంతీ, సామాన్య చర్చల్లో వినియోగించే భాష ఎలా ‘నాగరీక’మవుతాయో నేను చూశాను (చెన్నైలో 1960లు, 1970ల్లో విన్న ‘మద్రాస్ తమిళ్’ను మీరు ఇంకెంత మాత్రం వినలేరు). కొన్ని దేశాలు అష్టైశ్వర్యాలతో ఎందుకు తులతూగుతున్నాయి. అవి ఎలా ఆ విధంగా సంపద్వంతమయ్యాయి? నా అభిప్రాయంలో అవి నాలుగు పనులు నిర్వర్తించాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీ మదుపులు చేశాయి; విద్యకు పెద్ద మొత్తాలను వెచ్చించాయి; ఆరోగ్య భద్రతకు మిక్కిలిగా ఖర్చు పెట్టాయి; ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్యాన్ని సాగించాయి. మరి మన దేశమూ ఇవన్నీ చేస్తుందనడం పాక్షికంగా మాత్రమే సరైన విషయమని చెప్పి తీరాలి.
మౌలిక సదుపాయల అభివృద్ధికి మనమూ భారీ పెట్టుబడులు పెడుతున్నాం. అయితే అవి సరిపోవు. విద్య, ఆరోగ్యంపై మన వ్యయం (జీడీపీలో 3 శాతం, 1.4 శాతం మాత్రమే) చాలా తక్కువ. చరిత్రాత్మక వాణిజ్య సంస్కరణల అనంతరం మనం మళ్లీ భారీ పన్నులు, ఎగుమతులపై సుంకాలు, దిగుమతుల లైసెన్సింగ్, నిర్దిష్ట దేశాలకు నిర్దిష్ట సుంకాలు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలలో భాగస్వాములమవ్వడంలో తాత్సారం చేయడం మొదలైన తిరోగామి చర్యలతో పరిస్థితులను మళ్లీ మొదటికి తీసుకువస్తున్నాం.
అంతకంతకు పెరుగుతున్న ఆర్థిక అసమానతలు కలవరపెడుతున్న మరో పరిణామం. ఐటి రిటర్న్స్ దాఖలు చేసే దాదాపు ఏడు కోట్లమంది భారతీయుల సగటు ఆదాయంలో పెరుగుదలను 140 కోట్ల భారతీయుల ఆదాయంలో పెరుగుదలగా పరిగణిస్తున్నారు. పదేపదే ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఇదెలా సబబు? నిరుద్యోగిత రేటు 8.5 శాతంగా ఉన్నది. 15 నుంచి 24 సంవత్సరాల వయసు గల యువజనులలో నిరుద్యోగిత రేటు 24 శాతంగా ఉన్నది. మరి భారతీయులు అందరూ భాగ్యవంతులుగా ఎలా అయ్యారు? దేశ జనాభాలో 50 శాతం మంది జాతి ఆదాయంలో కేవలం 13 శాతం మాత్రమే ఆర్జిస్తున్నారు; జాతి సంపదలో కేవలం 3 శాతానికి మాత్రమే వారు యజమానులు. మరి సమస్త భారతీయులూ సంపద్వంతులు ఎలా అవుతారు?
జీ–20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రపంచంలోని 20 అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల ప్రభుత్వాధినేతలు మన దేశానికి రానున్నారు. భారత్ సత్వర ఆర్థికోన్నతిని వారు తప్పక సన్నిహితంగా పరిశీలిస్తారు. మనమూ మన ఆర్థికాభివృద్ధి తీరుతెన్నులపై ఆత్మశోధన చేసుకోవాలి. ఇది అవశ్యం. ఎందుకంటే ప్రతీ పౌరునికి వైయక్తికంగా మెరుగైన ప్రయోజనాలు కల్పించని అభివృద్ధి ఎలా సార్థకమవుతుంది?
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,
కాంగ్రెస్ సీనియర్ నాయకులు)