దండెత్తిన మేఘాల పాట
ABN , First Publish Date - 2023-10-23T01:48:14+05:30 IST
‘‘రెక్కల కింది రంగుల్ని/ ఒక్కొక్కటిగా ప్రదర్శనకు పెడుతున్న రోజులు/ పొడవాటి కాషాయపు కేకల్ని/ పైపైకి విసురుతున్న చెట్లు/ ఒంటి కంటిన ఎముకలని దులుపుకుంటూ/ పక్క మీద నుంచి లేస్తున్న సూర్యుడు/ మనుషులు...
‘‘రెక్కల కింది రంగుల్ని/ ఒక్కొక్కటిగా ప్రదర్శనకు పెడుతున్న రోజులు/ పొడవాటి కాషాయపు కేకల్ని/ పైపైకి విసురుతున్న చెట్లు/ ఒంటి కంటిన ఎముకలని దులుపుకుంటూ/ పక్క మీద నుంచి లేస్తున్న సూర్యుడు/ మనుషులు పశువులు/ ఒకే కంచంలో తింటున్న సెల్ఫీలు/ వెలుతురు మాత్రం/ సముద్రం మీద చక్కని గుళ్లను గోపురాలను చెక్కుతుంది/ ఈ గాలి గాలి కాదు/ నిత్యం ప్రహ్లాదుల్ని, విభీషణుల్ని, శబరుల్ని మోస్తూ/ నీలాల దీవుల వైపుకు పరుగులు తీస్తోంది’’.
వచన కవిత్వ చరిత్రలో గుంటూరు లక్ష్మీనరసయ్య గారి కంట్రిబ్యూషన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తొంభైయ్యవ దశకంలో ప్రారంభమైన ఈ సాహిత్య నడక ఒక ప్రవాహమై సాగుతూనే ఉంది. స్త్రీ, దళిత, బహుజన ఉద్యమాల్లో ఆయన పాత్ర, పని ఎక్కువే. ఆయన కవిత్వ నిర్మాణ పద్ధతులు ఎప్పటికి మార్గదర్శనమే. ఏ మూల ఒక్క కొత్త కవితా వాక్యం కనబడినా వినబడినా ముచ్చట పడతారు. వ్యాసమై హత్తుకుంటారు. విమర్శకుడిగా ఎప్పుడూ అన్వేషిస్తుంటారు. సంయమనంతో వ్యాఖ్యా నిస్తారు. ఐతే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆయన కూడా కవిత్వం రాశారు కదా, ఆ కవిత్వంలో దృక్పథం ఎలా ఉంది. ఏ సందర్భంలో ఆయన కవిత అవుతున్నాడు. అప్పుడు ఆయనలోని విమర్శకుడు అప్పుడు ఏమి అవుతున్నాడు? ఏ నిర్మాణంలో కవిత నిర్మిస్తున్నాడు.
పైన ఉదహరించిన కవితని గమనిస్తే ఆయన మార్గం ఏమిటో తెలిసిపోతుంది. పొడవాటి కాషాయపు కేకలు, మనుషులు పశువులు ఒకే కంచంలో తింటున్న సెల్ఫీలు, చివరి వాక్యానికి ముందు ఉన్న నామవాచకాలు పై కవితకు తాళం తీస్తాయి. నా అన్వేషణలో ఆయన రాసిన 200 కవితల వరకు దొరికాయి. అన్ని కవితల్లోనూ సామాజిక చైతన్యం, అంబేద్కర్ తాత్వికత, పీడితుల పక్షం వహించిన నిజాయితీ కన్పిస్తాయి. గాఢత ఉంటుంది. తార్కికతతో కూడిన వ్యంగ్యం కనిపి స్తుంది. నిర్మాణంలో పొడితనం కన్పిస్తుంది. వాక్యాలు వాక్యాలుగా ఉంటూనే, ఆ వాక్యాలు అన్నీ చదివాక, సారం ఎరుకలోకి వస్తుంది.
‘‘జెండాను/ మంచే ఎగరేస్తుందనే రూలు లేదు/ చెడు దాని గొంతది కోసుకుంటుందనే/ భరోసా లేదు/ తెల్లవారటం మాత్రం తథ్యం/ వడగాలుల్లో సైతం మకరందం కోసం/ తేనెటీగ అన్వేషించక మానదు/ జనం ఊరుకోరు/ కూల్చేకొద్దీ కొత్త వరదలై/ ఉరకలెత్తుతారు/ కిటికీలు మూసే కొద్దీ ఈదురు గాలులై/ రోడ్లెక్కుతారు/ కొమ్మలు ఇరిగేటప్పుడైనా కొమ్ము లిసరక మానరు/ అలలు ఉన్నంతకాలం సముద్రం బతికున్నట్టే’’ (‘ముగింపు’) - ఈ కవిత నిర్మాణాన్ని పరిశీలిస్తే స్టేట్మెంట్లు స్టేట్మెంట్లుగా కవిత నిర్మాణం సాగింది. తెల్లవారడం అనే మాటను స్వేచ్ఛకి ప్రతీకగా భావించవచ్చు. జన చైతన్యాన్ని, ప్రభంజనాన్ని తేనెటీగలుగా, ఈదురుగాలులుగా చెప్పారు. చివరి వాక్యానికి వచ్చేసరికి తాను చెప్పదలుచుకున్న అసలైన నిజాన్ని బాగా తెలిసి ఉన్న విషయంతో కనెక్ట్ చేశారు.
సామాజిక ప్రయోజనం ఈ కవి టార్గెట్. మానసికమైన అనుభూతులతో కూడిన ఆనందం పెద్దగా కనిపించదు. ఐతే తీవ్రమైన మానసిక సంవేదన ఉంటుంది. అలాగే జీవిత అనుభవాలను మేళవించి, ఒక తాత్విక స్పృహను కలిగించడం చేశారు. ఎక్కడ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కనబడినా, వినబడినా లక్ష్మీనరసయ్య కవిత్వ రూపంలో రికార్డు చేశారు. సూర్యుడు, సముద్రం, చెట్లు, సీతాకోకచిలుకలు, వెన్నెల... వంటి పదాలు కూడా ఆయన ఎన్నుకున్న మార్గం వైపే మాట్లాడ్తాయి.
గౌరీ లంకేష్‌ని రాజ్యం పొట్టనపెట్టుకున్నప్పుడు ‘‘ఆకాశాన్ని పూడ్చిపెట్టటానికి, ఎన్ని త్రిశూలాలు ఎన్ని గోతులు తవ్వినా కుదర’’దని అంటారు. సముద్రాన్ని ఖాళీ చేయడం రాజ్యం తరం కాదని, తుపాకీతో నయాగరా నోరు మూయించలేరని ఒక ఉద్యమకారుని స్వరంతో ప్రకటన చేశారు. ఆమె మాటల రైలుబండి దేశమంత పొడవు అవుతుందని అనడం ద్వారా ఆయన ఆలోచనల స్థాయి, ‘‘మాటలు’’, ‘‘రైలు బండి’’ అనడం ద్వారా ఆయన కవిత్వ సామర్థ్యం తెలుస్తుంది.
వాస్తవికత, విచక్షణ, సంఘర్షణ ఈ మూడు ఆయన కవిత్వానికి పునాదులు. ఈ సంఘర్షణను శక్తివంతంగా సాధారణీకరిస్తారు. సరళ వచనంలా కనిపిస్తూనే లోపల్లోపల పాఠకుణ్ణి జ్వలింపజేసే గుణం ఉంటుంది. మంచి కవిత్వానికి మనం చెప్పుకునే కొలమానాల్లో భావ చిత్రాలు పదచిత్రాలు అంటాం కానీ ఈ కవిత్వంలో భావ చిత్రాలు, పద చిత్రాలు లేకపోయినప్పటికీ వర్తమాన సామాజిక వ్యాఖ్యానం చదివింప జేస్తుంది. ఆయన చాలా ఏళ్ల క్రితం రాసుకున్న ‘నవ్వులకోసం’ అనే కవిత, ఆయన కవిత్వానికి మ్యానిఫెస్టో లాంటిది. ‘‘అతడు చెట్టుకు వేలాడే ఆకు’’ అనే పంక్తి కవిత మార్గానికి సిగ్నల్ లైట్. సామాజిక చలన సూత్రాలు అంతర్లీనంగా కన్పిస్తాయి.
దేవుడికి లంచం ఇచ్చే దేశభక్తులను, రాముణ్ణి ఓటుగా మార్చే ఆధ్యాత్మిక వాదుల్ని, గోధూళి చుట్టూ ప్రదక్షిణలు చేసే భక్తుల్ని, దేవుళ్ళ చుట్టూ రాజకీయ జాతీయ వాద సాలె గూళ్లను అల్లే కుట్రలను, రోడ్లను కమ్మేస్తున్న కాషాయపు దుమ్మును చూపడం ఆయన కవిత్వానికి స్పష్టీకరణలు. ఈ కవిత చూడండి: ‘‘యుద్ధం అంటే?/ పెట్టుబడి.// దేనిమీద?/ దేశభక్తి మీద.// దేశభక్తంటే?/ ఓటు చెట్టుకు ఎరువు/ కుర్చీలాటకు కుదురు.// మరి ప్రజలు?/ మృగాల వేలంపాటలో సరుకు.// దేశక్షేమం?/ ఎన్నటికీ తరగని డిమాండ్./ దేశీయుల ఊసేలేని ఎవర్ క్రేజీ డ్రామా./ ఎవరికీ పట్టని గాయాల గాలిపటం./ నాయకులెవ్వరూ వాసనైనా చూడని దివ్య పదార్థం’’. (‘క్రేజీ డ్రామా’) లక్ష్మీ నరసయ్య కవితపై వ్యాసం రాస్తూ ఏ రెండో మూడో వాక్యాలు ఉటంకించలేము. కవిత మొత్తాన్ని చెప్తే కానీ ఆ సారాన్ని అందుకో లేము. ఆయన కవిత్వ నిర్మాణంలో ఇది గమనించాల్సిన విషయం.
దళితవాదం అంటే దేశీయ మార్క్సిజం అని ప్రకటించిన ఈ కవి, ఆ మార్గంలో ఓ 20 కవితల వరకు వెలువరించారు. అవి ‘చిక్కనవుతున్న పాట’, ‘పదునెక్కిన పాట’, ‘నిశాని’, ‘విడి ఆకాశం’ మొదలైన సంకల నాల్లో మనం చూడవచ్చు. ఆ కవితల్లో దళిత తాత్వికతను, వాస్తవికతను బహుజన దృక్పథాన్ని ఆయన బలంగా వినిపించారు. పదునెక్కిన పాటలో ‘అన్నిటికీ చెడి’ అనే కవితలో, అలాగే ‘ఇద్దరం కలిసే’ అనే కవితలో ఆయన మార్గాన్ని చూడొచ్చు. మనువాదుల మూలాన్ని ఆయన ఆ కవితల్లో ప్రశ్నించగలిగారు. ‘‘ఏలు కోసి ఇవ్వడానికి నేను ఏకలవ్యుడిని కాదు. తల వంచి తపస్సు చేసుకోవడానికి నేను శంభూకుడిని కాదు. దొంగ బాణంతో దెబ్బతీయడానికి వాలిని కూడా కాదు. నేను మనువు మక్కెలు విరిచేవాణ్ణి. రంగుల్ని ఉరి తీసేవాడిని. ఈ దేవుళ్ళ చర్మం ఒలిచేవాడిని’’ అని అనడం ద్వారా తను బాధితుల పక్షాన తన స్వరాన్ని స్పష్టంగా పలుకుతున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఆయన అనేక కవితల్లో బాధితులకి బాసటగా నిలుస్తూ చెప్పిన కవితలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఆయన ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ స్థయిర్యాన్ని నింపే మనోవైజ్ఞానికుడిగా కనబడతాడు.
ప్రజా జీవితాలకు సంబంధించిన చేదు నిజాలు మన ముందు ఉంచేదే కవిత్వం అని ఒక ఆంగ్ల కవి అన్నట్లు లక్ష్మీ నరసయ్య ఏ సామాజిక పరిణామం ఎదురైనా, ఏ ప్రజా వ్యతిరేక నిర్ణయం జరిగినా అప్పటికి అప్పటికే ఫేస్బుక్ వాల్ మీద స్పందిస్తూ సుమారు 200 కవితల వరకు రాశారు. బాబ్రీ మసీదు సంఘటన కోర్టు తీర్పు, కశ్మీర్ విభజన, రైతు ఉద్యమాలు, సాయిబాబా అరెస్టు ఇలా అనేక సంఘటనలకు అప్పటికప్పటికీ కలం కదిలించి తనదైన శైలిలో కవిత్వం చేశారు.
మొదట్లో ఆయన రాసిన కవిత్వం స్పష్టంగా ఉంటూ ఏం చెప్తున్నాడో సులభంగా తెలిసిపోయేలా ఉంది. రాను రాను ఆయన కవిత్వంలో గాఢత, సాంద్రత పెరుగుతూ వచ్చింది. దీనివల్ల పాఠకుడు కాస్త లోతుగా ఆలోచించవలసిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో ఆయన రాసిన కవిత్వం ఏ సందర్భానికి రాసిందో తెలిస్తే తప్ప అది పాఠకుడికి అందదు.
ఆయన కవిత్వం రాసుకున్న సందర్భంలో కొన్ని అభివ్యక్తుల్ని, కొన్ని పదాల్ని చాలా కొత్తగా చెప్పారు. కంకుల కిరీటం, పండు జాతర, పరిసరాల పై పంచ, అవిటి గుణింతం, ముద్రపొద్దు, ఉక్రోషపు జాగారం, సిమెంటు స్వర్గం ఇలా ఇంకా కొన్ని కొత్త పదబంధాలను మనం గమనించవచ్చు. వేళ్ళ చివర గూడు కట్టుకున్న పాలపిట్టలు, చెమట చుక్కలో చిట్టడవులు రెక్కలిప్పడం, పైరగాలిని కలగనే కిటికి, సముద్రాన్ని నిద్రలేపే కాలింగ్ బెల్, టెండర్లు వేసే ఆవులు ఇలాంటి వాక్యాలు అక్కడక్కడ మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.
‘‘కళ్ళు లేకపోయినా కూలిన విగ్రహాలని పొదుపుకొని తన చేతుల్లో చిగురింప చేయడం మట్టికి తెలుసు’’, ‘‘కాలం చేతిలో ఒక కలం పెడతా ఈ శతాబ్దపు ఎలిజీ రాస్తుంది’’ ఇలాంటి శక్తివంతమైన వాక్యాలు ఆయనలోని కవిత్వ నిర్మాణ శక్తికి నిదర్శనంగా చూపవచ్చు. లక్ష్మీనరసయ్య స్వేచ్ఛకు రెక్కల తొడిగే ఆలోచనలు చేశారు. అక్కడక్కడ నెత్తురు మరిగించే వ్యక్తీకరణ, రక్తం నిండా సముద్రమే అని చెప్పుకునే పోరాట పటిమ మనల్ని చైతన్యవంతులను చేస్తాయి. 80ల్లో విప్లవ కవిత్వం, 90ల్లో దళిత కవిత్వం, ఆ తరవాత నేటి సామాజిక, రాజకీయ తాత్విక నేపథ్య విస్తృత విశాల కవిత్వం, ఈ క్రమంలో లక్ష్మీనరసయ్య కవిత్వాన్ని సమగ్రంగా పరిశీలించవచ్చు.
సుంకర గోపాల్
94926 38547