సతత హరిత వృక్షం ఇస్మాయిల్‌ కవిత

ABN , First Publish Date - 2023-10-09T03:31:13+05:30 IST

‘ఇస్మాయిల్‌ మన రాత్రింబవళ్ళని ఒకటి చేశాడు. మన చుట్టూ ఉన్న చీకటి ప్రపంచాన్ని తన కవిత్వంతో వెలిగించి నాలుగు దిక్కుల్ని తెరిచాడు. వెలుగులీనిన అతడి కవిత్వ దీప కాంతులు ఎప్పటికీ ఆరిపోయేవి కాదు. ఇస్మాయిల్‌ మహాభి నిష్క్రమణం చేసి 18 యేళ్ళు గడిచిపోయినా,...

సతత హరిత వృక్షం ఇస్మాయిల్‌ కవిత

సతత హరిత వృక్షం ఇస్మాయిల్‌ కవిత

‘ఇస్మాయిల్‌ మన రాత్రింబవళ్ళని ఒకటి చేశాడు. మన చుట్టూ ఉన్న చీకటి ప్రపంచాన్ని తన కవిత్వంతో వెలిగించి నాలుగు దిక్కుల్ని తెరిచాడు. వెలుగులీనిన అతడి కవిత్వ దీప కాంతులు ఎప్పటికీ ఆరిపోయేవి కాదు. ఇస్మాయిల్‌ మహాభి నిష్క్రమణం చేసి 18 యేళ్ళు గడిచిపోయినా, అతడి ‘పద్యం’ పాతబడలేదు. మోడువారలేదు. అనునిత్యం చివుళ్ళు తొడుగుతూ నవనవోన్మేషంగా రెపరెపలాడుతోన్న సతత హరిత వృక్షం ఇస్మాయిల్‌ కవిత! కాలాని కంటే ముందు నడిచాడు. కవిత్వం నినాదప్రాయమై నిస్త్రాణమైన దశలో దీపస్తంభమై నిలబడి దిశా నిర్దేశం చేశాడు.

ఇస్మాయిల్‌ కూడా తొలినాళ్ళలో శ్రీశ్రీని భుజానికి ఎత్తుకున్నవాడే! కృష్ణశాస్త్రి అడుగులో అడుగువేసి నడిచినవాడే! అతడి ‘ఎర్లీ పోయెట్రీ’పై కృష్ణశాస్త్రి కవిత్వ ఛాయలు స్పష్టంగా అగపడతాయి. కృష్ణశాస్త్రి నీడలోంచి బైటపడటానికి ఓ రెండు దశాబ్దాలు కవిత్వం రాయటం మానేశాడు ఇస్మాయిల్‌! 40 యేళ్ళ వయస్సులో తనదైన శైలీ, శిల్పంతో మళ్ళీ కవిత్వం రాయటం మొదలుపెట్టాడు.

1960ల్లో ఇస్మాయిల్‌ రాసిన కవిత ఒకటి ఇక్కడ ఉదహరిస్తాను:

‘‘అకటకట

వికట ప్రతిబింబాల

అద్దాల చెరసాల

బందీని నేనే

బందీఖానాని నేనే!’’

తనదైన మార్గాన్ని తానే అన్వేషించుకొని, ఆ మార్గంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ ఔతూ కవిత్వం రాసుకొంటూ పోయాడు ఇస్మాయిల్‌!

సరళమైన భాష, సునిశితమైన సూదిమొన లాంటి శైలి, పదచిత్రాలతో సుసంపన్నమైన అద్భుత శిల్పం ఇస్మాయిల్‌ సొంతం! ‘పికాసో’ గురించి ఇస్మాయిల్‌ రాసిన పద్యం లాంటిదే ఇస్మాయిల్‌ కవిత్వం కూడా!

‘‘అతడు గీసింది కన్నా

చెరిపింది ఎక్కువ!

మన కళ్ళ మీది కటకటాల్ని

కుంచెతో చెరిపేశాడు

అప్పట్నించీ మన కళ్ళు

ఎగరటం నేర్చుకున్నాయి’’

ఇస్మాయిల్‌ కవిత్వంలో చేసింది కూడా ఇదే! రాసిందానికన్నా మధ్యలో పూరించకుండా వదిలి పెట్టిన ఖాళీలే ఎక్కువ! మన మనస్సులకి రెక్కలు తొడిగి తన భావనా ప్రపంచంలో ఎగరటం నేర్పాడు.

అప్పుడెప్పుడో దేవిప్రియని వాళ్ళింట్లో కలిసి నప్పుడు మాటల సందర్భంలో ఆయన నాతో ఇలా అన్నాడు: ‘వైయక్తిక కవిత్వం రాయటాన్ని నిరసిం చాల్సిన పని లేదు. ఎందుకంటే, మనం మన జీవితంలోంచి, కుటుంబాన్నించి, ఇంట్లో గుండా సమాజంలోకి ప్రవేశిస్తాం. అలాంటప్పుడు కేవలం సామాజిక కవిత్వమే రాయాలనటంలో అర్థం లేదు’! ఇదే మాట ఇస్మాయిల్‌ ఎన్నో దశాబ్దాల క్రితమే చెప్పాడు. మనమే పెడచెవిన పెట్టాం! అతడు మాత్రం తన మానాన తాను తన మార్గంలో రాసుకొంటూ పోయాడు.

ఇస్మాయిల్‌ కవిత్వాన్ని ఏ భాషలోకి అనువదించినా ఆ భాషకి చెందిన కవిత్వం గానే భాసిస్తుంది. అదే అతడి కవిత్వంలోని ఔన్నత్యం! ఆ గుణమే ఇస్మాయిల్‌ని ప్రపంచకవిగా నిలబెట్టింది. స్థల కాలమానాలకి అతీతమైన కవిత్వం అతనిది. ఆ ఫ్రెష్‌నెస్‌ ఉంది కాబట్టే ఇస్మాయిల్‌ కవిత్వం కాలానికి నిలబడింది. ఇవాళ్టికి కూడా అతడి కవిత్వం గురించిన చర్చలూ, అతడి ప్రస్తావనా వస్తూనే (జరుగుతూనే) ఉన్నాయి.

ఇస్మాయిల్‌ని తెలుగులో ఏ ఇతర కవితోనూ పోల్చలేం! పంచేంద్రియాల్ని ఏకకాలంలో స్పృశిస్తుంది అతడి కవిత్వం! ఇస్మాయిల్‌ కవిత్వం చదువుతోంటే ఓ అద్భుతమైన అనుభూతి మన అనుభవానికి అందుతుంది.

‘వానగుర్రం’ అనే కవితలో ఇస్మాయిల్‌ ఇలా అంటాడు:

‘‘అర్ధరాత్రి కిటికీలోంచి

వాన గుర్రం తోక విసురు

మొహానికి తగిలి

నిద్రలేచి కూచున్నాను’’

ఇక్కడ అర్ధరాత్రి వానపడుతోన్న దృశ్యాన్ని కవిత్వీకరిస్తూ, వానని గుర్రంతో పోల్చాడు! కిటికీలోంచి తనని తాకిన వాన జల్లుని గుర్రం తోక విసురులా ఉందంటాడు. ఇక్కడ వానపడే దృశ్యం కళ్ళ ముందు కదలాడుతుండటమే కాదు, వానజల్లు విసురుగా మనల్ని తాకటాన్ని కూడా అనుభవిస్తాం! కళ్ళముందు వాన గుర్రాన్ని దృశ్యమానం చేస్తూనే ఛళ్ళున గుర్రపు తోకలా వానజల్లు తాకే సందర్భాన్ని స్పర్వాస్పదం చేస్తాడు.


‘పాట’ అనే కవితలో మానవ జీవితానికి సంబంధించిన ఒక సార్వత్రిక సత్యాన్ని ఆవిష్క రించాడు ఇస్మాయిల్‌! కష్టాలు లేకుండా జీవితం ఉండదు. ఆ కష్టాల్ని, కన్నీళ్ళని అధిగమిస్తూ ముందుకు సాగిపోవటమే జీవితమనే సత్యాన్ని ‘సెలయేటి’ రూపంలో ఆవిష్కరిస్తాడు కవి!

‘‘సెలయేరా, సెలయేరా!

గలగలమంటో నిత్యం

ఎలా పాడగలుగుఉన్నావు?

చూడు, నా బతుకు నిండా రాళ్ళు

పాడకుంటే ఎలా?’’

- ఇస్మాయిల్‌ జీవితం కూడా అతను రాసిన ఇలాగే గడిచిపోయింది. బాధల్ని, కష్ట నిష్టూరాల్ని పంటి బిగువున పట్టి ఉంచి తన సహజసిద్ధమైన ‘మందహాసం’తో జీవితాన్ని గడిపాడు. ఇస్మాయిల్‌ని ఉర్దూ గజల్‌ కవి గాలిబ్‌ తోనూ, తెలుగు ప్రబంధ కవి శ్రీనాథుడితోనూ పోల్చవచ్చు! వాళ్ళకి మల్లెనే జీవిత చరమాంకంలో అన్ని కష్టాలు అనుభవిం చాడు. ఐనా, కుంగిపోలేదు. పైగా, శ్రీనాథుడు ‘పాకనాటి’ వాడైతే నేను ‘వలసపాకనాటి’వాణ్ణి అని చమత్క రించేవాడు. ఉన్న ఆస్తులూ, ఇల్లూ కోల్పోయి కాకినాడలోని ‘వలసపాకల’కి వలస పోయి అక్కడే తనువు చాలించాడతడు.

ఇస్మాయిల్‌ సృజన సాహిత్యంతో పాటు అనేక భాషల కవుల కవిత్వాన్ని మూల కవిత్వానికి దీటుగా అనువదించాడు కూడా! ఇస్మాయిల్‌ అనువాదాలు కూడా అతడి ఒరిజినల్‌ వర్క్స్‌కి ఏమాత్రం తీసిపోవు. చాలా మంది కవులు చేసే అనువాదాలు సైతం వాళ్ళ పద్థతిలోనే అదే మూసలో ఉంటాయి. మూల కవిత్వపు దరిదాపులలోకి కూడా చేరవు! ఇస్మాయిల్‌ అనువాదాలు అలా కాదు. మూల కవి భాషకి అనుగుణంగా తనదైన సాదాసీదా భాషని మార్చుకుంటాడు. ఉదాహరణకి-

జీబనానంద దాస్‌ కవిత ‘బనలతాసేన్‌’కి ఇస్మాయిల్‌ అనువాదం ఇలా సాగుతుంది:

‘దిగంత ప్రాం తమోక్రాంత విదిషా నిశలు

ఆమె కేశాలు;

శ్రావస్తీ శిల్పమామె వదనం;

సముద్రమధ్యంలో

చుక్కాని విరిగి దారితప్పిన నావికుడు

దాల్చిని ద్వీపాంతరంలో

హరిత శాద్వలాల్ని దర్శించినట్లు

అంధకారంలో ఆమెను దర్శించాను:

‘ఎక్కడున్నావు ఇంతకాలం?’

అందామె, కులయాల వంటి కన్నులార్చి,

బనలతాసేన్‌.

అందుకే, ఇస్మాయిల్‌ గొప్ప స్రష్టగా, ద్రష్టగా పరిగణన పొందాడు. ఏ ప్రసిద్ధ ప్రపంచ కవికి తీసిపోని ప్రతిభామూర్తి ఇస్మాయిల్‌! ఇస్మాయిల్‌కి ఇస్మాయిలే సాటి! కవిత్వమే జీవితంగా జీవితమే కవిత్వంగా ఆఖరి శ్వాసదాకా జీవితాన్ని గడిపిన ధన్యకవి అతడు!

రవూఫ్‌

98490 41167

Updated Date - 2023-10-09T03:31:13+05:30 IST