ఓ అసమర్థుడి అంతర్మథనం
ABN , First Publish Date - 2023-05-20T02:05:54+05:30 IST
ఆస్తులున్నాయి కాబట్టి తెలంగాణ సిఎం వద్ద, కేసులున్నాయి కాబట్టి కేంద్రంలోని పెద్దల వద్ద ఒంగి ఒంగి దండాలు పెట్టి, చివరకు ప్రత్యేక హోదానీ తాకట్టు పెట్టా....
తాడేపల్లి ప్యాలెస్‌లో సేద తీరుతున్న సిబిఐ దత్త పుత్రుడు దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. ప్రతిపక్షాలన్నీ ఏకమై తనపై దాడి చేస్తున్నందుకు వాపోతున్నాడు. తన ప్రతిభను ఎవరూ గుర్తించనందుకు బాధపడుతున్నాడు, అంతర్మథనం చెందుతున్నాడు. లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన అమాయకుడినే, ఏడాదిన్నర జైలు అనుభవం ఉన్న సీనియర్ ఖైదీనే, కేవలం 510 కోట్లు ఆస్తులుగా చూపించిన పేదవాడినే, బాబాయికి ‘గుండెపోటు’ అందించిన మంచివాడినే, తల్లిని పార్టీ నుండి, చెల్లిని రాష్ట్రం నుండి పంపేసినవాడినే... నా మీద రవ్వంతైనా జాలి లేదా ఈ ప్రతిపక్ష నాయకులకి అని, ఇష్టమైన పబ్జి ఆటని కూడా పక్కన పెట్టి, నాలుగేళ్ల గతాన్ని ఇలా నెమరువేసుకుంటున్నాడు....
ఆస్తులున్నాయి కాబట్టి తెలంగాణ సిఎం వద్ద, కేసులున్నాయి కాబట్టి కేంద్రంలోని పెద్దల వద్ద ఒంగి ఒంగి దండాలు పెట్టి, చివరకు ప్రత్యేక హోదానీ తాకట్టు పెట్టా. అధికారంలోకి రాగానే శుభం జరగాలని తొలిగా కరకట్ట మీద ఉన్న ప్రజావేదికను కూల్చా. భవన నిర్మాణ కార్మికులకు ఇసుక దొరకకుండా చేసి, 60 మంది ఆత్మహత్య చేసుకున్నా చలించక నిలిచా. రైతు భరోసా సొమ్ములో ఓ 5వేలు ఎగ్గొట్టి, రైతులను కులాల వారీగా, మతాల వారీగా కూడా విడగొట్టా. ప్రభుత్వ భవనాలకి, స్కూళ్లకి పార్టీ రంగులు పూసి, తీసి మూడువేల కోట్లు మట్టిపాల్జేసా. మాతృభాషని మృతభాషలా మార్చడానికి కంకణం కట్టుకున్నా. అన్ని పథకాలకు, చివరకు కేంద్రం పథకాలకు కూడా ఏదో నా సొంత సొమ్ము ఇస్తున్నట్టుగా నా పేరు, నాన్న పేరు పెట్టుకున్నా. పరుల భూములకి రక్షకుడినంటూ సరిహద్దు రాళ్లపైన కూడా నా ఫోటో వేయించుకున్నా. అంతేనా!! రెండున్నర లక్షల ఉద్యోగాల హామీని అటకెక్కించా. పంచాయితీ, రెవెన్యూ వ్యవస్థల మధ్య చిచ్చుపెట్టా. పంచాయితీ నిధులు దారి మళ్లించి సర్పంచులు పిచ్చి చూపులు చూసేలా చేశా. కఠినమైన కరోనా కాలంలోనూ మద్యంప్రియులు నొచ్చుకోకూడదని ప్రభుత్వ ఉపాధ్యాయులను మద్యం షాపులకు కాపలా ఉంచా. మద్యపాన నిషేధం హామీని గాలికివదిలేసి, ఈ రాష్ట్రంలో రోడ్లు లేకపోయినా ఫర్వాలేదు నా ప్రజలకు కొత్త రుచులు చూపాలన్న సంకల్పంతో బూమ్ బూమ్, ఆంధ్రా గోల్డ్ వంటి బ్రాండ్లు అందిస్తున్నా. అధికారంలోకి రాగానే వారంలోనే సిపిఎస్ రద్దు హామీని నమ్మి నాకు ఓట్లేసిన ప్రభుత్వోద్యోగులను తెలివిగా దారికి తెచ్చా. సిపిఎస్ సంగతి, ప్రమోషన్ల సంగతి దేవుడెరుగు, ముందు టైమ్‌కి జీతాలు ఇవ్వండి మహాప్రభో అని కాళ్ళ బేరానికి వచ్చేలా చేశా. నా మాట వినే పోలీసు అధికారులకు ప్రమోషన్లు ఇచ్చా, వినని వారిని లూప్‌లోకి తోసి లెవెల్ చేసా. కుంటలలోను, గంటలలోను, చెరువులలోను, కొండలమీదా, గుట్టలమీదా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి, మా వాళ్ళకి మాత్రం పొలాలను అయిన కాడికి కొని, దోచి మరింత బాగుపడమని భరోసా ఇచ్చా. నిరుద్యోగులను రోడ్డెక్కాలా చేసి, నాలుగేళ్లుగా డీఎస్సీ రేపు, మాపు అంటూ నెట్టుకొస్తున్నా. సొసైటీ ఎన్నికలు, నీటి సంఘాల ఎన్నికలు గురించి జనం పూర్తిగా మర్చిపోయేలా చేశాను. ఇవన్నీ ఘనతలు కావా?
ఇలా ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటే నా సమర్థత చూసి నాకే ముచ్చటేస్తోంది. అమ్మఒడికి ఇచ్చిన డబ్బులు నాన్నబుడ్డి ద్వారా లాగేసుకున్నా. అన్ని జబ్బులూ ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చానని అంటూనే, పైసా ఇవ్వకుండా ఆసుపత్రుల యాజమాన్యాలను ముప్పుతిప్పలు పెడుతున్నా. కేంద్రానికి కూడా అంతుచిక్కని రీతిలో 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని శ్రీలంక స్థాయిలో నిలబెడుతున్నా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం కట్టడం చేతకాదా అని ప్రశ్నించిన నేను, గతంలో అవినీతి చేశాడంటూ ఏ కాంట్రాక్టరునైతే అల్లరి చేశామో అదే కాంట్రాక్టరుకి రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులు ఇచ్చా. చివరకు చేతులెత్తేసా.
రాజధాని కడితే మరొకరికి పేరు వస్తుంది గానీ నాకేం వస్తుంది? అమరావతికి సమాధి కట్టాను, మూడు రాజధానులు పేరుతో మూడు ప్రాంతాల మధ్యా చిచ్చుపెట్టా. వైజాగ్‌లో నా కలల సౌథం కట్టుకోవడానికి రుషికొండకు బోడిగుండు కొట్టించా. రాజధానే కాదు రోడ్లు కూడా లేని రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నా. నిత్యావసర ధరలు, కరెంట్ బిల్లులు, పెట్రోల్, డీజిల్ ధరలు, బస్సు చార్జీలు పెంచేసి కూడా సంక్షేమానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ అని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నా.
పక్క రాష్ట్రాల వారు నేను సిఎంగా ఉన్నంత కాలం తమ పరిశ్రమలకి, టూరిజంకి, ఐటి ఇండస్ట్రీకి, రియల్ ఎస్టేట్ రంగానికి డోఖా లేదని నన్ను అదేపనిగా మెచ్చుకుంటుంటే నా ఘనతను సొంత రాష్ట్రం వారు గుర్తించరేమిటో..! నన్ను నమ్ముకున్న ఎస్సీ, ఎస్టీ వర్గాలవారిమీద దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ప్రయోగించిన ఘనత నాది. మహిళలు, రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, దళితులు, మైనారిటీలు, కాపులు, బిసిలు ఇలా అన్ని వర్గాల వారిని ఏకకాలంలో మోసం చేయడమంటే మాటలా? ఇది కాదా టాలెంట్? పైగా, 60 మంది సలహాదారుల్ని నియమించుకుంటే మెచ్చకపోగా బుర్రతక్కువోడే ఇలా ఎక్కువమందిని పెట్టుకుంటాడని హేళన చేస్తున్నారు. ఏంటో ఈ తింగరోళ్లు!
రైతుల ఆత్మహత్యల్లో మూడోస్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండోస్థానం, గంజాయి, డ్రగ్స్ ఎగుమతుల్లో మొదటిస్థానం, ప్రతిపక్ష నాయకులను కేసులతోనూ హింసించడంలో మొదటి స్థానం... ఇలా ఎన్ని రికార్డులని! హిందూ దేవుళ్ళ విగ్రహాలను పగులగొట్టినవారిని, రథాలను తగులపెట్టిన దయతో వదిలేశా. హిందూ దేవాలయాల ఆస్తులను హాం ఫట్ చేసి, దైవదర్శనాలను మరింత ఖరీదు చేశా. సొంత పార్టీ ఎంపీనే బొక్కలో వేసి బొక్కలు విరిగేలా తన్నించా. ఇన్ని చేసినా ఏమీ చేయట్లేదని నాపై నిందలు వేస్తున్నారు ఆ దుష్ట చతుష్టయమం (వామ్మో నోరు తిరగట్లేదు).
నేను టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకుందీ, మంత్రి పదవులు ఇచ్చిందీ నాలానే వేలకోట్లు దోచుకున్న పేదవారు, జైలు అనుభవం ఉన్నవారే. అసెంబ్లీలో నేను ఏం చెప్పినా డూ డూ బసవన్నలా తల ఊపుతారు, బల్లలు చరుస్తూ చక్కగా భజన చేస్తారు. వారంతా విశ్వాసంలో శునకాలతో పోటీపడే బోడిలింగాలు, అమ్మ, అక్క, ఆలి తప్ప మరో భాషరాని పండితులు, ఫోన్లు చేసి గంట అరగంట సేవ చేసే కళాకారులు, రాత్రికిరాత్రే ఎర్ర చందనం దుంగలని మాయం చేయగలిగే నేర్పరులు. ఇటువంటి నా టీమ్‌ని పట్టుకుని నానామాటలు అనడానికి ప్రతిపక్షాలకు నోరు ఎలా వస్తోందో? వాళ్ల ఖర్మకి వారే పోతారు.
నేను బటన్ నొక్కడానికి తప్పితే బయటకు రాను. పబ్జి ఆడుకోవడానికే టైమ్ సరిపోకుంటే, రైతుల్ని స్వయంగా పరామర్శించాలట. తప్పిజారి బయటకు వెళ్ళాల్సివస్తే, నేను ఏ ఊరు వెళితే ఆ ఊరులో స్కూళ్లు, షాపులు అన్నీ బలవంతంగా మూయించేసి ప్రజలకు సెలవు ఇస్తున్నాను. అసలు, రేప్పొద్దున నా బెయిల్ రద్దు అయితే నా భవిష్యత్తు ఏమిటో తెలియదు కనుకనే మీ నమ్మకం నేనే అని ప్రచారం చేసుకుంటున్నాను. రోజూ కోర్టులు వేసే మొట్టికాయలతో తలబొప్పి కట్టి నొప్పెడుతున్నా, షిక్కటి చిరునవ్వు నా మొహం మీద పులుముకుంటాను. మీరంతా పాస్‌పోర్ట్ ఇళ్ళల్లో దాచుకుంటారు, నేను కోర్టులో దాచుకుంటా. కోర్టు పర్మిషన్ లేనిదే దేశం దాటను. నాలా ఇన్ని కేసులు ఎదుర్కొంటూ ప్రతీవారం కోర్టు వాయిదాలు ఎగ్గొట్టడం మరొకరికి సాధ్యమా? ఆలోచిస్తుంటే నా టాలెంట్ పైన నాకే ఈర్ష్య కలుగుతోంది.
నా పేటీఎం పిల్లకాయలతో న్యాయమూర్తులను బూతులు తిట్టించడం, మీడియాపైనా, ప్రతిపక్ష పార్టీలపైనా అక్రమ కేసులు బనాయించడం, పక్క రాష్ట్రాల నుంచి దొంగ ఓటర్లను తీసుకొచ్చి ఓట్లేయించుకోవడం, ప్రతిపక్ష పార్టీల వారిని నామినేషన్లు వేయనివ్వకుండా బెదిరించడం... ఇవన్నీ నాకు తప్ప సాధారణ వ్యక్తులకు సాధ్యమా? నా ప్యాలెస్‌లు, నా పేపరు, నా ఛానెల్ భవంతులు కళ్ళెదురుగా ఉన్నా తూచ్ అనేసి, నేను పేదవాడిని అని నిస్సిగ్గుగా చెప్పగలగడం నాకే చెల్లు. కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును నా పేపర్‌కి, ఛానెల్‌కి దోచిపెట్టడం, నేను అధికారంలోకి రావడానికి సహకరించిన వారందరికీ పదవులు కట్టబెట్టడం మంచితనం కాదా? అసలే బాబాయి మర్డర్ కేసు తమ్ముడి దగ్గరికి, మెల్లమెల్లగా నా ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చేలా ఉంది. ఈ టెన్షన్‌లో నేనుంటే ఈ ప్రతిపక్ష పార్టీల నాయకులు నన్ను తగులుకున్నారు. ఆడుకోనివ్వరు, పడుకోనివ్వరు, రోజువారీ కలెక్షన్ లెక్క పెట్టుకోనివ్వరు.
ఇక ఊరుకొని లాభం లేదు. వచ్చే ఎన్నికల్లోగా పార్టీ గుర్తును కోడి కత్తిగానో, గొడ్డలిగానో మార్చుకోవాలి. ఏది నాకు సరిగ్గా సరిపోతుందో నా క్షేమం కోసం యాగం చేసిన విశాఖ సాములోరిని అడగాలి. ఇంకా అవసరమనుకుంటే బ్లేడ్ బ్యాచ్‌ని రంగంలోకి దింపాలి. నా మీద నేనే దాడి చేయించుకుని కెవ్వుమని అరిచి, కన్నీళ్ళు పెట్టుకొని మరోసారి జనాన్ని మాయచేయాలి. ఈసారీ తగ్గేదేలే.
_ కొణిదెల నాగబాబు
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి