ఈ వారం వివిధ కార్యక్రమాలు 28 08 2023
ABN , First Publish Date - 2023-08-28T00:27:57+05:30 IST
‘జాతీయోద్యమంలో తెలుగు సాహిత్యం పాత్ర’ , తెలుగు భాషా పురస్కారాలు, ‘భూమి - బంగారం’ కథా సంపుటి, సాహిత్య పురస్కారం, పీచర సునీతా రావు పురస్కారాలు...
‘జాతీయోద్యమంలో తెలుగు సాహిత్యం పాత్ర’
ఈ అంశంపై సాహిత్య అకాడెమీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సదస్సు ఆగష్టు 29, 30 తేదీల్లో రవీంద్రభారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. సదస్సులో వాడ్రేవు చినవీరభద్రుడు, కె. జితేంద్రబాబు, ఎస్వీ సత్యనారాయణ, సంగి శెట్టి శ్రీనివాస్, దార్ల వేంకటేశ్వరరావు తదితరులు పాల్గొంటారు.
ఎస్. రఘు
పీచర సునీతా రావు పురస్కారాలు
స్వర్గీయ శ్రీమతి పీచర సునీతారావు వార్షిక పురస్కారాల కోసం మార్చ్ 2020-మార్చ్ 2023 మధ్య కవిత్వం, కథ, విమర్శ విభాగాల్లో వెలువడిన సంపుటులను ఆహ్వానిస్తున్నాం. సంపుటానికి రూ.15 వేల నగదు సత్కారం ఉంటుంది. రచనలను సెప్టెంబర్ 30లోగా చిరునామా: పీచర సునీతారావు పౌండేషన్, కేర్ ఆఫ్: విజయేందర్ రావు, ప్లాట్ నం. 505. బ్లాక్-డి, భీమా ప్రైడ్ అపార్ట్మెంట్స్, జీడిమెట్ల, హైదరాబాద్- 67కు పంపాలి. ఫోన్: 9866043441.
పీచర విజయేందర్ రావు
సాహిత్య పురస్కారం
హైదరాబాద్‌లోని పాల్కురికి పీఠం ఇచ్చే అనుమాండ్ల భూమయ్య సాహిత్య పురస్కారాన్ని 2023 సంవత్సరానికి గాను విహారి (జె. యస్. మూర్తి) స్వీకరిస్తారు. సెప్టెంబర్ 5న తెలుగు విశ్వవిద్యాల యంలో జరుగనున్న సభలో విహారికి ఈ పురస్కారం కింద రూ. పది వేల నగదు, జ్ఞాపిక అందజేసి, శాలువాతో సత్కరిస్తారు.
అనుమాండ్ల భూమయ్య
‘భూమి - బంగారం’ కథా సంపుటి
రెడ్డి రామకృష్ణ కథా సంపుటి ‘భూమి - బంగారం’ ఆవిష్కరణ సభ సెప్టెంబరు 3 సా.5గంటలకు గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం, విజయనగరంలో జరుగుతుంది. సభలో చీకటి దివాకర్, వర్దిపర్తి జగన్నాధ స్వామి, వాసిరెడ్డి నవీన్, కె.ఎన్. మల్లీశ్వరి, బమ్మిడి జగదీశ్వరరావు, గంటేడ గౌరునాయుడు, చింతకింది శ్రీనివాసరావు, జి.ఎస్. చలం పాల్గొంటారు.
సాహితీ స్రవంతి
తెలుగు భాషా పురస్కారాలు
గిడుగు రామ్మూర్తి జన్మదినం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రచయితల ఆధ్వర్యంలో తెలుగు భాషా పురస్కారాల ప్రదానం ఆగస్టు 29 సా.6గంటలకు అన్నమయ్య వేదిక, శ్రీ వేంకటేశ్వర దేవస్థాన ప్రాంగణం, బృందావన్ గార్డెన్స్, 5వ లైను, గుంటూరులో జరుగుతుంది. పురస్కార గ్రహీతలు: శతాధిక వ్యాసకర్త షేక్ అబ్దుల్ హకీం జానీ, బాలసాహితీవేత్త బెల్లంకొండ నాగేశ్వరరావు. సభలో సోమేపల్లి వెంకట సుబ్బయ్య, పాపినేని శివశంకర్ తదితరులు పాల్గొంటారు.
చలపాక ప్రకాష్