ఈ వారం వివిధ కార్యక్రమాలు 30 10 2023
ABN , First Publish Date - 2023-10-30T00:47:15+05:30 IST
‘గుల్‌దస్త’, మరో మూడు పుస్తకాల ఆవిష్కరణ, ‘రాత్రి సింఫని’ ఆవిష్కరణ, సాహితీ సమాలోచన సదస్సు, నిజాం వెంకటేశం స్మారక సాహిత్య పురస్కారాలు, ‘యుద్ధం - శాంతి’ అంశంపై కవితలకు ఆహ్వానం...
‘గుల్‌దస్త’, మరో మూడు పుస్తకాల ఆవిష్కరణ
మెహక్ హైదరాబాదీ ఉర్దూ నుంచి అనువదించిన పుస్తకాలు ‘గుల్‌దస్త’ (హిందువులపై హైదరాబాద్ ముస్లిం రచయితల కథలు), అస్థిపంజరం (అమృతా ప్రీతమ్ నవల), మంటో క్లాసిక్స్ (కథలు), హైదరాబాద్ ప్రజాసమరం (చెరుకు మాధవరెడ్డి రచన) ఆవిష్కరణ సభ రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాలులో నవంబరు 5వ తేదీ సా.5గంటలకు జరుగుతుంది. సభలో కె. రామచంద్రమూర్తి, కె. శ్రీనివాస్, నందిని సిధారెడ్డి, ఆడెపు లక్ష్మీపతి, మామిడి హరికృష్ణ, కిష్వర్ సుల్తాన, గులే రాణాలు పాల్గొంటారు.
మెహక్ హైదరాబాదీ
‘రాత్రి సింఫని’ ఆవిష్కరణ
బాణాల శ్రీనివాసరావు కవితాసంపుటి ‘రాత్రి సింఫని’ ఆవిష్కరణ సభ నవంబరు 5వ తేదీ సా.5.30గంటలకు దొడ్డికొమరయ్య హాలు, సుందరయ్య విజ్ఞానకేంద్రం, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్‌లో జరుగుతుంది. సభలో జూలూరు గౌరీశంకర్, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, గుంటూరు లక్ష్మీనరసయ్య, సిద్ధార్థ, గుడిపాటి, సంగిశెట్టి శ్రీనివాస్, ఏనుగు నర్సింహారెడ్డి, ఎస్. రఘు పాల్గొంటారు.
పాలపిట్ట బుక్స్
సాహితీ సమాలోచన సదస్సు
తెలుగు భాషా సాహితీ, సాంస్కృతిక సేవా సంస్థ ‘సేవ’ ఆధ్వర్యంలో, అక్షర తోరణం పేరిట కవి, రచయిత శిఖామణి సాహితీ సమాలోచన సదస్సు తిరుపతి కేంద్రంగా నవంబరు 1 నుంచి 4 వరకు నాలుగు రోజులపాటు జరుగుతుంది. శిఖామణి రచనలపై, కవిత్వంపై జరిగే ఈ సదస్సులో వాడ్రేవు చినవీరభద్రుడు, మృణాళిని, రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, సీతారాం, కోయి కోటేశ్వరరావు, అనిల్ డ్యానీ, సుంకర గోపాల్, జి. లక్ష్మీనరసయ్య, మేడిపల్లి రవికుమార్, నేమినేటి కిట్టన్న, దాట్ల దేవదానం రాజు, పాపినేని శివశంకర్, చల్లపల్లి స్వరూపరాణి, పుప్పాల శ్రీరాం, ఎం. ప్రభాకర్, కొప్పర్తి, ఖాదర్ మొహియుద్దీన్ తదితరులు పాల్గొంటారు. ప్రతి సాయంత్రం ఏడు గంటలకు ‘సేవ’ జూమ్, సేవ ఆన్ లైవ్ యూట్యూబ్, మీడియా ఛానల్స్ ప్రత్యక్ష ప్రసారంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. వివరాలకు: 94926 66660
కంచర్ల సుబ్బానాయుడు
నిజాం వెంకటేశం స్మారక సాహిత్య పురస్కారాలు
నిజాం వెంకటేశం స్మారక సాహిత్య పురస్కారానికి విమర్శ విభాగంలో ఎంపికైన రచనలు: ‘భరిణ’ (స్త్రీల రచనలపై సాహిత్య వ్యాసాలు), వి. త్రివేణి; ‘తెలంగాణ కథావర్తనం’ (కథా సాహిత్య విమర్శ), ఎం. దేవేంద్ర; ‘శతారం’ (వచన కవిత్వ విమర్శ వ్యాసాలు), గోపగాని రవీందర్. అన్ని సాహిత్య ప్రక్రియల వర్తమాన తీరుతెన్నులను విశ్లేషించిన వ్యాసాలతో కూడిన పుస్తకం ఏదీ రాకపోవడం వల్ల, ఒక గ్రంథానికి రూ.10వేలు అనుకున్న అవగాహనను మార్చుకుని, ఈ ముగ్గురికి రూ.5 వేల చొప్పున మూడు గ్రంథాలకు బహుమతి అందచేస్తారు. కవిత్వ విభాగంలో ఎంపికైన రచన: ‘చంద్రుడు లేని ఆకాశం’ గజ్జెల రామకృష్ణ. ఈ పుస్తకం రూ.5 వేల పురస్కారానికి ఎంపికైంది. ‘కాలుతున్న వెన్నెల’ (కవిత్వం)కు శీర్పి చంద్రశేఖర్ ప్రోత్సాహక బహుమతి స్వీకరిస్తారు. పురస్కారాల ప్రదాన సభ నిజాం వెంకటేశం జన్మదినం నవంబరు 14వ తేదీన ఉ.11గంటలకు ఆయన స్వగృహ ప్రాంగణం (బెల్వెడేరా అపార్టుమెంట్లు, పద్మారావు నగర్ సికింద్రాబాద్)లో జరుగుతుంది.
బి.ఎస్. రాములు
‘యుద్ధం - శాంతి’ అంశంపై కవితలకు ఆహ్వానం
విమలసాహితీ సమితి, అభ్యుదయ రచయితల సంఘం, మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ, సృజన కళల వేదికల సంయుక్త నిర్వహణలో ‘యుద్ధం - శాంతి’ అంశంపై కవితా సంకలనం తీసుకురావాలని సంకల్పించాం. కవితలు 30 లైన్లు లోపు వుండాలి. యూనికోడ్‌లో టైపు చేసి పంపాలి. ఒక కవి ఒక కవిత మాత్రమే పంపాలి. పత్రికలలో ప్రచురితమైన కవితలు కూడా పంపవచ్చు. వీలువెంబడి కవితలు ఆంగ్లంలోనికి అనువదింపబడతాయి. కవితా సంకలనం ఆవిష్కరణ సభలో కవి సమ్మేళనం, కవి సత్కారం ఉంటాయి. కవితలతోపాటు హామీపత్రం తప్పక జత చేయాలి. ఆసక్తిగల కవులు కవితల్ని yuddhamshanti@gmail.comకి నవంబర్ 30వ తేదీలోగా ఈమెయిల్ పంపాలి. పూర్తి వివరాలకు ఫోన్: 94904 69606, 92464 15150.
కలిమిశ్రీ