మూడు తరాల సాహిత్య సేవ
ABN , First Publish Date - 2023-10-23T01:45:35+05:30 IST
తెలుగువారికి సంబంధించినంత వరకు సినిమాలు, రాజకీయాలతో పోలిస్తే సాహిత్య రంగంలో వారసత్వ పోకడలు తక్కువ. అంటే మరీ లేదని కాదు....
తెలుగువారికి సంబంధించినంత వరకు సినిమాలు, రాజకీయాలతో పోలిస్తే సాహిత్య రంగంలో వారసత్వ పోకడలు తక్కువ. అంటే మరీ లేదని కాదు. అన్నమాచార్యులవారి దగ్గర్నుంచి హనుమచ్చాస్త్రి గారి వరకు వారి వారసులు సాహిత్య పరులైన ఉదాహ రణలు చెప్పవచ్చు. కానీ, అలాంటి సందర్భాలు అంతగా కనబడవు. అటువంటిది, మూడు తరాలవారు వరుసగా రచనలు చెయ్యటం, ఒక తరం నుంచి మరొక తరానికి ఆ ప్రతిభ మరింతగా రాణించటం విశేషంగానే చెప్పుకో వాలి. చిర్రావూరువారి కుటుంబంలో ఈ విశేషం జరిగింది.
రసపిపాసి, నవరస పిపాసి
బుక్కన్నా, చక్కని చుక్కన్నా
ఎక్కువ మక్కువ మాస్టార్‌కి.. మా స్టార్‌కి
పొట్లాన్ని విప్పి పకోడీలూ జిలేబీ తింటూ
ఆ కాగితాన్ని చదివితేగానిపారీలేని చదువరి
సిగరెట్‌మీద అడ్డంగా ఉన్న అక్షరాల్ని చూసిన తర్వాతనే
వెలిగించే అలవాటు గల చిలిపి..
- ఇది రోణంకి అప్పలస్వామి మీద చిర్రావూరు సర్వేశ్వర శర్మ (సి.యస్. శర్మ, కొందరికి ఢిల్లీ శర్మ) రాసిన కవితలో ఒక భాగం. ఇందులో పుస్తకం గురించి, చదవటం గురించి రాసిన వాక్యాలు శర్మ గారికి కూడా వర్తిస్తాయి. ‘నడచిన పుస్తకం’గా పేరు పొందిన ఆయనకి పుస్తకాలు కొనటం, చదవటం మీద ఎంత మక్కువ అంటే, చివరి రోజుల్లో ‘‘ఎందుకైనా మంచిది ఉంచమ’’ని కొడుకు జాగ్రత్తగా ఇచ్చిన ఐదు వందల రూపాయల్నీ వెంటనే పుస్తకాలు కొని అవగొట్టేసే అంత. శ్రీశ్రీ, ఆరుద్రతో సహా ఎంతోమంది సాహితీవేత్తలతో పరిచయం ఉన్నవారు. ఇటువంటి విస్తృత అనుభవం ఒక ఎత్తు, ఆయన స్వీయ రచనలు ఒక ఎత్తు. ఇటీవల శతజయంతి సందర్భంగా ఆయన కథల సంపుటిని కుటుంబ సభ్యులు వెలువరించారు. ఈ కథలన్నీ 1939-42 సంవత్సరాల మధ్య, అంటే ఇరవై సంవత్సరాల లోపు వయసులో ఉండగానే, తన పేరుతోనే కాకుండా పలు కలం పేర్లతో రాసి, వివిధ పత్రికలలో ఆయన ప్రచురించిన కథలు. శర్మగారికి సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. ఆయన వాడిన కలం పేర్లు కన్నీటి కలం, సీరియస్, నవ్వుల పాళీ, స్మయిల్స్, శర్మాని వంటివి దానికొక ఉదాహరణ.
ఈ కథలలో కథ కంటే కథనం ప్రధానం. అంతకు మించి, వాక్య నిర్మాణంలో ఒడుపు, చమత్కారం వీటికి జీవం. కథల్లో చాలా వైవిధ్యం ఉంటుంది. స్కెచెస్ లాగా అనిపించేవికొన్నైతే, మరికొన్ని చిన్న కథలు, కొన్ని ప్రేమ లేఖలు, రెండు అనువాదాలు వగైరా. కథా నిర్మాణపరంగా- కొంత మెలోడ్రమెటిక్‌గా అనిపించి, ట్రాజిక్ ముగింపు కలిగిన సామాన్యమైన కథల దగ్గర్నుంచి, ఆలోచనా ధారని, తలపోతని, అంతరంగ మథనాన్ని అద్భుతంగా వర్ణించే కథల వరకు పలురకాలు దొరుకుతాయి. ‘ఆఖరి ప్రేమలేఖ’ అనే కథ చదివినప్పుడు, ఇరవై ఏళ్ళ లోపు వయసు కలిగిన యువకుడు ఈ కథ రాశాడా అనే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రేమ లేఖలు చలం ప్రభావంతో రాసి ఉండవచ్చునని తెలుస్తూనే ఉంటుంది. దాదాపు అన్నిటిలోనూ చలం ప్రస్తావన వస్తుంది. వాటిలో సాధారణంగా కనిపించేవి ఆయన సౌందర్య దృష్టి, మనుషుల మీద కరుణ, వాళ్ళు కొంత కామన్‌సెన్స్ పాటించి, తమ జీవితాల్లో ఎందుకు సుఖపడలేరనే ఆవేదన మొదలైనవి. మనుషులకు ఇతర మనుషుల మీద ఉండే ప్రేమ, ప్రేమ రాహిత్యం, అసూయ, ఓర్వలేని తనం వంటి ఎన్నో లక్షణాలను పరిశీలించి, ఆయన తన కథలలో ఆవిష్కరించారు. శర్మగారికెందుకో నరసమ్మ అనే పేరు మీద కోపం ఉన్నట్టుగా ఉంది. చాలా కథల్లో ఆడ విలన్ పాత్రకి విధిగా ఆ పేరు వాడతారు. వయసుతో బాటు వచ్చే ఆలోచనలని చిత్రించటంలో ప్రతిభ కనిపిస్తుంది. ‘ఆమె ముసలిది’ కథలో ముసలిదాని ఆలోచనలు, ప్రేమలేఖల్లో ఒక ముసలిదాని గురించి లేఖకుడి ఆలోచనలు- ఇవన్నీ మనకు సాధారణంగా కలిగే ఆలోచనలను ప్రతిబింబిస్తాయి.
టీన్స్ లో ఉండగానే ఎన్నో మంచి కథలు రాసిన శర్మగారు ఆ తరువాత ఎందుకు విరమించారో తెలియదు. పరిణత వయస్సులో దానిని కొనసాగిేస్త, మరెన్నో అద్భుతమైన కథల రాసి ఉండేవారని అనిపిస్తుంది. మొత్తం మీద శైలి, నిర్మాణం పరంగా ఆయన తన కాలం కంటే ఎంతో ముందున్నారనే చెప్పాలి. ‘ఆమె ముసలిది’ ప్రచురించిన ఆంధ్ర భూమి సంపాదకులు, ఆ కథ క్రింద ప్రత్యేకమైన నోట్ రాస్తూ ‘‘రచనా ప్రపంచానికి ఈ రచయిత అవతరణం సరికొత్త అనే చెప్పాలి.’’ అని మెచ్చుకోవటం దానికొక తార్కాణం. సంపాదకులు ప్రత్యేకంగా మెచ్చుకునే ఇటువంటి సందర్భం ఎక్కడోగానిచూడం కదా!
శర్మగారిలో ఉన్న సౌందర్య దృష్టి, కవితా హృదయం బహుశా వారి తండ్రిగారైన చిర్రావూరు కామేశ్వరరావుగారి దగ్గర్నుంచి వచ్చి ఉండవచ్చు. ఆయన కవి, రచయిత, బహుభాషా కోవిదుడు. శర్మగారి శతజయంతి సందర్భంగా కామేశ్వరరావుగారి రచనలతో కూడిన ఒక సంకలనాన్ని ప్రచురించారు. ఒకటి రెండు కథలు చేర్చినా, ప్రధానంగా ఇది పద్య ఖండికల కూర్పు. 1918-38 మధ్య రాసిన ఈ పద్య, గద్య రచనలు భాషా పరంగా సరళ గ్రాంథికంలో ఉంటాయి. ఎన్నో తాత్విక, చారిత్రిక, పౌరాణిక అంశాలకు సంబంధించిన ఖండికలు ఇందులో ఉన్నాయి. పద్య రచనలో మంచి ధార, ఊహాశక్తి, నిర్మాణంలో వైవిధ్యంతో కూడిన అల్లిక మనల్ని అలరిస్తాయి. తన కవిత్వం గురించి చెబుతూ, ‘‘సాత్త్వికానంద బంధుర స్వాంతము నను, నాంతరంగిక భావమే ననువదింతు’’ అంటారు. ప్రాథమికంగా మానవతా వాదం అనేక కవితల్లో కనిపించినా, అదే సమయంలో ‘‘చంపగలవు ప్రాణుల బ్రతికింప లేవు, తెంపగలవు పూవుల రచియింప లేవు’’ అంటూ అతని అహంకారాన్ని ప్రశ్నించే పనిని సమర్థ వంతంగా చెయ్యగలరు. వచన కవిత్వం రాసే కవులు ఎందువల్లనో ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వని అంశం పౌరాణిక, చారిత్రిక పాత్రలకు, సంఘటనలకు తమ కవిత్వంలో చోటు కల్పించటం. ఈ పనిని జాషువా, కరుణశ్రీ వంటి వారు తమ ఖండికల్లో నిర్వహించారు. రాజ భిక్షువు, వేణీ సంహారము, అపర భీష్ముడు - ఇలా ఎన్నో ఖండికలలో కామేశ్వరరావు గారు అటువంటి ప్రయత్నమే చేశారు. వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగినది ‘కౌసల్యా విలాపము’. రామాయణంలో అనేక పాత్రల స్వగతానికి కవితా రూపం ఇవ్వటం మనం ఇంతకు ముందుచూసే ఉండవచ్చు. కానీ, రాముడు అడవుల పాలు కావటం గురించి కౌసల్య పడే మనోవేదనను చిత్రించే ఖండిక వంటిది అరుదు. కవితా నిర్మాణం దృష్ట్యా ఇందులో ఒక విశేషం ఉంది. పుష్య మాసం నుండి మొదలు పెట్టి, కార్తీక మాసం వరకు వివిధ ఋతువులలో రాముడు, సీత పడే బాధలను ఒకటొకటిగా తలుచుకొని, విలపించటం ఇందులో కథాంశం. ‘‘శల్య సంస్పర్శనముసేయు చలికి నెంత/ పరితపించునో మాఘ వాసరములందు’’ అని, ఆశ్వీయుజ మాసంలో ‘‘జాలి పడదె మా జానకి జన్మ గరిమ/ యడవిగాచినవెన్నెలయ్యయ్యెననుచు’’ అని దుఃఖిస్తూ, చివరకు కైకతో ‘‘మనకు రాణివాసమె దండకారణ్యమయ్యె’’ అంటూ ముగించటం ఎంతో సముచితంగా ఉంది. ‘అమర రాజ్యము’ మరొక ఆసక్తికరమైన ఖండిక. చరిత్రలో వివిధ రాజులు/ చక్రవర్తులుఏమైనారని మొదట ప్రశ్నిస్తూ, తరువాత ప్రపంచంలో శాంతిని, ధర్మ సంరక్షణను, చిత్తసంస్కా రాన్ని బోధించిన ‘సప్త ఋషులు’గా క్రీస్తు, చైతన్య ప్రభువు, మహమ్మదు, బుద్ధుడు, శంకరుడు, గురునానక్, రాజా రామమోహనరాయ్ వంటి వారిని ప్రస్తుతించటం ఆయనలో ఉన్న శాంతి కాముకతను, సర్వమతాలను సమానంగా చూడగలిగే హృదయ వైశాల్యాన్ని సూచి స్తుంది. కామేశ్వరరావుగారు తన సాహితీ ప్రతిభ, పద్య నిర్మాణ శక్తి పరిణతి చెందుతున్న దశలో, చిన్న వయసు లోనే పరమపదించటందురదృష్టం. వారు మరికొంత కాలం జీవించి ఉంటే, సుసంపన్నమైన రచనలు మరి కొన్ని వెలువరించి ఉండేవారనటంలో సందేహం లేదు.
తాత, తండ్రుల సాహిత్య వారసత్వాన్ని అందుకున్న మూడో తరం రచయిత, మెడికో శ్యామ్‌గా చిరపరిచితు లైన డా. చిర్రావూరు శ్యామ్. ఆయన రచనలలో సృజ నాత్మకత, ఊహా వైచిత్రి, చమత్కారం సరికొత్త తీరాలకు చేరాయని చెప్పవచ్చు. మెడికల్ కాలేజీ విద్యార్థిగా ఉన్న రోజులనాటి కథలు 1970-80లలో ఆంధ్రజ్యోతి వార పత్రిక చదివే పాఠకులందరికీ గుర్తుండే ఉంటాయి. వాటినే చాలాకాలం తరువాత అమెరికా వంగూరి ఫౌండేషన్ వారు ‘శ్యామ్ యానా’ పేరుతో పుస్తకంగా తీసుకువచ్చారు. ఈయన కథలలో నిర్మాణం, సన్నివేశ కల్పన, ఆలోచనల ట్రెయిన్, ముఖ్యంగా పదాలతో చేసే గారడీ చదివేవారికి ఆశ్చర్యం కలిగిస్తాయి. నత్తివాడి స్వగతంగా చెప్పే ‘నత్తివాడి కథ’లో ఒక ఆలోచన మరొక ఆలోచనకి దారితీసే విధానం, తన తల్లి గురించి, నత్తివాడిగా తన అనుభవాల గురించి, తను ఇష్టపడిన సరళతో సహా నత్తి మూలంగా తాను పొందలేకపోయిన వాటి గురించి చెప్పే వాక్యాలు పాఠకుల మనసుల్ని మెలిపెడతాయి. ఉద్వేగంతో నిండిన వర్ణనతో ఈ కథ కొన్ని చోట్ల కవితలాగా సాగుతుంది. డాక్టరుగా అనుభవంతో రాసిన ‘ముక్కుపుడక’, ‘కాఫీ’, ‘ఐసీసీయూ’ వంటి కథలు ఆలోచింపజేస్తాయి. హాస్పిటల్స్‌లో జరిగే సంఘటనల్ని మనం చూసే పేషెంటు దృష్టికోణంలో కాకుండా, డాక్టరు దృష్టికోణంలో ఇవి చూపిస్తాయి. రచనా సామర్థ్యమే కాకుండా, అపారమైన జ్ఞాపకశక్తి, ఎంతోమంది సాహితీమూర్తులతో మెలిగిన అనుభవం, ఢిల్లీ జీవితంలో ఇతర ప్రాంతాల వారితో సంపర్కం- అన్నీ కలిసి శ్యామ్‌ని మంచివక్తగా, వ్యాసకర్తగా రూపొందించాయి. చాగంటి తులసిగారు ఈయన కథల్ని హిందీలోకి అనువదించారు.
సాహిత్యంతో సంబంధంలేని వృత్తిలో ఉండటం, పువ్వు పుట్టగానే పరిమళించినట్టు పిన్న వయసులోనే విశేషమైన రచనలతో పాఠకులని, సంపాదకులని మెప్పించటం, ఆ తరువాత ఏదో కారణంతో వారి రచనా ప్రవాహం అర్ధాంతరంగా ఆగిపోవటం ఈ ముగ్గురిలో ఉన్న ఒక సామాన్య లక్షణం. యౌవనంలో విరివిగా రాసిన శ్యామ్, చాలాకాలం విరామం తీసుకుని, ఇటీవలే మిత్రుల కోరిక మీద మళ్ళీ కొన్ని మంచి కథలు రాశారు. తొలినాళ్ళలో వచ్చిన ఆ ప్రేరణ కొన్ని సంవత్సరాల పాటు ఆరిపోకుండా కొనసాగితే బాగుండేదనిపిస్తుంది. ఏది ఏమైనా, తమ కుటుంబం నుండి మూడుతరాల రచయితలు రావటం, వారి నుండి ఉత్తమమైన రచనలు వెలువడటమనేది తెలుగు సాహిత్యానికి చిర్రావూరు వారిచ్చిన విలువైన కానుకగా భావించవచ్చు.
విన్నకోట రవిశంకర్