ఉక్కు కవాటాల గుండె!

ABN , First Publish Date - 2023-07-22T00:46:59+05:30 IST

నిదురించిన ప్రజలను మేల్కొలిపి వారి హృదయాల్లో చైతన్యాల వెలుగులు విరజిమ్మిన మహాకవితా సారథి దాశరథి. నిజాం ఏలుబడిలో రైతుల కష్టాలను, కూలీల కన్నీటిని చూసి అంతరంగ క్షోభను అనుభవించారు.

ఉక్కు కవాటాల గుండె!

నిదురించిన ప్రజలను మేల్కొలిపి వారి హృదయాల్లో చైతన్యాల వెలుగులు విరజిమ్మిన మహాకవితా సారథి దాశరథి. నిజాం ఏలుబడిలో రైతుల కష్టాలను, కూలీల కన్నీటిని చూసి అంతరంగ క్షోభను అనుభవించారు. జాతి, భాషల అణచివేత ఆయనను మరీ కలవరపరిచింది. ‘తెల్లవాడు మన యింటిని గుల్లచేసెను/ నిజాం రాజు మన భాషకు నిప్పు పెట్టెను’ అని వేదన పడ్డారు. ఆ సర్కారు తీరుపై దాశరథి కన్నా గొప్పగా పోరాడినవారు, శిక్షలు అనుభవించినవారు ఎందరో ఉన్నా ఆయన చురకత్తి లాంటి పలుకుల కవితలు ఏలికలకు ములుకులుగా గుచ్చుకునేవి.

ఆయన ఉద్యమోపజీవి. ఉద్యమాలను ముద్దాడారు. జాతి బాగు కోసం అహరహరం తపించారు. ఆయనను ఆరాటపెట్టే సమస్య ఏదో ఒకటి కవితకు ఇతివృత్తంగా ఉండేది. అయితే అది పదిమందికీ పనికి వచ్చేలా ఉండాలే తప్ప వ్యక్తిగతం కాకూడదని భావించేవారు. జీవితమే పోరాటమని, పోరాటం నుంచి కవిత్వం, కళ పుడతాయని దాశరథి విశ్వసించారు.

తెల్లవారి ఏలుబడి నుంచి దేశం విముక్తి చెందినా, నిజాం తనను తాను స్వతంత్రుడిగా ప్రకటించుకున్నారు. తన రాష్ట్రంలో జాతీయ పతాకం ఎగరడానికి వీలులేదని ‘ఫర్మానా’ జారీ చేశారు. రజాకారుల అకృత్యాలకు గుండె రగిలిన దాశరథి నిజాం రాజుపై కవితాశరాలు ఎక్కుపెట్టారు. ‘ముసలి నక్కకు రాచరికంబు దక్కునే?’ అని నేరుగా నిజాంను నిలదీశారు. స్టేట్‌ కాంగ్రెస్‌ సత్యాగ్రహంలో పాల్గొనడంతో దాశరథికి ఏడాదిన్నర కఠినమైన జైలు శిక్ష పడింది. నిజామాబాద్‌ జైలుకు చేరుకున్న ఆయనకు అక్కడ ప్రజాకవి వట్టికోట ఆళ్వార్‌ స్వామితో స్నేహం కుదిరింది. దాశరథి జైలు గోడ మీద బొగ్గుతో రాసిన కవిత: ‘ఓ నిజాము పిశాచమా! కానరాడు.../ నిను బోలిన రాజు మాకెన్నడేని/ తీగెలను తెంపి అగ్నిలో దింపినావు/ నా తెలంగాణ కోటి రతనాల వీణ’ వట్టికోటకు మహదానందాన్ని కలిగించేదట. జైలు సిబ్బంది దానిని తుడిచే కొద్దీ, పళ్లు తోముకునేందుకు ఇచ్చే బొగ్గుతో మళ్లీమళ్లీ రాస్తూనే ఉండేవారట. అది భరించలేని ప్రభుత్వం ఆళ్వార్‌ స్వామిని మరో చోటికి మార్చింది.

‘అది తెలంగాణలోని దావాగ్ని లేచి/ చుట్టిముట్టిన భయద సంక్షోభ వేళ/ అది నిజాము నృపాలుని అండదండ/ చూచుకొని నిక్కినట్టి పిశాచి హేల’ అనగలిగిన ధీశాలి దాశరథి. ప్రజాకంటకులు నశించి తీరుతారని ఆయన ప్రగాఢ విశ్వాసం. ‘మూడు కోట్ల చేతులు నీ మేడను పడదోస్తాయి/ నీ మెడను విరిచేస్తాయి/ నీకు నిలుచునే హక్కు లేదు/ నీకింకా దిక్కులేదు’ అని హెచ్చరించారు. ‘దిగిపొమ్మని జగత్తంతా నగారుల కొడుతున్నది/ దిగిపోవోయ్‌ తెగిపోవోయ్‌’ అంటూ పిడికిలెత్తారు. ‘విషము గుప్పించినవాడు నొప్పించినవాడు/ మా నిజాం రాజు జన్మజన్మల బూజు’ అని నినదించారు. ‘ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో...’ వాక్యం సర్వకాల నిరంకుశ పాలకులకు ఎత్తిపొడుపు, పాలితులకు సానుభూతి. నిజాం రాష్ట్రంలో ఉంటూ పాలకుడిని ‘ముసలి నక్క, జన్మజన్మల బూజు’ అనడానికి ఎంత సాహసం కావాలి? అది దాశరథిలో పుష్కలంగా ఉంది. ‘తెగింపు’ ఆయన సొంతం.

జనవరి 11, 1948న రజాకారుల దాడిలో శారీరకంగా బలహీనుడు, లఘుకాయుడైన ఆయనకు ప్రాణాంతక దెబ్బలు తగిలాయి. ఒక దశలో ఆయన ఇక దక్కరు అని సహచరులు ఆందోళన చెందారు. అయినా వెరవలేదు. ‘గాయం లలిత కళా సృష్టికి సాయం. కవికి గాయకుడికి, చిత్రకారుడికి అదే ధ్యేయం’ అన్నారు.

1948 సెప్టెంబర్‌ 13వ తేదీ వేకువజామున భారతసైన్యం అన్ని వైపుల నుంచి హైదరాబాద్‌ రాష్ట్రంలో ప్రవేశించడంతో నిజాం సైన్యం నీరుగారి పోయింది. తాను బేషరతుగా లొంగిపోతున్నట్లు నిజాం రాజు మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ అదే నెల 17వ తేదీన రేడియోలో ప్రకటించారు. తన లక్ష్యాల్లో ప్రధానమైన తెలంగాణకు విముక్తి సిద్ధించడంతో దాశరథి ‘రుద్రవీణ’ కవితా సంపుటిని తెలంగాణకు అంకితం చేసి ‘మాతృభూమి’ రుణం తీర్చుకున్నట్లు భావించారు.

స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చే పది ఎకరాల భూమిని, ఇంటి స్థలాన్ని వారికి ప్రభుత్వం ఇవ్వజూపింది. సమాజ హితమే తప్ప వ్యక్తిగత లబ్ధి కోరని దాశరథి సోదరులు దానిని తిరస్కరించారు. ‘‘తాను సంస్కృతాంధ్ర సంస్కృతికి పట్టుగొమ్మగా నిలిచినా పట్టుగొమ్మల పట్టు చిక్కించుకుని ప్రభుత్వ కరుణా కటాక్షాలకై పాకులాడలేదు. ‘పట్టు’ పరిశ్రమలో పట్టా పుచ్చుకున్నవాడు కాదు. దొరవారిసత్రపు వారసత్వ దూలాలకు, పొగచూరిన చూరులకు వ్రేలాడిన దివాంధుల జాబితాలో ఆయన చేరలేదు’’ అని ఆయనకు అత్యంత సన్నిహితులలో ఒకరైన ప్రఖ్యాత కవి వేటూరి సుందర రామమూర్తి ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. దాశరథికి జన్మతః అబ్బిన భావనాపటిమ, స్వయంశక్తి, జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు, ఏ ఇజాలకు లొంగకపోవడం, రాజకీయపక్షాలకు అమ్ముడుపోకపోవడం, నిరంతరం ప్రజాసమస్యలపై పోరాటం వల్లనే తెలుగు హృదయపీఠంపై ‘ప్రజాకవి’గా నిలిచిపోయారు.

ఆరవల్లి జగన్నాథస్వామి

(నేడు దాశరథి జయంతి)

Updated Date - 2023-07-22T00:46:59+05:30 IST