ఉండేది, ఉన్నది

ABN , First Publish Date - 2023-09-18T00:23:49+05:30 IST

నిత్య నూతనోత్తేజం గుండెకాయ వంటి ఒక ఊరు ఉండేది ఎడతెగక పారే నిమ్నోన్నతాల ఒక ఏరు ఉండేది ఒక పొలం ఉండేది పొద్దులు నిండిన ఒక చెరువు ఉండేది తల్లి ఒడి లాటి ఇల్లు ఉండేది...

ఉండేది, ఉన్నది

నిత్య నూతనోత్తేజం

గుండెకాయ వంటి

ఒక ఊరు ఉండేది

ఎడతెగక పారే

నిమ్నోన్నతాల

ఒక ఏరు ఉండేది

ఒక పొలం ఉండేది

పొద్దులు నిండిన

ఒక చెరువు ఉండేది

తల్లి ఒడి లాటి ఇల్లు ఉండేది

సూర్య చంద్రులను ఒడిసిపట్టి

తాబేలుకు లాల పోసి జోల పాడే

ఒక చేద బావి ఉండేది

భుజంపై చెయ్యి వేసి

విశ్వాసం నింపే

ఒక స్నేహితుడు ఉండేవాడు

నెమరు మస్తు మజా

ఎవరిపై కోపం ఉండదు

ఎవరితో కొట్లాట జరుగదు

2

తొలి సంధ్య ఉడుకుడుకు సూర్యున్ని

సద్దిముల్లె కట్టుకొని

పట్నం అడ్డాలో లేబర్‌గా నిలబడి

ఊరు ఇప్పుడు వృద్ధాశ్రమం అయింది

ఇసుక రూపాయి అయిపోయింది

నడుము విరిగి ఏరు అంపశయ్యపై

మరణం కోసం ఎదురుచూస్తుంది

పొలం హలం హలాహలం మింగి

పంటకు మంట పెట్టుకుంటున్నయ్‌

చెరువుకు గండ కరువు వచ్చింది

పిల్లల కోడి ఇల్లును

గద్ద తన్నుకు పోయింది

చేద బావి జలకళ పోయి

మనోవేదనతో కన్నుమూసింది

స్నేహం విడిచి ఊరు విడిచి

మలిసంధ్య ఎర్రమందారమైపోయిండు

ప్రస్తుతం కొడుకును కోల్పోయిన

కుటుంబంలా తల్లాడుతుంది

అంటే పెద్ద తగువు

అనకుంటే గుండె బరువు

జూకంటి జగన్నాథం

Updated Date - 2023-09-18T00:23:49+05:30 IST