వర్ణ వివక్షపై పోరులో విన్నీ, మండేలా

ABN , First Publish Date - 2023-05-20T02:00:05+05:30 IST

బహుళ జాతులకు నెలవు అయిన దక్షిణ ఆఫ్రికాలో నాకు చాలా కాలంగా ఆసక్తి ఉంది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం అధ్యాపనం, పరిశోధనల నిమిత్తం ఆ దేశానికి వెళ్లాలని కూడా ఆలోచించాను....

వర్ణ వివక్షపై పోరులో విన్నీ, మండేలా

దక్షిణ ఆఫ్రికాలో శ్వేత జాత్యహంకార పాలనకు వ్యతిరేకంగా నల్ల జాతి ప్రజల పోరాటంలో కీలక పాత్ర వహించిన నెల్సన్ మండేలా, ఆయన జీవన సహచరి విన్నీ జీవిత కథే స్టెయిన్ బెర్గ్ రాసిన ‘విన్నీ అండ్ నెల్సన్’. ఒక వివాహాన్ని, ఒక జాతి ప్రజలను, ఒక దేశాన్ని, ఒక నిర్దిష్ట కాలాన్ని ప్రజ్ఞావంతంగా వర్ణించిన అద్భుత రచన ఆ పుస్తకం. సాహిత్య ప్రక్రియ పరంగా వర్గీకరణకు వీలు లేని ‘విన్నీ అండ్ నెల్సన్’ ఏకకాలంలో జీవిత కథ, చరిత్ర, రాజకీయ వ్యాఖ్యానం, కాల్పనికేతర కథనాల సమ్మేళనం.

బహుళ జాతులకు నెలవు అయిన దక్షిణ ఆఫ్రికాలో నాకు చాలా కాలంగా ఆసక్తి ఉంది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం అధ్యాపనం, పరిశోధనల నిమిత్తం ఆ దేశానికి వెళ్లాలని కూడా ఆలోచించాను. అమానుష వర్ణ వివక్ష పాలన నుంచి విముక్తి పొందిన దక్షిణ ఆఫ్రికాకు మానవోత్తముడు నెల్సన్ మండేలా ప్రథమ అధ్యక్షుడుగా ఎన్నికయిన సందర్భమది. మానవ స్వాతంత్ర్యం కోసం మహోన్నత పోరాటం చేసిన ఆ భూమి, ఆ ఆఫ్రికన్‌ ప్రజలను ప్రత్యక్షంగా చూడాలన్న ఉత్సుకత నాలో ఎంతగానో ఉండేది. అయితే నేను ఆకాంక్షించిన పని లభించకపోవడంతో ఆ దేశానికి ఉద్యోగ రీత్యా వెళ్లడం జరగలేదు. అయినప్పటికీ దక్షిణ ఆఫ్రికాలో పరిణామాలను నిశితంగా గమనిస్తూ వచ్చాను. విహార యాత్రకు లేదా స్నేహితులను చూసేందుకు ఆ తరువాత నేను ఐదుసార్లు ఆ దేశానికి వెళ్ళాను. ముఖ్యంగా దక్షిణ ఆఫ్రికాలో ఒకప్పుడు రెండు దశాబ్దాల పాటు గడిపిన ఒక భారతీయుడి గురించి అక్కడి చారిత్రక పత్రాల భాండాగారాల్లో పరిశోధన నిమిత్తమే నేను ఆ దేశానికి వెళ్లాను. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గురించి నేను ప్రస్తావించానని మీరు అర్థం చేసుకునే వుంటారు.

ఇటీవల నేను చదివిన ఒక పుస్తకం దక్షిణ ఆఫ్రికాలో నా ఆసక్తిని సరికొత్తగా అంకురింపచేసింది. అది, జొన్నీ స్టెయిన్ బెర్గ్ రాసిన ‘విన్నీ అండ్ నెల్సన్’. నెల్సన్ మండేలా (1918–2013), విన్నీ మడికిజెలా (1936–2018) వివాహ గాథ అది. ఆ దంపతుల కథ ద్వారా దక్షిణ ఆఫ్రికా సంక్లిష్ట, సంఘర్షణాయుత చరిత్రపై ఒక కొత్త గవాక్షాన్ని స్టెయిన్ బెర్గ్ పుస్తకం తెరిచింది. 1957లో నెల్సన్, విన్నీల మొట్ట మొదటి సమావేశ వివరాలతో స్టెయిన్ బెర్గ్ తన ఉత్తేజకర కథనాన్ని ప్రారంభించారు. విన్నీ అందచందాలకు నెల్సన్ పరవశుడయ్యారు అప్పటికే ఆయన వివాహితుడు, నలుగురు బిడ్డల తండ్రి. పైగా వయసులో విన్నీ కంటే ఇంచుమించు ఇరవై ఏళ్లు పెద్దవాడు. అయినప్పటికీ ఆమె పట్ల అమితంగా ఆకర్షితుడయ్యారు. ఉదాత్త వ్యక్తిత్వం గల నెల్సన్ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌లో ప్రభవిస్తున్న నాయకుడుగా ప్రజాజీవితంలో ప్రముఖుడుగా వెలుగొందుతున్నారు. విన్నీ సైతం ఆయన పట్ల సహజంగానే ఆకర్షితురాలు అవడంలో ఆశ్చర్యమేమీ లేదు.

‘ఏ పోర్ట్రైట్ ఆఫ్ ఏ మ్యారేజ్’ అనేది స్టెయిన్ బెర్గ్ పుస్తకం ఉపశీర్షిక. ఇదొక సముచిత వర్ణన. విన్నీ, నెల్సన్ మధ్య అనుబంధాన్ని రచయిత చాలా సున్నితంగానూ సాధికారితతోనూ చిత్రించారు. వారు నడయాడిన కాలంలోని సామాజిక, రాజకీయ చరిత్ర నేపథ్యంలో ఆ దంపతుల మధ్య వికసించిన సంబంధాన్ని హృద్యంగా, నిశితంగా రూపుకట్టాడు. నెల్సన్ , విన్నీల వ్యక్తిత్వాలు, పోరాటాలు, త్యాగాలను లోతుగా, విపులంగా స్టెయిన్ బెర్గ్ వివరించారు.

నెల్సన్ మండేలా, విన్నీ మడికిజెలాలు 1958లో వివాహం చేసుకున్నారు వారికి వరుసగా ఇద్దరు కుమారులు జన్మించారు. అయితే ప్రజా జీవితంలో నిమగ్నమై ఉన్న నెల్సన్‌కు తన బిడ్డలకు తండ్రి ప్రేమ నందించేందకు సమయం లేకపోయింది. విన్నీ రెండో కుమారుడు జన్మించిన కొద్ది రోజులకే నెల్సన్ అజ్ఞాత జీవితంలోకి వెళ్లిపోయారు. 1963లో శ్వేత జాత్యహంకార పాలకులు ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. దీంతో విన్నీ, ఆమె బిడ్డలు ఆయన నుంచి పూర్తిగా వేరుపడ్డారు.

‘విన్నీ అండ్ నెల్సన్’ తొలి పుట నుంచి తుది పుట దాకా ఏకబిగిన చదివించే పుస్తకం. అయితే మండేలా 27 ఏళ్ల జైలు జీవితం గురించిన అధ్యాయాలు మరింత విశేష స్థాయిలో ఆసక్తిగొలుపుతాయి. రోబెన్ ఐలెండ్ జైలులో రాళ్లు కొట్టడం మొదలైన కాయకష్టం పనులు చేస్తూనే నెల్సన్ మండేలా తన భావి రాజకీయ వ్యూహాలను రూపొందించుకునేవారు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌లోని వివిధ వర్గాల గురించి స్టెయిన్ బెర్గ్ చాలా జాగ్రత్తగా వివరించారు. హింసాత్మక కార్యకలాపాలకు భయపడని కమ్యూనిస్టులు, వీరిని వ్యతిరేకించే ఉదారవాదుల మధ్య తటస్థంగా ఉండడానికి నెల్సన్ ప్రయత్నించేవారని స్టెయిన్ బెర్గ్ వ్యాఖ్యానించారు. జాత్యహంకార పాలకులకు వ్యతిరేకంగా పోరాడింది కేవలం ఎఎన్‌సి మాత్రమే కాదన్న సత్యాన్ని ఆయన గుర్తించారు. పాన్ ఆఫ్రికనిస్ట్ కాంగ్రెస్, దాని నేత రాబర్ట్ సొబుక్వే గురించి స్టెయిన్ బెర్గ్ విపులంగా రాశారు.

ఇదిలా వుండగా సోవెటోలో కొత్త జీవితాన్ని ప్రారంభించడంతో పాటు ప్రజా జీవితంలో తనకొక ప్రత్యేకస్థానాన్ని సాధించుకునేందుకు విన్నీ ప్రయత్నించారు. జాత్యహంకార పాలకులపై తనదైన రీతిలో పోరాడుతూనే తన సొంత పిల్లల భవిష్యత్తు కోసం ఆమె చాలా కష్టాలు పడ్డారు. తరచు ఆమె జైలుకు వెళ్ల వలసివచ్చేది. అయినా ఈ కష్టనష్టాలను ఆమె లెక్క చేసేవారు కాదు. మరింత ముఖ్యమైన విషయమేమిటంటే ఆమె తీసుకున్న ఒక నిర్ణయం సాహసోపేతమైనది. జైలు వాసంలో ఉన్న మండేలా భార్యగా ఆయన స్థానంలో ప్రజల నాయకురాలుగా ఆమె తనను తాను ప్రకటించుకున్నారు. విన్నీ వ్యవహార శైలిలో ఒక నాటకీయత కొట్టొచ్చినట్టు కనిపించేది. విదేశీ విలేఖర్లకు ఆమె తరచు ఇంటర్వ్యూలు ఇస్తుండేవారు. విన్నీ ఇంటర్వ్యూల ద్వారానే నెల్సన్ మండేలా గురించి, ఆయన పోరాటాల గురించి విశాల ప్రపంచానికి తెలిసింది.

జాతి వివక్షా పాలనా విధానాన్ని ఇంకెంత కాలమో కొనసాగించ లేమన్న సత్యాన్ని దక్షిణ ఆఫ్రికా శ్వేత జాత్యహంకార పాలకులు 1980వ దశకం తుదినాళ్లలో అర్థం చేసుకున్నారు. వర్ణ వివక్ష వ్యవస్థకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఆ జటిల సమస్య నుంచి బయటపడేందుకు జైలులో ఉన్న నెల్సన్ మండేలాతో వారు చర్చలు ప్రారంభించారు. జాత్యహంకార ప్రభుత్వానికి చెందిన ఇద్దరు యువ ఇంటెలిజెన్స్ అధికారులు మండేలాతో సుదీర్ఘంగా సంభాషణలు జరిపారు. ‘మండేలాను ప్రలోభ పెట్టడం అసాధ్యమని’ వారు తమ రహస్య నివేదికలో స్పష్టం చేశారు. ఆ యువ అధికారులు ఇంకా ఇలా రాశారు: ‘ఎట్టి పరిస్థితులలోనూ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పట్ల ఆయన తన విధేయతను విడనాడేలా చేయలేము. మండేలా రాజకీయ విశ్వాసాలు ప్రగాఢమైనవి. వాటికే ఆయన కట్టుబడి ఉంటారు. ఆయన ఆధ్యాత్మికశక్తి ఆశ్చర్యం గొలుపుతుంది. ప్రత్యర్థులపై ఎలాంటి ప్రతీకార వైఖరి ఆయనలో ఏ కోశానా కన్పించదు. సంపూర్ణ సౌజన్యమూర్తి. లక్ష్య సాధన పట్ల ఆయన చిత్తశుద్ధి సందేహాతీతమైనది’.

ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు, 1922లో అహ్మదాబాద్‌లో రాజద్రోహం ఆరోపణతో మహాత్మాగాంధీపై విచారణ జరిపిన న్యాయమూర్తి రాబర్ట్ బ్రూమ్ పీల్డ్ వ్యాఖ్యలు గుర్తుకు వచ్చాయి. ‘నేను ఇప్పటివర‍కు విచారణ జరిపిన, భవిష్యత్తులో విచారణ జరపబోయే మరే వ్యక్తి కంటే మీరు పూర్తిగా భిన్నమైన వారు. ఫలానా కోవలోకి వచ్చే వ్యక్తిగా మిమ్ములను పరిగణించడం అసాధ్యం’ అని బ్రూమ్ ఫీల్డ్ తన తీర్పులో పేర్కొన్నారు. ఆయన ఇంకా ఇలా వ్యాఖ్యానించారు: ‘మీ సహచరదేశ వాసుల దృష్టిలో మీరు ఒక గొప్ప దేశభక్తుడుగా, మహా నాయకుడుగా గౌరవ మన్ననలు అందుకుంటున్నారన్న వాస్తవాన్ని విస్మరించడం అసాధ్యం. రాజకీయాలలో మీతో విభేదించేవారు సైతం మిమ్ములను ఉన్నతాదర్శాల వ్యక్తిగాను, ఉత్కృష్ట మానవుడుగాను, ఋషితుల్యుడుగాను భావిస్తున్నారు’. గాంధీకి ఆరు సంవత్సరాల కఠిన కారాగారశిక్ష విధిస్తూ బ్రూమ్ ఫీల్డ్ ఇలా పేర్కొన్నారు: ‘భారత్‌లో సంభవిస్తున్న సంఘటనల క్రమంలో, మీ శిక్షా కాలాన్ని తగ్గించి, విడుదల చేయడం ప్రభుత్వానికి సాధ్యమయితే అందుకు నా కంటే మరెవ్వరూ ఎక్కువగా సంతోషించరు’.

తమను, తమ ప్రజలను అణచివేస్తున్న సామ్రాజ్యవాద పాలకులలో సైతం మానవతను పురిగొల్పడమనేది గాంధీ, మండేలా ల గొప్పదనానికి అజరామర చిహ్నమని నేను భావిస్తున్నాను. 1990 ఫిబ్రవరిలో మండేలా 27 ఏళ్ల జైలు వాసం నుంచి విడుదలయ్యారు. విన్నీ తన పక్కన ఉండగా విలేఖర్లతో మాట్లాడుతూ జాతి భేదాలులేని, నిజమైన ప్రజాస్వామిక దక్షిణ ఆఫ్రికా ఆవిర్భవించగలదనే ఆశాభావాన్ని మండేలా వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం అనంతరం అవాజ్య ప్రేమానురాగాలు, సమున్నత రాజకీయ విశ్వాసాలతో మళ్లీ కలిసిన దంపతులుగా నెల్సన్, విన్నీ ఆనాడు ప్రపంచానికి కనిపించారు. నిజానికి ఆ కలయిక ఒక భ్రమ మాత్రమే. రెండున్నర దశాబ్దాలకు పైగా ఎడబాటు వారిలో మరింత దూరాన్ని పెంచింది. రాజీ సాధ్యంకాని విధంగా ఇరువురి మధ్య అగాధం ఏర్పడింది. విన్నీ వ్యవహారాలు మండేలాకు మనస్తాపం కలిగించాయి. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, ఆమెకు మధ్య ఉన్న విభేదాలు మరింత తీవ్రం కావడం కూడా మండేలాను అమితంగా బాధించాయి వ్యక్తిగతంగాను, రాజకీయంగాను వేరుపడడమనేది ఆ దంపతులకు అనివార్యమయింది. అదే జరిగింది.

నెల్సన్, విన్నీ 1996లో విడాకులు తీసుకున్నారు. వేరయిన దారుల్లో ఆ ఇరువరి విడివిడి జీవన ప్రస్థానాల ఆఖరి అంకాల వరకు స్టెయిన్ బెర్గ్ కథనం కొనసాగింది. 2013 డిసెంబర్‌లో నెల్సన్ కీర్తిశేషుడయ్యారు. నాలుగున్నర సంవత్సరాల అనంతరం విన్నీ శాశ్వతంగా విశ్రమించారు. నెల్సన్ మరణశయ్యపై ఉన్నప్పుడు ఆయన్ని పరామర్శించేందుకు విన్నీ రావడం గురించి స్టెయిన్ బెర్గ్ వివరించిన తీరు పఠితలను ఉద్వేగ భరితులను చేస్తుంది. నెల్సన్ జైలు నుంచి విన్నీకి రాసిన ప్రేమాస్పద లేఖల నుంచి పుస్తక రచయిత చేసిన ఉటంకింపులు మన మనస్సుల్లో రస స్పందనలను, మానవతా స్పర్శను కలిగిస్తాయి. నిష్కర్షగా పరిశోధించి, మనోహరమైన శైలిలో రాసిన ‘విన్నీ అండ్ నెల్సన్’ ఆ ఇరువురి వ్యక్తిగత జీవితాలపైనే కాకుండా, వారి జీవిత కాలంలో సంభవించిన రాజకీయ పరిణామాలపై కూడా మనకు నిశిత దృష్టిని కలిగిస్తుంది. ఒక వివాహాన్ని, ఒక జాతి ప్రజలను, ఒక దేశాన్ని, ఒక నిర్దిష్ట కాలాన్ని ప్రజ్ఞావంతంగా వర్ణించిన అద్భుత రచన స్టెయిన్ బెర్గ్ పుస్తకం. సాహిత్య ప్రక్రియ పరంగా వర్గీకరణకు వీలులేని ‘విన్నీ అండ్ నెల్సన్’ ఏకకాలంలో జీవిత కథ, చరిత్ర, రాజకీయ వ్యాఖ్యానం, కాల్పనికేతర కథనాల సమ్మేళనం. దక్షిణ ఆఫ్రికాపై ఎటువంటి ఆసక్తి లేనివారికి సైతం ఆ పుస్తక పఠనం ఒక మానవీయ సంస్కారాన్ని, పరిపూర్ణ జ్ఞాన వికాసాన్ని కలిగిస్తుంది.

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2023-05-20T02:06:38+05:30 IST