పోటీ పరీక్షలకు మెంటార్ అవసరమా? నిపుణులు ఏమంటున్నారంటే..!
ABN , First Publish Date - 2023-07-29T18:15:05+05:30 IST
కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే సందర్భాన్ని బట్టి జీవితంలో కొంతమందిని మానసికంగా రోల్‌మోడల్‌గా భావిస్తుంటాం. పలానా దగ్గర ట్యూషన్‌కి వెళ్ళు, పలానా పుస్తకం చదువు అనే తాత్కాలిక సలహాలు ఇచ్చే వ్యక్తులు ఉంటారు. వారిని శాశ్వత మెంటార్‌గా భావించలేము. అభ్యర్థి వెన్నంటి ఉండి అన్నింట్లోనూ
కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే సందర్భాన్ని బట్టి జీవితంలో కొంతమందిని మానసికంగా రోల్‌మోడల్‌గా భావిస్తుంటాం. పలానా దగ్గర ట్యూషన్‌కి వెళ్ళు, పలానా పుస్తకం చదువు అనే తాత్కాలిక సలహాలు ఇచ్చే వ్యక్తులు ఉంటారు. వారిని శాశ్వత మెంటార్‌గా భావించలేము. అభ్యర్థి వెన్నంటి ఉండి అన్నింట్లోనూ సహాయపడే వ్యక్తి నిజమైన మెంటార్. అమ్మో ఈ పరీక్ష నేను రాయగలనా అని దిగులు చెందుతున్నప్పుడు ఫర్వాలేదు, నీవు రాయగలవు అని ధైర్యం చెప్పే వ్యక్తి. సమయాన్ని, సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని గైడ్ చేసే వ్యక్తి. అభ్యర్థి చెప్పే అన్ని విషయాలనూ సహనంగా విని లోటుపాట్లు చెప్పే వ్యక్తి ఇతను. సంకల్ప బలాన్ని మరింతగా పెంచే వ్యక్తి.
అభ్యర్థి లక్ష్యసాధన అహర్నిశలూ తన బాధ్యతగా భావించి శ్రమించే వ్యక్తిని మెంటార్ అనవచ్చు. కానీ ఇన్ని లక్షణాలు కలిగిన వ్యక్తిని మెంటార్‌గా పొందేవారు ప్రస్తుతం ఉన్నారా అంటే చెప్పడం కష్టం. అలాంటి మెంటార్ ఎవరికైనా దొరికితే అదృష్టమే. కానీ అది ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదు. అయితే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క పరిస్థితిలో సందర్భానుసారంగా అభ్యర్థులకు తెలిసీ తెలియకుండా ఒక టీచరో, ఒక ట్రైనరో, ఒక సీనియర్ స్నేహితుడో, అనుభవజ్ఞుడో, సీనియర్ సిటిజనో, ఒక అధికారో, ఎవరో ఒకరు సరైన మార్గంలో విజయసాధనలో సహాయపడవచ్చు.
నా చిన్నప్పటి విషయం ఒకటి చెబుతాను. పిల్లాడిగా ఉన్నప్పుడు బడికి పోకుండా తప్పించే ప్రయత్నం చేస్తుంటే, ఒక ఉపాధ్యాయుడు ఇంటికి వచ్చి చేతికి రెండు పిప్పరమెంట్లు ఇచ్చి స్కూలుకు తీసుకొనివెళ్లి కూర్చోబెట్టాడు. నువ్వేమి చదువుకోవద్దు అక్కడ అలా ఊరికే కూర్చోమని నాకు తెలియకుండానే స్కూలు వాతావరణాన్ని అలవాటు చేసిన టీచర్ ఆ సమయంలో నా మెంటార్‌గానే వ్యవహరించాడు.
స్కూలు విద్యలో ఉన్నంత కాలం నాకు లెక్కలు పెద్ద సమస్యగా ఉండేవి. అలాంటి సమయంలో పదో తరగతి లెక్కల పరీక్షను ఏ విధంగా ఎదుర్కోవాలో మల్లాది పురుషోత్తమరావు అనే టీచర్ సిద్దం చేశారు. పద్ధతి ప్రకారం నేర్పడం వల్ల నేను మంచి మార్కులతో పాసయ్యాను. ఆ సందర్భంలో ఆయనే నా మెంటార్.
నన్ను బీఎస్సీలో చేర్పించాలని మా నాన్న కోరిక. కానీ నేను ఆర్ట్స్‌లో జాయినయ్యాను. ఆర్డినరీ అకడమిక్ కెరీర్‌ను తుడిపేసుకోవడానికి ఎం.ఏ.లో ర్యాంకు తెచ్చుకోవాలన్న దృఢమైన అభిప్రాయానికి నాలో నాంది వేసింది అప్పటి మా ప్రొఫెసర్ మూర్తి గారే. వీరందరూ ఆ సందర్భాల్లో నాకు తాత్కాలిక మెంటార్‌లుగా వ్యవహరించినట్లు లెక్క. అందుకే జీవితం మొత్తం ఒక్కరే మెంటార్‌గా ఉండే అవకాశం చాలా తక్కువ. కురుక్షేత్ర యుద్ధంలో ఒక్క అర్జునుడికే కాదు మొత్తం పాండవులకు కృష్ణుడు ‘మెంటార్’గా ఉన్నాడు. ఆయన వల్లనే పాండవులు తమ లక్ష్యాన్ని చేరుకోగలిగారు.
గామినీ సింగ్లా అనే అమ్మాయి 2021లో అఖిల భారత స్థాయిలో మూడో స్థానం సాధించి ఐఏఎస్‌కి ఎంపికైంది. అంతేకాదు ‘హౌ ఐ టాప్డ్ ద యూపీఎస్సీ’ అనే చిన్న పుస్తకంలో తను ట్రైనింగ్‌కు వెళ్లబోయే ముందు ఆమె అనుభవాలన్నీ పూసగుచ్చినట్లు రాసింది. పోటీ పరీక్షలు, ఇతర పరీక్షలు రాసే వారందరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం. ఆమె ఈ పరీక్షను ఒకేసారి జయించలేదు. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని దిగ్విజయంగా తన లక్ష్యాన్ని చేరుకుంది. తండ్రి సహా ఒక్కో సమయంలో ఎవరు, ఎలా మెంటార్‌గా వ్యవహరించాలో అందులో వివరించారు. ఆమెనే పరోక్షంగా మీరు మెంటార్‌గా స్వీకరించేవిధంగా ఈ పుస్తకాన్ని రాశారు. జీవిత గమనంలో ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు సలహదారులుగా, గైడ్స్‌గా, దారిచూపే వారిగా తారసిల్లుతారో చెప్పలేం.
చాలా మందికి తెలిసిన కథే. తన స్టడీ సర్కిల్ ద్వారా దేశంలోనే ఎంతోమందిని అఖిల భారత స్థాయిలో అధికారులుగా నిలబెట్టిన వ్యక్తి ఐఏఎస్ రావుగారు. ఆయనను ఎంతోమంది మెంటార్‌గా స్వీకరించి ఉండవచ్చు. అలాగే ప్రస్తుతం తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న మహేష్ భగవత్ కూడా పోటీ పరీక్షల్లో పాల్గొన్న ఎంతోమందిని మెంటార్‌గా గైడ్ చేస్తున్నారు.
ఒక చిన్న పాఠశాల నుంచి తన చదువు ఏవిధంగా మొదలైందో, ఐఏఎస్ ఏ విధంగా సాధించగలిగిందో గామినీ సింగ్లా తన పుస్తకంలో అరమరికలు లేకుండా వివరించింది. మొదట్లో ఒక టీచర్ ఐఏఎస్ పరీక్షల గురించి, సిలబస్ గురించి చెప్పాడట. మళ్లీ కొన్నిరోజుల తరువాత అదే టీచర్ తనను ఉదయం, సాయంత్రం సమయాల్లో ఎలా ట్రెయిన్ చేశాడో కూడా సోదాహరణంగా వివరించింది. మెంటార్ శాశ్వతంగా అంటిపెట్టుకొని ఉండాల్సిన అవసరంలేదు. మధ్యమధ్య అభిరుచికి తగ్గట్టు మోటివేట్ చేస్తూ లక్ష్యసాధనకు సహాయపడితే చాలు.
పోటీ పరీక్షలకు కూర్చొనే వాళ్లకు పుస్తకం మొదట్లోనే ఒక సూచన చేసింది. ‘నా మార్గాన్ని మీరు గుడ్డిగా అనుసరించాల్సిన పనిలేదు. మీకు ఏది సరిపడుతుందో అది గ్రహించి దానిని అనుసరిస్తే చాలు’ అంది. ‘ఈ చిన్న పుస్తకం రాసింది బాగా కష్టపడుతూ కూడా విజయం సాధించలేని వారికి సహాయపడేందుకే’ అని తెలిపింది కూడా. లక్ష్యసాధనలో పరిమితులు లేవు. ఎన్నో మార్గాలు, ఎన్నో విధానాలు - కానీ - అన్ని నదులు సముద్రంలో కలిసినట్లే ‘లక్ష్యం’ అనే ప్రవాహంలో కలిసి విజయాన్ని సాధించడానికే.
పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులందరూ ఒకే కష్టాన్ని, శ్రమను పెట్టిన తరవాత కూడా కొంతమంది విజయం సాధిస్తారు, మరికొందరు సాధించ లేరు. కారణం వారు మానసికంగా ఏవిధంగా పరీక్షకు సిద్ధమయ్యారు అనే అంశమే వారి జయాపజయాలను నిర్ణయిస్తుంది.
నా దృష్టిలో ఈ అభ్యర్థులకు రెండింట్లో శిక్షణ అవసరం. ఒకటి సబ్జెక్టు శిక్షణ, రెండోది మానసిక శిక్షణ. ఈ విషయం అర్థం అయితే ఒకటి రెండుసార్లు ఫెయిల్ అయినా పట్టించుకోరు. మానసికంగా బలంగా ఉంటే ఎవరు ఏమనుకున్నా, అసూయపడినా ఎలాంటి స్థితినైనా ఎదుర్కోగలరు. చివరకు పరీక్ష సమయంలో మైండ్ బ్లాంక్ అయినా తెప్పరిల్లి(కొన్ని క్షణాల్లోనే) పరీక్షను విజయవంతంగా రాయగలరు. ఎందుకంటే మీ లక్ష్యం బ్లాంక్ కాలేదు కాబట్టి.
పోటీ పరీక్షలు రాసే అభ్యర్థుల్లో కొందరికి మొదట వచ్చే సందేహం అసలు మెంటార్ అంటే ఎవరు? అభ్యర్థులకు తప్పనిసరిగా మెంటార్ ఉండాల్సిందేనా?
నిజానికి ఆయా వ్యక్తుల మానసిక సామర్థ్యాన్ని బట్టి అవసరమా? అనవసరమా? అన్నది ఉంటుంది.
‘మెంటార్’ పదానికి తెలుగు స్వేచ్ఛానువాదం ‘నమ్మకమైన సలహాదారుడు’ లేదా ‘హితం కోరే స్నేహితుడు’.
అవసరం అయినప్పుడు లేదా ఆపదలో ఆదుకొనేవాడు ‘మెంటార్’ అని కొంత మంది భావిస్తుంటారు. అది పొరపాటు. సరైన సమయంలో గైడ్ చేసే వ్యక్తి మెంటార్.
మెంటార్‌కు సహజంగా మోటివేట్ చేసే శక్తి ఉండాలి. తన భావాలను చక్కగా చెప్పే చాతుర్యం ఉండాలి. పరిష్కారాలు, అవకాశాలు కనిపెట్టే శక్తి ఉండాలి. ఎవరైతే గోల్‌ను సాధించేవిధంగా గైడ్ చేయడమే కాకుండా, జీవితంలో అప్పటివరకూ అనుభవంలో లేని విషయాలు ఎరుకలోకి తెచ్చే వ్యక్తులు మెంటార్‌లు.
మెంటార్‌ల ప్రధాన విధులు..
1) మార్గదర్శి 2) సలహాదారులు 3) మంచి చెడ్డలు చెప్పేవారు
4) ఉపాధ్యాయుడు 5) ఓటమి చెందినప్పుడు వెన్నుతట్టే వ్యక్తి
-రావులపాటి సీతారామారావు
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి